సామాజిక సేవ చేయడంలోను, దేశ ఆర్థిక అభివృద్ధికి కారణమయ్యే ఉమ్మడి భాగస్వామ్య కార్యక్రమాలలో పాల్గోవడంలో ఎందుకోగాని ప్రస్తుత యువత అంత శ్రద్ధ చూపించడం లేదు. కొంతమంది సినిమాలు, పోర్న్ సైట్లు ప్రభావంతో పక్కతోవ పడుతున్నారు. వ్యసనాలకు బానిసలవుతున్నారు. సమాజంపై విమర్శలు చేస్తారు గాని, ఆ సమాజాన్ని మార్చవలసిన బాధ్యత తమపై ఉందని మర్చిపోతున్నారు. ఈ మాటలు కొంచెం నిష్టూరంగా అనిపించిన ఇవి వాస్తవాలు. దేశానికి స్వాతంత్య్రం పొందడానికి ఎంతో మంది యువత పాటుపడ్డారు. చాలా మంది బలి దానమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారణం.
ఇటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యం ఐన యువతను మేల్కొలపడానికి మరో నరేంద్రుడు పుట్టాలేమో? నరేంద్రుడు అంటే ఇప్పటి వారికి తెలియక పోవచ్చు. ఆయనే వివేకానందుడు. ఈ రోజు ఆయన జన్మదినం. 1863 జనవరి 12న జన్మించిన జాతీయ యూత్ ఐకాన్ స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని జాతి యావత్తూ ఈ రోజున యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఆయన అన్న “ఎవరి కోసమో, దేనికోసమో ఎదురుచూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి.” అన్న ఆయన మాటలు ప్రస్తుత యువతకు సరిగ్గా సరిపోతుంది. ‘అద్భుతమైన గతానికి, గొప్పదైన భవిష్యత్తుకి అనుసంధానకర్తలు ‘ యువతే అని భావించారు. శక్తి అంతా మనలోనే ఉందని ఆ శక్తిని మనమే బయటకు లాగాలని చెప్పారు.
యువత బలీయమైన శక్తి
యువత సమాజంలో అత్యంత శక్తివంతమైన ఉత్పాదక వనరు. ఒక దేశ అభివృద్ధి సామర్థ్యం ఆ దేశంలో యువ జనాభా పరిమాణం, బలాలే నిర్ణయిస్తాయి. యువత విద్య, ఆరోగ్యం, వారి హక్కులను పరిరక్షించడం, హామీ ఇవ్వడం వంటి వాటిపై దృష్టి పెడితే అధిక యువ జనాభా కలిగిన మనదేశం విపరీతమైన వృద్ధిని సాధించవచ్చు. నేటి యువతే రేపటి ఆవిష్కర్తలు, సృష్టికర్తలు, జాతి నిర్మాతలు, కాబోయే నాయకులు.’ బలమైన అభిరుచి, ప్రేరణ, సంకల్పశక్తి, ఉల్లాసం, ఉత్సాహంతో, వినూత్నమైన ఆలోచనలతో నిత్య చైతన్యవంతం కేవలం యువతకి మాత్రమే సొంతం. వీరు దేశ నైతిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధికి అత్యంత విలువైన మానవ వనరు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర యువతదే.
యువత అంటే ఎవరు?
భారత ప్రభుత్వ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన యూత్ ఇన్ ఇండియా 2022 నివేదిక 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరినీ యువతగా భావించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక 2021లో దేశ జనాభాలో యువత 27.2 శాతంగా ఉన్నారని, ఈ వాటా 2036 నాటికి 22.7 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. నివేదిక ఇచ్చే నాటికి సుమారు 34.5 కోట్లు యువత దేశంలో ఉన్నారని తెలిపింది. 2021-2036లో యువ జనాభా వాటా తగ్గి వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
2021 వరకు మొత్తం జనాభాలో యువ జనాభాలో పెరుగుదలను నమోదు చేసిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తరువాత కాలంలో క్షీణతను చూస్తాయి. కేరళ, తమిళనాడు, హిమాచలప్రదేశ్ 2036 నాటికి యువత కంటే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. యువత నిరుద్యోగం చూస్తే 15-29 ఏళ్ల మధ్య ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 2017–18లో 17.8 శాతం నుంచి 2020–21లో 12.9 శాతానికి తగ్గింది. ఇండియా స్కిల్ 2023 ప్రకారం విద్యార్థుల మొత్తం ఉపాధి సామర్థ్యం 2017 లో 40.4 శాతం నుండి 2023 నాటికి 50.3 శాతానికి మెరుగు పడింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ జనాభాలో శ్రామిక శక్తి వాటాను కొలుస్తుంది. దీని ప్రకారం 2017–18లో కార్మిక శక్తిలో యువత భాగస్వామ్యం 38.2 శాతంగా ఉంది. 2020–21లో ఇది 41.4 శాతానికి స్వల్పంగా పెరిగింది. శ్రామిక శక్తిలో యువతుల భాగస్వామ్యం యువకుల కంటే చాలా తక్కువ.
2024 ఆర్థిక సర్వే
దేశ ఆర్థిక సర్వే 2024 నివేదిక ప్రకారం స్కిల్ గ్యాప్ అనేది మరొక సవాలుగా ఉంది. జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు ఉన్నారు. అయినప్పటికీ చాలా మందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలను కలిగి లేరు. కేవలం 51.25% మంది యువత మాత్రమే ఉపాధి పొండగలుగుతున్నారు. ఇంకా పని – వయస్సు జనాభా 2044 వరకు విస్తరిస్తూనే ఉంటుందని డిమాండ్‌ను తీర్చడానికి ఏటా దాదాపు 78.5 కోట్ల వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టించడం అవసరమని, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంతోపాటు వ్యవస్థీకృత తయారీ, సేవలలో ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం అవసరమని తెలిపింది.
ఇవే యువత ప్రత్యేకత
యువతకు ఆరోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు తక్కువ. ఏ విషయాన్నైనా వేగంగా నేర్చుకోగలరు. దేశ సామాజిక ఐక్యత, ఆర్థిక శ్రేయస్సు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మెరుగైన యువత ఇప్పటి తరానికే కాకుండా రాబోయే తరానికి కూడా విజయాన్ని అందివ్వగలదు. కనుకనే వీరు దేశానికి విలువైన మానవ వనరులు.
బాధ్యతలు
యువత దేశ భవిష్యత్తు అని చెప్పడంతోనే సరిపోదు. తాము అన్నీ చేయగలమని యువత నమ్మాలి. వీరు దేశ సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆశించిన ఫలితాలు, అనుకున్న లక్ష్యాలను చేరగలం. ప్రస్తుత ఈ స్పీడ్ యుగంలో యువత అంతే వేగంగా విజయ తీరాలు చేరాలంటే వినూత్న ఆవిష్కరణలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలు, జట్టు పని, సమస్య పరిష్కారంతో కూడిన సామర్థ్యాలు అవసరం. సాంకేతికత, డేటా విశ్లేషణ, ఆటోమేషన్లలో ఉపాధి రంగాలను వారి కెరీర్‌లగా ఆవిష్కరించుకోవడానికి, ముందుకు సాగడానికి యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. విజయం సాధించాలంటే స్కిల్, అప్-స్కిల్ అండ్ రీ-స్కిల్ అనే సూత్రాన్ని పాటించాలి.
ఆప్ స్కిల్ అంటే ఇప్పటికే చేస్తున్న పనిని మెరుగుపరచుకోవడం. రీ-స్కిల్లింగ్ అనేది విభిన్నత కోసం పూర్తిగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం. సమయ ప్రాముఖ్యతను గుర్తెరిగి క్రమశిక్షణతో సమయపాలన పాటించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నైతికంగా దృఢంగా ఉండి దేశం కోసం అంకితభావంతో అన్యాయంపై పోరాడి ప్రశ్నించే ధైర్యం, దమ్ము ఉండాలి. తాను సాధించాలనుకుంటున్న లక్ష్యాలపై దృష్టి పెట్టి వాటి కోసం కష్టబడాలి. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలను రక్షించడంలో కీలకపాత్ర పోషించాలి. సమాజంలో జరిగే తప్పులను తిప్పికొట్టే స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వారు కోరుకున్నది సాధించే వరకు అందుబాటులో ఉన్న అవకాశాలను అంది పుచ్చుకోవాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న వివిధ సమస్యలను పరిష్కరించి గొప్ప సవాళ్లను స్వీకరించే ధైర్యం ఉండాలి. తద్వారా ఆలోచనాత్మకమైన సమాజాన్ని సృష్టించ గలుగుతారు.
సవాళ్లు – పరిష్కారాలు
యువత సమాజంలో న్యాయమైన, సమానమైన ప్రగతిశీల అవకాశాల పరిష్కారాలను ఎక్కువగా డిమాండ్ చేస్తున్నందున వారు ఎదుర్కొంటున్న మంచి విద్య, ఆరోగ్యం, మెరుగైన ఉపాధి, లింగ సమానత్వం లాంటి బహుముఖ సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో యువతను రెండు సమూహాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి విద్యావంతులై అభివృద్ధి చెందిన వారు, రెండు నిరక్షరాస్యులై అభివృద్ధి చెందని సమూహం.మొదటి వర్గం వారు నిరుద్యోగం, విద్యా సమస్యలు, పెరుగుతున్న పోటీ, అవకాశాల కొరత, మానసిక ఒత్తిడి మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండవ వర్గంలో కొంత మంది చట్టంతో సరైన అవగాహన లేక నేరాలు చేయడం, మాదక ద్రవ్యాల వ్యసనం, బిక్షమెత్తుకోవడం, పేదరికం, అణగారిన జీవితాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
రెండవ సమూహంపై అధిక దృష్టి పెట్టాలి. చాలా మంది యువత విద్య, ఆర్థిక సహాయం, వ్యవస్థాపక అవకాశాలను పొందలేకపోతున్నారు. నేటి ప్రపంచంలో విజయానికి విద్య కీలకం. యువత తమకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను పొందాలి, తద్వారా వారు ఉద్యోగ మార్కెట్‌లో పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. విద్యతో పాటు యువత డిమాండ్ ఉన్న నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. ఇందులో కోడింగ్, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. సమస్యల పరిష్కారానికి, కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి తమ సృజనాత్మకతను ఉపయోగించాలి. యువత రిస్క్ తీసుకోవడానికి, వారి స్వంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగాలు సృష్టించడానికి, ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడానికి ఇది గొప్ప మార్గం. యువకులు రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. నాయకత్వ లోపం ఎక్కువగా ఉంది. వీటన్నిటినీ అధిగమించాలి.
యువతకు బాసటగా నిలవాలి
యువతలో చదువుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు, కూలీలు ఎక్కువ శాతంలో ఉంటారు. ఉద్యోగులు, రైతులు తక్కువ శాతంలో ఉంటారు. యువతలోని ఈ రెండు వర్గాల పైనా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతయినా ఉంది. జాతీయ యువజన విధానం (ఎన్వైపీ 2024 కోసం ముసాయిదాను విడుదల చేసింది. నేషనల్ యూత్ పాలసీ ఐదు ప్రాధాన్యత రంగాలైన విద్య, ఉపాధి, యువ నాయకత్వం, ఆరోగ్యం, సామాజిక న్యాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. యువత అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానం, అవకాశాలను అందించినప్పుడు అభివృద్ధికి సానుకూల శక్తిగా ఉంటుంది. ముఖ్యంగా, యువకులు ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలో సహకరించడానికి అవసరమైన విద్య, నైపుణ్యాలను అందించాలి. వారికి మంచి ఆరోగ్యం, విద్య, శిక్షణ, భవిష్యత్తును మార్చే అవకాశాల పరంగా అవసరమైన మద్దతు అవసరం. యువత చాలా రకాల సవాళ్లను ఎదుర్కొని ముందుకు పోవాలి.
వీటిలో ముఖ్యమైనవి నిరుద్యోగం, పేదరికం, అసమానత, ధరల పెరుగుదల, మానసిక ఒత్తిడి, లింగ వివక్ష, వాతావరణ మార్పులు వంటివాటిని ఎదుర్కోవాలి. రెండు తరాల ఆలోచనల మధ్య ఎప్పుడూ చాలా తేడా ఉంటుంది. రెండు తరాల ప్రజల అభిప్రాయాలు ఒకరినొకరు తిప్పికొట్టే స్థాయికి జనరేషన్ గ్యాప్ పెరిగింది. వారి జనరేషన్ గ్యాప్ కారణంగా తల్లిదండ్రుల పిల్లల సంబంధం తరచుగా ప్రభావితమవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై తమ విలువలు భావజాలాలను రుద్దడానికి ప్రయత్నిస్తారు. యువత వారు తమంతట తాముగా ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటారు.
జనరేషన్ గ్యాప్ కారణంగా యువకులు నిరాశకు గురవుతారు. ఈ సమయంలో వారికి వారికి సరైన వనరులు, మార్గదర్శకత్వం మంచి వాతావరణాన్ని అందించడం పాత తరం యొక్క బాధ్యత. యుకె, జర్మనీ, యుఎస్ఎ, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో పోలిస్తే మన దేశ యువత శ్రామిక శక్తిలో చాలా తక్కువ శాతం అధికారిక నైపుణ్య శిక్షణ పొందింది. శిక్షణ లేకపోవడం వల్ల, దేశంలోని చాలా యజమానులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థులను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు సగం మంది భారతీయ యజమానులు నైపుణ్యం కలిగిన కార్మికులను కనుగొనడానికి కష్టపడుతున్నారని ఇటీవల సర్వేలో తేలింది.
విద్యావంతులైన భారతీయుల్లో కూడా నిరుద్యోగం సమస్యగానే ఉండటం గమనార్హం. 2018 లో ఒక సర్వే ప్రకారం అధికారిక శిక్షణ పొందిన 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతలో మూడింట ఒక వంతు మంది ఇప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. భారత్ లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి డిమాండ్ పెరుగుతోంది. 2023 నాటికి దేశంలో వివిధ రంగాల, ముఖ్యంగా తయారీ రంగాల డిమాండ్లను తీర్చడానికి సుమారు 300 మిలియన్ల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది. సరఫరా, డిమాండ్ అసమతుల్యత: జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే నిపుణులకు అవసరమైన నైపుణ్యాలు లేనప్పుడు తగినంత ఉద్యోగావకాశాలు సృష్టించబడని సమస్యను భారతదేశం ఎదుర్కొంటోంది. ఇది నిరుద్యోగ రేటు పెరగడానికి మరియు తక్కువ ఉపాధికి దారితీసింది.
WRITER
జనక మోహన రావు దుంగ