ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతమని అందరూ భావిస్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు ఆ పార్టీనే విజయం సాధించింది.
మొత్తంగా చూసుకుంటే టీడీపీ ఐదు సార్లు (1983, 1989, 1999, 2009, 2014), కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు (1972, 1985, 1994), స్వతంత్ర అభ్యర్థులు రెండు సార్లు (1967, 2004), వైసీపీ ఒకసారి (2019) గెలిచాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన విడదల రజినీ మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు.
ఆమెకు బదులు మనోహర్ నాయుడు వైసీపీ తరఫున బరిలో నిలిచారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరఫున నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు.
సీనియర్ నేతగా ఆయనకు మంచి క్రేజ్ ఉండటం టీడీపీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగో సారి ఆయన విజయబావుటా ఎగురవేస్తారా లేదా వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు బోణీ కొడతారా అన్న విషయం తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.