Telugu Politics

విజయసాయి రెడ్డి రాజీనామా.. బీజేపీ ప్లాన్ ‘బి’లో  భాగామా.?

వైసీపీ తరఫున రాజ్యసభ సభకు వెళ్లిన విజయసాయి రెడ్డి తాజాగా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై కొందరు రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా పేరుతో డ్రామాలాడుతున్నారంటూ విమర్శించారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి చేసిన అరాచకాలపై తానే ఫిర్యాదు చేస్తానని అన్నారు. విజయసాయి వల్ల ఆర్థికంగా గానీ.. మానసికంగా గానీ.. ఇబ్బందులకు గురైతే నేరుగా ఫిర్యాదు చేయాలంటూ బాధితులకు విజయ్ పిలుపునిచ్చారు. రాజీనామా పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారంటూ విజయసాయిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన. 

ఇక మరోపక్క ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల కూడా విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని ఆమె అన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినందున ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ కోసం ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు వీడుతున్నారు? అనేది YSRCP కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని షర్మిల సూచించారు. నాయకుడిగా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని, ప్రజలను, నమ్మినవాళ్లను నాయకుడిగా జగన్‌ మోసం చేశారని షర్మిల మండిపడ్డారు.

ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రాజీనామా వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగివుందని అంటున్నారు. దీని వెనుక బీజేపీ వుందనే ప్రచారం సాగుతోంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో బీజేపీకి ఏం లాభం? ఇదే అందరి డౌట్. కానీ ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందట. తద్వారా రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది. ఇదే సమయంలో ఈ రాజీనామా వ్యవహారాన్ని అదునుగా చేసుకుని టీడీపీకి చెక్ పెట్టాలని చూస్తోందట.

ఇదే నిజమైతే ఇది బీజేపీ ప్లాన్ బి గా చెప్పుకోవచ్చు. సాధారాణంగా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ప్లాన్ ‘ఏ’ తో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అంటే అక్కడి లోకల్ పార్టీలతో కలిసి మొదట ప్రజల్లోకి వెళ్తుంది. ఆ రాష్ట్రంపై కొద్దిగా పట్టు రాగానే ప్లాన్ ‘బి’ స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పటివరకు కలిసున్న లోకల్ పార్టీని పక్కనపెట్టి సొంతంగా బలపడే ప్రయత్నాలు చేస్తుంది. ఇలా మహారాష్ట్రలో శివసేనపై ఇదే ఫార్ములాను అనుసరించారు కమలనాథులు. సేమ్ ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని ఏపీలో అనుసరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Show More
Back to top button