ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి కొన్నేళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా నిలకడగా విజయాలు సాధించడం లేదు. 1989, 1994, 1996, 1999 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఆళ్లగడ్డను తమ కంచుకోటగా మార్చుకుంది. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి ఈ రికార్డుకు మంగళం పాడారు.
కానీ 2009లో నూతన రాజకీయ పార్టీ పీఆర్పీ ఇక్కడ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012 ఉపఎన్నిక, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించారు.
ఆమె ఆకస్మికంగా మరణించడంతో 2014లో జరిగిన ఉపఎన్నికల్లో ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె టీడీపీ నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి అలియాస్ గంగుల నాని విజయబావుటా ఎగురవేశారు.
2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ, వైసీపీ నుంచి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు. గత ఎన్నికల్లో తనకు ఎదురైన పరాభవానికి అఖిలప్రియ ప్రతీకారం తీర్చుకుంటారా లేదా మరోసారి బిజేంద్రనాథ్‌రెడ్డి ఆమెపై విజయం సాధిస్తారో చూడాలి.