
సినిమా నిర్మాణానికి ఆద్యుడైన నిర్మాత క్షేమంగా ఉండి లాభాల పంట పండిస్తే అనేకమంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ పంట ఫలాలను అనుభవించి ఆనందిస్తారు. దాంతో లక్షలాది ప్రేక్షకులకు వినోదాల విందు లభిస్తుంది. అందుకే ప్రతీ నిర్మాత విజయవంతమైన చిత్రాలను నిర్మించాలని చిత్ర పరిశ్రమలో కోరుకుంటారు. నిజం చెప్పాలంటే చిత్ర నిర్మాణం అనేది ఒక యజ్ఞం లాంటిది. దానిమీద సరైన ప్రణాళిక, పరిపూర్ణమైన అవగాహన, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉన్నపుడు యజ్ఞం సజావుగా సాగుతుంది.
వీటిలో ఏది లోపించినా యజ్ఞానికి పూర్ణాహుతి ఎలా ఉండదో, చిత్ర నిర్మాణానికి ముగింపు కూడా అలాగే ఉండదు. కొత్తగా ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే దానికి సంబంధించిన లైసెన్స్ అవసరం ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన రకరకాల అనుమతులు కూడా అవసరం అవుతాయి. కానీ సినిమా తీయడానికి ఎలాంటి లైసెన్స్ లు కానీ, ఎవ్వరి అనుమతులు గానీ అవసరం ఉండదు. ఎవరైనా సినిమా తీయవచ్చు. అందువలన ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో వచ్చి సినిమాల చిత్రీకరణ ప్రారంభిస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అధిక శాతం చిత్ర నిర్మాణం గురించి తమకి అంతా తెలుసు అనే భ్రమలో అరకొర పరిజ్ఞానంతో అంతంత మాత్రంగానే ఉన్న ఆర్థిక వనరులతో చిత్ర నిర్మాణం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ సినిమా షూటింగ్ మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. దిగితే గానీ నీళ్ల లోతు తెలియదనే సామెత మాదిరిగా దానినే అనుసరిస్తూ నిర్మాణంలో దిగి లోతు తెలుసుకోవాలని చిత్ర నిర్మాణం ప్రారంభిస్తే నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఎక్కువ మందికి అనుభవం లేకుండా ఇలా అర్థాంతరంగా నిలిచిపోయిన చిత్రాలలో పేరు పొందిన నిర్మాణ సంస్థలు ప్రారంభించిన చిత్రాలు కూడా ఉన్నాయి. తెలుగు చిత్ర నిర్మాణం ప్రారంభించిన వంద సంవత్సరాల క్రిందట నుండి లెక్కిస్తూ పోతే ఇలా అర్థంతరంగా నిలిచిపోయిన చిత్రాల విలువ వందల కోట్లలోనే ఉంటుంది. కొన్ని వేల మంది శ్రమ ఫలం ఇలా నిష్ప్రయోజనం అవ్వడం నిజంగా శోచనీయం. ప్రస్తుతం చిత్ర నిర్మాణం జరుపుకుంటున్న చిత్రాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించే వారికి ఇది కనువిప్పు కావాలి. అలా ఆగిపోయిన సినిమాలలో కొన్ని సినిమాల వివరాలు పరిశీలన చేస్తే…
1950 నుండి 1960 మధ్య ఆగిపోయినవి…
1956లో మూకీ పిక్చర్స్ వారు జంపన దర్శకత్వంలో ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి, బాల సరస్వతి, గుమ్మడి, సూర్యకాంతం లతో “సౌభాగ్యవతి” అనే చిత్రాన్ని వాహిని స్టూడియోలో ప్రారంభించారు. కానీ చిత్రీకరణ ఎక్కువ కాలం సాగలేదు.
1956 ప్రాంతాల్లో కృష్ణన్ పంజు దర్శకత్వంలో గుబ్బి కర్ణాటక ప్రొడక్షన్స్ వారు “ప్రభాకర విజయం” అనే చిత్రాన్ని మూడు భాషలలో నిర్మించాలని ప్రణాళిక చేశారు. దానితో బాటు “దశావతారం”, “దక్షయజ్ఞం” చిత్రాలను కూడా నిర్మించడానికి పూనుకున్నారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కానీ చిత్ర నిర్మాణం పట్టాలకెక్కలేదు.
1956లో నటుడు లింగమూర్తి దర్శకత్వంలో హేమలత పిక్చర్స్ సంస్థ రేలంగి, చిత్తూరు వి.నాగయ్య, కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, గిరిజ లతో “శాంత జ్ఞానేశ్వర” కథను చిత్రంగా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
1956 లో హిందీలో ఘనవిజయం సాధించిన “న్యూఢిల్లీ” సినిమాను సరసు చిత్ర వారు తెలుగులో పునఃనిర్మించడానికి హక్కులు కొన్నారు. కానీ చిత్ర నిర్మాణం మొదలుకాలేదు.
1956లో జి.నటరాజు దర్శకత్వంలో త్రిపుర ఫిలిమ్స్ వారు మైరావణ చిత్రాన్ని ఆర్.నాగేశ్వరరావు, కాంతారావు లతో నిర్మించాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు.
జి.వి.రావు దర్శకత్వంలో గోకుల ప్రొడక్షన్స్ వారు “సతీ తులసి” చిత్రాన్ని అమర్ నాథ్, రంగారావు, సూరిబాబు, రమణారెడ్డి, చదలవాడ కృష్ణకుమారి, శ్రీరమణి లతో నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు, కానీ ఆ చిత్రం చిత్రీకరణ వరకు వెళ్లలేదు.
1952లో తిలక్ దర్శకత్వంలో వి.టి.ఫిలిమ్స్ వారు “ఉత్తర గోగ్రహణం” చిత్రాన్ని నిర్మించడానికి సనాలు చేశారు.
సంగీతా వారు తమ తొలి చిత్రం “ఇంటి గుట్టు” విడుదల కాకుండానే “మదన కామరాజు” కథ తీస్తామని ప్రకటించారు.
1958 లో సి.ఎస్.రావు దర్శకత్వంలో అరుణోదయ ప్రొడక్షన్స్ వారు “మైరావణ” చిత్రాన్ని ఎస్వీ రంగారావు, రేలంగి, మాలతి, సంధ్య లతో తీయడానికి ప్రయత్నాలు చేశారు, కానీ వీలుపడలేదు.
కొంతవరకు తయారైన పాలేరు చిత్రాన్ని యస్.ఆర్. ప్రొడక్షన్స్ వారు పూర్తి చేయడానికి ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఏవో ఆటంకాలు ఎదురవ్వడంతో ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. జగ్గయ్య, కృష్ణకుమారి, జానకి, గుమ్మడి, గోవిందరాజుల సుబ్బారావు, అన్నపూర్ణ, సుమిత్ర తదితరులు నటించిన చిత్రానికి సంగీతం పెండ్యాల.
1959 లో గోపీనాథ్ దర్శకుడిగా శార్వాణి పిక్చర్స్ వారు “గంధర్వ సుందరి” చిత్రాన్ని గోపీనాథ్ సోదరుడు కణ్వశ్రీ నిర్మాణ సారథ్యంలో తీయడానికి సంకల్పించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు.
1960 నుండి 1965 వరకు ఆగిపోయినవి…
1962 లో టి.ఎస్.రామారావు దర్శకత్వంలో శివరంజని పిక్చర్స్ వారు “అనురాగం” అను చిత్రాన్ని నక్షత్రాన్ని జగ్గయ్య, గుమ్మడి, సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, రమణారెడ్డి, చదలవాడ, పద్మనాభం తదితరులతో ప్రారంభించారు. కొన్ని రోజులు చిత్రీకరణ అనంతరం ఈ చిత్రం ఆగిపోయింది.
1963 లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఇంటిగుట్టు చిత్ర నిర్మాతలు బ్యానర్ లో “బేతాళ మాంత్రికుడు” అనే చిత్రాన్ని ప్రారంభించారు. పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. ఎన్టీఆర్, రేలంగి, గుమ్మడి, కృష్ణకుమారి, పుష్పవల్లి, గిరిజ తదితరులను నటీనటులుగా ఎన్నుకున్నప్పటికీ అనుకోని కారణాల వలన చిత్రీకరణ అయిపోయింది.
1963 లో ఎం.శంకర్ దర్శకత్వంలో జగదాంబ ప్రొడక్షన్స్ వారు కృష్ణకుమారి, కాంతారావు, రాజనాల, ఈలపాట రఘురామయ్య, బాలకృష్ణ లతో “వేములవాడ భీమకవి” చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు చిత్రీకరణ జరిగిన తరువాత చిత్రీకరణ ఆగిపోయింది. హోణసూరు కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రచన జూనియర్ సముద్రాల, సుసర్ల సంగీత దర్శకులు.
1963 లో రజనీకాంత్ దర్శకత్వంలో సువర్ణ సినీ ప్రొడక్షన్స్ వారు “కాంభోజరాజు శౌర్యం” చిత్రాన్ని చిత్రంగా తీయాలని ప్రయత్నించారు, కానీ ప్రయత్నాలు ఫలించలేదు.
1963 లో తాతనేని ప్రకాషరావు దర్శకత్వంలో రవిచిత్ర వారు కంచర్ల మాధవరావు నిర్మించాలని తలపెట్టిన “కవల పిల్లలు” అనే చిత్రం పట్టాలకెక్కించాలని ప్రణాళిక తయారుచేశారు, కానీ అది విఫలం అయ్యింది. సంభాషణలు అనిశెట్టి వ్రాయగా, టి.వి.రాజు సంగీతం చిత్రం అందించారు. కానీ ఈ చిత్రం మొదలవ్వలేదు.
1963 లో సి.సుబ్బారావు దర్శకత్వం లో పద్మజ పిక్చర్స్ వారు “విఠల భక్తతుకారం” చిత్రాన్ని మొదలుపెట్టారు. రంగారావు, అంజలి, ముక్కామల మొదలగు వారిని ఎంపిక చేసుకున్నారు. చత్రపతి శివాజీ పాత్రకు జగ్గయ్య ఎన్నుకున్న ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. 8 రీళ్ళ వరకు తయారైన ఈ చిత్రం ఆ తరువాత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత ఈ చిత్రం హక్కులు కొన్న నటులు పద్మనాభం గారు మిగిలిన చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించారు, కానీ వీలు పడలేదు.
1963 లో సార్వభౌమ దర్శకత్వంలో అజంతా ఆర్ట్ పిక్చర్స్ వారు “కీచకవథ” చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అందులో తారాగణంగా జి.వరలక్ష్మి, కాంతరావు, చిత్తూరు వి.నాగయ్య, గిరిజ, హరనాథ్, చలం, రామకృష్ణ లను తీసుకున్నారు. అనిశెట్టి రచనలో, పెండ్యాల సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది.
1963 లో దయానంద్ దర్శకత్వంలో మురళీ పిక్చర్స్ వారు “సువర్ణగిరి” అనే జానపద చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. సావిత్రి, ఎస్వీ రంగారావు, రాజసులోచన లాంటి తారాగణంతో నిర్మించాలని ప్రయత్నించారు. కానీ ఈ సినిమా పట్టాలకెక్కలేదు.
25 జులై 1963 నాడు హోణసూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో ఆర్యన్ ప్రొడక్షన్స్ వారు “ప్రభావతి ప్రద్యుమ్నం” ను ప్రారంభించారు. జమున, హరనాథ్, రంగారావు, జి.వరలక్ష్మి, శారద, ఈలపాట రఘురామయ్య తారాగణంతో మొదలుపెట్టిన ఈ సినిమాకు రచన తాపీ, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ సినిమా కూడా ముందుకు కదలలేదు.
1963 లో వేదాంతం రాఘవయ్య హాస్యనటి మీనా కుమారి భర్త సుబ్బారావు “చక్రధారి ఫిలిమ్స్” పేరిట “చదువుకున్న భార్య” అనే చిత్రాన్ని కృష్ణకుమారి, మీనా కుమారి, జగ్గయ్య లాంటి తారాగణం తో నిర్మించడానికి ప్రారంభించారు. కావూరి రచయిత, సంగీతం టి.వి.రాజు. ఈ సినిమాతో తన భార్య కెరీర్ చక్కదిద్దాలనుకున్న సుబ్బారావు ప్రయత్నం ఫలించలేదు.
1963 లో గోవిందయ్య దర్శకుడిగా వెంకటాద్రి పిక్చర్స్ వారు “కాశీ మహత్యం” అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా పాటలు కూడా రికార్డింగ్ అయిపోయాయి. బాలయ్య, కాంతారావు, కృష్ణకుమారి, హరనాథ్, లీలావతి, జయమాల మొదలగు తారాగణం ఎంపికైన ఈ సినిమా గోల్డెన్ స్టూడియోలో పి.బి.శ్రీనివాస్, జానకిల యుగళగీతం తో రికార్డింగ్ ప్రారంభించారు. వడ్డాది మాటలు వ్రాయగా నిర్మాత ఎం.కె.రావు, పి.రామాంజనేయులు నిర్మాణ సారథ్యంలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణకు నోచుకోలేదు.
1963 లో రజనీకాంత్ దర్శకత్వంలో అస్వరాజ్ ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్ ప్రధాన భూమికలో “శ్రీకృష్ణసత్యభామ చిత్రాన్ని పి సత్యనారాయణమూర్తి నిర్మాణ సారథ్యంలో నిర్మించదలిచారు. ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ఘంటసాల గారిని ఎంచుకున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
1964 లో “ప్రతాపరుద్రీయం” చిత్రాన్ని చిత్రాన్ని బాలాజీ ఫీలిమ్స్ పతాకంపై ఎం.పుండరీకాక్షయ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో పేరిగాడు, ప్రతాపరుద్రుడి పాత్రలను ఎన్టీఆర్ పోషించగలరని కూడా వెల్లడించారు. పింగళి రచన చేసిన ఈ చిత్రం కూడా మొదలవ్వలేదు.
1964 లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కమల శ్రీ ఫిలిమ్స్ వారు “ధనలక్ష్మి” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటన వెలువరించారు. మహారథి మాటలు, మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలు, ఘంటసాల సంగీత సారథ్యంలో నిర్మాత కె.వీరరామయ్య నిర్మించదలిచారు. ఎన్టీఆర్, సావిత్రి, గుమ్మడి, రమణారెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటిస్తారని చేసిన ప్రకటన కేవలం పత్రికలకు మాత్రమే పరిమితమైంది.
1964 లో తమ సంస్థ శ్రీ రామ పిక్చర్స్ పతాకంపై చాళ్ల సుబ్బారావు “లవంగి పండిత రాయలు” చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. ఆరుద్ర రచన, మల్లాది పాటలు, సంగీతం సాలూరి రాజేశ్వరరావును ఎంచుకున్న ఈ సినిమా కూడా పట్టాలకెక్కలేదు.
1965 నుండి 1970 ల మధ్య…
1965 లో చిన వరహాలు దర్శకత్వంలో సత్యనారాయణ పిక్చర్స్ వారు “తాళిబొట్టు” అనే చిత్రాన్ని నిర్మించదలచి రంగారావు, హరనాథ్, రేలంగి, రమణారెడ్డి, కృష్ణకుమారి, సూర్యకాంతం, గిరిజ లాంటి నటీనటులను ఎన్నుకున్నారు. చలపతిరావు సంగీత దర్శకుడిగా ఎన్నుకున్న ఈ సినిమాకి నిర్మాతలు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా కూడా ముందుకు సాగలేదు.
గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ కమల పిక్చర్స్ వారు “ఖడ్గ తిక్కన” చిత్రాన్ని భారీగా నిర్మించడానికి నిర్మాత జాన్ ప్రారంభోత్సవం చేశారు. అక్కినేని నాగేశ్వరావు, జగ్గయ్య, రంగారావు, హరనాథ్, జమున ముఖ్య తారాగణంగా ఎంచుకున్న ఈ సినిమాకి రచన ఆరుద్ర చేయగా, సంగీత దర్శకుడిగా పూర్ణచంద్రరావును ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా ఓ కొలిక్కి రాలేదు.
1966 లో మాధవి ప్రొడక్షన్స్ వారు “సింహబలుడు” అనే చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నారు. కానీ అప్పట్లో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ సరిగ్గా పదేళ్ల తరువాత కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా ఇదే పేరుతో మరో చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం.
1966 లో మానాపురం అప్పారావు దర్శకత్వంలో దేవి చిత్రాలయ వారు “లక్ష్మీనారాయణ” అనే చిత్రాన్ని రూపొందించాలని యత్నించారు. కాంతారావు, రంగారావు, రామకృష్ణ, నాగభూషణం, అమర్ నాథ్, కృష్ణకుమారి, రాజశ్రీ తదితర నటులతో ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నారు. ఈ సినిమాకు రచన రాజశ్రీ. ఈ చిత్రం కూడా చిత్రీకరణ ఆగిపోయింది.
1966 లో దర్శకుడు పద్మనాభరావు (అక్కా చెల్లెళ్ళు, బావా మరదళ్ళు సినిమాల దర్శకులు) దర్శకత్వంలో ఇండియన్ మూవీస్ వారు నూతన తారలతో “స్వప్నరేఖ” చిత్రాన్ని రూపొంచిచాలని యత్నించారు. ఆరుద్ర పాటలు వ్రాస్తూ, వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా మొదలుకాలేదు.
1966 లో జి.ఎస్.కృష్ణమూర్తి దర్శకత్వంలో శ్రీ అపర్ణ చిత్ర వారు పి.ఎస్.శాస్త్రి, జంపన రామయోగి నిర్మాతలుగా, జగ్గయ్య కథానాయకుడిగా అశ్వత్థామ సంగీతంలో ఒక చిత్రాన్ని పాటల రికార్డింగ్ ప్రారంభించారు. జగములనేలుచు అనే పాటను రికార్డ్ చేశారు. ఆ తరువాత దానిని నిలిపివేశారు.
పి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో శ్రీ విజయ ప్రొడక్షన్స్ వారు పి.సూర్యనారాయణ రాజు, కె.హనుమంత రావు నిర్మాతలుగా కాంతారావు, బాలయ్య, చిత్తూరు వి.నాగయ్య, ధూళిపాల, ముక్కామల, జి.వరలక్ష్మి మొదలగు తారాగణంతో “పాండవుల బాల్యకథ” చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల అనంతరం ఈ చిత్రం ఆగిపోయింది. ఆ తరువాత ఇదే కథతో “బాలభారతం” చిత్రం రూపుదిద్దుకుంది.
కె.ఎన్.వి.ఆర్ ఆచార్య దర్శకత్వంలో ప్రేమా మూవీస్ వారు “నిశిరాత్రి 12 గంటలకు” అనే చిత్రాన్ని కాంతారావు, రాజనాల రామకృష్ణ, జయకృష్ణ, సుకన్య, వాణిశ్రీ, శారదలతో ప్రారంభించారు. కోదండపాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా 29 సెప్టెంబరు 1966న ప్రారంభమైనా కూడా ఇది ముందుకు సాగలేదు. కొన్ని రోజులకు ఈ చిత్రం ఆగిపోయింది.
1966 లోని శ్రీనివాస బాబ్జి ఫిలిమ్స్ వారు పోతులూరి వీర బ్రహ్మంగారి చరిత్రను “కాలజ్ఞానం” సినిమా పేరుతో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ సినిమా ప్రారంభం కాలేదు.
గిడుకూరి సత్యం దర్శకత్వంలో ప్రసన్నాంజనేయ పిక్చర్స్ వారు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో “అతి రహస్యం” చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
బోళ్ల సుబ్బారావు దర్శకత్వంలో “పార్వతీ పరమేశ్వరులు” చిత్రం నిర్మించాలని భావించారు. కాంతారావు, శోభన్ బాబు, హరనాథ్, రామకృష్ణ, రాజనాల, గీతాంజలి, ధూళిపాల, మిక్కిలినేని ప్రధాన తారాగణంగా మల్లేశ్వర రావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ వ్రాసిన పాటలను రికార్డు చేశారు. కానీ సినిమా ప్రారంభం కాలేదు.
ఆచార్య ఆత్రేయ తన స్వీయ దర్శకత్వంలో సుచిత్రా మూవీస్ పతాకం పై “చిన్నారి మనసులు” చిత్రాన్ని తీయాలనుకున్నారు. నేపథ్య గాయని సుశీల పాడిన పాటను రికార్డ్ చేశార. కానీ చిత్రీకరణ మాత్రం ప్రారంభం అవ్వలేదు.
పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ధనుంజయ ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్, చిత్తూరు వి.నాగయ్య, జమున, రాజసులోచన, గిరిజ, ముక్కామల మొదలగు తారాగణంతో “బీబీ నాంచారమ్మ” చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సదాశివ బ్రహ్మం రచన చేసిన ఈ చిత్రానికి టి.వి.రావు సంగీత దర్శకత్వం వహించాల్సిన ఈ చిత్ర షూటింగ్ మాత్రం ప్రారంభం అవ్వలేదు.
యం.యస్.పి ప్రొడక్షన్ వారు పి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో “కోటి విద్యలు కూటి కొరకే” చిత్రాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని రోజుల తరువాత ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది.
1967 లో కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ వారు కాంతారావు, కాంచన, చంద్రమోహన్, గీతాంజలి, ముక్కామల మొదలగు తారాగణంతో ఘంటసాల సంగీత సారథ్యంలో ఒక చిత్రం నిర్మించదలిచారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
1966 లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ఐ.వి.శర్మ నిర్మాతగా “బ్రహ్మరథం” అనే పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు.
1966 లో పి.వి.వి.ఎస్.ఎం వారు “అయినవారు కానివారు” చిత్రాన్ని జగ్గయ్య, రాజబాబు, ఏడిద నాగేశ్వరరావు, కృష్ణకుమారి, రమాప్రభ లతో రూపొందించాలని ప్రయత్నం చేశారు. కానీ అది మధ్యలో ఉండగానే ఆగిపోయింది.
1966 లో వేణు పిక్చర్స్ వారు ఎన్టీఆర్ తో “సతీ అరుంధతి” సినిమా నిర్మిస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.
1967 లోనే శ్రీదేవి కంబైన్స్ వారు ఎన్టీఆర్ తో “ఛాలెంజ్ రాముడు” తీస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ సినిమా ప్రారంభం అవ్వలేదు. అయితే దర్శకులు తాతినేని ప్రకాశరావు అనిల్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్టీఆర్, జయప్రద కలయికలో ఈ చిత్రాన్ని తరువాత నిర్మించారు.
1967 లో డి.సార్వభౌమారావు దర్శకుడిగా నాగదుర్గ ప్రొడక్షన్స్ వారు రాజశ్రీ, శోభన్ బాబు, ధూళిపాల, బాలయ్య లతో “శ్రీ దేవయాని” అనే చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నించారు. దీనికి ఆచార్య ఆత్రేయ మాటలు, పాటలు సి.నారాయణ రెడ్డి పాటలు, సంగీతం అశ్వత్థామ రెడ్డి సమకూర్చడానికి ఒప్పందం కుదరగా చెన్నారెడ్డి, మల్లేష్ లు నిర్మాతలుగా వ్యవహారించారు. కానీ ఈ చిత్రం కూడా ఆగిపోయింది.
1967 లో కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా శ్రీ సిరి ఫిలిమ్స్ వారు “పాశుపతాస్త్రం” చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీయడానికి ప్రకటన చేశారు. రచన గడియార శేషశాస్త్రి , సంగీతం సాలూరి రాజేశ్వరరావు. కానీ ఈ సినిమా కేవలం ప్రకటనకే పరిమితమైపోయింది.
1967 లో విజయా రెడ్డి దర్శకత్వంలో లక్ష్మీ మూవీస్ వారు శోభన్ బాబు, కృష్ణకుమారి లతో “కర్ణార్జున విజయం” తీయాలని ప్రణాళిక చేశారు. కొన్ని రోజుల చిత్రీకరణ తరువాత ఆ సినిమా ఆగిపోయింది.
1967లో పి.సాంబశివరావు దర్శకత్వంలో జ్యోతి ప్రొడక్షన్స్ వారు శోభన్ బాబు, బాలయ్య, రామకృష్ణ పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, కృష్ణకుమారి, రాజశ్రీ తారాగణంతో బి.ఎల్.ఎన్ ఆచార్య రచన చేయగా “ముగ్గురు మరాఠీలు” చిత్రాన్ని ప్రారంభించారు. అయిదు రీళ్లు తయారైన తరువాత చిత్ర నిర్మాణం ఆగిపోయింది. కానీ అంతకుమించి అది ముందుకు సాగలేదు.
1967 లో అశ్వరాజా పిక్చర్స్ వారు ఎన్టీఆర్ కథానాయకుడిగా “ముగ్గురు మరాఠీ” లు చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. రచన సముద్రాల చేయగా, ఘంటసాల సంగీతం సమాకూర్చడానికి ఒప్పుకున్న ఈ చిత్ర చిత్రీకరణ కొన్ని రోజులకు నిలిచిపోయింది.
1967లో బాబు బాయి మిస్త్రీ దర్శకత్వంలో మారుతి ప్రొడక్షన్స్ వారు “ద్రౌపది వస్త్రాపహరణం” చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు ప్రారంభించారు. దీనికి నిర్మాతగా రామ కోటేశ్వరరావు, సంగీతం టి.వి.రావు అనుకున్నారు. కానీ ఈ సినిమా నిర్మాణం ప్రారంభం కాలేదు.
1969 లో పద్మనాభం దర్శక, నిర్మాణంలో రేఖా మూవీస్ వారు భక్త తుకారం తీయాలని వీటూరితో రచన చేయించారు. కానీ సినిమా మొదలుకాలేదు.
1969 లో తోలు మోహన్ రావు దర్శక నిర్మాణంలో కృష్ణకుమారి, శోభన్ బాబు, రాజనాల, రేలంగి, గీతాంజలి తారాగణంతో “వైకుంఠపాళి” చిత్రాన్ని తీయాలని ప్రణాళిక చేశారు. వేణు సంగీతం అందించాలని ప్రయత్నం చేసిన ఈ చిత్రం కూడా మొదలవ్వలేదు.
1968 లో చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో జ్యోతి సినీ సిండికేట్ పై “కంచు కాగడా” చిత్రాన్ని ఎన్టీఆర్, కాంతారావు, రాజనాల, కృష్ణంరాజు, జమున లతో సినిమా రూపొందించాలని భావించారు. మహారథి రచన, కె.వి.మహదేవన్ సంగీత సారథ్యంలో విశ్వేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాకపోతే ఈ చిత్ర తారాగణంలో కొన్ని మార్పులు జరిగాయి.
1968 లో చిత్తజల్లు శ్రీనివాసరావు, రావూరి లతో మంజుల సినీ సిండికేట్ వారు “మా ఇంటి దేవత” అనే చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా తీయాలని యు. విశ్వేశ్వరరావు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ సినిమా ప్రారంభం అవ్వలేదు.
1968 లో చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకుడిగా విశ్వశాంతి వారు “దశావతారాలు” చిత్రం రంగులలో ఎన్టీఆర్, జమున, సావిత్రి లతో నిర్మించాలనుకున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ కూడా ముందుకు సాగలేదు.
1968 లో ఎన్టీఆర్ తో గౌరీ వారు “సహస్ర విక్రమార్క” చేయాలనుకున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు.
1968 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో బాబు మూవీస్ వారు “విశాల నేత్రాలు” చిత్రాన్ని నిర్మించాలని చూశారు. ఈ సినిమాకి రచన “పిలక గణపతి శాస్త్రి”. ఈ చిత్రంలో రంగనాయకులుగా అక్కినేని నాగేశ్వరావు, శ్రీ రామానుజంగా జగ్గయ్య, యజ్ఞమూర్తిగా గుమ్మడి ని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ప్రారంభం అవ్వలేదు.