Telugu Featured NewsTelugu Politics

ఢిల్లీలో రైతుల యుద్ధం

రెండేళ్ల తర్వాత రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఛలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలో నిరవధిక ఆందోళనకు దిగారు. గతంలో చేసిన ఆందోళనకు ఈ తాజా ఆందోళనకు ఏంటి తేడా? ఒక్కసారిగా రైతులు ఎందుకు ఆందోళనకు దిగారు, కేంద్ర ప్రభుత్వం ఇంత తీవ్రంగా ఎందుకు అణచివేస్తోంది. ఎన్నికలకు ముందు రైతులు ఢిల్లీపై యుద్ధం ప్రకటించారా? ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులతో యుద్ధం చేస్తోందా? అనే విషయాలను వివరంగా చర్చిద్దాం.

2020లో మోడీ ప్రభుత్వం రైతుల కోసం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల రైతుల ఇబ్బందే తప్ప ఒరిగేది ఏమీ లేదని సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో 13 మాసాలపాటు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 200 రైతు సంఘాలు చారిత్రాత్మకమైన పోరాటాన్ని ఢిల్లీ సరిహద్దులలో నిర్వహించాయి. చిట్టచివరకు ప్రభుత్వం రైతుల పోరాటానికి లొంగివచ్చి రైతుసంఘాలతో చర్చించి మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. కనీస మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లు, మరికొన్ని ఇతర సమస్యల విషయంలో రాతపూర్వక హామీలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ తరువాత ఆ హామీలను ప్రభుత్వం గాలికి వదిలివేసింది. దీంతో రైతులు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల జాతీయ వేదికలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని అనుకున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి?

కేంద్ర ప్రభుత్వం రైతుల తమ పంటకు కనీస మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లులు ప్రకటిస్తామని తెలిపింది. కానీ ప్రభుత్వం దీని అములకు నోచుకోలేదు. ఇదే కాకుండా  UPA హయాంలో ఏర్పడ్డ స్వామినాథన్ కమిటీ కనీస మద్దతు ధరపై 2004-06 మధ్య కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఉత్పత్తికి అయ్యే సగటు ఖర్చు కన్నా MSP కనీసం 50శాతం ఎక్కువ ఉండాలని సూచించింది. ఈ కమిటీ సూచనల మేరకు MSPకి చట్టబద్ధత కల్పించాలనేది రైతు సంఘాల డిమాండ్. C2+50% ఫార్ములాగా పిలిచే ఈ విధానంపై నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సూచన బెడిసి కొట్టొచ్చని, మార్కెట్స్‌పై ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది.

MSP కంటే పంజాబ్ రైతుల అతిపెద్ద సమస్య ఇదే!

పంజాబ్ రైతుల వెంట MSP సమస్యతో పాటు ఇంతకంటే పెద్ద సమస్యే ఉందట. వ్యవసాయానికే ఎసరు తగిలే పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘పంజాబ్ సర్కారు 2018లో ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 79% ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధికంగా వాడుతున్నారు. ఫలితంగా 2039కు అవి అడుగంటిపోతాయి’ అని హెచ్చరిస్తున్నారు. దీంతో నీటి కొరత పంజాబ్‌కు సవాల్‌గా మారిందంటున్నారు నిపుణులు. 2020లో కేంద్రం ఆ రాష్ట్రంలో బ్లాకుల వారీగా భూగర్భ జలాల నిల్వలపై సర్వే చేపట్టగా కేవలం 17 బ్లాకులే సేఫ్ జోన్లో ఉన్నట్లు తేలింది. మిగతా 133 బ్లాకుల్లో నీటి వాడకం అధికంగా ఉందట. 70% కన్నా తక్కువ భూగర్భజలాలను వినియోగించిన ప్రాంతాలను ‘సేఫ్ జోన్’గా కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనిని కూడా రైతు సంఘాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

రైతు ఆవేదన దేశానికి మంచిది కాదు

ప్రస్తుతం దేశంలో సాగునీటి వనరులు లేక, ప్రాజెక్టుల నిర్మాణం ఏళ్ల తరబడి పూర్తిగాక, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రీతిలో పంటల బీమా పథకం లేక, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎరువులు, పురుగుమందుల సరఫరా సక్రమంగాలేక రైతులు అప్పులపాలై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపైనప్పటికీ తగిన ఆదాయం రాక దేశ రైతాంగం దివాళా స్థితికి చేరిపోయింది. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను అమలుచేయాలని కోరుతూ గత సంవత్సరం అన్ని రాష్ట్రాల రాజధానులలో, కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దఎత్తున 30 రోజుల పాటు కార్మికులు, రైతులు గవర్నర్ల కార్యాలయాలవద్ద పెద్ద ఎత్తున ‘మహాపడావ్’ నిర్వహించి ప్రభుత్వానికి తమ సమస్యలను వెల్లడించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకే రైతు సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌కు పూనుకున్నాయి. దీంతో ఈ బంద్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమో అని ప్రభుత్వం దీనిని అణచివేయడానికి పూనుకుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రైతు కంటి కన్నీరు జాతికే కళంకం తెస్తుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలంటున్నారు.

Show More
Back to top button