
నేడే ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం కాగా రాంలీలా మైదానం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ఎన్డీయే ముఖ్య నేతలు హాజరవుతున్నారు.
గతంలో సుష్మాస్వరాజ్ (భాజపా), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), అతికి (ఆప్) ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించిన బీజేపీ.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖా గుప్తా పేరును ప్రకటించడం విశేషం. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. రేఖా గుప్తావైపే భాజపా అధిష్టానం మొగ్గు చూపింది. డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మను ప్రకటించింది.
షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు.. రాజకీయాలేం కొత్త కాదు. ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. భాజపాలో పలు విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారామె.
నేపథ్యం..
1974 జులై 19న హరియాణాలోని జింద్ జిల్లాలోని జులానాలో రేఖా గుప్తా జన్మించారు. 1976లో తన కుటుంబం మొత్తం ఢిల్లీకి మకాం మారారు. చిన్న వయసులోనే ఆరెస్సెస్ భావజాలంవైపు ఆకర్షితురాలయ్యారు. ఢిల్లీ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. 1996లో ఢిల్లీ యూనిర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ ఎన్నికయ్యారు.
అనంతరం ABVPలో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత వంటి కీలక అంశాలపై దృష్టిసారించి, పనిచేశారు.
తొలుత 2003-04లో బీజేపీ యువమోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి, అక్కడ ప్రధాన కార్యదర్శిగా, 2004-06 వరకు ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
మొదటిసారి 2007లో ఉత్తర పితంపురా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆమె 2012లో మరోసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. తరువాత దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి బరిలో నిలిచిన రేఖా గుప్తా.. రెండుసార్లు ఓటమిని ఎదుర్కొన్నారు.
తిరిగి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దిల్లీ భాజపా ప్రధాన కార్యదర్శిగా, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా.. ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో కొనసాగారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలతో ఆమె సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో.. చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా ఆప్ కు షాకిస్తూ.. బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని, అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఈసారి తన ఖాతాను తెరవలేకపోయింది.
సీఎం సీటు రేసులో పర్వేశ్ సాహిబ్ సింగ్, విజేందర్ గుప్తా, రేఖా గుప్తా, ఆశిశ్ సూద్, సతీశ్ ఉపాధ్యాయ్, శిఖా రాయ్‌ల పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరకు కేజ్రీవాల్‌ను ఓడించిన ఢిల్లీ మాజీ సీఎం కొడుకు పర్వేశ్ వర్మను సీఎంగా ఎంచుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, బుధవారం సమావేశమైన బీజేఎల్పీ ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకోవడం విశేషం.
రేఖా గుప్తానే ఎందుకంటే..
రేఖా గుప్తానే ఎందుకంటే ఆమె మహిళా నాయకురాలిగా ఆమెకున్న విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణాల్లో మైనారిటీ ఓటర్లు అనుకూలంగా ఉండటం కూడా ప్లస్ అయ్యింది. దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులు మైనారిటీలను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధించిన బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీ విషయంలోనూ ఇదే సక్సెస్ మంత్రలా పనిచేసింది.
దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో చూసుకుంటే (సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీనే అధికారంలో ఉంది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం అభ్యర్థి లేరు.
మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఒకపక్క ఉండనే ఉన్నాయి. పైగా ఢిల్లీ సీఎంగా ఇప్పటివరకు అతిశీనే ఉన్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో తిరిగి మహిళను ఎంచుకోకుంటే ఇదివరకే వినిపిస్తున్న విమర్శలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతోపాటు అక్కడ మహిళా ఓటర్లే ఎక్కువ.
ఢిల్లీ తర్వాత భాజపాకు నెక్స్ట్ టార్గెట్‌గా ఉన్న పంజాబ్‌లోనూ ఆప్ ఈ విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. పంజాబ్‌లో ఆప్‌ను ఓడిస్తే.. ఇక ప్రధాన శత్రువును పూర్తిగా ఓడించినట్లవుతుంది.
మరో కారణం.. రేఖా గుప్తా బనియా కమ్యూనిటీకి చెందిన మహిళా నేత. ఢిల్లీలో ఈ కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కమ్యూనిటీకి చెందినవారు. రేఖా గుప్తాను ఎంచుకుంటే బనియా కమ్యూనిటీని ప్రసన్నం చేసుకోవడంతోపాటు మహిళల నుంచి పాజిటివిటీని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. వారి చుట్టే హామీల పర్వం కొనసాగింది. మొత్తంగా
ఆప్ మహిళా ఓటు బ్యాంకును చెదరగొట్టడం వల్లే బీజేపీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సీఎం పదవికి అనుభవజ్ఞులైన నాయకులను పక్కనబెట్టిన బీజేపీ అధిష్టానం.. ఢిల్లీలో కూడా అదే ఫార్ములాను అమలు చేసి, కొత్త ఒరవడిని కొనసాగిస్తోంది.