Telugu NewsTelugu Politics

అమరావతి నిర్మాణ పనులకు లైన్ క్లియర్..

  • రాజధానికి తొలిదశలో  రూ.11,467 కోట్ల నిధులు విడుదల కాగా
  • ఇప్పుడు మరో రూ.8,821.14 కోట్ల పనులకు ఆమోదం..
  • ప్రధాన రహదారులు, భవనాల నిర్మాణం కోసం..
  • పాత టెండర్ల రద్దు.. 
  • కొత్త ధరలతో మళ్లీ టెండర్లకు పిలుపు..

రాజధాని అమరావతిలో మరో రూ. 8821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథారిటీ 42వ సమావేశంలో 20 పనులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 2న జరిగిన 41వ సమావేశంలో రూ.11,467.27 కోట్ల పనులకు ఆమోదం లభించగా.. ఇప్పటివరకు మొత్తం రూ. 20,288.41 కోట్ల పనులకు ఆమోదం లభించింది. 

సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్‌ పనులకు ఆమోదముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 20 సివిల్‌ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం తాజాగా పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఏఎస్‌ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. 

న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఒకే చెప్పింది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్ లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయించింది.

ఇక రాజధానిలో దాదాపుగా 99.9% పనులకు ఈ నెలాఖరుకల్లా టెండర్లు పిలవనున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. 

తొలి విడతలో అనుమతులు తీసుకున్న రూ.11,467.27 కోట్ల పనులకు నాలుగైదు రోజుల్లో టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు ఇప్పుడు ఆమోదం పొందిన అదనపు పనులకు తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాక టెండర్లకు పిలుస్తామని వెల్లడించారు.

వేటికి ఎంతంటే…

రాజధానిలో రూ. 4,521.11 కోట్లతో ప్రధాన రహదారుల నిర్మాణం కోసం,

రూ.3,807.73 కోట్లతో రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి కోసం, 

రూ.492.30 కోట్లతో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనుల కోసం అనుమతులు లభించాయి.

*రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో సుమారు 1200-1500 కి.మీ. రహదారులు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడు 236 కి.మీ. రహదారులకు, అలాగే ప్రధాన రహదారులు 360 కి.మీ. పొడవున నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడు 97.5 కి.మీలకు, రహదారుల నిర్మాణాన్ని 14 ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఆమోదించినట్లు పేర్కొన్నారు.

Show More
Back to top button