డా. బీఆర్ అంబేద్కర్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది భారత రాజ్యాంగం. ఈయన లేనిదే ఆధునిక భారతీయ చరిత్రను ఊహించలేం. ఐక్యరాజ్యసమితి అంబేద్కర్ ఘనతని, కీర్తిని గుర్తించి వారికి తగిన గౌరవం గుర్తింపు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని దిశానిర్దేశం చేసింది. అలాంటి మహనీయుడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ నిపుణులు తప్పుపడుతున్నారు. అసలు ఇంతకీ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏంటి? దీనిపై దేశమంతా ఎందుకు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల భారత పార్లమెంటులోని రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ప్రతి ఒక్కరూ దేశంలో అంబేద్కర్ అనే నామాన్ని పలకడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని అందుకు బదులుగా దేవుడిని తలచుకుంటే ఏడు జన్మలకు సరిపడా స్వర్గం లభిస్తుందని అన్నారు. కానీ, వాస్తవంగా మాట్లాడుకుంటే స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియదు. కానీ, భారతీయ ప్రజలు సర్వ సుఖాలు అనుభవించేలా, ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదిగేలా, భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా ఉండేలాగా ‘భారత రాజ్యాంగం’ అనే గ్రంథంతో అంబేద్కర్ దేశ చరిత్రను సంపూర్ణంగా మార్చేశారు. దేశాన్ని అంతలా మర్చిన నాయకున్ని ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా అనడంపై అంబేద్కర్ వాదులు తప్పుబడుతున్నారు.
అప్పుడే మనకు భిన్నత్వంలో ఏకత్వం..!
ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్‌ని ఓ వర్గానికి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నాయి. కాబట్టి ఇలా ఆయన్ను దూషిస్తూ ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ రాజకీయాన్ని కొనసాగించలేరు. దేశంలోని అన్ని పార్టీలకు దేశ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే భారత రాజ్యాంగ గ్రంథంలోని అంశాలని తూచా తప్పకుండా అమలుపరిస్తే దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా దుఃఖంతో ఉండడు. కాబట్టి అంబేద్కర్‌ను ఓ వర్గానికి చెందిన వ్యక్తిగా కాకుండా.. రాజ్యాంగ నిర్మాతగా చూస్తేనే దేశంలో అసలైన భిన్నత్వంలో ఏకత్వం అనే భావన సంతరించుకుంటుంది.