Telugu NewsTelugu Special Stories

అక్కడ వినాయకుడికి పూజలు చేస్తారు కానీ.. నిమజ్జనం చేయరు

హిందువుల ప్రముఖ పండుగ వినాయక చవితి. వినాయక చవితికి తొమ్మిది రోజులు నవరాత్రులను హిందువులు ఘనంగా జరుపుకొని, గణనాథుడిని వైభవంగా పూజిస్తారు. భారత దేశం అంతట వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా చిన్నారులు నవరాత్రుల సందర్భంగా ఆటపాటలతో గణనాథుడికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. భారతదేశంలోని మహారాష్ట్రలో వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడిని ఆరాధిస్తారు.

బొజ్జగణపయ్యకు తొమ్మిది రోజులూ ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు చేసి చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం మనకు ఆనవాయితీ. కానీ మహారాష్ట్ర లోని ఒక ఊళ్లో మాత్రం వినాయకుడికి అలాగే పూజలు చేస్తారు కానీ, నిమజ్జనం మాత్రం చేయరు. చెక్కతో చేసిన ఈ గణపతి కేవలం నవరాత్రుల్లో మాత్రమే దర్శనమిస్తాడు. మహారాష్ట్రలోని పాలజ్లో కొలువైన ఈ స్వామిని చూసేందుకు ఈ తొమ్మిది రోజులూ లక్షల మంది జనం బారులు తీరుతారు.

ఆ గణపతిని నిమజ్జనం చేయరు..

ఏడాదికోసారి గణపతి నవరాత్రు లొస్తాయి. రకరకాల ఆకృతుల్లో బోలెడు రంగుల్లో గణేశ్ బొమ్మలు దర్శనమిస్తాయి. ఇంటికో బుజ్జి గణపతిని బట్టి ఆకాశమెత్తునీ కొలువుతీరతాయి. కానీ మహారాష్ట్రలోని పాలజ్ వాసులకు మాత్రం గణపతి నవరాత్రులంటే తమ ఊళ్లోని చెక్క వినాయకుడే ఆయన్నే తమ కష్టాలను కొలుస్తారు. ఒకసారి గణపతి నవరాత్రులకు పెట్టిన బొమ్మనే అరవై ఏళ్లుగా వాళ్లు కొలుస్తున్నారు. ఎంతో భక్తితో ఆయనకు గుడికట్టి పూజలు చేస్తున్నారు. నవరాత్రుల్లో మాత్రమే ఆయన దర్శనం కోసం దేశం నలుమూలల నుంచీ ఆ గ్రామానికి బారులు తీరతారు. ఆయనే మహారాష్ట్ర రాష్ట్రం పాలజ్ గ్రామంలో కొలువైన గణపతి, తెలంగాణాలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సరిహద్దులో మహారాష్ట్ర లో ఉంటుందీ పాలజ్ గ్రామం.

మొదటి గణపతి..

మొదట్లో అన్ని గ్రామాల్లాగే పాలజ్లోనూ వినాయక నవరాత్రులు జరిపి స్వామిని నిమజ్జనం చేసేవారు. అయితే 1948 ప్రాంతంలో నాందేడ్ జిల్లాతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో విపరీతమైన కరవు వచ్చింది. దాంతోపాటూ పాలజ్లో కలరా వ్యాపించి విపరీతంగా జనం మరణిం చారు. అయితే నవరాత్రుల సందర్భంగా గణపతిని నిమజ్జనం చేయడమే ఇందుకు కారణమై ఉంటుందని గ్రామ ప్రజలు భావించారు. అందుకే, అక్కడి ఒక స్వామీజీని ఆశ్రయించి ఆయన సూచన మేరకు నిమజ్జన కార్యక్రమాన్ని నిలిపివేశారు.

స్వామీజీ సూచనల మేరకు కొయ్యబొమ్మలకు ప్రఖ్యాతి చెందిన నిర్మల్ పట్టణానికి వెళ్లి మంచి కలపతో నాలుగడుగుల ఎత్తున వినాయకుడి చెక్క విగ్రహాన్ని చేయించారు. గ్రామస్థులు. దాన్ని తీసుకువచ్చి అర్చనలు చేశారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా తమ ఊరిలోనే శాశ్వతంగా నిలుపుకోవాల న్నది వాళ్ల ఆలోచన. అందుకే ఆ స్వామికి గుడికట్టారు. ఆ విగ్రహాన్ని గ్రామంలోకి తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాంతం వెనువెంటనే ‘పాడిపంటలతో కళకళలాడిందట. కలరా మహమ్మారి కూడా ఊరి నుంచి దూరమైందట. కరవు సమయంలో నీళ్లు లేకపోవడంతో ఒక బురద గుంటలో గణపతిని నిమజ్జనం చేయాల్సి అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండటానికే నిలుపుకున్నారనీ మరో కథ.

వినాయక చవితి సమయంలో మాత్రమే దర్శనం…

పాలజ్లోని చెక్క గణపతిని ఎప్పుడంటే  అప్పుడు  అప్పుడు దర్శనం చేసుకోలేం. కేవలం గణపతి నవరాత్రుల సందర్భంగా మాత్రమే ఆ విగ్రహాన్ని బయ టకు తీసి అర్చకులు అర్చనలు చేస్తారు. ఆ సమయంలో మాత్రమే పూజలు జరుపుతారు. ఈ ప్రత్యేకమైన చెక్క గణపతిని  చూసేందుకు తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, చత్తీస్ఘడ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర

రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ సమయంలో స్వామితోపాటు  మరో చిన్న మట్టి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు.

చిన్న గణపతికి నిమజ్జనం…

చెక్క గణపతితో పాటుగా ఏర్పాటుచేసిన బుజ్జి గణపయ్యలను నవరాత్రుల అనంతరం గోదావరిలో నిమజ్జనం చేసి ఆ నీళ్లను తెచ్చి స్వామి మీద చల్లుతారు. తర్వాత ఆ విగ్రహాన్ని తీసి ప్రత్యేకమైన గదిలో భద్ర పరుస్తారు. విగ్రహాన్ని మళ్లీ బయటకు తీసేది గణేశ్ చతుర్దికే. మిగతా ఏడాదంతా స్వామి స్థానంలో విగ్రహపు ఫొటోను ఉంచి పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల సమయంలో ఊళ్లో ఎవరూ మాంసాహారాన్ని వండరు. దాదాపు 75 శాతం యువతీ యువకులంతా ఈ రోజుల్లో ఉపవాసాలు చేస్తారు.

అక్కడకు ఎలా వెళ్లాలంటే.. ?

దట్టమైన అటవీప్రాంతంలో గోదావరి పాయల వెంట మనోహరంగా కొలువై ఉంది. పాలజ్ దేవాలయం. స్వామి మహిమ ఊరూరా ప్రచారమవుతుండటంతో పాలజ్ కు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మంచి నీటి ప్లాంటును ఏర్పాటు చేసి, పులిహోరను ఉచిత ప్రసాదంగా పంచుతోంది కమిటీ. ఆలయం దగ్గర పెద్ద భోజన హాళ్లున్నాయి. అలాగే భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలూ అందుబాటులో ఉన్నాయి. పాలజ్ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా భైంసాకు సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి భైంసాకు బస్సులుంటాయి, అక్కడి నుంచి పాలక్కు తరచుగా బస్సులు నడుస్తుంటాయి. పాలజ్ పేరుకి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నా ఆ గ్రామంలో తెలుగువారే ఎక్కువ. అందుకే స్వామిని దర్శించుకునేవారిలో మనవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు.

Show More
Back to top button