ఇకనుంచి పీఎఫ్ ను నేరుగా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్ లో డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం మొదలు.. క్లెయిమ్ ప్రాసెస్ అయ్యేందుకు వారంరోజులు లేదా అంతకంటే ఎక్కువ వర్కింగ్ డేస్ అయితే తప్ప అకౌంట్లోకి డబ్బు జమ అవ్వదు. ఇలా రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పని ఇకముందు లేకుండా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఏటీఎం కార్డుల ద్వారా పీఎఫ్ డ్రా చేసుకునేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
2025 నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ల(పీఎఫ్)ను నేరుగా ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చన్నమాట. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఈ నెల 11(బుధవారం)న కీలక ప్రకటన చేశారు.
అసలుకైతే ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో 12 శాతాన్ని తమ పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాని కూడా అదే మొత్తంలో జమ చేస్తారు. పీఎఫ్ ఖాతా అనేది వాస్తవానికి మంచి పొదుపు పథకం. పిల్లల చదువు కోసమని, పెళ్లి కోసం దాచుకోగలిగే చక్కని స్కీం. ఇందులో ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల పీఎఫ్ ఖాతాకు కొంత డిపాజిట్ అవ్వడమే కాక ఆ మొత్తానికి మంచి వడ్డీ కూడా లభిస్తుంది.
ప్రస్తుతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు 70 మిలియన్లకు పైగా యాక్టివ్ సబ్ స్కైబర్ లున్నారు. వారి సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ తమ సేవలను మరితం సులభతరం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టింది. EPFO 3.0 కింద PF ఖాతాదారులకు త్వరలో ఏటీఎం తరహా ఒక కార్డును అందివ్వనుంది. ఈ కార్డు సాయంతో ఈపీఎఫ్ఓ మెంబర్స్ పీఎఫ్ ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0 విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది కాగా 2025 జూన్ నాటికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.