కొంతమంది తెర ముందు, మరి కొంతమంది తెర వెనకాల ఇలా వందలాది మంది శ్రమిస్తేనే మనం సినిమాను చూడగలం. మనం సినిమాను చూస్తున్నాం అని అనుకుంటాం, కానీ నిజానికి కెమెరా కన్ను మనకు చూపిస్తుంది. సినిమా రూపకల్పన అనేది 24 విభాగాల సమిష్టి కృషి. ఇందులో ఏ విభాగాన్ని తక్కువ చేసి చూడలేము. సెట్ బాయ్ దగ్గర నుంచి దర్శకుడి దాకా అందరూ కీలకమైన పాత్రలు పోషించే వారే. తెరవెనకాల ఎంత దర్శకత్వం, ఎంత నటన, ఎంత రచన ఎన్ని జరిగినా కెమెరా రీల్ లో బంధించేది, ఎడిటర్ అనుమతిచ్చేవి ఆ దృశ్యాలు మాత్రమే మనం చూస్తున్నాం. కథ, సంభాషణలు, నేపథ్య సంగీతం, నటన ఇవన్నీ ఒకెత్తయితే, ఒక్కొక్క దృశ్యాన్ని ప్రేక్షకుల దృష్టిలో ఏ భావన పలికించాలో, ప్రేక్షకుడిలో ప్రతిస్పందన ఏ విధంగా కగిలిగించాలో వాటికి తగ్గట్టుగా లైటింగ్ ఏర్పాటు చేసి సరైన కోణంలో సరైన కదలికలతో కెమెరాలో బంధించే కీలకమైన సాంకేతిక నిపుణుడు ఛాయాగ్రహకుడు లేదా ఛాయాగ్రహణ దర్శకుడు లేదా సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ (D.O.P).
తెలుగు సినిమా స్వర్ణ యుగంలో అంటే 1950 – 60 దశకానికి చెందిన ఛాయాగ్రహకులు మార్కస్ బార్ట్లే. ఆయనకు ఆ రోజుల్లో హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు ఉన్నటువంటి ఖ్యాతి, విలువ, గౌరవం ఉండేవి. విజయా బ్యానరులో నిర్మింపబడిన “పాతాళభైరవి”, “పెళ్లిచేసిచూడు”, “మాయాబజార్”, “మిస్సమ్మ”, “గుండమ్మ కథ” లాంటి చిత్రాలకు ఎంత శాశ్వతత్వం ఉందో, అట్లాంటి సినిమాలను అత్యంత నాణ్యతతో, అత్యున్నత ప్రమాణాలతో కెమెరాలో బంధించిన మార్కస్ బార్ట్లే గారి పనితనానికి కూడా అంతటి శాశ్వతత్వం ఉంది. 60 – 70 సంవత్సరాల తరువాత కూడా ఈరోజుకీ మనం వాటిని చూడగలుగుతున్నామంటే వాటి ప్రక్రియతో పాటుగా తొలిసారిగా వాటిని కెమెరాలో బంధించిన మార్కస్ బార్ట్లే గారిని కూడా మనం అభినందించి తీరాల్సిందే. మార్కస్ బార్ట్లే గారి పేరు తెలియని వారు ఉంటే వారికి “మాయాబజార్” గుర్తు చేయాల్సిందే. ఆ సినిమాలో ప్రతీ సన్నివేశం మార్కస్ బార్ట్లే గారి సంతకం. సృష్టికే ప్రతి సృష్టి అన్నట్టు వెండితెర మీద వెన్నెలను అత్యంత సహజంగా తీర్చిదిద్దిన వెండితెర చందమామ సృష్టికర్త మార్కస్ బార్ట్లే.
మార్కస్ బార్ట్లే గారు హై స్కూల్ మించి చదువుకోలేదు. ఫోటోగ్రఫీలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి కూడా అంతా స్వశక్తి, సూక్ష్మదృష్టి, అధ్యయనం, స్వయంకృషి వీటివలనే ఎదిగారు, వీటితోనే ఒక స్థాయికి చేరుకున్నారు. తాను చిత్రీకరించిన ప్రతి దృశ్యాన్ని ఒక పాఠ్యగ్రంథం అనేలా నిలిచిపోయేలా చేశారు. మార్కస్ బార్ట్లే గారు ఆర్టికల్స్ లాంటి సబ్జెక్టులు ఏమి చదువుకోలేదు. కానీ కెమెరాలో లెన్స్ లు, ఈ రంగాలలో ఆయనకున్న సాంకేతిక పరిజ్ఞానం అనన్య సామాన్యం. వాహినీ వారి చిత్రాల వెనుక తొలి సంవత్సరాలలో కీలకమైన పాత్ర పోషించిన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కె. రామ్ నాథ్ గారు అయితే, తరువాత సంవత్సరాలలో విజయా వాహినీ చిత్రాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రముఖులు “మార్కస్ బార్ట్లే”. తాను ఎందుకు అంత ప్రత్యేకమైన ఛాయాగ్రహకులో ఆయన చిత్రీకరించిన సినిమాలే తెలియజేస్తాయి. అలాగే తెర వెనకాల ఆయన జీవనశైలి, నాణ్యత, రాజీపడని క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఆయనకు ఎందుకు అంతగౌరవం ఇస్తారో తెలియజేస్తాయి.
సినిమా సెట్ లో మౌనంగా, దీక్షతో, శ్రద్ధగా పని చేసుకుంటూ వెళ్లడమే మార్కస్ బార్ట్లే గారి వ్యవహార శైలి. కెమెరా లెన్స్ లనే ప్రాణప్రదంగా చూసుకునేవారు. అత్యవసరమైతే తప్ప వాటి మీద ఎవ్వరినీ చేయి వేయనిచ్చేవారు కాదు. తన పని తానే తప్ప సెట్ లో ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. స్నేహాలు, కలిసి తిరగడాలు ఇలాంటివేమీ కూడా ఉండేవి కావు. సినిమా వేడుకలలో కూడా ఎక్కువగా కనిపించేవారు కాదు. తన డెబ్భై ఆరు సంవత్సరాల వ్యక్తిగత జీవితంలో 40 సంవత్సరాలు వెండితెర జీవితం మార్కస్ బార్ట్లే గారిది. 40 సంవత్సరాల వెండితెర జీవితంలో కేవలం 40 నుండి 50 చిత్రాలకు మాత్రమే ఛాయాగ్రహకుడిగా పనిచేశారు. అంత విశిష్టమైన సాంకేతిక నిపుణుడిగా అందరి ప్రశంసలను, అందరి గౌరవాన్ని అందుకున్నారు..
జీవిత విశేషాలు…
జన్మ నామం : మార్కస్ బార్ట్లే
జననం : 22 ఏప్రిల్ 1917
స్వస్థలం : శ్రీలంకలో
తండ్రి : జేమ్స్ బార్ట్లీ
తల్లి : డొరొతీ స్కాట్
వృత్తి : ఛాయాగ్రాహకులు
మరణ కారణం : చక్కర వ్యాధి కారణంగా
మరణం : 14 మార్చి 1993, విజయా ఆసుపత్రి, మద్రాసు, తమిళనాడు..
నేపథ్యం…
మార్కస్ బార్ట్లే గారు 22 ఏప్రిల్ 1917 నాడు జన్మించారు. వీరి తల్లిదండ్రులు డొరోతీ స్కాట్, జేమ్స్ బార్ట్లే. డొరోతీ స్కాట్ అమ్మగారి పూర్వీకులు శ్రీలంకకు చెందినవారు కావడంతో మార్కస్ బార్ట్లే గారు శ్రీలంకలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు మిలటరీలో “దంత వైద్యులు” గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా సేలంలోని ఏర్కాడులో, మద్రాసులో, మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర్లో ఉన్న దేవ్ లలి అనే కంటోన్మెంట్ ప్రాంతంలో దంత వైద్యునిగా పనిచేశారు. జేమ్స్ బార్ట్లే గారు దంత వైద్యులు అవ్వడంతో ఎక్సరేలు ప్రచురించడానికి సొంత ప్రయోగశాల ఉండేది.
అందువలన చాలా చిన్నతనంలోనే మార్కస్ బార్ట్లే గారు వాళ్ళ నాన్నగారి ప్రయోగశాలలో ఎక్సరేలు ప్రచురణ ప్రయోగశాలలో “ఫిలిం ప్రాసెసింగ్” పరిశీలించే అవకాశం దొరికింది. ఎంతసేపూ ప్రాసెసింగ్ చూడడమేమిటి మనమే కెమెరాతో ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన 14 ఏళ్ల మార్కస్ బాటిల్ గారు ఈ విషయాన్ని వాళ్ల నాన్నగారికి చెప్పారు. డానికి వాళ్ళ నాన్న గారు కూడా అడ్డు చెప్పలేదు, సరికదా తనకు ఒక బ్రౌని కెమెరాను కూడా కొనిచ్చారు. ఆ కెమెరాతో తాను తీసిన ఫిలింను డెవలప్ చేయించి మొట్టమొదటిసారిగా ఫలితాలు చూసుకోగానే ఆ పద్నాలుగు సంవత్సరాల కుర్రవాడు ఎప్పటికైనా తాను ఛాయాగ్రాహకుడు కావాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు.
చదువు మాని కెమెరా చేతబూని..
టాకీ చిత్రాలలో సంగీత ప్రధానమైన చిత్రాలను చూసి వాటిని ఫోటోలతో కూడా చూపించవచ్చా అని వాళ్ళ నాన్నగారిని అడిగారు. దానికి వాళ్ళ నాన్నగారు అడ్డు చెప్పకుండా నెలకు ఒక రోల్ ఫిల్మ్ ఇచ్చి ఫోటోలు కనీసం నాలుగు మంచి ఫోటోలు తీయమన్నారు. నెలకు కేవలం ఒక రోల్ మాత్రమే వాడాలి అనే షరతులు విధించారు. ఓ నాలుగు మంచి ఫోటోలు తీసినా చాలు అనేది వాళ్ళ నాన్నగారి అభిప్రాయం. కానీ 8 మంచి ఫోటోలు తీస్తున్నారు “మార్కస్ బార్ట్లే. అదే సమయంలో పాఠశాలలో చదువు తగ్గుతుందని “మార్కస్ బార్ట్లే” గారి నాన్నగారికి పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేశారు. కెమెరాతో ఏమొస్తుంది? చదువుకుంటే మంచి ఉద్యోగమైనా వస్తుంది కదా అని వారి పాఠశాల యాజమాన్యం అభిప్రాయం. కానీ తరువాత కాలంలో నిజంగానే ఆ కెమెరాలే ఆ కుర్రవానికి ప్రపంచం అవుతాయని, ఆ కుర్రవాడు అనుకోలేదు, వాళ్ళ నాన్నగారు కూడా ఊహించలేదు. కొన్నాళ్ళ తరువాత చదువు మానేసి పూర్తిస్థాయిలో కెమెరాకే అంకితం అయ్యారు.
ఇల్లెస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఫోటోల ప్రచురణ…
1933లో తనకు 16 సంవత్సరాల వయస్సులో వాళ్ళ నాన్నగారు మంచి కెమెరా కొని పెట్టారు. అందులో ఫిల్మ్ వేసుకొని శని, ఆదివారాలలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మంచి మంచి ఫోటోలు తీస్తుండేవారు. ఆ ఫోటోలను మద్రాస్ మెయిల్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలకు పంపించేవారు మార్కస్ బార్ట్లే గారు. ఆ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. కానీ పంపించిన కుర్రాడు ఎవరు? తన వయస్సు ఎంత? ఇలాంటివి వివరాలు ఏమీ కూడా వారికి తెలియవు. ఈ ఫోటోలు ప్రచురణ వేయించుకోవడానికి ఆగ్ఫా కంపెనీకి వెళుతుండేవారు. ఆ ఫోటోలను చూసిన ఆగ్ఫా కంపెనీ వారు “ఈ ఫోటోలు బాగున్నాయి, వీటిని జర్మనీలో ఉండే పత్రికలకు పంపించమని” సలహా ఇచ్చారు. దాంతో అక్కడికి కూడా తన ఫోటోలను పంపించారు. దాంతో వారు వారి పత్రికలో ఆ ఫోటోలు ముద్రించేశారు. అలా దేశ, విదేశాలలో తన ప్రతిభ ప్రాచుర్యం ప్రారంభమైంది. మద్రాస్ మెయిల్ పత్రికలో ఆర్ట్ ఎడిటర్ గా పనిచేసే జాన్ విల్సన్ ఆ కుర్రాడిని పిలిపించి ఫోటోలు తీయడంలో మెలకువలు నేర్పించారు.
బ్రిటీషు మూవీ టోన్ లో ఉద్యోగం…
1934లో తన 17 సంవత్సరాల వయస్సులో చదువు మానేసిన మార్కస్ బార్ట్లే గారు వాళ్ల నాన్నగారికి చెప్పి జాన్ విల్సన్ గారి వద్దకు వెళ్లారు. అప్పుడు ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో తనకు పరిచయం ఉన్న “స్టాన్లీ జప్సన్” కు సిఫారసు చేయగా “స్టాన్లీ జప్సన్” గారు “మార్కస్ బార్ట్లే” గారిని ఛాయాగ్రహకుడిగా చేర్చుకున్నారు. 36 ఫోటోలు ఉండే ఆ ఫిలింలో కనీసం నాలుగు ఫోటోలు మంచిగా వచ్చినా చాలు అన్నారు స్టాన్లీ జప్సన్ గారు. కానీ మార్కస్ బార్ట్లే తీస్తే 36 ఫోటోలకు 36 ఫోటోలు మంచిగా వచ్చాయి. అలా తాను సంవత్సరాలు “ప్రెస్ ఫోటోగ్రాఫర్” గా పనిచేశాక తనకు మొహంమొత్తింది. దాంతో ఆ ఉద్యోగం మానేసి, అందులోనుండి బయటకు వచ్చేశారు. డిసెంబరు
1936లో “బ్రిటిష్ మూవీ టోన్ కంపెనీ” వాళ్ళు న్యూస్ రీల్స్ తీయడానికి “టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్” కు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి న్యూస్ రీల్స్ తీసే ఛాయాగ్రాహకుడు కావాలి. వారికి మార్కస్ బార్ట్లే గారి గురించి తెలిసింది. దాంతో మూవీ కెమెరాతో పనిచేస్తూ న్యూస్ రీల్స్ తీయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు మార్కస్ బార్ట్లే గారిని చేర్చుకున్నారు. ఆ మూవీ కెమెరా కెమెరా తీసుకొని బాంబే టాకీస్ ల్యాబరేటరీ లో ఉన్న ఒక జర్మన్ దగ్గరికి వెళ్లి కెమెరాలో ఫిలిం వేసి దానితో ఎలా చిత్రీకరించాలో తెలుసుకుని వాళ్ల లేబరేటరీ లోనే ప్రయోగత్మాకంగా కొన్ని చిన్న చిన్న ఫిలిమ్స్ చేసి దాంతో అనుభవం తెచ్చుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా వారు కేటాయించిన పని కోసం సిద్ధంగా ఉన్నారు.
మతకల్లోలాలపై తొలి రీల్స్..
టైమ్స్ ఆఫ్ ఇండియా వారు తొలిసారిగా పండరీపురంలో జరిగే ఉత్సవాలను న్యూస్ రీల్ గా తీసే పనిని తనకు అప్పగించారు. మార్కస్ బార్ట్లే గారు న్యూస్ రీల్ తీసిన విధానం టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి బాగా నచ్చింది. దాంట్లో ఉన్న నాణ్యత కానీ, ఆ ఉత్సవాన్ని వైభవంగా ఆయన బంధించిన విధానం గానీ బ్రిటిష్ మూవీ టోన్ వారికి బాగా నచ్చింది. ఆ తరువాత బ్రిటిషు అధికారుల పర్యటనను కూడా న్యూస్ రీల్స్ గా తీశారు. 1937లో బొంబాయిలో జరిగిన మతకల్లోలాల గురించి చిత్రీకరించే పనిని అప్పగించారు. అప్పుడు మార్కస్ బార్ట్లే గారు పత్రిక వ్యాన్ లో బయలుదేరి ఆ వ్యానును కొంచెం దూరంగా ఉంచి కల్లోలాలు జరుగుతున్న వీధిలోకి వెళ్లారు.
అక్కడ జనాలు గుంపులు గుంపులుగా దుకాణాలను ధ్వంసం చేస్తున్నారు. మేడ మీద ఉన్న కొంతమంది క్రింద ఉన్న గుంపు మీదికి రాళ్లు విసురుతున్నారు. అక్కడ ఉన్న ఒక పోలీస్ కమిషనర్ బాల్కనీలో ఉన్న ఇద్దరిని తుపాకితో కాల్చేశారు. ఇదంతా మార్కస్ బార్ట్లే గారు తీస్తున్న కెమెరాలో బంధించారు. కొంతసేపటికి ఆ పోలీస్ కమిషనర్ ఆ దృశ్యాన్ని చూసి బార్ట్లే గారిని వెంబడించగా ఆయన పరిగెత్తి వ్యాన్ లో ఎక్కి పారిపోయారు. బ్రిటీషు మూవీ టోన్ పత్రిక వాళ్లకు ఈ విషయం చెప్పగానే వారు వెంటనే ఆ ఫిల్మ్ ని విమానంలో లండన్ పంపించారు. ఆ కమిషనర్ పత్రిక కార్యాలయంకు వచ్చారు. కానీ అప్పటికే ఫిల్మ్ ను పంపించేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో చిత్రీకరణ చేయడం నేర్చుకున్నారు మార్కస్ బార్ట్లే గారు.
టైమ్స్ అఫ్ ఇండియా పత్రికకు రాజీనామా…
మార్కస్ బార్ట్లే గారు కొంతకాలం గడిచిన పిదప ఈ ఘర్షణలు, పోట్లాటలు ఉంటూ ప్రమాదకరమైన ఈ వృత్తిని ఆపేద్దామనుకుంటుండగా తన జర్మనీ బాస్ బొంబాయి హార్బర్ ఫోటోలు తీసుకు రమ్మని పని అప్పగించారు. దాదాపు 200 ఫోటోలను రకరకాల కోణాలలో తీసి ఇచ్చారు బార్ట్లే గారు. అవి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు కాకుండా తన సొంత పని కోసం ఆ జర్మనీ బాస్ తీయించుకున్నాడు. ఆ వ్యవహారశైలి నచ్చని బార్ట్లే గారు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు రాజీనామా ఇచ్చేశారు. ఆ తరువాత రెండు మూడు నెలలు నిరుద్యోగంతో పని కోసం వెతుకుతుండగా చికాగో రేడియోకు సంబంధించిన మోత్వాని అనే వ్యక్తి బొంబాయిలో బార్ట్లే గారికి ఒక పని అప్పగించారు. హరిపురంలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభను న్యూస్ రీల్ తీసి పెట్టమని చెప్పారు. కానీ ఇది కూడా తనకు నచ్చలేదు.
ఎలాగైనా సినిమాలలో చేరాలని బొంబాయి టాకీస్ స్టూడియోలో పని కోసం తిరిగారు. కానీ కుదరలేదు దాంతో తాను మద్రాసుకు తిరిగి వచ్చేశారు. మద్రాసులో కె.సుబ్రహ్మణ్యం గారు, (తమిళ చిత్ర దర్శకులు మరియు లాయరు) గారు ఎం.ఎస్. కృష్ణన్, పి.ఎన్. మధురం అనే వాళ్ళిద్దరిని సినీ రంగంలోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక చిన్న హాస్య చిత్రం తీయాలని ఆయన ప్రయత్నం. పెద్దపెద్ద కెమెరామెన్లు ఒప్పుకోకపోవడంతో చిన్న కెమెరామెన్ కోసం వెతుకుతుండగా మార్కస్ బార్ట్లే గారు కనిపించారు. తనను ఒప్పించి వారం రోజుల పాటు రెండు లఘు చిత్రాలు తీయించి తనకు 50 రూపాయలు బార్ట్లే గారికి ఇచ్చారు. ఆ హ్రస్వ చిత్రమే తరువాత రోజులలో ఎమ్మెస్.కృష్ణ, ఎన్.మధురై లకు సినిమా అవకాశాలు కల్పించడానికి పునాది వేసిన చిత్రం. కె.సుబ్రహ్మణ్యం గారు ఇప్పించిన ఇంకో అవకాశంతో దక్షిణ మధ్య రైల్వే వాళ్లకు యాత్రా చిత్రం తీసి పెట్టారు.
ప్రగతి స్టూడెయో లో ఉద్యోగం…
ఇన్ని అనుభవాల తరువాత మార్కస్ బార్ట్లే గారు 1938 చివరలో తన వయస్సు 22 సంవత్సరాలున్నప్పుడు ప్రగతి స్టూడియోలో (ఆ తరువాత కాలంలో అది ఏ.వీ.ఎం స్టూడియోగా మార్పుచెందినది) ఉద్యోగం దొరికింది. ఆ స్టూడియోలో చేరి తాను సినిమాటోగ్రాఫర్ గా తీసిన మొట్టమొదటి చిత్రం తిరువళ్లు. వారి రెండవ సినిమా “నాయది”. ఈ “నాయది” సినిమాకు నందలాల్ జస్వంత్ లాల్ గారు దర్శకులు. నందలాల్ జస్వంత్ లాల్ గారే ఆ నందలాల్ గారే మెలకువలు నేర్పారు అని చాలా సందర్భాల్లో చెప్పారు. మార్కస్ బార్ ట్లే గారికి నెలకు 200 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు.
అలా రెండు సంవత్సరాలు ప్రగతి స్టూడియోలోనే పనిచేశారు. మార్కస్ బార్ట్లే గారికి అందులో పని చేయడం నచ్చక బయటికి వచ్చేసారు. అలా ఆరు నెలలు నిరుద్యోగంలో ఉండగా రంగస్థలంపై శ్రీకృష్ణుడు వేషాలు వేస్తుండే “పెర కులతూర్ శామ” అనే నటుడు 1940 చివరలో బార్ట్లే గారిని తాను తీయబోయే సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పెట్టుకున్నారు. ఒక సినిమా మొదలు పెట్టారు. అది సగంలోనే ఆగిపోయింది. రెండో సినిమా మొదలుపెట్టారు. రెండవ సినిమా మొదలుపెట్టారు అది కూడా పూర్తికాకుండానే ఆగింది. దాంతో చేసేదిలేక “పెర కులతూర్ శామ” అనే నటుడు సినిమాలలో నటించడానికి వెనక్కి వెళ్లారు. దాంతో మరల బార్ట్లే గారు నిరుద్యోగంలో ఉండిపోయారు.
మలుపు తిప్పిన బి.యన్ రెడ్డి గారి పరిచయం…
అలా మళ్లీ అవకాశాల కోసం వెతుకుతూ అక్టోబరు 1941 లో న్యూటోన్ స్టూడియోలో ప్రవేశించారు. అందులో నాలుగైదు సంవత్సరాలు పనిచేశారు. అందులో జూపిటర్ వారి సినిమాలు “కన్నడి”, “కుబేర కుచేలా” లాంటి సినిమాలకు ఛాయాగ్రహకులుగా చేశారు. న్యూటోన్ స్టూడియోలో పనిచేస్తుండగా 1944లో వాహినీ బి.యన్.రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే తనను మూడు దశాబ్దాల పాటు వాహినీ, విజయ సంస్థలతో మార్కస్ బార్ట్లే గారి అనుబంధానికి, తెలుగు చలనచిత్రలోనే అద్భుతమైన చిత్రాల రూపకల్పనలో మార్కస్ బార్ట్లే గారి పనితనం వినియోగానికి దారితీసింది. అంతకుముందు వాహినీ, విజయా వారికి మొట్టమొదటి స్క్రీన్ ప్లే, ఛాయాగ్రహణం అందించిన వారు కె.రామ్ నాథ్ గారు. 1940లో కె.వి.రెడ్డి గారి భక్త పోతన చిత్రీకరణ చివరి దశలో ఉండగా రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం వలన కొంతకాలం చిత్రీకరణ ఆగిపోయింది.
విజయా వారికి తొలిసినిమా “స్వర్గసీమ”…
ఆ సినిమా మళ్లీ ప్రారంభమయ్యే నాటికి కె.రామనాథ్ గారు జెమిని స్టూడియో కు వెళ్లిపోయారు. మిగిలిన భాగాన్ని కె.వి.రెడ్డి గారు పూర్తి చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు 1944లో వాహినీ వారి “స్వర్గసీమ” ప్రారంభమైంది. దాని చిత్రీకరణకు ఏర్పాట్ల కొరకై న్యూటోన్ స్టూడియో కి వెళ్ళినప్పుడు అక్కడ మార్కస్ బార్ట్లే గారితో, బి.యన్.రెడ్డి గారికి పరిచయం ఏర్పడింది. బి.యన్.రెడ్డి గారికి మార్కస్ బార్ట్లే గారి ప్రతిభ మీద ఎలా నమ్మకం ఏర్పడిందో గానీ అది ఒక శకానికి ఆరంభం అయ్యింది. ఆ విధంగా తన తెలుగు చిత్రం “స్వర్గసీమ” సినిమాతోనే మార్కస్ బార్ట్లే గారు కె.రామ్ నాథ్ గారికి ధీటైన సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. మార్కస్ బార్ట్లే గారు ఛాయాగ్రహణం నిర్వహించిన ప్రతీ చిత్రంలోనూ ఆయన ప్రతిభను ఎత్తిచూపించే దృశ్యాలు అనేకం ఉన్నాయి.
విజయా వారి పూర్తిస్థాయి ఛాయాగ్రహకుడిగా…
స్వర్గసీమ తరువాత మరొక అద్భుతమైన కలయికకు వేదిక అయ్యింది “యోగివేమన” చిత్రం. అది కె.వి.రెడ్డి, మార్కస్ బార్ట్లే గార్ల కలయిక. ఇద్దరికీ కూడా సినిమా అంటే కేవలం సృజనాత్మకత మాత్రమే కాదు, సినిమా నిర్మాణంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కూడా ఉంటాయని నమ్మిన నిపుణులు. కె.వి.రెడ్డి గారి సృజనాత్మకతకు పట్టాభిషేకం చేసిన మిత్రులు మార్కస్ బార్ట్లే గారు. వాళ్ళిద్దరూ కలయికలో వచ్చిన ప్రతీ చిత్రం సాంకేతిక విలువలతో అత్యున్నతమైనవి అని చెప్పుకోవచ్చు. “యోగి వేమన” సినిమా జరుగుతుండగానే వాహినీ స్టూడియో నిర్మాణం కొనసాగింది. ఈ సినిమా పూర్తి అవ్వడంతోనే సినిమా స్టూడియో నిర్మాణం కూడా పూర్తయ్యింది. అందులో “గుణసుందరి కథ” తో సినిమా చిత్రీకరణ మొదలయ్యింది. “స్వర్గసీమ”, “యోగి వేమన” చిత్రాలతో తన ప్రతిభను గమనించిన నాగిరెడ్డి, చక్రపాణి గార్లు ఆయనను పూర్తిస్థాయి ఛాయాగ్రహకుడుగా తన సంస్థలోకి ఆహ్వానించారు.
అధిక పారితోషికం…
ఆ రోజులలో మిగతా సాంకేతిక నిపుణులందరికంటే ఎక్కువ పారితోషికం మార్కస్ బార్ట్లే గారికి ఇచ్చేవారు. పింగళి గారికి 500 రూపాయలు, గోఖలే గారికి 200 రూపాయలు ఇలా ఉన్న ఆ రోజులలో మార్కస్ బార్ట్లే గారికి నెలకు 700 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. ఛాయాగ్రహకుడితో పాటు ప్రయోగశాల (ల్యాబరేటరీ) నిర్వహణ కూడా మార్కస్ బార్ట్లే గారే చూసుకునేవారు. రాను రాను స్టూడియో విస్తరించేసరికి పని భారం ఎక్కువయ్యి లేబరేటరీ పనులు “సేమ్ గుప్తా” అనే వ్యక్తికి అప్పగించి మార్కస్ బార్ట్లే గారు ఛాయాగ్రహకుడిగానే పరిమితమయ్యారు. “గుణసుందరి కథ” సినిమాలో కెమెరా ట్రిక్స్ తాను మాత్రమే తీయగలను అని నిరూపించుకున్నారు. అందులో కస్తూరి శివరావు పాత్ర సూక్ష్మ రూపంలోకి మారిపోయి రాక్షసి కడుపులోకి దూరడం లాంటి షాట్లు మార్కస్ బార్ట్లే గారికి మాత్రమే సాధ్యమైంది.
వెండితెర చందమామ..
విజయా ప్రొడక్షన్స్ ప్రారంభమైన తరువాత “షావుకారు”, “పాతాళ భైరవి” మొదలైన వాటిలో మార్కస్ బార్ట్లే గారి కెమెరా స్వైర విహారం చేసిందనే చెప్పవచ్చు. “స్వర్గసీమ” నుండి వెండితెర చందమామను చూపించడం మొదలుపెట్టారు బార్ట్లే గారు. వెండితెర చందమామను తనకు మరియు విజయా ప్రొడక్షన్స్ వారికి ట్రేడ్ మార్క్ అయ్యేలా చేశారు. మార్కెట్లో గారు “షావుకారు” సినిమాలో నాయికా, నాయకులు అర్థ చంద్ర ఆకారంలో ఉన్న చంద్రుని సమక్షంలో ఉండగానే సినిమాకు శుభం కార్డు పడుతుంది. మార్కస్ బార్ట్లే గారికి చందమామ అంటే చిన్నప్పటినుంచే ఇష్టం ఏర్పడింది. వాళ్ళ నాన్నగారు చీకట్లో, వెన్నెల రాత్రుల్లో అడవికి వేటకు వెళుతుండేవారు. వెళుతూ వెళుతూ బార్ట్లే గారిని కూడా తీసుకెళ్లేవారు. అడవిలో వెన్నెల, వెన్నెల్లో అడవి అందాలు అవన్నీ కూడా బార్ట్లే గారి మనసులో శాశ్వతంగా ముద్రించుకపోయాయి. వాటి ఫలితమే విజయా వారి నిండు చందమామ క్రియేటెడ్ బై మార్కస్ బార్ట్లే అయ్యింది. “పాతాళ భైరవి”, “చంద్రహారం”, “మాయాబజార్” ఈ సినిమాలలో మార్కస్ బార్ట్లే గారి పనితనం గురించి ఫోటోగ్రఫీ గురించి తేలికగా వందలాది పుస్తకాలు వ్రాయొచ్చు.
చివరి చిత్రం “మయంగం”…
గుండమ్మ కథ తర్వాత 1964 లో మార్కస్ బార్ట్లే గారు వాహిని స్టూడియోస్ నుండి జెమినీ స్టూడియోకి మారారు. అక్కడ కూడా సంవత్సరంన్నర మాత్రమే పనిచేశారు. “రాము కారియత్” తీస్తున్న “చెమ్మీన్” సినిమాకు తీస్తుంటే జెమిని వారి కోరిక మీద ఆ సినిమాకు ఛాయాగ్రహకుడిగా మార్కస్ బార్ట్లే గారు వెళ్లారు. ఆయన ఆ సినిమాలో కేరళ సముద్ర తీరాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా చివరలో ఉండగా ఆ సినిమా నుండి బార్ట్లే గారు తప్పుకున్నారు. మిగిలిన భాగాన్ని యు.రాజగోపాల్ గారు చిత్రీకరించారు.
ఆ సినిమాకు 1965లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా మార్కస్ బార్ట్లే గారు పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు తమిళ సినిమా “శాంతినివాసం” చిత్రానికి ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు మార్కస్ బార్ట్లే గారు. ఆయన తెలుగులో ఛాయాగ్రాహణం అందించిన చిట్టచివరి చిత్రం 1974లో వచ్చిన చక్రవాకం. ఆ తర్వాత 1977లో విజయా వారి హిందీ చిత్రం “యహీ హే జిందగీ”, 1979లో “మయంగం” అనే మలయాళీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.
మరణం…
1980 వచ్చేసరికి మార్కస్ బార్ట్లే గారి శకం ముగిసింది. తీరిక సమయాల్లో కెమెరా లెన్స్ శుభ్రం చేస్తూ ఉండేవారు. ఆదివారాలు చిత్రీకరణ పెట్టుకోకుండా కెమెరా సర్వీసింగ్ లు, లైసెన్సులు సరిచేయడం లాంటివి చేసుకుంటూ ఉండేవారు. 1989లో తమిళనాడు ప్రభుత్వం “రాజా షాడో” పురస్కారంతో సత్కరించింది. 1990 తర్వాత మార్కస్ బార్ట్లే గారి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయనను మధుమేహం వ్యాధి బాగా ఇబ్బంది పెట్టేది. ఆయన స్వయంగా వైద్యం చేసుకునేవారు. వైద్యుని వద్దకు వెళ్లేవారు కాదు. వ్యాధి బాగా తీవ్రతరమైన సందర్భంలో బి.నాగిరెడ్డి గారే వవిజయా ఆసుపత్రిలో చేర్పించారు. ఏ విజయా చిత్రాల వైభవంలో మార్కస్ బార్ట్లే గారు కీలకమైన పాత్ర పోషించారో, ఆ విజయా సంస్థల ఆసుపత్రుల ఆధ్వర్యంలోనే 14 మార్చి 1993లో కన్నుమూశారు. మార్కస్ బార్ట్లే గారి అంతిమయాత్రకు సినీ ప్రముఖులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ముగింపు…
మార్కస్ బార్ట్లే గారి నిష్క్రమణ తరువాత వచ్చిన విజయచిత్ర సినిమా పత్రికలో “వెండితెర చంద్రుడు అస్తమయం” అని రావికొండల రావు గారు నివాళి వ్యాసం వ్రాశారు. అందులో చిట్టచివరిగా పేరా యధాతధంగా…
దక్షిణ భారతదేశం గొప్పగా చెప్పుకోగల గొప్ప ఛాయాగ్రహకులు మార్కస్ బార్ట్లే ఎన్నో తెలుపు నలుపు చిత్రాలు, వర్ణ చిత్రాలు అందుకు సాక్ష్యం పలుకుతాయి. సినిమా అంటే బొమ్మ, ఆ బొమ్మ నిజం అనిపించేలా చూపించడం ఛాయాగ్రహకుడి బాధ్యత అన్న నమ్మకం మార్కస్ బార్ట్లే గారిది. దానికోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. తెలుగు సినిమా ఛాయాగ్రహణంలో మెలకువలు, కొత్తదనం, కొత్త విధానం చూపించి పిండిముద్ద లాంటి వెన్నెలను తెరమీదనే పరిచిన మార్కస్ బార్ట్లే గారికి తమిళనాడు ప్రభుత్వం రాజా షిండే పురస్కారం ఇచ్చి గౌరవించింది. తెలుగువాళ్ళు అంతటి సన్నిహితుడికి, మార్గదర్శికి, అనుభవజ్ఞుడికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి గౌరవించుకోలేకపోవడం ఆయన బాధపడి ఉండకపోవచ్చు. కానీ అటువంటి మహోన్నత సాంకేతిక నిపుణులు అస్తమించినందుకు కళల పట్ల గౌరవం, అభిరుచి, అవగాహన ఉన్న వారందరూ బాధపడతారు అని రావికొండల రావు గారు వ్రాశారు.
ఊహ తెలిసిన దగ్గర నుంచి తుది శ్వాస పీల్చేదాక కెమెరాలే ప్రపంచంగా జీవించిన మార్కస్ బార్ట్లే గారిని ఎన్ని తరాలు గుర్తుంచుకుంటాయో తెలియదు గానీ ఆయన చిత్రీకరించిన సినిమాలు నిలిచి ఉన్నంతకాలం మార్కస్ బార్ట్లే గారు చిరంజీవే.