Telugu Politics

ఓ బ్రాండ్‌గా ఏపీని మారుస్తాం: సీఎం చంద్రబాబు

తాజాగా గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రగతి, అమరావతి నిర్మాణంతోపాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. బ్రాండ్‌ ఏపీ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని ఆకాంక్షించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

వైసీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాకే ఆక్సిజన్‌ అందించి నిలబెడుతున్నామని చెప్పారు. నాటి పాలనలో నిర్మాణ రంగం అడ్రస్‌ లేకుండా పోయిందని ఎద్దెవా చేశారు. రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామని అన్నారు.

‘రియల్‌ ఎస్టేట్‌ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఉచిత ఇసుక విధానం ద్వారా కొరత లేకుండా చేశాం. జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 7.3% ఉంది. 2047 నాటికి 20 శాతానికి పెరిగి 5.8 ట్రిలియన్‌ డాలర్లు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఇక వచ్చే రెండు నెలల్లో డ్యాష్‌బోర్డు తీసుకొచ్చి వీలైనంత త్వరగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతోపాటు ‘సకాలంలో అనుమతులివ్వాలని అధికారులపై చర్యలు తీసుకుంటాం. కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, వారి ఆదాయం రెండు రెట్లు పెరిగేలా చూస్తాం. రాబోయే 5 సంవత్సరాల్లో వివిధ రంగాల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్‌ బాండ్లలో కొందరు నష్టపోయారు. వీటిని గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. వారెవ్వరినీ వదిలిపెట్టం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Show More
Back to top button