ఫుడ్ డెలివరీ యాప్‌లు రావడంతో క్లౌడ్ కిచెన్‌లు పాపులర్ అయ్యాయి. తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు. మీలో ఎవరైనా క్లౌడ్ కిచెన్ ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే దానిని ఎలా ప్రారంభించాలో ఒక లుక్ వేద్దాం పదండి..
డైన్‌ఇన్ లేని రెస్టారెంట్‌ని క్లౌడ్ కిచెన్ అని అంటారు. ఈ క్లౌడ్ కిచెన్ నుంచి కేవలం ఫుడ్ డెలివరీకి, టేక్ అవే(పార్సిల్స్) వంటి సేవలు మాత్రమే చేయవచ్చు. రెస్టారెంట్‌లో ఉన్నట్టు ఒక కిచెన్‌ని సిద్ధం చేసి.. అందులో వండిన వంటలను ప్యాక్ చేసి డెలివరీ చేయడం లేదా అక్కడికి వచ్చిన కస్టమర్లకు పార్సిల్ ఇవ్వడం. కూర్చొని తినడం వంటివి ఉండవు కాబట్టి.. దీనికి తక్కువ స్థలం పడుతుంది. ఫుడ్ డెలివరీ యాప్‌లతో కూడా ఒప్పందం చేసుకుంటే వ్యాపారంలో మరింత ఆదాయం పొందవచ్చు.
క్లౌడ్ కిచెన్ ఎలా ప్రారంభించాలి?
కనీసం 50*30 అడుగుల విస్తీర్ణం ఉండే గదిని కిచెన్‌లాగా తయారు చేసుకోవాలి. అందులో గ్యాస్ సిలిండర్, మైక్రో ఓవెన్, వండటానికి పాత్రలు మొదలగు వస్తువులు సిద్ధం చేసుకోవాలి. క్లౌడ్ కిచెన్ ఆహారానికి సంబంధించిన వ్యాపారం కాబట్టి తప్పకుండా కొన్ని లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.
* FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్)
* GST రిజిస్ట్రేషన్
* హెల్త్/ట్రేడ్ లైసెన్స్
* ఫైన్ & సెఫ్టీ లైసెన్స్
* షాప్ & ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్
వీటితో పాటు మరికొన్ని సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి.
* క్లౌడ్ కిచెన్‌కి ఎంత పెట్టుబడి అవసరం?
సొంత గది ఉంటే అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. సొంత గది లేకపోతే ప్రాంతాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు అద్దె ఉంటుంది. అడ్వాన్స్‌కి రూ.30 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా వేర్వేరు ఏరియాల్లో వేర్వేరుగా ఉంటుంది. కిచెన్ సమాన్లకు రూ.2 లక్షల-రూ.3 లక్షల మధ్య ఖర్చవుతుంది. లైసెన్సులకు మరో రూ.15 వేలు అవుతుంది. వీటితో పాటు పని చేయడానికి మనుషులని తీసుకుంటే వారికి జీతం ఇవ్వాలి.
ఇద్దరిని తీసుకుంటే.. ఒక్కొక్కరికి జీతం రూ.15 వేలు వేసుకున్నా.. నెలకు రూ.30వేలు అవుతుంది. ప్యాకింగ్ కోసం కావాల్సిన వస్తువులకు రూ.5 వేలు. ఇవన్నీ లెక్కేసుకొని 3 నెలల వరకు వ్యాపారం సాగడానికి, వ్యాపారం ప్రారంభించే ముందు డబ్బు సిద్ధం చేసుకోవాలి. మొత్తం కలిపి రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షలు వరకు అవుతుంది. మీరు ఏ వ్యాపారం ప్రారభించలనుకుంటున్నా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.