సినిమాలలో ప్రతినాయకుడు (విలన్) అంటే ముందుగా మనకు గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్ల లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అది సర్వసాధారణం. అలనాటి చిత్రాలలో విలన్ లు అదేవిధంగా ఉండేవారు. అయితే వాటికి భిన్నంగా విలన్ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి ఏరకమైన సంబంధం లేదని “విలనీ” కే సరికొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటులు రాజనాల నాగేశ్వరరావు. ఆయన అందమైన విలన్. ఆరడుగుల అందగాడు, ఉట్టిపడే రాజసం, హుందాతనం ఆయన సొంతం. ఆయన సినిమాలలోకి ప్రవేశించిన ఒకటి రెండు సంవత్సరాలకే ఆయనను తిరుగులేని స్టార్ ను చేసింది ఆయన నటన అనే చెప్పాలి.
తాము ధరించే పాత్రను అధిగమించి తామే ఆ పాత్రలో నటించే నటులు కొందరు ఉంటారు. తాము కనిపించకుండా తాము ధరించే పాత్ర మాత్రమే కనిపించేలా నటించే నటులు కొంతమంది ఉంటారు. ఒక పాత్రలో నటిస్తూ కూడా తాను నిలబడగలిగే నటులు కూడా ఉంటారు. వారిలో రాజనాల నాగేశ్వరావు ఒకరు. వారు పాత్రలో నటించడమే కాదు ఆ పాత్రలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. “బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి” అంటూ “దొంగరాముడు” చిత్రంలో ఆయన చెప్పిన సంభాషణలు అప్పట్లో అందరి నోటా వినిపించేవి. అదే నోటితో ఆయన చెప్పిన “అదే మామా మన తక్షణ కర్తవ్యం” అంటూ మాయాబజార్ చిత్రంలో పలికిన సంభాషణలు కూడా ఈరోజుకీ మనం మరచిపోలేం. ఆయన చనిపోయి 60 సంవత్సరాలు దాటినా కూడా తన అసమాన నటనా చాతుర్యంతో ఇప్పటికీ అసంఖ్యాకమైన అభిమానులను నిలుపుకునేలా చేసింది.
1950వ దశకంలో ఈయన పేరు చూసి సినిమాలకు వెళ్లేవారు. ఆ రోజులలో సినిమాకు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు సినిమా హీరో హీరోయిన్ల తర్వాత ఈ సినిమాలో ఆర్.నాగేశ్వరరావు ఉన్నారా అని చూసుకుని సినిమాకి వెళ్లేవారు. తాను ధరించిన ప్రతీ పాత్రను ప్రత్యేకంగా మలుచుకున్న శైలి అయినది. ఆయన అలనాటి అందమైన విలన్. ఆయన చలనచిత్రం జీవితం కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. నటించిన సినిమాలు 50 పైగా ఉంటాయి. కౄరమైన పాత్రలు పోషించడంలో దిట్ట అయిన రాజనాల నాగేశ్వరరావు తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్ రాముడు వంటి పలు చిత్రాల్లో తాను నటించారు. ఆయన ఏమాత్రం నాటక రంగం అనుభవం లేకుండా సినీ రంగ ప్రవేశం చేసి ఒకటి రెండు సంవత్సరాలకే పరిశ్రమలో ప్రేక్షకుల మీద బలీయమైన ముద్ర వేసి తనకంటూ ఒక స్థానం పదిలపరుచుకున్న అందమైన స్టైలిష్ విలన్ ఆర్.నాగేశ్వరరావు. విలన్ పాత్రలు వేయడంలో ఆయన ఎంత దిట్టో, వ్యక్తిగతంగా అంత వినయశీలి, సౌమ్యుడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న రాజనాల నాగేశ్వరరావు
ఆయన కొద్దిరోజుల్లోనే క్షయవ్యాధి బారినపడి తన 33వ ఏటనే కన్నుమూశారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : రాజనాల నాగేశ్వరావు
ఇతర పేర్లు : ఆర్. నాగేశ్వరావు
జననం : 1926
స్వస్థలం : జీరా , సికింద్రాబాద్
వృత్తి : నటులు
జీవిత భాగస్వామి : రత్నాబాయి
తండ్రి : రత్నాకర్ రావు
తల్లి : లక్ష్మీ నరసమ్మ
పిల్లలు : మోహన్, రత్నాజీ, సుహాసిని, శ్యామ్, చాందినీ
మరణ కారణం : టి.బి (అనారోగ్యం)
మరణం : 05 ఆగస్టు 1959
నేపథ్యం…
సుమారు వంద సంవత్సరాల క్రిందట సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండ్ వెళ్లే దారిలో జీరా అనే ప్రాంతంలో రాజనాల రత్నాకర రావు, లక్ష్మీనరసమ్మ అనే దంపతులు ఉండేవారు. రాజనాల రత్నాకర రావు రైల్వేలో ఉద్యోగం చేస్తుండేవారు. రత్నాకర రావు నాన్నగారు, అన్నయ్య అందరూ రైల్వే ఉద్యోగులే. ఈ కుటుంబాలకు రైల్వే ఉద్యోగం కులవృత్తి అని అందరూ అంటుండేవారు. రత్నాకర రావు, లక్ష్మీనరసింహ దంపతులకు ముగ్గురు, నలుగురు ఆడపిల్లలు పుట్టి చనిపోయారు. ఆ తరువాత పుట్టిన మగ బిడ్డ పేరు పెంటయ్య అని పెట్టుకున్నారు. నిజానికి ఆ రోజులలో పుట్టిన పిల్లలు పుట్టినట్టే వెంటనే చనిపోతుంటే తరువాత పుట్టిన పిల్లలకు విలక్షణమైన పేరు పెట్టుకునే అలవాటు ఉండేది. ఆ విధంగా వారి సంతానానికి పెంటయ్య అని పేరుపెట్టుకున్నారు.
నాగేశ్వరావు పుట్టిన కొంతకాలానికి లక్ష్మీనరసమ్మ గర్భిణీ అయ్యారు. ఆమె గర్భిణీ అయిన మరో నెల రోజుల్లో రెండో బిడ్డను చూసుకుంటున్నాను అని సంబరపడ్డ రత్నాకరరావు కు నిరాశే మిగిలింది. తన రెండో బిడ్డను చూసుకుందామనుకునే లోపే రత్నాకర రావు మరణించారు. ఆయన మరణించిన నెల రోజుల్లోనే లక్ష్మీనరసమ్మకు మగ బిడ్డ జన్మించాడు. ఆయన పేరు రాజనాల నాగేశ్వరావు. ఆయన 1926 లో జన్మించారు. తండ్రి చనిపోయినందున నాగేశ్వరావు బాగోగులను వాళ్ళ పెదనాన్న గారు చూసుకుంటూ ఉండేవారు. తన అన్న పెంటయ్య, పెదనాన్న గారి అబ్బాయి మరియు నాగేశ్వరావు కలిసి ఉండేవారు. జీరాలో వాళ్లది పెద్ద కుటుంబం. నాగేశ్వరావు చదువుకునే రోజులలోనే చురుకుగా, ధైర్యంగా ఉండేవారు.
విద్యాభ్యాసం…
చిన్నతనంలోనే గురిచూసి కొట్టడం తనకు అలవాటుగా మారిపోయింది. గురిచూసి రాయి విసిరితే చెట్టు మీద పాకే తొండైనా, కొండ మీద పిట్ట అయినా నేల మీద వాలి పడాల్సిందే. పాఠశాలలో ఎవరైనా తన మీదికి గొడవకి వస్తే గురి తప్పని రాయి తన ప్రత్యర్థిని పలకరిస్తూ ఉండేది. దాంతో ఆ కుర్రాళ్ళు వెళ్లి మాస్టారుకు చెప్పడం, అప్పుడు మాస్టారు నాగేశ్వరావుని దండించడం చేసేవారు. ఆయనను ఇంటి వద్ద వాళ్ళ అమ్మ, పెదనాన్న తిట్టడం మామూలైపోయింది. అలా గురి చూసి కొట్టడం ఆ తరువాత రోజులలో ఆయనను గొప్ప వేటగాడిగా రుపుదిద్దుకోవడానికి పునాది వేసింది. పాఠశాల చదువు అయ్యాక మెహబూబా కళాశాలలో ఇంటర్మీడియట్ కు వచ్చేశారు. నాగేశ్వరావుకు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి తాను నివసిస్తున్న ప్రాంతంలో మంచి వాళ్లకు హీరోగా చెడ్డ వాళ్లకి డాన్ గా ఉండేవారు. ఆడవారిని ఎవ్వరైనా ఒక్కమాట అన్నా, వాళ్ళను చూసి ఏదైనా కొంటె పని చేయబోయినా కూడా అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉండేవారు. నాగేశ్వరావు వారికి రక్షకుడిగా అభయహస్తం అందించేవారు.
నాగేశ్వరావు ఎక్కువగా నవాబుల పిల్లలతో కలిసిమెలిసి ఉండేవారు. నాగేశ్వరావు దేహదారుడ్యాన్నీ చూసి తనను కూడా నవాబు అని అనుకునేవారు. ఒకసారి ఆయనకు పదిహేడు సంవత్సరాల వయస్సుండగా వాళ్ళ అమ్మ వాళ్ళు దూరప్రయాణం చేస్తున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన రైలును ఆపడానికి రైల్వే గార్డుతో మాట్లాడి రైలును ఐదు నిమిషాలు ఆపి వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, పెద్ద నాన్నలను రైలెక్కించారు. ఆ విధంగా చిన్న వయస్సు నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేవారు. ఆయన చదువు ముగిశాక డిగ్రీ కోసమని అలీఘర్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కానీ ఎందువల్లనో ఆ యూనివర్సిటీ చదువు పూర్తికాకుండానే మధ్యలోనే వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు, పెద్ద నాన్నగారు లాగా కుటుంబానికి అచ్చొచ్చిన రైల్వే ఉద్యోగం కాకుండా నాగేశ్వరరావు 1945 లో తన పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో సికింద్రాబాదులోని పారామౌంటు థియేటర్ లో మేనేజరుగా కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. తన భారీకాయంతో మేనేజర్ గా అందరినీ సముదాయించేవారు.
థియేటర్ మేనేజరుగా…
1945 లో నాగేశ్వరావు తన మేనమామ గారి కూతురు రత్నబాయిని వివాహం చేసుకున్నారు. ఆయన పారామౌంటు థియేటర్ లో మేనేజర్ గా పనిచేస్తుండగానే పూర్ణ పంపిణీ సంస్థ వారు కొత్త శాఖను ప్రారంభిస్తూ కొత్త మేనేజరు కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో పారామౌంటు థియేటర్ లో మేనేజరుగా పనిచేస్తున్న నాగేశ్వరావు గురించి తెలిసింది. దాంతో పూర్ణ పంపిణీదారులు వారి సంస్థలో నాగేశ్వరావును మేనేజరుగా తీసుకున్నారు. ఆ రకంగా థియేటర్ నుంచి సినిమా పంపిణీసంస్థకు మారారు. ఈలోగా హైదరాబాదులో రజాకార్ల ఉద్యమం మొదలైంది. నాగేశ్వరావు రజాకార్లను వ్యతిరేకించే కార్యకర్తలకి ఆశ్రమం ఇచ్చేవారు. వారితో చనువుగా ఉండేవారు.
ఈ విషయాలన్నీ గమనించిన నాగేశ్వరావు కుటుంబీకులు ఆయన ఇక్కడ ఉంటే ప్రమాదం ఉందని గ్రహించి తనను ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చూసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. ఆ రోజులలో పూర్ణా మంగరాజు తాను విశాఖపట్నం చుట్టుప్రక్కల కొత్త కొత్త సినిమా ప్రదర్శనశాలలను నిర్మిస్తున్నారు. వాటితో బాటు ఆముదాలవలసలో కూడా ఒక థియేటర్ నిర్మించారు. ఆ థియేటర్ కు మేనేజరు కోసం వెతుకుతున్న క్రమంలో నాగేశ్వరావును ఆముదాలవలసకి మేనేజరుగా పంపించారు. అక్కడ మూడు సంవత్సరాలు మేనేజరుగా పనిచేశారు. హైదరాబాదులో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి హైదరాబాదుకు వచ్చిన నాగేశ్వరావు ప్రీమియర్ పంపిణీసంస్థలో చేరారు. ఆ క్రమంలో పూర్ణా మంగరాజుతో నాగేశ్వరావుకు సన్నిహితమైన పరిచయం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యమే తరువాత కాలంలో నాగేశ్వరావును సినీ రంగ ప్రవేశానికి దారులు పరిచింది.
సినీ రంగ ప్రవేశం…
ప్రీమియర్ సంస్థలో పంపిణీశాఖలో పనిచేస్తున్న రాజనాల నాగేశ్వరావు పంపిణీ పనిమీద తరచూ మద్రాసుకు వెళ్తుండేవారు. అలా ఒకసారి మద్రాసుకు వెళ్ళినప్పుడు “షావుకారు” సినిమా చిత్రీకరణ జరుగుతుంది. దాని దర్శకులు ఎల్వీ ప్రసాద్. ఆయన వద్దకు వెళ్లిన నాగేశ్వరావు నేను సినిమాలకు పనికొస్తానా అని సందేహాన్ని వెళ్ళిబుచ్చారు. దానికి ఆయనను పైనుండి క్రింద దాకా ఎగాదిగా చూసి ఎల్వీ ప్రసాద్ నీవు శారీరకంగా పుష్టిగా ఉన్నావు తప్పకుండా సినిమాలో నటించడానికి పనికొస్తావు అని ఎల్వీ ప్రసాద్ సెలవిచ్చారు. నాగేశ్వరావుకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న పూర్ణ మంగరాజు బి.ఏ.సుబ్బారావుకు నాగేశ్వరావును సినిమాలలోకి తీసుకోవాల్సిందిగా ఒక సిఫారసు లేఖ వ్రాశారు. ఆ లేఖ పట్టుకొని బి.ఏ. సుబ్బారావును కలిశారు నాగేశ్వరరావు.
తొలి సినిమా “రాజు – పేద”..
బి.ఏ. సుబ్బారావు తాను తీయబోయే రాజు – పేదలో అవకాశం ఇచ్చారు. 1952 లో మొదలైన రాజు – పేద చిత్రీకరణ సినిమా విడుదల అవ్వడానికి సుమారు రెండు సంవత్సరాలకు పైగా (1954 జూన్ వరకు) పట్టింది. ఈ రెండు సంవత్సరాలలో రాజనాల నాగేశ్వరరావుకి ఆరు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. రాజు – పేద సినిమా చిత్రీకరణలో ఉండగానే మిత్రులు బెనర్జీ సిఫారసుతో నాగేశ్వరరావుకి “సంక్రాంతి” సినిమాలో అవకాశం వచ్చింది. అందులో ఆయన పాపారావు అనే పాత్రలో నటించారు. ఆ సినిమాకు దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. ఆ సంక్రాంతి సినిమాకు నిర్మాత సుందర్ లాల్ నెహతా. సెప్టెంబరు 1952 ప్రాంతంలో సంక్రాంతి సినిమాను విడుదలచేశారు.
తనకు రికార్డుల పరంగా మొదట తాను బుక్ అయిన సినిమా రాజు – పేద అయితే, తన సినిమాలలో ముందుగా విడుదలైన చిత్రం “సంక్రాంతి”. ఈయనకు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తీసుకువచ్చిన సంవత్సరం 1953. ఆ సంవత్సరంలో తాను నటించిన రెండో చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు “పరోపకారం”. ఇందులో నాగేశ్వరావు పాత్ర పేరు “సర్దార్”. ఈ సినిమాలో ఆరుద్ర చాలా పొడవైన సంభాషణలు వ్రాసి నాగేశ్వరావుతో చెప్పించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే తాను ధరించిన రెండో సినిమాలోనే నాగేశ్వరావుపై ఒక పాట చిత్రీకరించారు. “జోడెడ్ల నడుమ జోరైన రగడ, రేత్తిరి రేగిందోయ్ నడి రేత్తిరి రేగిందోయ్” అని ఆరుద్ర గారు వ్రాసిన పాటను ఆయనపై చిత్రీకరించారు. ఈ సినిమా మే 1953 లో విడుదలయ్యింది.
జి. వరలక్ష్మి సొంత చిత్రం “కన్నతల్లి” లో…
1953 లో మూడో సినిమా జి.వరలక్ష్మి నిర్మాణ సారథ్యంలో ఆమె కూడా నటించిన సినిమా “కన్నతల్లి”. ఇది జి.వరలక్ష్మి సొంత చిత్రం. ఇందులో జి.వరలక్ష్మి భర్తగా రాజనాల నాగేశ్వరావు నటించారు. అందులో ఆయనది క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర కానప్పటికీ కూడా అది ఆ సినిమాలో కీలకమైన మలుపు తిప్పే విలన్ పాత్ర. ఈ పాత్ర కూడా ఆయనను ప్రేక్షకులలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. ఈ సినిమా నుండే జి.వరలక్ష్మితో అనుబంధం పెరిగింది. ఆమె నాగేశ్వరావును తమ్ముడిలా చూసుకుంటుండేవారు. ఆయన కుటుంబంతో జి.వరలక్ష్మి సన్నిహితంగా ఉండేది. ఆ తరువాత నాగేశ్వరావుకు మంచి గుర్తింపు తెచ్చిన మరొక చిత్రం “దేవదాసు”.
ఈ సినిమాలో దేవదాసు తండ్రి జమీందారు పాత్రలో ఎస్.వి.రంగారావు, దేవదాసుకు అన్నయ్య పాత్రకు రాజనాల నాగేశ్వరరావును ఎంచుకున్నారు. ఎస్వీ రంగారావు కొడుకుగా నాగేశ్వరరావు నటించారు. ఎస్వీ రంగారావుతో మొదలైన నాగేశ్వరరావు పరిచయం, ఆయన మరణించాక కూడా కొనసాగింది. భానుమతి రామకృష్ణ 1953 వ సంవత్సరంలో “చండీరాణి” అనే ద్విభాష చిత్రం (తెలుగు, హిందీ భాషలలో నటించాల్సిన రావడం) లో నటించారు. అది 1953 ఆగస్టులోనే విడుదల అయ్యింది. ఇలా ఏడు సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న రాజనాల నాగేశ్వరరావు మొదటి చిత్రం రాజు- పేద 25 జూన్ 1956 లో విడుదలైంది. ఈ రెండు, మూడు సంవత్సరాలలో నాగేశ్వరావు నటించిన పాత్రలు చాలా బలీయమైనవి. అందువలన నాగేశ్వరావుకు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించింది.
దొంగరాముడు…
రాజనాల నాగేశ్వరావుకి సినిమాలలో బలమైన పాత్రలు సృష్టించేవారు దర్శక నిర్మాతలు. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన రెండు సంవత్సరాలకు ఉత్తమ ప్రతినాయకుడు పాత్రకు పోటీలు పెడితే రాజనాల నాగేశ్వరావుకు ఉత్తమ ప్రతినాయకుడు బహుమతి లభించింది. ఈ విధంగా సినిమాలలో ప్రతినాయక పాత్రలు చేసుకుంటూ వెళుతుండగా ఆయన సినీ జీవితం ప్రత్యేకమైన మలుపు తిప్పింది ఒక చిత్రం. ఆ చిత్రం పేరు “దొంగ రాముడు”. ఇందులో నాగేశ్వరావు ప్రధానమైన ప్రతి నాయకుడు పాత్ర ధరించారు. “బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అయినా అబ్బ అనాలి” అనే సంభాషణలు, “రావోయి మా ఇంటికి” అనే పాట ఆ పాటలోని హావాభావాలు ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేశాయి. ఆ తరువాత నాగేశ్వరరావు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆయనకు రాలేదు. దొంగ రాముడు సినిమా తరువాత “పెళ్లినాటి ప్రమాణాలు”, “మాయాబజార్”, “ముందడుగు” ఇలాంటి సినిమాలలో తాను దూసుకుంటూ వెళ్లారు.
సౌమ్యులు, స్నేహశీలి…
సినిమాలలోకి వచ్చాక ఎస్వీ రంగారావు తో కలిసి వేటకు వెళ్లేవారు. వీళ్లిద్దరూ కలిసి విజయనగరం దగ్గరలో ఉన్న పులిని వేటాడడానికి వెళ్లారు. మామూలు పులులు తాము చంపిన జంతువులను సగం తినేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటాయి. కానీ విజయనగరం దగ్గరలో ఉండే పులి మాత్రం ఎవరైనా తనను వేటాడతారని “తాను చంపిన జంతువును లాక్కొని వెళ్ళిపోతుంది”. అలాంటి పులిని వేటాడటం కోసం ఎస్వీ రంగారావు, రాజనాల నాగేశ్వరరావులు పులిని వేటడానికి వెళుతున్నాము, వివరాలు తర్వాతకి వచ్చాక చెబుతామని కినిమా మాసపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి వెళ్లారు. ఆ వేట విజయవంతం అయ్యింది.
ఎస్వీ రంగారావు 30 ఏప్రిల్ 1958 నాడు తాను సొంతంగా కట్టుకున్న ఇంటి గృహప్రవేశం చేశారు. ఆ వేడుకలో ఇద్దరు ఒకే రకమైన దుస్తులు వేసుకున్నారు. తెరమీద క్రూరమైన పాత్రలు ధరించే నాగేశ్వరరావు బయట చాలా సౌమ్యులు, స్నేహశీలి. మిత్రులను ఇంటికి పిలిపించి పార్టీలు ఇచ్చేవారు. ఆయన హాస్య చతురత గలవారు. జోకులు చెప్పడం మొదలుపెడితే ఆపకుండా గంటకు 50 జోకులు చెబుతుండేవారు. బొంబాయి నుండి వచ్చిన శ్రీ రామచంద్ర రావు అనే సంగీత దర్శకులు, దిలీప్ కుమార్ అనే నటులు ఈయనకు ఆప్తమిత్రులుగా ఉండేవారు. నాగేశ్వరరావుకి ఉర్దూ, హిందీలో ప్రావీణ్యం ఉంది. అది కూడా రామచంద్ర రావు, దిలీప్ కుమార్ మైత్రికి పూలబాటలు వేసిందని చెప్పాలి. సినిమా వంద రోజులు వేడుకలలో నాగేశ్వరావు ఊర్ధులోనే ప్రసంగించేవారు.
మరణం…
రాజనాల నాగేశ్వరరావుకి 1958 వచ్చేసరికి అనారోగ్యం మొదలయ్యింది. 1959లో ఆయన నటించిన “ఇల్లరికం” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దాని వందరోజుల విజయోత్సవ సభ తిరుపతిలో జరిగింది. అక్కడ ఒక అతిథి గృహంలో ఆరుద్ర, రాజనాల నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అప్పటికే నాగేశ్వరావు అనారోగ్యాన్ని గుర్తించిన గుమ్మడి సినిమాలు తగ్గించుకోమని ఆయనకు సూచనలు ఇచ్చారు. వైద్యులకు చూపించుకోమని సలహా ఇచ్చారు కూడా. ఆరుద్ర కూడా నాగేశ్వరావుని మందలించారు. నాగేశ్వరావుకి ఒక ఊపిరితిత్తు దెబ్బతింది. టి.బి వచ్చిందేమోనని అనుమానం కూడా ఉండేది. ఆరోజు 05 ఆగస్టు 1959. ఆయన అప్పటికే మూడు, నాలుగు సినిమాలలో నటిస్తున్నారు. నాగేశ్వరావు “జగన్నాటకం” అనే సినిమా చిత్రీకరణ ముగించుకుని ఇంటికి వచ్చారు.
సాయంకాలం అవ్వడంతో మేడ మీదకి వచ్చి పడుకున్నారు. కానీ గుండెల్లో ఏదో నొప్పి ఉండేసరికి వైద్యుడికి కబురుచేయమన్నారు. చరియన్ అనే వైద్యులు తీరికలేకుండా ఉన్నా కూడా నాగేశ్వరావు కబురు చేయడంతో వచ్చి పరీక్షించి మేడ మీద నుంచి కిందకు తీసుకువస్తున్నారు. తనతో పాటు ఎనిమిది సంవత్సరాల తన కూతురు సుహాసిని ఉన్నది. అంబులెన్స్ వచ్చింది. సుహాసినిని ఎదురుగా రమ్మన్నారు. ఆమె ఎదురుగా రాగానే అంబులెన్స్ దవఖానా వైపు కదిలింది. ట్యూషన్ చెప్పే మాస్టర్ వచ్చి ట్యూషన్ చెబుతున్నారు. ఇంతలో ఎవరో వచ్చి నాగేశ్వరరావును దవఖానాకు తీసుకెళుతుండగానే మార్గమధ్యలో మరణించారు అని చెప్పారు. 05 ఆగస్టు 1959 రాజనాల నాగేశ్వరరావు ఆఖరి రోజు.
ఆ తర్వాత జి.వరలక్ష్మి వచ్చి నాగేశ్వరరావు అయిదుగురు పిల్లలను, వాళ్ళ అన్నయ్య నలుగురు పిల్లలను కలిపి తొమ్మిది మందిని తన ఇంటికి తీసుకెళ్లారు. రాత్రంతా ఆమె తన ఇంటి వద్ద ఉంచుకొని భోజనం పెట్టించి ఉదయం తీసుకువచ్చారు. రాజనాల నాగేశ్వరావు మరణించే సమయానికి మూడు సినిమాలలో నటిస్తున్నారు. “భక్త శబరి”, “జగన్నాటకం” అనే రెండు సినిమాలు పూర్తయ్యాయి. “సమాజం” అనే సినిమాలో సగం మాత్రమే నటించారు. ఆ తరువాత ఆ సినిమాను వేరొకరితో పూర్తి చేశారు. ఆ తరువాత “శభాష్ రాముడు” ను విడుదల చేశారు. 1960 సంవత్సరంలో “భక్త శబరి”, “జగన్నాటకం”, “సమాజం” చిత్రాలు విడుదలయ్యాయి. అందులో తెరమీద కీర్తిశేషులు రాజనాల నాగేశ్వరావు అని పేరు వేశారు.
జింకలను వేటాడిన నాగేశ్వరావు…
రాజనాల నాగేశ్వరరావుకు సాధారణంగానే జంతువులను వేటాడే అలవాటు ఉండేది. తాను పారామౌంటు థియేటర్ లో ఉద్యోగం చేస్తూండగా ఆయనకు తన మిత్రుడు డబుల్ బ్యారెల్ గన్ ను బహుమతికి ఇచ్చారు. 1945 – 46 ప్రాంతాలలో ఆ తుపాకీకి లైసెన్స్ కూడా తీసుకున్నారు. ముందుగా తనకు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి చిన్న చిన్న జంతువులను వేటాడడం నేర్చుకున్నారు. కొన్ని రోజులకు మిత్రుడు ప్రసాదుతో కలిసి జీపులో అడవులలోకి వెళ్ళారు. నైజాం కు చెందిన ఆల్ ఇండియా రేడియో చెక్ పోస్ట్ వద్ద జంతువులు ఎక్కువగా ఉండేవి. ఆ ప్రాంతంలో నాగేశ్వరావు జీపు చాలా వేగంగా నడుపుతున్నారు.
ఆయనకు దూరంగా రెండు జింకల కనిపించాయి. వేగంగా వెళుతున్న జీపులో నుండి వేగంగా పరిగెత్తుతున్న జింకలను కాల్చారు. చనిపోయిన ఆ జింకలను మిత్రుడు ప్రసాద్ తన జీపులు వేసుకొని ఇంటికి వచ్చి వాటి మాంసం తిందామని అనుకున్నారు. ఆ జింకలలో ఒకటి ఆడ జింక, మరొకటి మగ జింక. ఆడ జింకను కోసినప్పుడు దాని కడుపులో రెండు జింక పిల్లలు ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి చలించిన నాగేశ్వరావు “అప్పుడు యువకుడిని కాబట్టి నాకు తెలియలేదు. యువరక్తంలో ఉన్నాను గనుక వేటాడాను. ఇప్పుడు గనుక అలా జరిగి ఉంటే వెంటనే వేటాడడం ఆపేసేవాడిని” అని నాగేశ్వరావు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
పులిని వేటాడిన నాగేశ్వరావు…
నాగేశ్వరావు ఒకసారి మిత్రులతో కలిసి జీపులో పూణా – కాండ్లకు మధ్యలో ఉన్న అడవిలో వేటకు వెళ్లారు. సాయంకాలం పూట జీపులో వెళ్తుండగా చిరుచీకట్లు కమ్ముకున్నాయి. ఆ సమయంలో దూరంగా ఒక పెద్దపులి వెళుతూ కనిపించింది. వాళ్ల జీపు మోత విని అది ఏ మాత్రం చలించలేదు. హఠాత్తుగా జీపుకి బ్రేకులు వేస్తే ఆ పులి తన మీదికి దూకుతుందని గ్రహించి నాగేశ్వరరావు జీపు లైట్లు తీసేసి వేగంగా పులి మీద నుండి జీపు నాలుగు చక్రాలను నడిపించారు. వెంటనే మళ్లీ జీపును వెనుకకు వెళ్లే గేర్ వేసి అంతే వేగంగా వెనక్కి నాలుగు చక్రాలను పులి మీదుగా పోనిచ్చారు. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పులి చనిపోయింది. దాని చర్మం దాచుకున్నారు.
1950 లో ఒకసారి సంక్రాంతి రోజున కామారెడ్డి దగ్గర అడవులలో మిత్రులతో కలిసి వేటకు వెళ్లారు. ఆ అడవిలో కూడా ఒకచోట పులి పడుకునే ఉంది. అక్కడ కూడా పులి మీదికి జీపును వేగంగా పోనిచ్చే క్రమంలో వాహనం పులిని ఢీకొనగానే ఆర్ నాగేశ్వరావు జీపు నుంచి క్రింద పడిపోయారు. మిత్రులంతా హడావుడిగా ఆ జీపు దిగారు. నాగేశ్వరావు ఒళ్లంతా గాయాలు. పులి చనిపోయిందా అని మిత్రులను అడిగారు నాగేశ్వరావు. దానికి సమాధానంగా వారు పులి చనిపోయే ఉంటుంది. నీవు దవఖానాకు ఆయనను తరలించారు. ఈ ధైర్యంతోనే ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా ఇదే వేటను సినిమాలలోకి వెళ్లాక మిత్రుడు ఎస్.వి.రంగారావుతో కొనసాగించారు.
కుటుంబం..
రాజనాల నాగేశ్వరరావుకు ముగ్గురు పిల్లలు. మొదటి సంతానం అబ్బాయి మోహన్, రెండవ సంతానం అబ్బాయి రత్నాజీ, మూడో సంతానం అమ్మాయి పేరు సుహాసిని. అలాగే ఆయన సినీరంగ ప్రవేశం చేసిన తరువాత నాలుగో సంతానంగా కుమారుడు జన్మించాడు, పేరు శ్యామ్. ఆ తరువాత అయిదవ సంతానంగా కుమార్తె జన్మించింది, ఆమె పేరు చాందినీ. నాగేశ్వరావు సినీ రంగ ప్రవేశం చేసిన సంవత్సరానికి ఆయన పిల్లల్ని, భార్యని మద్రాసుకు తీసుకొచ్చారు. ఆయన నటించిన సినిమాలతో ఆయనకు మంచి స్నేహితులు ఏర్పడ్డారు. ఆయనకు చాలా గాఢమైన స్నేహితులు ఎస్వీ రంగారావు.
నాగేశ్వరావు తమ కుటుంబాన్ని, బంధువులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆదివారం వస్తే చిత్రీకరణ ఆపేసి కుటుంబంతో కలిసి షికారుకు వెళ్లేవారు. సికింద్రాబాదులో ఉన్న అన్నయ్య పెంటయ్యకు, ఆయనకు ఉన్న నలుగురు పిల్లలకు కావాల్సినవన్నీ కూడా మద్రాసు నుండి పంపిస్తుండేవారు. పెంటయ్య ఉద్యోగం చేసేవారు కాదు. ఆయన ఖాళీగా ఉంటుండడంతో ఆయన క్షేమ సమాచారాలు కూడా నాగేశ్వరరావు చూస్తుండేవారు. 1955 లో అన్నయ్య పెంటయ్య గారు చనిపోతే వాళ్ళ నలుగురు పిల్లలను మద్రాసుకు తీసుకువచ్చి తన ఐదుగురు పిల్లలతో కలిపి సమంగా చూసుకుంటూ ఉండేవారు.