Telugu Politics

ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న జాతీయ పార్టీలు!

ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలకు రాజకీయ మనుగడ సమస్యగా మారిందని కొన్ని సంఘటనలు ద్వారా రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వివిధ కేసులతో ఆయా పార్టీల నేతలను వేధిస్తున్న తీరు కారణంగా అవి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయంటున్నారు. ఈ క్రమంలో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారు గట్టిగా నిలదీయలేక పోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రాంతీయ పార్టీలను కేంద్రం కూడా విశ్వాసంలోకి తీసుకోలేక పోతున్నది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి సమస్యపైనా చర్చ చేయకుండా మమ అనిపించడమే ఇందుకు నిదర్శనంలా కనిపిస్తోంది.

జీఎస్టీపై నిర్మలా సీతారామన్ తలబిరుసుగా సమాధానం ఇచ్చినా రాష్ట్రాల్లో గట్టిగా నిరసనలు తెలపలేక పోయారు. దీనివల్ల ప్రజల సమస్యలను నిలదీయడంలో ఈ పార్టీలు విఫలం అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఆ పార్టీలను దారికి తెచ్చుకునే క్రమంలో జార్ఖండ్, ఢిల్లీ సీఎంలకు వేధింపులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీని, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజీవ్రాల్ను తుదముట్టించడం బీజేపీ ప్రయత్నమే అని అంటున్నారు. అంతేకాకుండా పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించగలిగారు అని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఓ రకంగా బీజేపీ.. కాంగ్రెస్ ముక్త నినాదానికి ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  ఇలా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఉనికి లేకుండా చేయగలి గుజరాత్, గోవాలో కాంగ్రెస్ ఓట్లను చీల్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

జార్ఖండ్ సీఎం సోరేన్ ఎలాగో బెయిల్ దక్కించుకుని మళ్లీ పీఠం ఎక్కారు. అయినా వీరికి తాత్కాలిక ఉరట మాత్రమే దక్కింది.  అంతేకాకుండా బీఆర్‌ఎస్ నేత కవిత కూడా బెయిల్ కోసం నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు బలహీనపడితే వాటి స్థానంలో బలపడేందుకు కాంగ్రెస్కే ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకునే ప్రాంతీయ పార్టీలు అధికంగా కొల్లగొట్టాయి. బీజేపీ క్రియాశీలకంగా మారడానికి ముందే ప్రజలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలను ఆదరించారు.

ఇవాళ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కాంగ్రెస్ అనుసరించిన విధానాలే కారణం. ఇప్పుడు మోదీ కూడా ప్రాంతీయ పార్టీలను బలహీన పరిస్తే చివరకు ప్రధాన పోటీ మళ్లీ బీజేపీ, కాంగ్రెస్లకే పరిమితం కావడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి మొన్నట పార్లమెంట్ ఎన్నికలకే ఉదాహరణ చూపుతున్నారు. అదే సమయంలో బిజెపి తన సీట్లను భారీగా కొల్పోయింది. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యం సాధించడం కష్టమని గ్రహించినందు వల్లే మోదీ ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా పెట్టుకున్నారా? అన్న అనుమానాలకు ఆస్కారం లేకపోలేదు.

ఏమైనా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మధ్య ప్రాంతీయ పార్టీలు నలిగిపోయే పరిస్థితి పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. బిజెపి పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనే కర్ణాటక, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు. ఏది ఏమైనా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపో, బీజేపీ వైపో మళ్లుతున్నారంటే అందుకు ప్రధాన కారణం ప్రాంతీయ పార్టీల నేతల స్వయంకృతాపరాధాలే అని చెప్పుకోవాల్సిందే. ఈ పరిస్థితిని అధిగమించి ప్రజారంజక పాలన సాగిస్తేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉంటుంది.

Show More
Back to top button