
పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరపున మంత్రి సీదిరి అప్పలరాజు పోటీ చేస్తున్నారు. ఇక కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గౌతు శిరీష బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు అధికంగా ఉన్నారు. రెండో స్థానంలో కళింగ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. ఈ కారణంగా వైసీపీ అభ్యర్థి అప్పలరాజుకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మత్స్యకారులు ఉండడం.. అప్పలరాజు ఆ శాఖకు మంత్రిగా పని చేయడం సానుకూలంగా మారొచ్చని అంటున్నారు. అంతేకాకుండా, కళింగ కమ్యూనిటీతో ఉన్న సత్సంబంధాలు కూడా ఈయనకు బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే, 2019లో గెలిచినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఈజీ కాదనే చెప్పాలి.
దాని కారణం కూటమి అభ్యర్థి గౌతు శిరీష గతంలో ఉన్న టీడీపీ ఓటర్లను చూసుకోవడమే కాకుండా జనసేన, బీజేపీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను కలుపుకుంటూ ఎన్నికలలో విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఒకే తాటిపైకి తెచ్చి గౌతు శిరీషకి సపోర్ట్ చేస్తే ఆమె గెలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.