Telugu Opinion SpecialsTelugu Special StoriesTOPICS

దేశ జల రవాణా ముఖచిత్రాన్ని తిరగరాయనున్న వాధవన్ పోర్ట్

ప్రధానమంత్రి ‘గతిశక్తి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో ఉన్న వాధవన్ వద్ద కొత్త మేజర్ ఓడరేవు నిర్మాణానికి 19 జూన్ 2024న భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాధవన్ పోర్ట్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే జాతీయ రహదారులు, ప్రస్తుత రైలు నెట్‌వర్క్‌కు మరియు రాబోయే డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌కు రైలు అనుసంధానానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రతిపాదిత ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ వాధవన్ పోర్ట్ భారతదేశం యొక్క అతిపెద్ద డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ (పెద్ద కార్గో షిప్‌ల వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం గల ఓడరేవు)గా అవతరించనుంది. ఈ ఓడరేవు ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర సమూహాలలో ఒకటిగా మారుతుంది. ఈ ఓడ రేవు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభమైతే భారతదేశం యొక్క సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా, పెరిగిన వాణిజ్య కార్యకలాపాలు మరియు ఉద్యోగ కల్పన ద్వారా దేశ ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుంది. ఇది దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడనున్న తొలి పెద్ద ఓడరేవు కావడం విశేషం.

ప్రాజెక్టు వివరాలు:
భారత ప్రభుత్వం ఆమోదం లభించడంతో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్ పిఎ) మరియు మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు (ఎంఎంబి) సంయుక్త భాగస్వామ్యంలో సంవత్సరానికి 298 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో రూ.76,220 కోట్ల వ్యయంతో వాధవన్ ఓడరేవు రెండు దశల్లో పూర్తి కానుంది. ఈ ఓడరేవు నిర్మాణాన్ని స్థానికులు, రైతులు, మత్స్యకారులు మరియు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్ పిఎ) నేతృత్వంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (Expert Appraisal Committee) నిబంధనలకు అనుగుణంగా స్థానిక ప్రజల జీవనోపాధికి లేదా ఇతర అంశాలకు విఘాతం కలుగకుండా ప్రాజెక్టు కార్యకలాపాలు కొనసాగుతాయని జెఎన్ పిఎ ఇంఛార్జ్ ఛైర్మన్ ఉన్మేష్ వాఘ్ తెలిపారు. షిప్పింగ్, ఓడరేవులు మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ ఒక పక్క ఇప్పటికే దేశంలో ఉన్న ఓడరేవులను ఆధునీకరిస్తూనే మరో పక్క కొత్త ఓడరేవులు నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పాటుపడుతోంది. దహను జిల్లాలో జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న ఆందోళనలు పెల్లుబుకుతున్న సమయంలో ఓడరేవు నిర్మాణాన్ని ముందు ప్రతిపాదించినట్లు సముద్రపు ఒడ్డున కాకుండా, 4 నుండి 6 కిలోమీటర్లు సముద్రం లోపలికి జరిపినట్లు, దీని వలన ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ కూడా గణనీయంగా తగ్గుతుందని, ఈ సవరింపు కారణంగా ఇప్పుడు ఓడరేవు నుండి రైలు మరియు రోడ్డు మార్గాలను అనుసంధానించడానికి కేవలం 571 హెక్టార్లు భూమి సరిపోతుందని ఆయన తెలిపారు. ఓడరేవు నుండి సమీప రైలు మార్గం వరకు మరియు ప్రధాన రోడ్డు మార్గం వరకు అభివృద్ధి చేయాల్సిన రహదారి వ్యయాన్ని భారతీయ రైల్వే శాఖ మరియు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా భరించనున్నాయి. కొత్తగా నిర్మించబోయే ఓడరేవు కోసం భారీ స్థాయిలో భూపునరుద్ధరణ (Reclamation) అవసరమవుతుంది. ఇందుకోసం 50 కిలోమీటర్ల దూరంలో గల డామన్ తీరం నుండి డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా ఇసుకను తరలిస్తారు.

సహజ పరిమితుల కారణంగా దేశంలో ఏ ఓడరేవుకు లేని విధంగా వాధవన్ ఓడ రేవు 24.5 మిలియన్ ఇరవై అడుగుల సమమైన యూనిట్ల (Twenty-foot Equal Units-TEU) వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యంతో రూపొందించబడుతోంది. దేశంలోనే అత్యంత లోతైన ఈ ఓడరేవు 24000 టిఈయు కంటైనర్ ఓడల వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి 2001లో తమిళనాడు లోని కామరాజర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత గత రెండు దశాబ్దాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొందుతున్న మొదటి పెద్ద ఓడరేవు ఇదే.

పెట్టుబడులు:
రూ.76,220 కోట్ల భారీ వ్యయంతో భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (ఇప్పటికే మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న ‘నవా షెవా’ ఓడరేవును నిర్వహిస్తోంది) మరియు మహారాష్ట్ర మారిటైమ్ బోర్డుల సంయుక్త భాగస్వామ్య సంస్థ “వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్” (విపిపిఎల్) చేపడుతోంది. మొత్తం ఈక్విటీ మూలధనంలో 74 శాతం జెఎన్ పిఎ మరియు 24 శాతం ఎంఎంబి సమకూరుస్తున్నాయి. ప్రాథమిక మౌలిక సదుపాయాలలో భాగంగా 10.14 కిమీ పొడవైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, రెక్లెమేషన్, తీర రక్షణ బండ్, టగ్ బెర్త్, అప్రోచ్ ట్రెసెల్స్, రైలు మరియు రోడ్డు లింకేజీలు, అంతర్గత రహదార్లు లాంటి వాటిని రూ.43,622 కోట్లతో వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ చేపడుతుంది. ఇందులో తమ వంతుగా రైల్వే శాఖ రూ.1,765 కోట్లు, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రూ. 2,881 కోట్లు, మహారాష్ట్ర జీవన్ ప్రాధికరన్ మరియు మహారాష్ట విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సంయుక్తంగా రూ. 356 కోట్లు అందించనున్నాయి. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన మిగతా రూ.37,244 కోట్లను, విపిపిఎల్ ఎంపిక చేసిన ప్రైవేటు కంటైనర్ టెర్మినల్స్, మల్టిపర్పస్ బెర్త్స్, కోస్టల్ కార్గో బెర్త్స్ నిర్వాహకుల నుండి సమకూర్చుకుంటుంది. నిధుల సేకరణకు గాను విపిపిఎల్ ఐడిబిఐ క్యాపిటల్ మర్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ ను సలహాదారుగా నియమించుకుంది.

నిర్వాసితుల పునరావాసం:
ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోయే ప్రతి కుటుంబానికి (దారిద్ర్య రేఖ దిగువన ఉన్నా లేకపోయినా) పునరావాస ప్రయోజనాలను అందించే ఏర్పాట్లను జెఎన్ పిఏ చేపడుతోంది. స్థానికుల సామాజిక మరియు ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా కాల పరిమితి గల జీవనోపాధి అవకాశాల ప్రణాలికను (Livelihood Opportunities Plan) సిద్ధం చేయాలని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ జెఎన్ పిఎ కు సూచించింది. జెఎన్ పిఎ ఉపాధ్యక్షుడి అధ్యక్షతన మత్స్యకార సంఘం, ఎంఎంబి, మత్స్య, రెవెన్యూ, పోలీసు శాఖ మరియు మత్స్య శాస్త్రవేత్తలు సభ్యులుగా ఏర్పాటయ్యే మత్స్యకారుల నష్టపరిహార కమిటీ, వాటాదారులు మరియు మత్స్యకారుల సంఘంతో సంప్రదింపులు జరిపి, బాధితులకు మత్స్యకారుల నష్టపరిహార బీమా (Fisher-Folks Compensation Policy) అందిస్తుంది. అంతే కాకుండా అట్టడుగు వర్గ ప్రజల ఉపాధి కల్పన లక్ష్యంగా సముద్ర వనరుల ఎగుమతి ఆధారిత అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఫిషింగ్ హార్బర్ మరియు సీఫుడ్ పార్క్ నిర్మించాలని, ఫిషరీస్ మరియు కంటైనర్ ఆపరేషన్ సంబంధిత లాజిస్టిక్ కోర్సుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా స్థాపించాలని సంకల్పిస్తోంది. కొత్త ఓడరేవు ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగాను, ఆరు వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభించే అవకాశముందని, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తరువాత లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా.

గణాంకాలు:
మన దేశంలోని వాణిజ్య కార్యకలాపాలను అధ్యయనం చేస్తే, పరిమాణం ప్రకారం 95 శాతం మరియు విలువ ప్రకారం 70 శాతం సరుకు రవాణా జలమార్గం ద్వారానే జరుగుతుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. దేశంలోని ప్రధాన ఓడరేవులలో మెరుగైన మౌలిక సదుపాయాల రూపకల్పనతో నౌకల ప్రయాణ వేగం పెరిగి అధిక కార్గో లోడింగ్ సామర్ధ్యానికి దోహదపడింది. దేశంలోని పెద్ద ఓడరేవులలో సరుకు రవాణా 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 4.55 శాతం వృద్ధి రేటుతో (గతేడాది కంటే) 819 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. భారత దేశానికి అత్యధికంగా తొమ్మిది రాష్ట్రాలు మరియు 1382 దీవులలో కలిపి మొత్తం 7,517 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉండడం విశేషం. హిందూ మహాసముద్ర ప్రాంతం (Indian Ocean Region) ప్రపంచ వాణిజ్యానికి కేంద్రబిందువుగా ఉందని చెప్పొచ్చు. హిందూ మహాసముద్ర జలాలపై ప్రపంచంలోని 38 దేశాలకు సార్వభౌమాధికారం ఉంది. వీటిలో ఆఫ్రికా ఖండంలోని 13 దేశాలు, ఆసియా ఖండం లోని 22 దేశాలు, ఐరోపా ఖండంలోని 2 దేశాలు మరియు ఓషియానియాలోని ఒక దేశం ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్ష వాణిజ్య నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతం గుండా సరుకు రవాణా చేస్తాయి. ఇందులో 30 శాతం వివిధ ప్రపంచ దేశాలకు చెందిన కంటెయినరైజ్డ్ కార్గో కాగా, 42 శాతం ముడి చమురు రవాణా. ప్రపంచ వాణిజ్యానికి జల రవాణా ఆయువు పట్టు లాంటిది. దాదాపు 80 శాతం సరుకులు ఓడల ద్వారా రవాణా చేయబడతాయని అంచనా వేయబడింది. ఓషన్ షిప్పింగ్ అనేది చాలా పరిశ్రమలకు సరఫరా గొలుసు (Supply Chain)లో అంతర్భాగంగా ఉంటుంది. మన దేశంలో ప్రస్తుతం 12 పెద్ద ఓడరేవులు, 205 మధ్య మరియు చిన్న ఓడరేవులు ఉన్నాయి. కాగా, వాధవన్ ఓడరేవు నిర్మాణంతో పెద్ద ఓడరేవుల సంఖ్య 13కు చేరనుంది.

భారీ లక్ష్యం:
ఆగస్టు 19, 2023న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 19వ మారిటైమ్ స్టేట్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రసంగిస్తూ దేశం యొక్క మొత్తం పోర్టుల సామర్థ్యాన్ని 2047 సంవత్సరానికి 10,000 మిలియన్ టన్నులకు పెంచాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపిన నేపథ్యంలో వాధవన్ మేజర్ పోర్టు నిర్మాణం ఒక ఆశావహ ముందడుగు అని భావించవచ్చు.

Show More

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ, హైదరాబాద్
Back to top button