ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2008లో ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి.
2009, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయకేతనం ఎగురవేశారు. అయితే 2019 ఎన్నికల్లో పరిటాల సునీతకు బదులు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌పై 25వేలకు పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది.
మరోవైపు గత ఎన్నికల్లో చేసిన మార్పు బెడిసికొట్టడంతో టీడీపీ అధిష్టానం వ్యూహం మార్చింది. మరోసారి పరిటాల సునీతకే టిక్కెట్ కేటాయించింది. దీంతో ముచ్చటగా మూడోసారి పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
పరిటాల కుటుంబానికి ఉన్న ఛరిష్మా, మాస్ ఇమేజ్, బలమైన టీడీపీ ఓటు బ్యాంకుతో పరిటాల సునీతకు ఎడ్జ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పరిటాల అడ్డాలో మరోసారి తోపుదుర్తి విజయం సాధిస్తారా.. ఇక్కడి నియోజకవర్గం ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.