హైడ్రా ఓ విప్లవాత్మకం..! ఏపీలో సాధ్యం అవుతుందా..?
ప్రకృతితో ఆడుకుంటే.. ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది అని అంటాడు పర్యావరణ శాస్త్రవేత్త. అందుకే భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూనుకోవడం అభినందించదగ్గ పరిణామం. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం, దానికి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్‌ను ఛైర్మన్‌గా నియమించడమే ఓ విప్లవాత్మకం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రా(హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’)కు సంబంధించిన ప్రస్తావన వస్తోంది.
ఢిల్లీ టవర్స్ కూల్చివేతే స్ఫూర్తి..!
రూ.70 కోట్ల బడ్జెట్‌తో కట్టిన ఈట్విన్ టవర్స్‌ను కట్టడానికి మూడేళ్ల సమయం పట్టింది. కానీ కూల్చేందుకు కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్‌ను కట్టారని ఇంతపెద్ద టవర్స్‌ను కూల్చివేశారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ వివరాల ప్రకారం.. గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య దూరం కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంది. అంటే కేవలం 7 మీటర్లు తేడాతో ఈ భవనం నిర్మించారు. అందుకే కూల్చివేశారు. ఈ రెండు టవర్స్ కూడా కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే చాలా ఎత్తులో ఉన్నాయి. కేవలం 7 మీటర్ల తేడాతో కట్టిన అంతపెద్ద ట్విన్ టవర్స్‌నే కూల్చివేయగా.. చెరువులపై నిర్మాణాలు చేస్తే కోర్టులు అందుకు ఊరుకుంటాయా..? కబ్జాలు చేసి చెరువులను ఆక్రమించి కట్టేసి.. తర్వాత కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్‌లతో కాలయాపన చేయవచ్చు అనుకునేవారికి అతిపెద్ద గుణపాఠం. ఢిల్లీ ట్విన్ టవర్స్.
‘రూల్ ఫర్ ఆల్’
ఇటీవల ప్రముఖ సిని హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికీ ఒకే రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటూ యమా దూకుడు మీదుంది ప్రభుత్వం. అక్రమ నిర్మాణాలను గుర్తించడం… ఆ వెంటనే కూల్చివేయడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టు. ఇక ముందు హైడ్రా ఎవరి ఆక్రమణలపై గురి పెడుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఏపీలోనూ హైడ్రా తీసుకుని రాబోతున్నారా..?
తెలంగాణలో ‘హైడ్రా’ చర్యలపై సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో కూడా అలాంటి తరహా చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరిగా చెరువులు, నల్లాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలకంటే… ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా సర్కార్ భూముల కబ్జాపై ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనేది ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్చలు తీసుకునేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హైడ్రాకు రాజ్యాంగ బద్దత కల్పించాలి..!
హైడ్రా చేస్తున్న పని.. ప్రస్తుత తీవ్ర వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో భాగంగా మనం చూడాలి. రానున్న కాలంలో హైడ్రాను స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా రాజ్యాంగ బద్దత కల్పించాలి. న్యాయపరమైన దిశలోనూ ఆ సంస్థను పటిష్ట పరచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే చెరువులు చాలా అవసరం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే పచ్చదనం, చెట్లు అవసరం. పచ్చదనానికి, చెట్లకు చెరువులు అవసరం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే నీటితో నిండిన చెరువుల పాత్ర చాలా ముఖ్యం. చెరువుల పునరుద్ధరణ మీద రాజకీయ నీలినీడలు పడకుండా హైడ్రా సంస్థ పనితీరు ఉండాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత విష రాజకీయ సంస్కృతి గుర్తు చేస్తున్నది. హైడ్రా పనికి ప్రజల నిరంతర మద్దతు అవసరం ఉన్నది. ప్రజల మద్దతు రావాలంటే హైడ్రా తన పనిలో ప్రజల్ని భాగస్వాములు చేయాలి.