Telugu Politics

కూటమి ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌..రూ.3,22,359 లక్షల కోట్లతో రాష్ట్ర పద్దు..ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూ.3,22,359 లక్షల కోట్లతో నిన్న ఉదయం 10 గంటలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో, కొల్లు రవీంద్ర శాసనమండలిలో ప్రవేశపెట్టారు.

ఐదేళ్ల వైకాపా పాలనలోని ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించేలా.. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే విధంగా రూపొందించిన ఈ బడ్జెట్‌ కీలకంగా నిలవనుంది. అభివృధ్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇవ్వబోతోంది. కూటమి ప్రభుత్వ ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు, సూపర్‌సిక్స్‌లో కీలక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడబోతున్నాయి. ఇందుకు సింహభాగం కేటాయింపులు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉన్నందున కేంద్ర సాయంతో చేపట్టే ఈ పథకానికి భారీగా నిధులు దక్కనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్రలోని కరవు ప్రాంతాలకు, మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఉంటాయి. 

*సూపర్‌సిక్స్‌ లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అమలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘తల్లికి వందనం’ పేరుతో చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఆర్థికసాయం అందించనున్నారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ సాయం అందుతుంది. మే నెలలో ఈ పథకం అమలుచేయనున్నారు. 

*అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందించనున్నారు. కేంద్రం రూ.6వేలు ఇస్తే, రాష్ట్రప్రభుత్వం రూ.14వేలు సాయం అందిస్తోంది. 

*దీపం పథకం కింద రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నారు.

*ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించనున్నారు. వ్యవసాయరంగంలో వైకాపా ప్రభుత్వంలో రైతులకు ఉపకరణాలేవీ అందించలేదు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అవసరమైన సామగ్రి అందించేందుకు సిద్ధమవుతోంది. రుణసంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. 

*వైద్యరంగానికి కేంద్రం నుంచి కొన్ని పథకాల పరంగా సాయం అందే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలను అన్నింటినీ గాడిలో పెట్టారు. ఆ పథకాలకు 40% రాష్ట్ర వాటా నిధులు కేటాయించనున్నారు. ఆ పథకాలు అమలైతే జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు కేటాయింపులు ఉంటాయి. స్వయం ఉపాధి పథకాలు, వాటిలో రాయితీలు, యూనిట్ల స్థాపనకు వీలు కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుంది.

*పోలవరంతో పాటు వెలిగొండ ప్రాజెక్టుకూ ప్రాధాన్యం ఉంటుంది. హంద్రీనీవా సుజల స్రవంతి, కుప్పం బ్రాంచి కాలువ, వంశధార, వంశధార నాగావళి అనుసంధానం, చింతలపూడి ఎత్తిపోతల, గాలేరు నగరి సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వనున్నారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా డెల్టాల ఆధునికీకరణపైన దృష్టి   సారిస్తారు.

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

*నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – రూ.1,228 కోట్లు,

* పాఠశాల విద్యాశాఖ – రూ.31,805 కోట్లు,

* ఉన్నత విద్య – రూ.2,506 కోట్లు,

* ఎస్సీల సంక్షేమానికి – రూ.20,281 కోట్లు,

*ఎస్టీల సంక్షేమానికి – రూ.8,159 కోట్లు,

* బీసీల సంక్షేమానికి – రూ.47,456 కోట్లు,

* అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ.5,434 కోట్లు,

* మహిళాశిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం – రూ.4,332 కోట్లు,

*వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి – రూ.19,264 కోట్లు,

*పంచాయతీ రాజ్‌ శాఖకు – రూ.18,847 కోట్లు,

* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ.13,862 కోట్లు,

*గృహ నిర్మాణ శాఖకు – రూ.6,318 కోట్లు,

* జలవనరుల శాఖకు – రూ.18,019 కోట్లు,

*పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ.3,156 కోట్లు,

* ఇంధన శాఖకు – రూ.13,600 కోట్లు,

*ఆర్‌అండ్‌బీకి – రూ.8,785 కోట్లు,

* యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు – రూ.469 కోట్లు,

*గృహ మంత్రిత్వ శాఖకు – రూ.8,570 కోట్లు,

*తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ.10 కోట్లు,

*మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ.10 కోట్లు,

* జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం – రూ.2,800 కోట్లు,

* వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ.13,487 కోట్లు,

*పౌరసరఫరాల శాఖకు – రూ.3,806 కోట్లు,

* తల్లికి వందనం కోసం – రూ.9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు),

* ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం – రూ.27,518 కోట్లు,

* ఆర్టీజీఎస్‌ కోసం – రూ.101 కోట్లు,

* దీపం 2.0 పథకానికి – రూ.2,601 కోట్లు,

* మత్స్యకార భరోసాకు – రూ.450 కోట్లు,

* స్వచ్ఛాంధ్ర కోసం – రూ.820 కోట్లు,

* డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ.3,486 కోట్లు,

*ఆదరణ పథకానికి – రూ.1000 కోట్లు.

Show More
Back to top button