ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 2 బిలియన్ల క్రిస్టియన్లు 25 డిసెంబర్ శుభ గడియల్లో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగ క్రిస్మస్ అని మనకు తెలుసు. “గాడ్స్ కన్ లేదా దేవుడి కుమారుడి”గా జీసస్ క్రీస్ట్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. క్రీస్తు బోధించిన ప్రేమ, త్యాగం, కరుణ, శాంతి, సద్భావనలు, క్షమాగుణాలను మరోసారి మననం చేసుకోవడం, ప్రవక్తల ప్రవచనాల ద్వారా వినడం ఆ పండుగ ప్రత్యేకం. దురాశ, చేటు భావనలకు తావులేని మానవజాతి నిర్మింపబడాలని క్రీస్తు బోధించడం జరిగింది.
ఇండ్లను విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించడం, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనను చేయడం, బంధుమిత్రులతో కలిసి శుభాకాంక్షలు పంచుకోవడం, క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాలను (లేదా కరోల్స్) ఆలపించడం, కానుకలు పంచుకోవడం, ప్రత్యేక వంటలను ఆస్వాదించడం, కేకులు పంచడం, క్రిస్మస్ ట్రీని అలంకరించడం, శాంతా క్లాజ్ రూపాలను ధరించడం లేదా ఆహ్వానించడం లేదా రూపాలను ఏర్పాటు చేసుకోవడం, అరటి/మామిడి కొమ్మలతో అలంకరించడం, మట్టి ప్రమిదల్లో చమురు వేసి ఇంటిపై భాగాన అమర్చి వెలిగించడం లాంటి పలు కార్యక్రమాలను పవిత్ర భావనలతో చేయడం చూస్తుంటాం. ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించిన ఈ పండుగలో అన్ని మతాల ప్రజలు కూడా పాల్గొనడం, శుభాకాంక్షలు తెలియజేయడం గమనిస్తున్నాం.
మేరీ మాతకు క్రీస్తు జననం:
బెత్లహామ్ నగరంలో మేరీ మాతకు క్రీస్తు జన్మించారని మనకు తెలుసు. బైబిల్‌లో జీసస్ క్రీస్తు పుట్టిన రోజును స్పష్టంగా వర్ణించనప్పటికీ క్రీస్తుశకం 336 ప్రాంతంలో రోమన్ రాజులు శీతాకాల ముగింపు వేళల్లో “అజేయ సూర్యుడి పునర్జన్మ లేదా ది రీబర్త్ ఆఫ్ ఇన్విన్సిబుల్ సన్”గా 25 డిసెంబర్‌న నిర్వహించుకోవడం ఆచారంగా మారింది. జీసస్ క్రీస్తు ప్రపంచాన్ని వెలుగులమయం (లైట్ ఆఫ్ ది వరల్డ్) చేసిన రోజుగా 25 డిసెంబర్‌కు ప్రాధాన్య ఇవ్వబడింది. కొన్ని క్రిస్టిమన్ సమూహాలు క్రీస్మస్ పండుగను జనవరి 06 లేదా మార్చి 25న (మేరీ మాత గర్భవతి అయిన రోజు) కూడా నిర్వహిమచుకుంటున్నారు.
క్రీస్తు శకం 52 ప్రాంతంలో సెయింట్ థామస్ అనే క్రైస్తవ బోధకుడు భారత దేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేసినట్లుగా చెబుతారు. నేడు భారత దేశవ్యాప్తంగా 24 మిలియన్లు క్రిస్టియన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, గోవా, కేరళ, తమిళనాడు, పాండుచ్చెరీ లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియన్ల జనాభా అధికంగా కనిపిస్తుంది. ముంబాయి మహానగరంలో కూడా ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది.
క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతియుత సహజీవనం, కరుణ, దయ, క్షమాగుణాలను అలవాటు చేసుకొని విశ్వ మానవాళి సమైక్య భావనలతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని, దురాశ, చెడు ఆలోచనలకు దూరంగా ఆదర్శప్రాయంగా జీవితాలను గడపడానికి కృషి చేయడమే అసలైన క్రీస్మస్ పండుగ కావాలని కోరుకుందాం. క్రిస్టియన్ సమాజానికి జీసస్ క్రీస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.