బానిసత్వం రూపు మార్చుకుంటున్నది. నాటి వెట్టిచాకిరి లాంటి బానిసత్వ రూపాలు నేడు మారిపోయి నూతన రూపును సంతరించుకుంటున్నాయి. బలవంతపు వివాహాలు, మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ దోపిడీ, బాల కార్మిక దురాచారం, లైంగిక వేధింపులు లేదా దోపిడీ, యుద్ధ సమయాల్లో బాలల్ని వాడుకోవడం లాంటి సమకాలీన బానిసత్వ రూపాలు నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండడం విచారకరం, ఆక్షేపణీయం. ఇలాంటి ఆధునిక బానిసత్వ సంకెళ్లలో 50 మిలియన్ల ప్రపంచ అభాగ్యులు మగ్గడం సోచనీయం. వీరిలో 28 మిలియన్ల ప్రజల బలవంతపు శ్రమ దోపిడీ, 22 మిలియన్ల మంది బలవంతపు వివాహాలు ఉన్నాయి. ప్రతి 8 మందిలో ఒక్కరు బలవంతపు శ్రమ దోపిడీకి, సగం మంది పిల్లలు బలవంతపు లైంగిక సంబంధాలను కలిగి ఉంటున్నారు.
బలవంతపు శ్రమ దోపిడీ 86 శాతం ప్రైవేట్ రంగాల్లోనే జరుగుతున్నది. బలవంతపు శ్రమ దోపిడీకి గురి అవుతున్న ప్రతి ఐదుగురు మహిళలు/బాలికల్లో నలుగురు బలవంతపు లైంగిక దోపిడీకి లోనవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. పేదరికం, వివక్ష, సంక్షోభాలు లేదా యుద్ధాల వంటి కారణాలతో అభాగ్యుల నిస్సహాయ స్థితులను ఆసరాగా చేసుకుని చెప్పు కింద పురుగు వలె బానిసత్వ కోరల్లో బంధించి వారి బతుకులను నలిపి వేయడం నేడు సాధారణం కావడం సిగ్గు చేటు. ఈ విష వలయంలో మహిళలు, పిల్లలు కూడా చిక్కి శల్యం కావడం కడు విచారకరం.
సమకాలీన బానిసత్వ రూపాల నిర్మూలన
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ) వివరాల ప్రకారం ఆధునిక బానిసత్వ దురాచారాలు ప్రపంచ దేశాలన్నింటిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్య ఆదాయ, అధిక ఆదాయ దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపించడం బాధాకరం. ఆధునిక బానిసత్వ రూపాలను రూపుమాపడానికి, అవగాహన పెంచడానికి, బానిసత్వ సంకెళ్లను తొలగించడానికి ప్రతి ఏట 02 డిసెంబర్ రోజున ఐరాస-ఐఎల్ఓ నేతృత్వంలో “అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం” పాటించుట ఆనవాయితీగా మారింది.
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం-2024 థీమ్‌గా “సమకాలీన బానిసత్వ రూపాల నిర్మూలన” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతున్నది. పరిశ్రమలు, గృహ సేవలు, వ్యవసాయ, సేవారంగాల్లో ఆధునిక బానిసత్వమైన బలవంతపు శ్రమ దోపిడీ పెచ్చరిల్లిపోతున్నట్లు తెలుస్తున్నది. కొంత వరకు బలవంతంగా బిక్షాటన, అక్రమాలు చేయించడం కూడా జరుగుతున్న విషయం మరిచి పోరాదు. పిల్లలను, మహిళలను బానిసత్వ మురికి కూపాల్లోకి నెట్టడం అమానవీయం, ఆక్షేపణీయం. డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి బానిసత్వ రూపాలు కనిపించడం నేటి మానవ సమాజానికి సిగ్గు చేటు. ఇప్పటికైనా బానిసత్వ దురాచారాలకు దూరంగా సుస్థిరాభివృద్ధికి దగ్గరగా జరుగుతూ, 2030 నాటికి బానిసత్వమే కనిపించని ప్రపంచాన్ని చూద్దాం, ఆ దిశగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.