ప్రస్తుతం ఏపీలో ఎండలతోపాటు ఎన్నికల వేడి కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి సింహాసనాన్ని అదిష్టిస్తుందో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే, దీనిపై కొందరు రాజకీయ నిపుణులు కొన్ని విశ్లేషణలు విసురుతున్నారు. అలాంటి వాటిలో ఒకటే తటస్థ ఓటరు. అంటే రాష్ట్రంలో తటస్థ ఓటరు ఎటువైపు ఉంటే.. అదే పార్టీ గెలుస్తోందంటున్నారు. దీనికి సంబంధించి గత ఎన్నికలను కొలమానాలను ఉదాహరణగా తీసుకుని మరీ చెబుతున్నారు.
సాధరణంగా నియోజకవర్గ స్థాయిలో విజయానికి ప్రాతిపదిక ఓటే షేర్ కాగా రాష్ట్ర స్థాయిలో సీట్ షేర్ ఆధారమవుతుంటుంది. పోలైన ఓట్లను ఏ పార్టీ ఎక్కువ సీట్లుగా మార్చుకోగలుగుతుందో ఆ పార్టీదే గెలుపు. పార్టీలకు తొలినుంచి ఉండే సొంత ఓటు బ్యాంకు అటుఇటుగా ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగుతూనే ఉంటుంది. తటస్థంగా ఉండే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అంతిమంగా ఆ పార్టీదే గెలుపు అవుతుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలు ప్రధానంగా చెప్పాలంటే.. పోటీ తీవ్రంగా ఉండి గెలుపునకు అటుఇటుగా ఊగిసలాడే స్థానాల్లో తటస్థ ఓటర్లే ప్రధానం. వారు ఎటు ఉంటే అటే విజయం. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో టీడీపీ ఓట్ల షేర్ 45.2% కాగా వైసీపీ ఓట్ల షేర్ 44.6%. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.6% మాత్రమే. కానీ సీట్లకు వచ్చేసరికి టీడీపీకి 102 (58.3%), వైసీపీకీ 67 (38.3%) 5. అరశాతం ఓట్ల తేడాతో టీడీపీ అదనంగా 35 సీట్లను సాధించింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర విభజన ప్రభావం ఏపీపై అత్యధికంగా పడింది. ఈ ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కన్నా 10.7% శాతం మెజార్టీ ఓట్లతో 128 స్థానాలను అధికంగా కైవసం చేసుకుంది.
ఆయా పార్టీల సొంత ఓటు బ్యాంకుతో పాటు తటస్థ ఓటర్లు కూడా తోడయినప్పుడు పార్టీల ఓట్లు, సీట్లు మరింత పెరిగాయి. కాబట్టి ఇలా పార్టీల ఓట్లను సీట్లుగా మార్చడంలో తటస్థ ఓటర్లు కీలకమవుతారు. ఉద్యోగులు, విద్యావంతులైన మేధావులు, ప్రభుత్వంతో అంతగా సంబంధం ఉండని ప్రయివేటు కంపెనీల సిబ్బంది, వివిధ రంగాల్లోని నిపుణులను తటస్థ ఓటర్లుగా పరిగణించవచ్చు. ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల ఈ వర్గాలవారు కూడా ఏదో రంకంగా ప్రభావింతం అయ్యి చివరి నిమిషంలో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం వల్ల ఎలాంటి భేదాలు లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అమలైనందున తటస్థ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ సాగించిన ఈ ఐదేళ్ల పాలనలో భారీగా వ్యతిరేకత ఉండడంతో.. 2019లో వచ్చిన తటస్థ ఓటరు ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. ఈసారి ఓటరు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతాడో వేచి చూడాల్సిందే.