
2023-24 సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈరోజు(ఫిబ్రవరి 1)న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం వినిపించారు. తొలుత నిర్మలా సీతారామన్ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది. ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్ధగా భారత్ ఉందని, నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని నిర్మల సీతారామన్ అన్నారు. అసలు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల వంటి ప్రత్యేకతల గురుంచి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం:
గతంలో చూసుకున్నట్లైతే, బడ్జెట్ ను ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెట్టేవారు. 2017లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ మొదటిసారిగా బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఆ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టడమనేది ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఇందుకు ఓ కారణం లేకపోలేదు. ఫిబ్రవరి నెల చివర్లో అంటే, బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నెల రోజుల తర్వాత, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కేవలం ఒకే ఒక్క నెల వ్యవధిలోనే బడ్జెట్ నిబంధనలను ప్రవేశపెట్టడమనేది సాధ్యం కాని పని.. దీంతో బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడితే కాల వ్యవధి ఇంకాస్త ఎక్కువ రోజులు ఉంటుందన్న నిర్ణయానికి రావడమే ఇందుకు కారణం.
అలానే బడ్జెట్ ప్రసంగం ఉదయం 11గంటలకే ప్రారంభమవ్వడానికి కూడా ఓ కారణం ఉంది. ఇండియా బ్రిటీష్ ఆధీనంలో ఉన్నప్పుడు బడ్జెట్ ను 11 గంటలకు ప్రవేశపెట్టేవారు. నిజానికి ఇది బ్రిటన్ లో జరిగే విధానం.. దీని ప్రకారం, మనకు సాయంత్రం 5 గంటలవుతుంది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకే ప్రవేశపెట్టేవారు. కానీ 1999- 2000 సంవత్సరంలో ఉన్న అప్పటి ఎన్డీయే ప్రభుత్వ ఆర్థికమంత్రి అయిన యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27, సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులుగా.. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. దీంతో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఆ సమయాన్ని పాటిస్తూ రావడంతో.. తేదీ, సమయాలు ఇలా స్థిరపడ్డాయి.
ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటా 26నిమిషాల పాటు కొనసాగింది. వరుసగా ఐదోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులో 7 ప్రధాన అంశాలకు చోటు కల్పించారు.. అవి:
- చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడలు
- సామర్థ్యాల వెలికితీత
- స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి(గ్రీన్ గ్రోత్)
- యువశక్తి
- విత్త విధానం
- అర్థిక విధానాన్ని బలపరచడం
నిరుద్యోగుల కోసం…
యువతలో నైపుణ్యాలు పెంచేలా పీఎం కౌశిల్ వికాస్ యోజన 4.0 ప్రారంభం..
పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్
మూడేళ్ల పాటు డీబీటీ ద్వారా సాయమందివ్వడం.
సీనియర్ సిటిజన్స్ కోసం..
ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పొదుపు పరిమితిని రెట్టింపు చేసి, రూ.30లక్షలకు పెంపు చేయడం.
మహిళలు, బాలికల కోసం..
మహిళలు, బాలికల కోసం సమ్మాన్ బచత్ పత్ర అనే కొత్త స్కీమ్ 2025 వరకల్లా అమల్లోకి వస్తోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే ఈ కొత్త పథకం.. రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది.
గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది.
సొంతింటి కల…
కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకోవాలనుకునేవారికి పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఈసారి బడ్జెట్లో నిధులను పెంచింది.
గత బడ్జెట్లో ఈ పథకం కింద రూ. 48వేల కోట్ల రూపాయలను కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతానికి పెంచి, రూ. 79వేల కోట్లు చేసింది.
రైతుల కోసం…
రూ. 20లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందిస్తాం.
ఇతరాంశాలు…
నీతి ఆయోగ్ ను మరో మూడేళ్లపాటు పొడిగించడమైంది.
కాలం చెల్లిన వాహనాల తొలిగింపుకు తక్షణ ప్రాధాన్యం..
కేంద్రప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు..
కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాం.
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు.. ఇందుకోసం 13.7లక్షల కోట్లు కేటాయింపు.
కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
వ్యవసాయ రుణాలకు రూ.20 లక్షల కోట్లు,
మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు,
గతంలో పోలిస్తే ఇప్పుడు 9 రెట్ల నిధులు కేటాయింపు..
ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు.. స్కూళ్ల ద్వారా రానున్న 3 ఏళ్లలో 38,800 టీచర్ ఉద్యోగాలు
కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపులు…
మత్యశాఖకు రూ.6 వేల కోట్లు
క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ.2 వేల కోట్లు
ఎస్సీ వర్గాలకు రూ.15 వేల కోట్లు
పీఎం ఆవాస్ యోజన్ పథకానికి రూ.79 వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
రైల్వేలకు రూ.2.04 లక్షల కోట్లు
సప్తర్షి(ఏడు) అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యం…
వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
వ్యవసాయరంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం.
అగ్రికల్చర్ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు.. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.
ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటకు చేయూత
చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం..
నిర్మలమ్మ ధరించే నేతచీరలకు సైతం ఉందో ప్రత్యేకత…
చేనేత చీరలంటే నిర్మలమ్మకు ఎంతో ఇష్టమట. ఆమె ఆర్థికమంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మల సీతారామన్ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈరోజు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో కనిపించారు.
2019లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజువరకు చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ఇలా ప్రస్తావించారు.. ‘సిల్క్, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలంటే నాకిష్టం. వాటి రంగు, పనితనం, ఆకృతి బాగుంటాయి’ అని చెప్పారు.
2021లో ఎరుపు-గోధుమ రంగుతో ఉన్న భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి కాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
బడ్జెట్-2023.. ఏవి పెరిగాయి.. ఏవి తగ్గాయి..?
తగ్గేవి…
డైమండ్ తయారీ వస్తువులు,
మొబైల్, ల్యాప్‌టాప్, డీఎస్ఎల్ఆర్ కెమెరా లెన్సులు, టీవీ ప్యానెల్ పార్టులు, లిథియం అయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు..
దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఉత్పత్తులు..
పెరిగేవి…
బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు, వెండి ఉత్పత్తులు..
సిగరెట్లు,
టైర్లు, రాగి తుక్కు
దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
రబ్బర్