Telugu Special Stories

సుపరిపాలనకు చిరునామా అటల్‌ బిహారీ వాజ్‌పాయి పాలన

 భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కవి, రచయిత, జర్నలిస్టు, వక్త అటల్‌ బిహారీ వాజ్‌పాయి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏట 25 డిసెంబర్‌ రోజున భారత ప్రభుత్వం “సుపరిపాలన దినోత్సవం లేదా గుడ్‌ గవర్నెన్స్‌ డే” నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ ఏడాది 25 డిసెంబర్‌ 2024 రోజున వాజ్‌పాయి 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ డిసెంబర్‌ 19 నుంచి 24 వరకు భారత ప్రభుత్వం “గ్రామాల వైపు సుపరిపాలన లేదా ప్రశాసన్‌ గామ్‌ కీ ఓర్‌” అనే నినాదాన్ని తీసుకొని పరిపాలనా యంత్రాంగాలను గ్రామీణ స్థాయికి తీసుకురావడం, గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించే మార్గాలు వెతకడం కొనసాగుతున్నది.

సుపరిపాలన ప్రధాన లక్షణాలు:

2014 నుంచి నిర్వహిస్తున్న సుపరిపాలన దినోత్సవంలో భాగంగా పరిపాలనా యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల అభిప్రాయాలకు సత్వర స్పందన, సమ్మిళిత – సమానత్వ అభివృద్ధి, మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు పట్టం కట్టడం, చట్టాలకు లోబడి పాలన, అన్ని వర్గాల స్థానిక ప్రజల భాగస్వామ్యం, సమర్థవంతమైన సఫల పరిపాలన, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడం, అధికార దుర్వినియోగాలను అరికట్టడం, నిధులను నిష్పక్షపాతంగా కేటాయించి సద్వినియోగపరచడం లాంటి అంశాలను జోడించి స్వపరిపాలనకు మెరుగులు దిద్దడం కొనసాగుతుంది. సుపరిపాలన అందించడానికి భారత కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా, ఆర్టీఐ చట్ట అమలు, మైగవ్‌ ప్లాట్‌ఫాం, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌, ప్రగతి 2.0 లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలను రచించి అమలు చేస్తున్నది. 

అటల్‌ బిహారీ వాజ్‌పాయి సుసంపన్న జీవితం:

25 డిసెంబర్‌ 1924న గ్వాలియర్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అటల్‌ బిహారీ వాజ్‌పాయి పిజీ వరకు విద్యను పూర్తి చేశారు. 1942లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పిడికిలా బిగించి పాల్గొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 9 సార్లు లోకసభకు ఎన్నిక కావడంతో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తన జీవితకాలంలో మూడు పర్యాయాలు (1996, 1998-99, 1999+2004) ప్రధాన మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా అవిశ్రాంత అద్వితీయ సేవలు అందించారు.

వాజ్‌పాయి పరిపాలనాదక్షతకు నిదర్శనాలుగా పోక్రాన్‌ అణు పరీక్ష నిర్వహణ, కార్గిల్‌ యుద్ధ విజయం, బంగారు చతుర్భుజ పథకం, పిఎం గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సంస్కరణల కొనసాగింపు లాంటివి కొన్ని మచ్చుకు ఉదాహరణలుగా పేర్కొనబడుతున్నాయి. అటల్‌ బిహారీ వాజ్‌పాయి అమూల్య సేవలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 2015లో భారత అత్యున్నత పౌర పురస్కారం “భారత రత్న” అందించడం జరిగింది. దీనికి తోడుగా పద్మ విభుషన్, ఉత్తమ పార్లమెంటేరియన్‌, మెరొక్కో ఆర్డర్‌ ఆఫ్‌ క్వాసమ్‌ అలోక్వెట్‌ లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

16 ఆగష్టు 2018న తుది శ్వాస విడిచిన అటల్‌ బిహారీ వాజ్‌పాయి పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా జీవితాన్ని భరతమాత సేవకు అర్పించారు. వాజ్‌పాయి రాజకీయ జీవితం నేటి రాజకీయ నాయకులకు దారి దీపం కావాలని, పౌర సమాజానికి వారి సాధారణ సరళ నిస్వార్థ జీవితం ఆదర్శం కావాలని, ప్రభుత్వ యంత్రాంగం వారు చూపిన సుపరిపాలన అందించాలని కోరుకుందాం, నేడు 100వ జన్మదిన వేడుకల్లో సుపరిపాలనకు పునరంకితం కావాలని ఆశిద్దాం. 

Show More
Back to top button