విశాఖపట్నం స్థానిక కోటా ఎమ్మెల్సీ ఆగస్టు 30న జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఎన్నికలకు మొత్తం 838 మంది ఓటర్లు పాల్గొనున్నారు. కాగా, ఇందులో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది ZPTCలు ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు 97 మంది ఉన్నారు. 28 మంది నర్సీపట్నం కౌన్సిలర్లు, 25 మంది ఎలమంచిలి కౌన్సిలర్లు ఉన్నారు. ఖాళీలు పోను 822 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి సవాల్ ఎదుర్కొబోతుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చే తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓటమి చెందితే.. తొలి పరాభవం ఎదురైనట్లే. ఇటీవలి తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జరిగింది. అధికారం కాంగ్రెస్ కాకుండా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉండబోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఇంకా ఎన్నికల వేడి అలానే ఉండడమే అంటున్నారు. మరోపక్క ప్రతిపక్ష వైసీపీకి అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నందున ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాల్‌గా ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది.
అంతేకాకుండా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీ తన ఉనికిని సవాల్‌గా మారింది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే.. అధికారం కోల్పోయిన తర్వాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కొంతమేర ఊతం ఇచ్చనట్లు ఉంటుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఇటు కూటమికి, ఇటు వైసీపీకి సవాల్‌గా మారాయి. ఇకపోతే 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది.
దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థి లేకపోవడంతో వైసీపీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అయితే ఈసారి టీడీపీ పోటీ చేస్తుంది. ప్రస్తుతం ఆ సీటు ఖాళీగా ఉండటంతో కూటమి అభ్యర్థిగా ఎవరి పేరును ఖరారు చేయనుందో తొందర్లో తెలస్తుంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కూటమి నాయకత్వం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇక ఈ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. కాబట్టి ఈసారి గెలుపు ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.