
నేటి తరం యువతలో అధిక శాతం అధిక వేతనాల కోసం విదేశీ అవకాశం ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్న రోజులివి ! కానీ వందేళ్ళ క్రిందటే మాతృభూమి రుణం తీర్చుకోవడానికి విదేశీ అవకాశాలను కాదనడమే కాక ప్రతిష్ఠాత్మకమైన ‘నోబెల్ ‘ బహుమతిని భౌతిక శాస్త్రంలో అందుకొని మనదేశ గౌరవాన్ని గగన వీధుల్లో ఎగురవేసిన శాస్త్రవేత్త ‘ సర్ సి వి రామన్ ‘. అరకొర సదుపాయాలతోనే మనదేశంలో పరిశోధనలు చేసి ఎన్నో విజయాలు సాధించిన కాంతిపుంజం ఆయన. ‘ భారతరత్న ‘ అందుకున్న విజ్ఞాన కెరటం.
భారతీయుల ఆధునిక విజ్ఞాన ప్రతిభాపాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహావ్యక్తి. భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ మహనీయుడు. ” విజ్ఞానశాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తులే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి” అని భారతరత్న అందుకున్న సందర్భంలో ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసం నేటీకీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమేగాక నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
జాతీయ సైన్స్ దినోత్సవం:
సివి రామన్ నోబెల్ బహుమతిని గెలుచుకోవడానికి దారితీసిన ‘రామన్ ఎఫెక్ట్’ను ఫిబ్రవరి 28 న కనుగున్నారు. ఈ ఆవిష్కరణ జ్ఞాపకార్థం ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం 1987 ఫిబ్రవరి 28 నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా అధికారకంగా జరుపుతుంది. ప్రతీ సంవత్సరం విభిన్న థీమ్ తో జరుపుతారు. ” 2025 జాతీయ సైన్స్ దినోత్సవ థీమ్ ‘ విక్షిత్ భారత్ సాధనలో భాగంగా విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలో ప్రపంచంలోనే నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం. ” జాతీయ సైన్స్ డే వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలలో పబ్లిక్ స్పీచ్‌లు, టెలివిజన్ టాక్ షోలు, థీమ్‌లు, కాన్సెప్ట్‌ల ఆధారంగా సైన్స్ ఎగ్జిబిషన్‌లు, స్కైవాచింగ్, లైవ్ ప్రాజెక్ట్‌లు, పరిశోధన ప్రదర్శనలు, డిబేట్లు, క్విజ్ పోటీలు, ఉపన్యాసాలు, సైన్స్ మోడల్‌ల ప్రదర్శనలు లాంటి అనేక ఇతర కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా జరుగుతాయి.
ఈ రోజు లక్ష్యాలు:
సైన్స్ ప్రాముఖ్యత దాని అనువర్తనాల గురించి ప్రజలలో అవగాహన పెంచడం జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. ప్రజల దైనందిన జీవితంలో శాస్త్రీయ అనువర్తనాల సందేశాన్ని వ్యాప్తి చేయడం, మానవ సంక్షేమం కోసం భారతీయ శాస్త్రవేత్తల కార్యకలాపాలు, కృషి విజయాలను ప్రదర్శించడం, శాస్త్రీయ సమస్యల గురించి చర్చించడం, శాస్త్రీయ అభివృద్ధికి కొత్త సాంకేతికతలను అమలు చేయడం, శాస్త్ర సాంకేతికతలను ప్రోత్సహించడం వంటి ఇతర లక్ష్యాలు కూడా ఉన్నాయి.
నోబెల్ విజేత:
మనదేశంలో భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తుల్లో సర్ సి వి రామన్ మొదటి వ్యక్తి. ఈయన 7 నవంబర్ 1888 నాడు తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించిన భరతమాత ముద్దు బిడ్డ ” “చంద్రశేఖర్ వెంకట రామన్”. అందరికీ తెలిసే పేరు సివి రామన్. తండ్రి విశాఖపట్నంలో ఎవియన్ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. చిన్నప్పటి నుండే విజ్ఞానశాస్త్రల ఆసక్తిని కనబరిచేవారు. తండ్రి భౌతిక అధ్యాపకులవడం సైన్స్ పట్ల మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది.
చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన పన్నెండవ యేట సెయింట్ అలోషియస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ హయ్యర్ సెకండరీ విద్యనును పూర్తి చేసారు. ఫిజిక్స్ సబ్జెక్టులో బంగారుపతకాన్ని సాధించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 లో ప్రవేశించి డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందారు. 1907 లో అదే కాలేజీ నుండి MA( ఫిజిక్స్) డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యారు.తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.
ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. కానీ విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్ నుండి తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది.
సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం. ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు కాంతి పరిక్షేపణంపై పరిశోధనలు చేశారు. కాంప్టన్ ఫలితం ఎక్స్ కిరణాల విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయాలలో నిజం కావాలి కదా అని ఆలోచించి పరిశోధనలు కొనసాగించారు. కోల్‌కతాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాలలో 1928 ఫిబ్రవరి 28 న “రామన్ ఎఫెక్ట్” అనే సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఇది స్పెక్ట్రోస్కోపీలో ఒక దృగ్విషయం.
రామన్ ఎఫెక్ట్ అంటే ?
పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.
రామన్ ఎఫెక్ట్ కాంతి కిరణాన్ని అణువుల ద్వారా మళ్లించినప్పుడు సంభవించే కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పును సూచిస్తుంది. కాంతి ఒక అణువును ఎదుర్కొన్నప్పుడు, దానిని వివిధ మార్గాల్లో చెల్లాచెదురు చేయవచ్చు అని ఈ దృగ్విషయం తెలుపుతుంది. ఈ ప్రయోగం అసామాన్యమైనదని అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ ను అభినందించారు. ఈ ప్రయోగానికే ఆయనకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
అనువర్తనాలు :
రామన్ స్పెక్ట్రోస్కోపీ అనేది రామన్ ఎఫెక్ట్ అనువర్తనం. ఇది రోగనిర్ధారణ సాధనం. ప్రోటీన్ నిర్మాణాన్ని అధ్యయనంలో, కణజాలం, కణాలలో జీవ అణువులను, శరీరంలోని ప్రాణాంతక కణజాలాన్ని కూడా గుర్తించగలదు. వైద్యశాస్త్రంలో క్యాన్సర్ వ్యాధితో పాటుగా కరోనా వైరస్, హెపటైటిస్, డెంగ్యూ జ్వరం లాంటి వ్యాధులను నిర్ధారించడానికి, బయోమెడికల్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్స్‌లో దాని రోగనిర్ధారణ సామర్థ్యం కోసం విస్తృతంగా ఉపయోగించే సాధనంగా రామన్ స్పెక్ట్రోస్కోపీ మారింది. ఔషధాల తయారీ తుది ఉత్పత్తి ధృవీకరణలోను, తయారీ ప్రక్రియలోను, నాణ్యత నియంత్రణలోను ఉపయోగకరంగా ఉంటుంది.
శరీరకణాలలో ప్రోటీన్లు, లిపిడ్లు, న్యూక్లియిక్ ఆమ్లాల కంటెంట్‌ను పర్యవేక్షించడంలోను ఉపయోగపడుతుంది. ఈ నిర్దిష్ట సాంకేతికత ద్వారా ఆహార నాణ్యత, ఆహార ఉత్పత్తుల ప్రమాణీకరణను సులభంగా నిర్వహించవచ్చు. రసాయన సమ్మేళనాలను గుర్తించడానికి, పరమాణు బంధాలు, పరస్పర చర్యలను అర్థం చేసుకోవచ్చు. ఆహార పరిశ్రమలో ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను నిర్ధారించోచ్చు. పర్యావరణ కాలుష్య కారకాలను గుర్తించవచ్చు. ఇది నీరు, గాలి, మట్టిలోని కాలుష్య కారకాలను గుర్తించి లెక్కించగలదు. పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు సహాయపడుతుంది. నేర నిర్ధారణ విభాగంలో తుపాకీ కాల్పులు అవశేషాలు, ఫోర్జరీ పత్రాలను గుర్తించడంలోనూ, రిమోట్ సెన్సింగ్, గ్రహాల అన్వేషణలోనూ అంగారక గ్రహంలోని ఖనిజాలను పసిగట్టడానికి రామన్ స్కాటరింగ్ ఉపయోగపడుతుంది.
సత్కారాలు:
ఈయనకు 1928 లో ‘ సర్ ‘ , 1929లో బ్రిటీష్ ప్రభుత్వంచే నైట్ హుడ్ బిరుదులు లభించాయి. 1954లో భారత అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” తో గౌరవించబడ్డారు. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో సత్కరించింది.
మరణం వరకూ పరిశోధనలే !
1949లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ ఆ సంస్థలో పరిశోధనలు జరిపి మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు. అతని పని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల పరిశోధకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. కాంతి స్వభావం పై తన మార్గదర్శక పని ద్వారా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసిన మార్గదర్శకుడు.