CINEMATelugu Special Stories

నంది తిమ్మన పారిజాత ప్రబంధానికి సినిమా రూపం.. శ్రీకృష్ణ తులాభారం (1966)

ఒక రోజు అనుకోకుండా శ్రీకృష్ణ దేవరాయలు భార్య తిరుమలదేవి, రాయల వారిని తన పాదాలతో తాకుతుందట. దాంతో కోపగించుకొన్న రాయల వారు, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు. తిరుమలదేవికి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి “స్వయంగా శ్రీకృష్ణుల వారే తన్నించుకున్నారు మీదేముంది” అని చెప్పడానికి ఈ కథ వ్రాసినారు అని ఒక జనశ్రుతి. ఈ కథలో నారదుడు పారిజాతం శ్రీకృష్ణుల వారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, ఆ విషయం తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.

నంది తిమ్మన వ్రాసిన పారిజాత ప్రబంధం ఆధారంగా 1920 లో ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రచించారు. వందల కొద్దీ ప్రదర్శనలు జరుపుకున్న ఆ నాటకంలో ప్రసిద్ధ రంగస్థల నటులు స్థానం నరసింహారావు సత్యభామ పాత్ర పోషించి “మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి” గీతాన్ని ఆలపించి వన్నెకెక్కారు. ఆ నాటకంలోని పలు పాటలు, పద్యాలు జనరంజకంగా నిలిచిపోయాయి. ఆ నాటకం ఆధారంగా చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో 1935లో  రూపొందిన “శ్రీకృష్ణ తులాభారం” చిత్రంలో కపిలవాయి రామనాథ శాస్త్రి, ఋష్యేంద్రమణి, కచ్చెర్లకోట సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సినిమాతోనే రేలంగి, కాంచనమాల సినీ రంగానికి పరిచయమయ్యారు.

ఆ తరువాత 1956లో నిర్మాత కడారు నాగభూషణం, చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మించిన “శ్రీకృష్ణ తులాభారం” చిత్రంలో ఈలపాట రఘురామయ్య, ఈశ్వర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తరువాత 1966 లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన “శ్రీకృష్ణ తులాభారం” చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, జమున , అంజలీదేవి, వాణీశ్రీ మొదలగు వారు నటించగా ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు. ఈ చిత్రానికి రచన, కొన్ని పాటలు, పద్యాలు సముద్రాల రాఘవాచార్య, ఛాయాగ్రహణం అన్నయ్య, నృత్యం కే.ఎస్. రెడ్డి అందించగా కళ దర్శకత్వం రాజేంద్ర కుమార్, ఎడిటింగ్ కె. ఏ. మార్తాండ్ లు అందించారు. శ్రీకృష్ణ తులాభారం 25 ఆగస్టు 1966 విడుదలై ఘనవిజయం సాధించింది.

@ చిత్ర విశేషాలు….

  • దర్శకత్వం   :       కమలాకర కామేశ్వరరావు 
  • సంభాషణలు   :    సముద్రాల సీనియర్
  • నిర్మాణం   :     డి. రామానాయుడు 
  • తారాగణం  :  నందమూరి తారక రామారావు, జమున, కాంతారావు, అంజలీదేవి, వాణిశ్రీ
  • సంగీతం    :     పెండ్యాల నాగేశ్వరరావు
  • ఛాయాగ్రహణం  :   అన్నయ్యా
  • కూర్పు       :       కె.ఏ. మార్తాండ్ రావు
  • నిర్మాణ సంస్థ    :    సురేష్ ప్రొడక్షన్స్
  • నిడివి      :     178 నిమిషాలు
  • విడుదల తేదీ   :     25 ఆగస్టు 1966
  • భాష     :     తెలుగు

@ కథ సంక్షిప్తంగా…

ఆది వరాహమూర్తి, భూదేవి లకు జన్మించినవాడు నరకాసురుడు. అతడు నరరూప రాక్షసుడు. దేవతలకు తల్లిగా భాసించే అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్ని, వారి విహార సాధనమైన మణిపర్వతాన్ని అతడు ఎత్తుకుపోతాడు. నరకాసురుడి ఆగడాలు మితిమీరడంతో దేవతలు శ్రీకృష్ణభగవానుడిని (ఎన్టీఆర్‌) వేడుకుంటారు. దాంతో శ్రీకృష్ణభగవానుడు సత్యభామా (జమున) సమేతంగా యుద్ధానికి వెళ్లి, ఆమె చేత యుద్ధం చేయించి నరాకాసుర సంహారం చేస్తాడు. నరకాసురుని మీద యుద్ధం చేసి గెలిచిన తరువాత విజయోత్సాహంతో ద్వారకకు వచ్చిన శ్రీకృష్ణుడు, సత్యభామలకు అశేష జనసందోహం ఆనందోత్సవాలతో స్వాగతం పలుకుతుండగా చిత్ర కథ ప్రారంభమవుతుంది. సత్యభామ తాను నరకాసుర వధలో కీలక పాత్ర పోషించానని, నావల్లే శ్రీకృష్ణునికి విజయం సిద్ధించినదని గర్వంతో ఉండడం మొదటి సన్నివేశంలోనే కనిపిస్తుంది.

నారద మహర్షి (కాంతారావు) అమరలోకం నుండి పారజాతపుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి (ఎన్టీఆర్‌) బహూకరిస్తాడు. ఆ కుసుమాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణి (అంజలీదేవి) కొప్పులో అలంకరిస్తాడు. అది చూసిన సత్యభామ చెలికత్తె (వాణిశ్రీ) ఆ విషయం సత్యభామ చెవిన వేస్తుంది. అది విని రగిలిపోయిన సత్యభామ అలక వహిస్తుంది. దాంతో శ్రీకృష్ణుడు దేవలోకం వెళ్లి సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని తెస్తాడు. దానితో సత్యభామ గర్వం హద్దులు మీరి, శ్రీకృష్ణుని ఎల్లవేళలా తన సన్నిధిలో ఉండేలా చేసుకోవాలనుకుంటుంది. అందుకోసం నారదుడు సత్యభామ చేత భర్తృదాన వ్రతాన్ని చేయించి శ్రీకృష్ణుని దానంగా పొందుతాడు. అప్పుడు శ్రీకృష్ణుని బదులు అతనికి సమానంగా తూగగల ఐశ్వర్యాన్ని ఇచ్చి శ్రీకృష్ణుని తిరిగి పొందమని చెబుతాడు.

శ్రీకృష్ణ తులాభారము మొదలవుతుంది. శ్రీకృష్ణుని తులదూచే ధనమిచ్చి, తిరిగి పొందాలని సత్యభామ చూస్తుంది. చివరకు స్వామి వారి బరువుకు తగ్గ బంగారం, ధనేతరములు ఏవీ సత్యభామ వద్ద దొరకవు. దాంతో శ్రీకృష్ణుని నారదుడు అంగడి వీధిలో పెట్టి అమ్మ చూపుతాడు. సత్యభామ తాను చేసిన పొరబాటుకు విచారిస్తుంది. భక్తితో తనను తూచగల శక్తి రుక్మిణికి మాత్రమే ఉందని శ్రీకృష్ణులవారు సెలవిస్తారు. నారదుని ఆదేశం మేరకు సత్యభామ రుక్మిణీదేవిని సహాయం అర్ధిస్తుంది. రుక్మిణీదేవి భక్తితో నమస్కరించి ఒక తులసీదళం త్రాసులో వేయగానే అది కృష్ణుని బరువుతో సరితూగుతుంది. శ్రీకృష్ణుడు సత్యానాథుడు కాదని, ఆ పరమాత్మ జగన్నాథుడని నారదుడు సత్యభామకు నిరూపించి సత్యభామ స్వాతిశయానికి కళ్ళెం వేస్తాడు. కృష్ణ పరమాత్మ భక్తికి దాసుడు అన్న సత్యాన్ని జగతికి చాటడానికే ఈ నాటకం సాగిందని తేలుతుంది. సత్యభామ గర్వం నశించి, ఆమె కూడా కృష్ణభక్తినే ఆశ్రయిస్తానంటుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.

@ కథా సంగ్రహణం…

నిజానికి భాగవతంలో “పారిజాతాపహరణం” అన్న ఘట్టం మాత్రమే ఉన్నది. కానీ, “శ్రీకృష్ణతులాభారము” అన్నది అందులో కానరాదు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన నంది తిమ్మన తన “పారిజాతాపహరణం” ను రక్తి కట్టించారు. దానిని ఆధారం చేసుకొని పలు గాథలు అల్లుకుపోయి, చివరకు “శ్రీకృష్ణతులాభారం” వెలసింది. దానిని ముత్తరాజు సుబ్బారావు నాటకంగా మలిచారు. ఈ నాటకంలో పద్యాలను ఆయనే పలికించారు. ఆయన వ్రాసిన “శ్రీ కృష్ణ తులాభారం” నాటకాన్ని తెలుగు నాటకరంగం లో దిగ్గజాలనదగిన నటులు ఎందరెందరో ఈ నాటకానికి ప్రాచుర్యం కల్పించారు. ఇందులో కొన్ని పాటలను చందాల కేశవదాసు రాశారు. ఈయన తెలుగు సినిమా తొలి గేయ రచయిత. మన తొలి టాకీ తెలుగు చిత్రం “భక్త ప్రహ్లాద” కు ఈ చందాల కేశవదాసు గీత రచయిత.

స్థానం నరసింహారావు గారు రచించి అభినయించినట్టుగా చెప్పబడుతున్న “మీరజాల గలడా నా యానతి” అను పాట, నారదుడు పాడే “భలే మంచి చౌక బేరమూ” అను పాటలు బహుళ ప్రజాదరణను పొందాయి. నాటకం లోని పాటలు, పద్యాలను యథాతథంగా ఉపయోగించి నిర్మించిన శ్రీ కృష్ణ తులాభారం” సినిమా అపురూపమైన ప్రేక్షకాదరణను పొందింది. ఈ నాటకం ఆధారంగా తెలుగులో సినిమాలు నిర్మించబడ్డాయి. కృష్ణ తులాభారం (1935) లో మొదటిసారి నిర్మించినప్పుడు శ్రీకృష్ణుడుగా “కపిలవాయి రామనాథశాస్త్రి” నటించారు. చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో ఇది రెండవసారి శ్రీకృష్ణ తులాభారం (1955) పేరుతో నిర్మించబడింది. మూడవసారి డి.రామానాయుడు నిర్మాతగా 1966 లో శ్రీకృష్ణ తులాభారం నిర్మించగా అది అద్భుతమైన ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది.

@ కృష్ణుడిగా ఎన్టీఆర్…

పౌరాణిక పాత్రలలో జీవించి,  పౌరాణిక పాత్రలు పోషించాలంటే ఎవ్వరైనా ఎన్టీఆర్ తరువాతే  అని నిరూపించి పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు మహనీయులు ఎన్టీఆర్. ఆయన “ఇద్దరు పెళ్ళాలు” చిత్రంలో తొలిసారి కొద్దిసేపు శ్రీకృష్ణుడి పాత్రలో అలా కనిపించారు. ఆ తరువాత ఘంటశాల నిర్మించిన “సొంతవూరు” (1956) లో రెండు నిముషాల పాత్ర నిడివితో రెండవ సారి కృష్ణుడి పాత్ర ధరించారు. కానీ శ్రీకృష్ణుడి పాత్ర అంటే ప్రేక్షకులకు ఈలపాటి రఘురామయ్య గుర్తురావడం వలన ఎన్టీఆర్ ని ప్రేక్షకులు శ్రీకృష్ణుడిగా అంగీకరించలేదు. కె.వి.రెడ్డి చిత్రీకరించే “మాయాబజార్” సినిమాకు తాను శ్రీకృష్ణుడి పాత్రకు సరిపడనని, వెరెవరినైనా వెతుక్కోండని కె.వి.రెడ్డికి ఎన్టీఆర్ చెప్పారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ మీద విపరీతమైన నమ్మకం ఉన్న కె.వి.రెడ్డి వినలేదు.

శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ని ఒప్పించి కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ లతో చర్చించి శ్రీకృష్ణుడి పాత్రకి సరిపడే ఆహార్యానికి తగిన స్కెచ్‌లు గీయించి, లోహంతో మడిమకుటం లాంటి రంగుల రాళ్ళు అద్ది పూర్తి కిరీటం తయారు చేయించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మెడలో వనమాల, కౌస్తభం లాంటివి ఆహార్యంగా ఎంపిక చేసి మాయాబజార్ సినిమాతో తెలుగువారి శ్రీకృష్ణుడి రూపానికి ప్రాణం పోశారు కె.వి.రెడ్డి. ఇక కృష్ణుడిగా అయితే మాయాబజార్ సినిమాతో మొదలుపెట్టి.. వినాయకచవితి, దీపావళి, భక్త రఘునాథ్, శ్రీ కృష్ణార్జున యుద్ధం, కర్ణన్, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణ విజయం, కన్నన్ కరుణై, శ్రీకృష్ణాఆంజనేయ యుద్ధం, శ్రీమద్విరాట పర్వం.. అప్పటినుండి తమిళ్, తెలుగు భాషలలో కలిపి ఎన్టీఆర్ దాదాపు 25 సంవత్సరాలలో 33 చిత్రాలలో శ్రీకృష్ణుడిగా నటించారు. 18 సినిమాలలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా నటించారు. ఆవిధంగా “శ్రీకృష్ణ తులాభారం” చిత్రంలో కూడా శ్రీకృష్ణుడి పాత్రలో అలరించారు.

@ నిర్మాత రామానాయుడు…

ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో 1936 లో దగ్గుబాటి రామానాయుడు జన్మించారు.  మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోగా పినతల్లి వద్ద పెరిగారు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ యస్.యస్.యల్.సి దాకా చదువుకున్నారు. మద్రాసులోని ఆంధ్రా లయోలా కళాశాలలో చదువుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే ఎక్కువగా గడిపేవారు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కళాశాల రాజకీయాలు తోడవ్వడంతో రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పారు. దాంతో రామానాయుడుకి మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిపించారు. ఆ తరువాత వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టారు. 

రామానాయుడికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. ఇష్టం లేకున్నా కూడా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టారు. ఓ రోజు హఠాత్తుగా ఆదాయపు పన్ను శాఖ వారు వచ్చి బిల్లులు రాయడం లేదంటూ రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దాంతో ఆ వ్యాపారం మీద విరక్తి వచ్చేసి, మిల్లు మూసివేసి ఊరు విడచి చెన్నపట్నం చేరుకున్నారు. మద్రాసులో సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. నిర్మాతలతో భాగస్వామిగా “అనురాగం” చిత్రాన్ని నిర్మించారు. కానీ అది విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తాను పెట్టుబడిగా పెట్టిన 50 వేల రూపాయలు కోల్పోయారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ సంపాదించుకోవాలన్న పట్టుదల తనకు మొదలైంది. 

అందుకని ఈసారి తానే స్వయంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని “సురేష్ ప్రొడక్షన్” సంస్థ ఆరంభించారు. తాపీ చాణక్య దర్శకుడిగా 1964లో “రాముడు భీముడు” తీసి విజయం సాధించారు. “రాముడు భీముడు” చిత్ర చిత్రీకరణ జరుగుతూ ఉండగానే ఎన్టీఆర్ కు మరో సినిమా కోసం బయానా ఇచ్చారు రామానాయుడు. ఆ సినిమా పేరు “శ్రీకృష్ణతులాభారం”. ఎన్టీఆర్ వేరే సినిమాతో తీరికలేకుండా ఉండటం వలన “శ్రీకృష్ణతులాభారం” సినిమాను ఒక సంవత్సరం పాటు వాయిదా వేశారు. అందువలన ఆయన కాంతారావు, ఎల్.విజయలక్ష్మి, రాజశ్రీ లతో “ప్రతిజ్ఞ పాలన” నిర్మించారు. ఈ సినిమా కూడా బాగా ఆడింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో శ్రీకృష్ణతులాభారం (1966) లో నిర్మించారు. ఆ సినిమా బాగానే ఆడింది, పెట్టిన ఖర్చులు వెనక్కి వచ్చేశాయి.

@ దర్శకులు కమలాకర కామేశ్వరరావు…

దర్శక మాంత్రికుడు కమలాకర కామేశ్వరరావు 1911 లో బందరులో జన్మించారు. ఆయన 1933లో బి.ఏ. పాసయ్యారు. సినిమా సాంకేతికత మీద ఉన్న ఉత్సాహంతో వచ్చిన ప్రతీ చలనచిత్రాన్ని భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసి కృష్ణా పత్రికలో “సినీఫాన్” అన్న పేరుతో సినిమా సమీక్షలు వ్రాసేవారు. బందరులో మొదటిసారి విడుదల కాని తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు చేస్తుండేవారు. ఆయన వ్రాసిన సినిమా విమర్శల్ని చదివి, ప్రేక్షకులు సినిమా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “ద్రౌపదీ మానసంరక్షణం” చిత్రాలలో  “వస్త్రాపహరణం” ఆర్థికంగా విజయవంతమైంది, “మానసంరక్షణం” దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం “మానసంరక్షణం”, “వస్త్రాపహరణం” కంటే మంచి చిత్రమని ప్రశంసించారు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లను విమర్శించాడు. చిత్రాల మీద వ్రాసిన ఆ విమర్శలే కామేశ్వరరావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.

“కనకతార” తీస్తున్న హెచ్.ఎం.రెడ్డిని మద్రాసులో కలుసుకున్న కామేశ్వరరావును తన సినిమా “వస్త్రాపహరణం” సినిమా బాగాలేదని వ్రాసిన విమర్శలు నచ్చి హెచ్.ఎం.రెడ్డి కామేశ్వరరావును అభినందించి తన గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కామేశ్వరరావును తన రోహిణీ సంస్థలో చేచుకున్నారు. రోహిణీలో ఆయనకు రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైన పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకులు. వాహినీ వారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పనిచేశారు. వారు స్థాపించిన విజయా సంస్థ “పాతాళభైరవి” సినిమా నుండి కామేశ్వరరావు పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత విజయా వారే నిర్మించిన “చంద్రహారం” సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం నిరాశపరిచింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది.

@ తారాగణం…

శ్రీకృష్ణుడిగా మహానటులు నందమూరి తారకరామారావు శాంత, వీర, గంభీర భావాలను, లాలింపు, అలరింపు, అనునయం సన్నివేశాలను చక్కని చిరునవ్వుతో అభినయించారు. అంజలీదేవి రుక్మిణిగా సాత్వికమైన నటనతో,   సత్యభామను విమర్శించే జాంబవతిగా కృష్ణకుమారి నటనలో తన చురుకుదనాన్ని ప్రదర్శించారు. ఇక సత్యభామగా ఆ పాత్రకు గల అతిశయాన్ని శ్రీకృష్ణునిపై అనురాగాన్ని తన నటనలో మేళవించి, ప్రదర్శించిన జమున తన అభినయంతో ఆకట్టుకొని అపర సత్యభామ బిరుదు సార్ధకం చేసుకున్నారు. ఇక నారదని పాత్రలకు బాగా ప్రసిద్ధి పొందిన కాంతారావు ఆ పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఈ చిత్రంలో ఇంద్రునిగా రాజనాల నటించగా, అతని భార్య సచీదేవిగా యస్. వరలక్ష్మి, దేవమాతగా ఋష్యేంద్రమణి తమ పాత్రలలో చక్కటి అభినయాన్ని చూపించారు. అలాగే దేవికీగా నిర్మలమ్మ, వసుదేవుడిగా  మిక్కిలినేని నటించారు. శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో జాంబవతిగా కృష్ణకుమారి నటించగా మిగిలిన భార్యల పాత్రలలో అనురాధ, జయశ్రీ, విజయలలిత మరో ఇరువురు నటించారు. ఈ సినిమాలో వసంతయ్య పాత్రలో పద్మనాభం నటించగా, మాలతిగా మీనాకుమారి చక్కని అభినయంలో కనిపిస్తారు.

@ చిత్రీకరణ…

శ్రీకృష్ణ తులాభారం సినిమాలో శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు అభినయించారు. 

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నందమూరి తారకరామారావు తో నిర్మించిన రెండవ సినిమా ఇది కాగా, ఈ చిత్రానికి దర్శకుడుగా మొట్టమొదట తాపీ చాణక్యను  అనుకున్నారు. ఆ సినిమా పౌరాణీకం కావడంతో “కమలాకర కామేశ్వరరావు” ను తీసుకున్నారు. సత్యభామ ఆలక, ఆపైన పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకురావడం, దేవేంద్రుడు శచీదేవిల సన్నివేశాలు, శ్రీకృష్ణుని లీలావిలాసం, సత్యభామ అతిశయం, రుక్మిణి అవమానం పుట్టిన దినమని మెట్టిన దినమనే సన్నివేశంలో సపత్నుల వాదాలు, శ్రీకృష్ణుని తులాభారం, శ్రీకృష్ణుని బజారులో అమ్మడం వంటి సన్నివేశాలను ఎంతో విపులంగా, హృద్యంగా పౌరాణిక గాథను దృశ్యకావ్యంగా వెండితెరపై ఆకట్టుకులేనా కమలాకర కామేశ్వరరావు రూపొందించారు. సత్యభామ పై చిత్రీకరించిన ప్రార్థన గీతం “కరుణించవే తులసి మాత”, రుక్మిణిపై చిత్రీకరించిన గీతం “నిదురనైనా నాధుని సేవకోరటం”,  సత్య పై “కలనైనా గోపాలుడు నన్నే వలచు రీతి”, రంభ నృత్యగీతంలో “కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి” లో కాళియ పడగలపై లీలా నాట్యము వేసిన తాండవ కృష్ణ, అలాగే చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణ సత్యల స్వాగత గీతం “జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి” మనల్ని అలరిస్తాయి.

నృత్య దర్శకుడు కె.యస్.రెడ్డి అభినయం, అతనికి ఘంటసాల నేపథ్య గానం పాడడం, “ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి” అంటూ నందనోద్యాన వనంలో గీతం (జయంతి, జమున, విజయలక్ష్మి అభినయం), “ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను” అంటూ ఆకాశవీధి నుంచి నారదుడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ పాడే గీతం,  శ్రీకృష్ణుడు సత్యభామ తోటలో  “మధువులు చిందే మందహాసం”, మందిరంలో రుక్మిణితో “ప్రణయారాధన వేల బాలా పతి పూజలు నీకేలబేల”, నదిలో పడవలో జాంబవతితో “మధుర సుధారాగమే”, మిగిలిన వారితో పాచికలు, వీణ వాయిద్యం, పన్నీరు చల్లటం, ఊయల లూపటం, నృత్యం చేయడం లాంటివి విడివిడిగా సంగీతంతో చూపడం, చివర, మధ్యలో శ్రీకృష్ణుడు, చుట్టూ ఎనిమిది మంది చిత్రాలు రావడాన్ని  అలరించేలా దర్శకులు కమలాకర కామేశ్వరరావు చిత్రీకరించారు. సత్యభామ అలక తీర్చే గీతం “ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల”, రక్తిని మేళవించిన రసమయ గీతం “మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి”, చందాల కేశవదాసు రచించిన “భలే మంచి చౌక బేరము ఇది సమయమున్” (నారదుడు శ్రీకృష్ణుడిని అమ్మజూపే సన్నివేశంలోనిది) లాంటి పాటలను అద్భుతంగా చిత్రీకరించారు.

@ విడుదల…

03 మార్చి 1966 న వాహినీ స్టూడియోలో విజయా నాగిరెడ్డి తొలి క్లాప్ కొట్టగా, దగ్గుపాటి సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయడంతో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. నందమూరి తారక రామారావుకు 

శ్రీకృష్ణుడిగా ఇది ఏడవ సినిమా. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకులు కోవెలమూడి బాపయ్య ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాను, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న “శ్రీకృష్ణ తులాభారము” సినిమా 25 ఆగస్టు 1966 నాడు విడుదల అయ్యింది. ఈ సినిమా 5 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

100 రోజుల కేంద్రాలు వరుసగా దుర్గా కళామందిరం, విజయవాడ లో (112 రోజులు), నాజ్ థియేటర్, గుంటూరు లో (104 రోజులు), అశోక థియేటర్ రాజమండ్రి, కల్పన థియేటర్ కాకినాడ, రంగమహల్ నెల్లూరు లో 100 రోజులు ఆడింది. సాగర్ థియేటర్, హైదరాబాద్ లో 64 రోజులు ఆడింది. ఆ సంవత్సరం అనగా 1966 లో నందమూరి తారక రామారావు నటించిన “శ్రీకృష్ణ పాండవీయం”, “పల్నాటి యుధ్ధం”, “శకుంతల”, “పరమా నందయ్య శిష్యుల కథ”, “శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ”, “మంగళ సూత్రం”, “అగ్గిబరాటా”, “సంగీత లక్ష్మి”, “శ్రీకృష్ణ తులాభారము”, “అడుగు జాడలు”, “పిడుగు రాముడు”, “డాక్టర్ ఆనంద్” సినిమాలు విడుదల అయ్యాయి.

ఉత్తమ అభిరుచి గల నిర్మాత డి.రామానాయుడు భారీ నిర్మాణ వ్యయానికి వెనుకఅడుగు వేయకుండా తమ బ్యానర్ పై నిర్మించిన “శ్రీకృష్ణ తులాభారం” ఘనవిజయం సాధించింది. ఆ సంస్థ తరువాత కాలంలో పలు భాషలలో శతాధిక చిత్రాలు రూపొందించడం అభినందించదగ్గ విషయం.

Show More
Back to top button