రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. వైసీపీని నుంచి అధికార పగ్గాలు తీసుకోవడం కోసం ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ కూడా చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఆ తర్వాత సీట్లను మూడు పార్టీలు పంచుకోనున్నాయి. ఇప్పటికే ఒక కూటమి ఏర్పాటు కాగా.. మరో కూటమి ఏర్పాటుకు రాష్ట్రంలో చాప కింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సీపీఐ, సీపీఎంతోపాటు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఇందులో చేరబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది. షర్మిల పార్టీలో చేరకముందు నిస్తేజంలో కూరుకుపోయిన కేడర్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. అధికార, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో షర్మిల పదునైన విమర్శనాస్త్రాలు వేస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ వాదులుగా ఉన్న ఎంతో మంది మళ్లీ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో రెండు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఓటు బ్యాంకును సాధించేందుకు వీలు ఉందని పార్టీ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. సీట్లు రాని ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌లో చేరతారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అసంతృప్త నేతలకు తలుపులు తెరిచే కాంగ్రెస్ పార్టీ ఉంచింది. ఇది కూడా పార్టీకి అడ్వాంటేజ్ మారుతుందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.
మొదట టీడీపీ, జనసేన ఏర్పాటు చేసే కూటమిలో సీపీఐ, సీపీఎం ఈ రెండు పార్టీలు చేరాలని తొలుత భావించాయి. అందుకు అనుగుణంగా ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఈ రెండు పార్టీల కీలక నేతలు లోకేశ్‌తోపాటు ఆ పార్టీ నేతలకు అండగా నిలబడ్డారు. ఒకానొక దశలో ఈ నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పాటు అవుతాయని ప్రచారం జరిగింది. అనూహ్యంగా బీజేపీ కూటమిలో చేరడంతో ఈ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు టీడీపీ, జనసేనకు దూరంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో కూటమికి ఏర్పాటుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే కూటమిలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కూడా చేరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా ఏర్పడడానికి ఓ కూటమిగా ఏర్పడడానికి బీజేపీయే కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి నిలిచిపోవడం వంటి అంశాలు విద్యావం తులలోనూ, మేథావుల్లోనూ వైసీపీపై తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామన్న వైసీపీ చివరకు ఎన్నికలు రెండు నెలలు ఉందనగా.. కేవలం ఆరు వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించింది. ఈ ప్రకటన పై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు భరోసా పేరిట ఇస్తున్న నిధులు బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోక పోవడంతో రైతాంగం సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది.
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగిన నిత్యావసర ధరలు, కరెంట్ బిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వంటి విషయాల్లోనూ మధ్యతరగతి ప్రజానీకం సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ గ్రాఫు రోజుకి తగ్గిపోతుందనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న చాలామంది నేతలు వైసీపీలో తమకు టికెట్లు వద్దంటూ టీడీపీ- జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీల్లో టిక్కెట్టు దక్కని వారు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఎన్నికల ముందు సీఎం జగన్ చేసిన మార్పులు, చేర్పులు ప్రయోగం పెద్ద గందరగోళానికి దారితీసింది. మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మారుస్తూ, కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడంతో వైసీపీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. మార్పులు, చేర్పుల పేరుతో 30 మందికి కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలకు పక్క నియోజ కవర్గ నేతలను పంపించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చే విషయంలో సరైన కసరత్తు చేయకుండా సర్వేల పేరుతో మార్చడంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణికి ఇది ఉదాహరణని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన కూటమికి ధీటుగా మరో కూటమి ఏర్పాటు అవుతుందన్న వార్తలు ప్రస్తుతం జోరుగా షికారు చేస్తున్నాయి. ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందో చూడాలి.