CINEMATelugu Featured NewsTelugu Special Stories

అపజయాలకు కృంగనివాడు, విజయాలకు పొంగనివాడు, స్థితప్రజ్ఞుడు… పవన్ కళ్యాణ్…

కొణిదల పవన్ కళ్యాణ్ (02 సెప్టెంబరు 1971)…

బాల్యంలో తోటి పిల్లలతో సరదాగా కాలక్షేపం చేయాల్సిన ఒక సాదాసీదా కానిస్టేబుల్ కుమారుడు చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడేవాడు. తరగతి గదిలో మిగతా విద్యార్థుల మాదిరి అల్లరి చేయాలనుకునే ఒక కుర్రాడు మాష్టారు కొట్టిన దెబ్బలకు భయపడి అల్లరి చేయడానికి వెనుకాడేవాడు. తనతోటి వారంతా పడవతరగతి పాసైపోతే గణితంలో తప్పిపోయి ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్ మార్కులతో పాసైనవాడు. ఐశ్వర్యవంతుడై ఉండి కూడా మిగతా ధనవంతుల పిల్లల వలె పబ్ లకు, పార్టీలకు వెళ్లకుండా ఇంట్లోనే తిష్టవేసి మౌనంలో మునిగిపోయేవాడు. తొలి రోజులలో నటన రాక ఇబ్బంది పడినవాడు, లక్ష్యం ఏదో తేల్చుకోలేక తడబడినవాడు. తెలిసీ తెలియని వివాహబంధంలో చిక్కుకుని బయటపడినవాడు.  పుస్తక ప్రియుడు, ధ్యానంలో మునిగిపోయే యోగి, తాత్విక సిద్ధాంతాలను ఆపోసన పట్టినవాడు. వైఫల్యాలకు బెదరని వాడు, ఓటమికి చెదరని వాడు,  గెలుపు ఓటమి లను సమానంగా స్వీకరించు వాడు, తనదైన రోజున రాష్ట్రాన్ని శాసించగలవాడు.. అతడే “కొణిదెల కళ్యాణ్ బాబు” అలియాస్ “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. “నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను” అని “గబ్బర్ సింగ్” సినిమాలో ఒక సంభాషణలో అంటాడు. నిజమే తాను ఏమి చేసినా అది సంచలనమే. అది ఓటమి అయినా, గెలుపు అయినా..

చిన్నతనంలో ఎక్కువగా వైఫల్యాలు ఎదుర్కోవడం వలన కాబోలు తనలో ఓటమికి భయపడరు. సినిమా పరిశ్రమ అంటేనే వెలుగులు, జిలుగులు. కానీ పవన్ కళ్యాణ్ జీవనశైలి వాటికి దూరంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయిపోగానే తన అతిథి గృహానికి వెళ్లిపోవడం, మొక్కలతో తన ప్రేమను పంచుకోవడం, పుస్తకాలలో మునిగిపోవడం, మౌనాన్ని ఆస్వాదించడం ఇవన్నీ చూస్తే పవన్ లో మనకు ఒక తాత్వికుడు కనిపిస్తాడు. జిడ్డు కృష్ణమూర్తి, ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి ప్రసంగాలను, వారి పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడతారు పవన్ కళ్యాణ్. “నిన్ను నువ్వు తెలుసుకో” అంటాడు రమణ మహర్షి. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది. రోజు పద్మాసనం వేస్తుంటే, పద్మాసనమే వస్తుంది కానీ నటన రాదు. మంచి నటుడు కావాలంటే మళ్ళీ కష్టపడాల్సిందే అంటారు పవన్ కళ్యాణ్. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, బడే బాబా, ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి మొదలగు వారు పవన్ కళ్యాణ్ ని అపారంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినంత మాత్రాన వ్యవహారిక జీవితంలో అంతా సాఫీగా ఉండాలని నియమమేమీ లేదు. ఆ దారి వేరు, ఈ దారి వేరు. ఒకటి అంతర్గతం, మరొకటి బహిర్గతం. దేని ప్రస్థానం దానిదే.  ప్రకృతి సూత్రాలను ఎవ్వరూ తిరగ రాయలేరు.

కళ్యాణ్ గారు సినిమా చిత్రీకరణకు వస్తే, రెండు జతల బట్టలు, రెండు పుస్తకాలు తీసుకుని వస్తారు. సినిమా చిత్రీకరణ అయిపోగానే వెళ్లి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు అని మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిరాడంబరంగా జీవితం సాగించడం తన వల్లే అవుతుంది అని చెబుతుంటారాయన. అవగాహన లేని వైవాహిక బంధంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల నుండి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అన్నిటికీ తన విజయంతోనే సమాధానం చెప్పేశారు. నేను ఉపాధ్యాయుడిని అనుకుంటే వృద్ధి ఆగిపోతుంది. విద్యార్థిగా ఉంటేనే మనం నిరంతరం నేర్చుకోవచ్చు. ఏమీ తెలియనప్పుడు మనం అంతా తెలుసు అనుకుంటాం. మనం ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెడతామో అప్పుడు మనకు ఏమీ తెలియదని  తెలుసుకుంటాం. జీవితం సినిమా కన్నా ఎక్కువ నాటకంగా ఉంటుంది. ఇలాంటి మాటలన్నీ పవన్ కళ్యాణ్ చెబుతారు.

తన సినిమాలోని ఏదో ఒక పాట ద్వారా సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే అది సినిమాలకు మాత్రమే పరిమితం చేయలేదు. అది పవన్ కళ్యాణ్ యొక్క మనస్సు భాష. ఆయన సినిమాల గురించి మాట్లాడేటప్పుడు మృధుస్వభావిగా మాట్లాడుతారు. సమాజం గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్వరూంలో తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. సమాజం గురించి మాట్లాడాలంటే ఆయన గొంతు గంభీరంగా మారిపోతుంది. మాటల్లో ఏదో తెలియని ఆవేదన ధ్వనిస్తుంది. అన్యాయాలపై ఆయన కోపం కనిపిస్తుంది. ఏదో చేయాలని భావన వినిపిస్తుంది.  అందుకే పవనిజం అనేది అభిమానుల మతం అయిపోయింది.

@ నేపథ్యం…

కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో 02 సెప్టెంబరు 1971 నాడు కొణిదల వెంకటరావు మరియు అంజనా దేవి దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు మరియు ఇద్దరు అక్కలు దుర్గాదేవి, మాధవి. నటులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు దుర్గాదేవి సంతానమే. కొణిదెల వెంకటరావు పోలీసు కానిస్టేబుల్‌ గా నిడదవోలులో విధులు నిర్వహిస్తున్నప్పుడు నాగబాబు జన్మించారు. అప్పటికే శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 1వ తరగతి చదువుతున్నారు. ఆ తరువాత నాన్న గారికి గురజాల, మంగళగిరి, పొన్నూరు ఇలా అనేక ప్రాంతాలకు బదిలీ అవుతున్న క్రమంలో బాపట్ల బదిలీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే కొనసాగింది. వాళ్ళ నాన్న గారి ఉద్యోగ బదిలీల కారణంగా పవన్ కళ్యాణ్ రకరకాల ప్రాంతాల్లో పెరిగారు.

నాన్న ముక్కుసూటి, మనిషి నిజాయితీపరుడు. దాంతో ఉద్యోగంలో అనేక ఒడిదుడుకులు వచ్చేవి. అందువలన చాలా రోజులు సెలవులలోనే ఉండాల్సి వచ్చేది. దానివలన జీతం వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఎప్పుడూ అనారోగ్యముతో ఉండేవారు. ఆస్తమాతో బాధపడేవారు. ఆ సమయంలో ఆయనను వాళ్ళ అక్క ఆసుపత్రికి తీసుకెళ్లేది. వాళ్ళ నాన్న ఎక్కువ రోజులు సెలవులలో ఉంటుండడం వలన ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించడానికి ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నయ్య నాగబాబు దగ్గర ఆయనకు చనువు ఎక్కువగా ఉండేది. ఏమైనా అడగాలంటే నాగబాబునే అడిగేవారు. ఏమైనా చెప్పాలనుకున్నా తనతోనే చెప్పేవారు. ఎంతో సహనంతో ఉండే అమ్మ అంజనాదేవి ఏ విషయాన్నైనా వాస్తవిక దృక్పథంతో ఆలోచించేవారు. ఆ రోజులలో వార్తాపత్రికలో వచ్చే మంచి మంచి సీరియల్స్ ని కత్తిరించి ఆమె బైండింగ్ చేయించేవారు. పవన్ కళ్యాణ్ వాటిని చదువుతూ పెరిగారు.

@ విద్యాభ్యాసం…

బాల్యంలో కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడేవారు. కనుక ఇంట్లో అల్లరి చేసే పరిస్థితి ఉండేది కాదు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు వీపు మోత మ్రోగించేవారు. అందువలన బడిలో కూడా అల్లరిచేసే ధైర్యం చేసేవారు కాదు. ఎక్కువమంది స్నేహితులు కూడా ఉండేవారు కాదు. ఉన్న ఒక్కరిద్దరితో కలుపుగోలుగా ఉందామని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, స్నేహితుల మాటలకు పొంతన కుదిరేది కాదు. తాను పదవ తరగతిలో ఉన్నప్పుడు తనకు ఇంజనీరింగ్ చదివే ఒక మిత్రుడు, పుస్తకాల దుకాణం యజమాని కొడుకు మరో మిత్రుడుగా ఉండేవారు. కళ్యాణ్ కు తెలుగు భాష మీద మమకారం కలగడానికి కారణం తన తెలుగు మాస్టారు. మనసుకు హత్తుకునేలా ఆయన బోదనలు ఉండేవి.

గణితం మాస్టారు బోదన అర్థం కాకపోవడం వలన కాబోలు లెక్కలు సరిగ్గా వచ్చేవి కావు. అందువలన గణితం అంటే భయం ఉండేది. ప్రతీ పరీక్షలలో గణితంలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో లెక్కలే తనను దెబ్బకొట్టాయి. మూడు మార్కుల తేడాతో పదవతరగతి తప్పారు. సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన మార్పుల కారణంగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థానంలో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి అభ్యర్థులకు ఆయన ఇచ్చిన ఐదు మార్కులతో పవన్ కళ్యాణ్ కూడా పాసయ్యారు. భూతంలా భయపెడుతున్న లెక్కల మీద ఏవిధంగానైనా పట్టు సాధించాలనే తపనతో ఇంటర్మీడియట్ లో అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం తో పాటు గణితాన్ని కూడా తీసుకున్నారు. అదే సమయంలో అన్నయ్య చిరంజీవి సినిమాలలో స్థిరపడ్డారు. కళాశాలలో చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ అనే ముద్ర పడిపోయింది.

@ సత్యశోధన స్ఫూర్తితో ఇంటర్మీడియట్ తప్పి…

రోజూ వార్తాపత్రికలలో వచ్చే మంచి మంచి సీరియల్స్ ని కత్తిరించి తల్లి అంజనాదేవి బైండింగ్ చేయించిన పుస్తకాలు చదవడం అలవాటుగా ఉన్న పవన్ కళ్యాణ్ పదవతరగతి తప్పినా, చదువు అబ్బకపోయినా పుస్తకాలు పఠనం మాత్రం అలవాటు ఉండడంతో పదవతరగతి పూర్తయ్యేసరికి మంచి మంచి పుస్తకాలను తిరగేశారు. చివుకుల పురుషోత్తం వ్రాసిన “ఏది పాపం ఏది పుణ్యం” పుస్తకాన్ని పదవతరగతి లోనే చదివేశారు. గాంధీజీ మీద ఉన్న అభిమానం కొద్దీ “సత్యశోధన” పుస్తకాన్ని పలుమార్లు చదివారు. ఆ పుస్తకంలోని అనేక విషయాలు తనను వెంటాడుతూ ఉండేవి. ఒకసారి ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్నప్పుడు తనకు కాపీ కొట్టే అవకాశం వచ్చింది. కాసేపు గాంధీజీ “సత్యశోధన”ను మర్చిపోతే చకచకా చూసి వ్రాసేయవచ్చు, పరీక్ష కూడా పాస్ అయిపోవచ్చు అనుకున్నారు.

కానీ ఎందుకో ఆయన అంతరాత్మ అందుకు ఒప్పుకోలేదు. “నా స్థానంలో గాంధీజీ ఉంటే ఇలా చేసేవారు కాదు కదా, ఆయన నుంచి నేను నేర్చుకున్నది ఇదేనా” అనుకున్నారు. పరీక్ష తప్పితే తప్పింది కానీ కాపీ కొట్టకూడదు అనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దించిన తల ఎత్తకుండా వచ్చిందేదో వ్రాసి బయటకు వచ్చేశారు. ఫలితం ఊహించినట్టే జరిగింది. ఫలితాలలో తన నెంబర్ కనపడలేదు. దానికి ఆయనేమీ బాధపడలేదు. ఎందుకంటే వైఫల్యాలు తాను ఎరిగినవే. ఎనిమిదో తరగతి నుంచి పరీక్ష తప్పడం అలవాటైన తనకు అదేమీ పెద్ద వైఫల్యం అనిపించలేదు. మరోసారి సెప్టెంబరులో ప్రయత్నించారు. మళ్ళీ కుదరలేదు. పాస్ అవ్వడం అసాధ్యమని ఆయనకు అర్థం అయిపోయింది. ఇన్ని సార్లు పరీక్షలలో తప్పుతున్నా కూడా వాళ్ళ అమ్మ, నాన్న పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు.

@ ఆత్మహత్య ప్రయత్నం…

ఒకవైపు చదువు అబ్బడం లేదు. మరోవైపు ఏమిచేయాలో పవన్ కళ్యాణ్ కు తెలియడం లేదు. ఏదైనా ఉద్యోగం చేయాలనిపించి ఓ ప్రింటింగ్ ప్రెస్ లో చేరారు.  కొన్ని రోజులు గడిచినాక మూసగా అనిపించింది ఆ పని మానేశారు. ఓ గిడ్డంగిలో కుదిరారు. దాని యజమాని పవన్ కళ్యాణ్ నాన్నకు మిత్రుడు. ఈ విషయం తెలిస్తే ఆయన కోప్పడతారని రెండు రోజులకే కళ్యాణ్ ని ఇంటికి పంపించేశారు. స్నేహితులేమో ముందుకెళ్ళిపోతున్నారు. తాను మాత్రం ఉన్నచోటే ఉన్నాడు. వయస్సుకు మించిన ప్రతిభ కనపరుస్తున్న విశ్వనాథ్ ఆనంద్, సచిన్ టెండూల్కర్ వంటి వారి గురించి చదివినప్పుడు తనకేమైంది అనే అంతర్మథనం తనలో మొదలయ్యింది. విలువైన సమయాన్ని వృథా చేస్తున్నానేమో అనిపించింది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. ఇంకాస్త ఆలస్యమైతే ప్రాణాలు కూడా పోయేవి. ఇంట్లో వాళ్ళు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు, వదిన సురేఖ  అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. డిగ్రీలు చదివితేనే చదువు కాదు, ఎక్కువగా ఆలోచించవద్దు, నీవు చదివినా చదవకపోయినా మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నీవేమి కావాలనుకుంటున్నావో నీవే నిర్ణయించుకోమని సలహా ఇచ్చారు. నీ భవిష్యత్తు మీద నీకు స్పష్టమైన అవగాహన ఉంటే చాలు అని భరోసా ఇచ్చారు.

@ పుస్తక ప్రియులు…

ఐశ్వర్యవంతుల పిల్లలు పబ్ లకు వెళ్లడం , షికార్లు చేయడం, విహార యాత్రలు ఇలా గడుపుతుంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం మూడేళ్లు ఇంట్లోనే ఉన్నాడు. ఏకాంతం కావాలని దేశాటన చేశారు. వివిధ రకరకాల ప్రాంతాలలో తిరిగారు. ఆధ్యాత్మిక సాధన చేశారు, పుస్తకాలు చదివారు. ఆయనకు బడిలో నేర్పించిన విద్య కంటే పుస్తకాలలో లభించే చదువు మంచిదని భావించేవారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన పుస్తక ప్రియులు. ఆయనను మార్క్ ట్వెయిన్, నండూరి రామమోహన్ రావు రచనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయి. చివుకుల పురుషోత్తం వ్రాసిన “ఏది పాపం, ఏది పుణ్యం”, కేశవరావు వ్రాసిన “అతడు అడవిని జయించాడు”, పరమహంస యోగానంద వ్రాసిన “ఒక యోగి ఆత్మ కథ”, గాంధీజీ వ్రాసిన “సత్యశోధన”, “ఆధునిక మహాభారతం” వ్రాసిన శేషేంద్రశర్మ రచనలు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

“మైండ్ ఈజ్ ఏ మిత్” పుస్తకం తన లోని ద్వైదీ భావాన్ని పటాపంచలు చేసిందని చెబుతారు పవన్ కళ్యాణ్. ఆ పుస్తకాన్ని మహేష్ భట్ వ్రాశారు. ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి, ఓషో, రామకృష్ణ పరమహంస, ఓషో, రమణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి ఇలా ఎందరో ఆధ్యాత్మిక గురువులు, తత్వవేత్తలు ఆయనను ఎంతో ప్రభావితం చేశారు. జీవనాధారం కోల్పోయినప్పుడు  పడే ఆవేదనను కళ్లకు కట్టినట్టు చూపించిన “అతడు అడవిని జయించాడు” పుస్తకాన్ని కేశవరావు వ్రాశారు. ఆ పుస్తకం తనను చాలా ప్రభావితం చేసింది. ఎంతగా ప్రభావితం చేసిందంటే “రైతులు, చేనేత కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులు తన సాయం కోరగానే వెంటనే స్పందించారు ఆయన. తన సొంత డబ్బుతో వారికి జరిగిన నష్టాన్ని భర్తీచేసేంతలా తాను ప్రభావితం అయ్యారు. గబ్బర్ సింగ్ సినిమా విజయవంతం అయినందుకు కలిగిన సంతోషం కన్నా బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ వ్రాసిన “వనవాసి” పుస్తకం తనకు లభ్యమైనప్పుడు ఎక్కువ ఆనందం కలిగిందని చెబుతుంటారు. సినిమా చిత్రీకరణకు వెళ్ళినప్పుడు తప్పకుండా పుస్తకాలు తీసుకెళతుంటారు పవన్ కళ్యాణ్.

@ సత్యానంద్ వద్ద శిక్షణ…

సాధారణంగా ఏ తల్లికైనా ఎదుగుతున్న తమ కూతుళ్ల మీద బెంగ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకి ఎలాంటి భర్తలు వస్తారో, వారి కాపురం ఏవిధంగా ఉంటుందో,  అత్తివారింట్లో వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని. కానీ అంజనాదేవికి తన కూతుర్లు, ఇద్దరు కొడుకులు కంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ బెంగగా ఉండేది. ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు ఏదో లోకంలో ఉంటారనేది ఆమె బెంగ. ఒకరోజు కొడుకు చిరంజీవితో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు మీద తనకున్న బెంగను వెల్లిబుచ్చింది. ఒక ఆదివారం భోజనాల సమయంలో పవన్ కళ్యాణ్ ను చిరంజీవి అడిగారు. తనకు ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) ఇష్టం అని చెప్పారు కళ్యాణ్. కానీ అది వద్దు ఇంకేదైనా ఇష్టమేమో కనుక్కోమని నాగేంద్రబాబుకు చెప్పగా, వ్యవసాయం చేస్తాడట అన్నాడు చిరంజీవితో. షాకుల మీద 

షాకులిచ్చేస్తున్నాడు కళ్యాణ్. చివరికి నటన అయితేనే బావుంటుంది అని అన్నయ్య చిరంజీవి చెప్పడంతో నాగబాబు కూడా అదే సరైనది అని నచ్చజెప్పారు. కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారు. పవన్ కళ్యాణ్ ను సత్యానంద్ వద్దకు పంపించారు అన్నయ్య చిరంజీవి. పవన్ కళ్యాణ్ ను పూర్తిగా అర్థం చేసుకున్న సత్యానంద్ ముందుగా ఆయనలో ఉన్న బిడియాన్ని పోగొట్టాలనుకుని రోజూ తనను బిగ్గరగా అరవమని చెప్పేవారు. అలా అరవడం వలన తన భయం, జంకు పోతుందని సత్యానంద్ అభిప్రాయం. ఆ శిక్షణ కళ్యాణ్ కు బాగా ఉపయోగపడింది. సినిమాలలో నటించడం అంటుంచితే స్వతంత్రంగా బ్రతకగలనన్న ధైర్యం వచ్చేసింది.

@ సినీ రంగ ప్రవేశం…

చిత్రసీమలో హేమహేమీలు ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్ బాబు లాంటి అగ్రనటులు తమ తమ సినిమాలతో తారపథంలో దూసుకుపోతున్నారు. ఎప్పటినుండో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న శ్రీకాంత్ తాజ్ మహాల్ (1996) సినిమా తో అదరగొట్టేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబి (1996) తో జె.డి. చక్రవర్తి తన జెండా పాతేశాడు. సినిమా అవకాశం వచ్చినా మూడేళ్ళ నుండి చిత్రీకరణ మొదలవ్వకుండా తాత్సారం కొనసాగుతోంది. సినిమా మొదలవ్వకుంటే బెంగుళూరు వెళ్లి నర్సరీ పెట్టుకుని మొక్కలు పెంచుకోవడమే తనకు తెలిసిన పని. ఎప్పుడెప్పుడు అని చూస్తుండగా ఒకరోజు అక్కినేని నాగేశ్వరావు మనుమరాలు, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ కథానాయిక, ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకుడిగా “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి” (1996) సినిమా చిత్రీకరణ మొదలైంది.

నుదుటి మీద ఇటుకలు బద్దలు కొట్టించుకుంటున్నాడు, ఛాతి పై పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి సుత్తితో పగులగొట్టించుకుంటున్నాడు. చేతిమీదుగా కార్లు పోనించుకుంటున్నాడు. వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడే డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్, ఫైట్ మాస్టర్ దగ్గర ఫైట్స్, అవేకాకుండా జిమ్నాస్టిక్స్, కరాటే నేర్చుకున్నాడు. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కఠోర శిక్షణ చేశాడు. అందమైన లొకేషన్లలో చిత్రీకరణ కొనసాగింది. అనుభవమున్న సాంకేతిక నిపుణులు, భారీ ప్రచారం, అభిమానుల మద్దతుతో సినిమా విడుదల అయ్యింది. కానీ ఫలితం తారుమారు అయ్యింది. పరాజయం పాలైంది. సినిమా విజయవంతం అవ్వాలంటే ముఖ్యంగా కథ బావుండాలి. ఇలాంటి కథనంతోనే అంతకుముందే నాగార్జున “నిన్నే పెళ్లాడుతా”, వెంకటేష్ “ప్రేమించుకుందాం రా” తీశారు.

@ ఊహించని విజయం “తొలిప్రేమ”…

తొలి సినిమా అక్కడ అమ్మాయి – ఇక్కడ అమ్మాయి పరాజయంతో పవన్ కళ్యాణ్ లో మళ్ళీ అంతర్మథనం మొదలైంది. ఏ అండా లేకుండా వస్తే ఇబ్బందిలేదు. కానీ ఒక మెగాస్టార్ తమ్ముడు స్థానంలో అరంగేట్రం జరిగి చతికిలపడ్డట్టైంది. రెండవ సినిమా పవన్ కల్యాణ్, రాశి జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో “గోకులంలో సీత” (1997) లో విడుదలైంది. చిత్రం. పర్వాలేదు. ఆ తరువాత పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం (1998) అనే ప్రేమకథా చిత్రం విడుదలై విజయం సాధించింది. అయినా సరే పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేరు. నటుడిగా ప్రేక్షకులను ఇంకా మెప్పించాలి. ఒక అద్భుతమైన సినిమా కావాలి. ఎదురుచూస్తున్నాడు.

అంతలోనే కథ చెప్పడానికి రానే వచ్చాడు కరుణాకరణ్. చూడడానికి టీ స్టాల్ లో పనిచేసే కుర్రాడిలా అనిపిస్తున్నాడు. కానీ కథ మొత్తం విన్నాక తనలో ఏదో మెరుపు ఉందని కళ్యాణ్ కి అర్థమైంది. తాను ఎలాంటి కథ కోసమైతే వెతుకుతున్నాడో అదే కథ తగిలింది కళ్యాణ్ కి. కరుణాకరణ్ కూడా తనకు మొదటి సినిమా కాబట్టి నిరూపించుకునే కసిమీద ఉన్నాడు. అందమైన ప్రేమకథ, అద్భుతమైన పాటలు, అదిరిపోయే క్లైమాక్స్. పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా “తొలిప్రేమ” (1998) ను అందంగా తెరకెక్కించారు దర్శకులు కరుణాకరణ్. సినిమా విడుదలయ్యింది. ఊహించనంత విజయవంతమైంది సినిమా. 21 కేంద్రాలలో 100 రోజులు, రెండు కేంద్రాలలో 200 రోజులు, హైదరాబాదు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో సంధ్య 70 యం.యం. థియేటర్ లో 365 రోజులు.

@ 41 కేంద్రాలలో బద్రి శతదినోత్సవం…

తొలిప్రేమ సినిమా విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు అభిమానులు పెరిగిపోయారు. వైఫల్యాల నుండి విజయం వైపు మొదలైన ప్రయాణంలో విజయాల మెట్లు ఒక్కొక్కటిగా అధిరోహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తమ్ముడు (1999) సినిమాను బి.శివరామకృష్ణ నిర్మించారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “బద్రి” (2000) సినిమా 41 కేంద్రాలలో శత దినోత్సవం, యస్.జె. సూర్య దర్శకత్వంలో ఖుషి (2001) చిత్రం రూ. 20 కోట్ల రూపాయలను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించింది.

ఏడు సినిమాలకే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత విజయాలు. కోట్ల మంది అభిమాన ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. తనకు నచ్చిన పాత్రలు చేస్తారు. తనకు తెలిసిన భావోద్వేగాలే పలికిస్తారాయన. తనకు సినిమా ప్రయాణం ముఖ్యం, ఫలితాలు కాదు. సినిమా విజయవంతం అయినా, పరాజయం పాలైనా అది ప్రయాణంలో భాగమే తప్ప  సినిమా ఘనవిజయం సాధించినంత మాత్రాన తల ఎగిరేస్తే, రేపు వైఫల్యం ఎదురైనప్పుడు ఆ తలనే మళ్ళీ దించుకోవాల్సి వస్తుంద. ఈ రెండూ తనకు ఇష్టం ఉండదు.

@ స్వీయ దర్శకత్వంలో “జానీ”…

చలనచిత్రానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయపరిచి వాటిని సమర్ధవంతంగా ఆయా శాఖల నుండి తనకు కావలసిన విధముగా వారి వారి సామర్ధ్యన్ని ఉపయోగించుకుని తన ఆలోచనలకు ప్రాణం పోసి, తెరపైకి ఒక దృశ్యంగా మలచే వాడిని దర్శకుడు అని సంభోధిస్తారు. పవన్ కళ్యాణ్ ను అలా సంభోధించే సమయం రానే వచ్చేసింది. సినిమా రంగంలో ఏడు సంవత్సరాలు, ఏడు సినిమాలు. తరువాత స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు కళ్యాణ్. సినిమా పేరు “జానీ” (2003). కథానాయకులు మెగాఫోన్ పట్టుకోవడం ఈనాటిది కాదు. ఎప్పటినుండో ఉన్నది. బాలీవుడ్ లో దర్శకత్వం రాజ్ కపూర్ కు సాధ్యమైంది. దేవానంద్ కు కూడా సాధ్యమైంది. కానీ దిలీప్ కుమార్  దాని జోలికి వెళ్లలేదు.

తెలుగులో నందమూరి తారకరామారావుకు సాధ్యమైంది, సూపర్ స్టార్ కృష్ణకు సాధ్యమైంది. కానీ అక్కినేని నాగేశ్వరరావు దాని జోలికి వెళ్లలేదు. ఎం.జి.ఆర్, శివాజీ గణేషన్ లాంటి వారు దర్శకత్వం చేయడానికి భయపడ్డారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి లాంటి వారు దర్శకత్వం చేయడానికి ఒప్పుకోలేదు. హీరోగా ఉంటూ దర్శకత్వం వహించడం అంటే మెడకు పెద్ద బండరాయి కట్టుకుని సముద్రాన్ని ఈదడమే. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఆ పనిని ఎంచుకున్నారు. కానీ సినిమా విజయం సాధించాలంటే కథ ఎంత ముఖ్యమో, దాని కథనం కూడా అంతే ముఖ్యం. “ఒక కళాకారుడు జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకోకపోతే, ఆ కళాకారుడు జనానికి ఏది అక్కర్లేదో అదే ఇస్తాడు”.

నిజానికి “జానీ” (2003) జనానికి అక్కర్లేని సినిమా. పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులు అలా చూడదలుచుకోలేని సినిమా “జానీ”. పవన్ కళ్యాణ్ నుండి వాళ్ళు ఆశించని సినిమా. కథానాయికకు క్యాన్సర్. హీరో ఫైటింగ్ లు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ సంఘర్షణ గొప్పగానే ఉండవచ్చు. కానీ ప్రేక్షకులకు ఆ కథనాన్ని అంగీకరించలేకపోయారు. విజయం ఇచ్చే ఆనందం కన్నా, పరాజయం కొట్టే దెబ్బ ఎంత బలంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ కి తెలిసి వచ్చింది. తన సినిమా కార్యాలయం సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా జేబులో డబ్బులు లేవు. అలాగాని ఆయన ఎవ్వరినీ అడగలేని పరిస్థితి. అంతకుముందు ఖుషి సినిమాకి సంపాదించిన డబ్బుతో కొన్న ఫామ్ హౌస్ అల్లు అరవింద్ కి ఇచ్చేసి మిగిలిన కొద్దిపాటి డబ్బులతో ఊరెళ్ళిపోయారు కళ్యాణ్. విజయానికి చుట్టాలు బోలెడు మంది, కానీ పరాజయం మాత్రం అనాథ.

@ జల్సా తో తన సత్తువ తెలిపి…

జానీ (2003) పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తన సినీ ప్రస్థానాన్ని విజయంతో గాడిలోకి తేవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆలోపే తెలుగు సినిమా చరిత్రలో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి మహేష్ బాబు “ఒక్కడు” సినిమా 15 జనవరి 2003 న విడుదలై అద్భుతమైన విజయం సాధించగా, జూనియర్ ఎన్టీఆర్ “సింహాద్రి” 09 జులై 2003 నాడు విడుదలై అది కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నిజానికి పరాజయం చవిచూసిన కథనాయకులని ప్రేక్షకులు పట్టించుకోరు. విజయం వరించిన వారిని మాత్రమే గుర్తుంచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరైనా పరుగులు తీస్తూనే ఉండాలి. అలా పరుగులు తీస్తున్న క్రమంలో ఏర్పడిన దారిలో కొత్త కథానాయకులు వస్తుంటారు. ఎవరి ప్రతిభ వారిదే. పవన్ కళ్యాణ్ తిరిగి తన దారిని తాను తిరిగి దక్కించుకోవాలి. గుడుంబా శంకర్  (2004), బాలు (2005), బంగారం (2005),  అన్నవరం (2006) సినిమాలతో మళ్ళీ విజయసౌధానికి దారులు పరుస్తున్నాడు.

సరైన సమయం వచ్చింది. మాటల మాంత్రికుడి చొరవతో మాయచేసేశాడు. త్రివిక్రముడి దర్శకత్వంలో జల్సా (2008) బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. సునామీ ఎదురుగా ఉంటూ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది “జల్సా” సినిమా. పవన్ కళ్యాణ్ సత్తువ ఏమిటో నిరూపించింది. కలెక్షన్లు వర్షం కురిపించింది. ఆ విజయంతో మళ్ళీ ఎవరెస్టు మీద నిలుచున్నాడు. అంతే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆత్రపడలేదు, తొందరపడి సినిమాలు తీయలేదు. విజయాలను ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వెళుతున్నాడు. కొమరం పులి (2010), తీన్ మార్ (2011), పంజా (2011), గబ్బర్ సింగ్ (2012), కెమెరా మెన్ గంగతో రాంబాబు (2012), అత్తారింటికి దారేది (2013), గోపాల గోపాల (2015), సర్దార్ గబ్బర్ సింగ్ (2016), కాటమ రాయుడు (2017), అజ్ఞాతవాసి (2018), వకీల్ సాబ్ (2021), భీమ్లా నాయక్ (2022), బ్రో (2023) మొదలగు సినిమాలతో తెలుగు సినిమారంగంలో తనదైన ముద్రవేస్తూ కొనసాగుతున్నారు.

@ వివాహాలు – వివాదాలు…

పవన్ కళ్యాణ్ మే 1997లో నందినిని వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన 1999 నాటికి విడిపోయారు. న్యాయపరమైన గొడవ తరువాత వారు అధికారికంగా ఆగష్టు 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణం క్రింద కళ్యాణ్ ₹ 5 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించారు. అంతకుముందే 2001లో బద్రి సినిమా చిత్రీకరణ నుండి తన సహనటి రేణు దేశాయ్‌తో కళ్యాణ్ సహజీవనం కొనసాగించారు.   వారికి 2004లో కుమారుడు అకిరా నందన్ జన్మించాడు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కళ్యాణ్ ఆర్యసమాజ్ ఆచారాల ప్రకారం జనవరి 2009లో  రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. వారికి 2010 లో కుమార్తె ఆద్య జన్మించింది.

2011 నాటికి ఆర్థిక సమస్యలను ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ జంట అధికారికంగా 2012 లో విడాకులు తీసుకుని విడిపోయారు. వ్యక్తిగత కారణాల వలన వారు విడిపోయినా గానీ ఇప్పటికీ రేణు దేశాయ్, కళ్యాణ్‌తో చాలా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తోంది. తీన్ మార్ సినిమా చిత్రీకరణ సమయంలో కళ్యాణ్ తన మూడవ భార్య, రష్యా పౌరురాలు అన్నా లెజ్నెవాను కలుసుకున్నారు. వారు సెప్టెంబరు 2013లో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని సబ్ – రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె మరియు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు.



Show More
Back to top button