ప్రేమ గొప్పదా? కామం గొప్పదా? ప్రేమ అనేది ఒక బలమైన సానుకూల మానసిక, భావోద్వేగపు స్థితి. ప్రేమ అనేది మనుషుల మధ్య ఉన్న లోతైన ఆప్యాయత. ఇది వేర్వేరు స్థాయిల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. కుటుంబ ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఏ ఆకర్షణా లేని స్వచ్ఛమైన ప్రేమ (ప్లేటోనిక్ లవ్), స్వీయ ప్రేమ, భక్తి ప్రేమ (భగవంతుడిపై ప్రేమ) ఇలా ప్రేమ పలు రకాలుగా ఉంటుంది. కామం అనేది చతుర్విధ పురుషార్థాలలో ఒకటి. ఇది ఆనందం, కోరిక యొక్క భావన.
సమకాలీన సాహిత్యంలో కామం అనే పదాన్ని తరచుగా లైంగిక కోరిక, భావోద్వేగ కోరికలను సూచించడానికి ఉపయోగిస్తారు. నిజానికి కామం అనగానే మనకు తెలిసిన అర్థం వేరు, మన స్ఫురణకు వచ్చే దృశ్యం వేరు. మనస్సుకు కామానికి దగ్గరి సంబంధం ఉంది. కామానికి దేహానికి అలాంటి సంబంధమే ఉంది. కాముకులకు దేహంలోని సుడిగుండం వంటి ప్రదేశంలో మనసు చిక్కుబడిపోతుంది. మాములు అర్థంలో మనస్సు నుండి దేహానికి ప్రసారం అయ్యేదే కామం. మనసే అన్నింటికీ ప్రధానం కాబట్టి మనసులో పుట్టిందే కామం అన్నారు.
ప్రేమ అనేది నిస్వార్థమైనది, మానసిక బంధం మరియు గౌరవంతో కూడిన ఉన్నతమైన భావన. ప్రేమ కాలంతో పాటు బలపడుతుంది. కానీ కామం అనేది శారీరక ఆకర్షణ మరియు ఇంద్రియ తృప్తికి సంబంధించినది. కామం తాత్కాలికం కావచ్చు. నిజమైన ప్రేమ బంధాన్ని నిలబెడితే, కామం అనేది కేవలం శారీరక అవసరాన్ని తీరుస్తుంది. కనుక కామం కన్నా ప్రేమ గొప్పదిగా పరిగణించబడుతుంది. ప్రేమ అనేది మనసుతో కూడినది, కామం అనేది శరీరంతో కూడినది. కానీ దంపతుల మధ్య ప్రేమతో పాటు కామం కూడా ఉన్నప్పుడే అది పరిపూర్ణమవుతుంది.
ప్రేమ గురించి ప్రముఖ తత్వవేత్తలు పరిపరి విధాలుగా చెప్పారు. ఆర్థర్ షోపెన్‌హౌర్ (జర్మన్ తత్వవేత్త మరియు రచయిత) ప్రేమ అనేది జాతుల మోసం. వాటి పునరుత్పత్తి కోసం మెదడు వేసిన ఒక వలపు అని అన్నారు. ప్రేమ అనేది ఒక భావన కాదు అది ఒక నైపుణ్యం అని జర్మన్ మనస్తత్వవేత్త ఎరిచ్ ఫ్రమ్ అన్నారు. ప్రేమలో కూడా ఒక ఆధిపత్య పోరు దాగి ఉంది, ఇది ఒక కొట్లాట అన్నారు జర్మన్ తత్వవేత్త మరియు రచయిత అయిన ఫ్రెడ్రిక్ నీట్షే. ఇంతకు ప్రేమ గొప్పదా, కామం గొప్పదా అనే విషయం తెలుసుకుందాం..
ప్రేమ ముందా? శృంగారం ముందా?
ప్రస్తుతం సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ప్రేమ గొప్పదా? కామం గొప్పదా? ఒక మనిషిలో ప్రేమ ముందు పుట్టిందా? శృంగారం ముందు పుట్టిందా? అసలు ప్రేమ అనేది నిజమా? లేక మనం ప్రేమపూరితంగా పెట్టుకున్న రసాయన భ్రాంతి మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం సగం జీవశాస్త్రంలో ఉంది, సగం మానవ విషాదంలో ఉంది. అయితే ప్రేమ గురించి, శృంగారం గురించి మాట్లాడినప్పుడు మనిషి ఎక్కువగా అబద్ధాలు మాట్లాడుతాడు. ప్రేమ, శృంగారం గురించి నిజం చెప్పాలంటే ఒక మనిషిలో దాగున్న నిజమైన నిజాలని మనం అంగీకరించాలి. ప్రేమించినప్పుడు నేను నీకోసం చస్తానని చెప్పే మనిషి అలా ఎందుకు చెబుతాడు.
నిజానికి ఒక మనిషి అవసరం, తనలోని భయం, తన ఒంటరితనం, ఒక్కోసారి కోరిక, ఒక మానసిక లోటుని పూరించడానికి చేసుకోవడానికి ఇంకొక మనిషి వాడుకుంటున్నాడని ఒప్పుకోవాలి. కానీ అలా ఒప్పుకోవడం కష్టం. అందుకే ప్రేమ గురించి కథలు సృష్టిస్తాం, కవితలు వ్రాస్తాం, సినిమాలు తీస్తాం. కానీ వాస్తవానికి జీవశాస్త్రం పరంగా చూస్తే ఇవేమీ అవసరం లేదు. ఏదేమైనా తన జాతి నిలవాలంటే “పోటీ ప్రమాణాల ప్రకారం ఉండాలి”. మొట్టమొదటి ఈ భూమిపై జీవం పుట్టినప్పుడు ప్రేమ అనే భావన లేదు. మొదట ఏక కణ జీవులు ఉద్భవించాయి. అవి కాస్తా ద్వికణ జీవులుగా వృద్ధిచెందాయి. చేపలు గుడ్లు పెట్టాయి, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు శారీరకంగా కలిశాయి. అప్పుడు అక్కడ శృంగారం అనేది శారీరకంగా కలిసేలా పుట్టింది. అంతేగానీ ప్రేమ అనేది లేదు, ప్రేమకు సంబంధించిన భావోద్వేగాలు లేవు. అక్కడ కనీస అవసరాలు మాత్రమే ఉన్నాయి.
మొదట ప్రేమ తల్లి బిడ్డ మధ్య…
జీవరాశుల పుట్టుక, పరిణామంలో ఒక పెద్ద మార్పు జరిగింది. మానవజాతి ఆవిర్భావం జరిగినప్పుడు బిడ్డ పుట్టగానే లేచి నిలబడలేదు, పరిగెత్తలేదు, తన ఆహారాన్ని తాను సంపాదించుకోలేదు. ఆ విధంగా అనేక నెలలు, అనేక సంవత్సరాలు ఇంకొకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇది ప్రకృతికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందువలన అంటే ఆ బిడ్డ బ్రతకాలంటే పెద్దవాళ్లతో కలిసే బతకాలి, పెద్దవాళ్ళు కలిసి బ్రతకాలి. లేదంటే బిడ్డ చనిపోతుంది. తద్వారా ఆ జాతి నష్టపోతుంది. ఈ బిడ్డ కోసం కలిసి ఉండటం లోనే ప్రేమ అనే నాటకం మొదలైంది. ప్రేమ అనేది మొదట్లో పుట్టలేదు. అది తల్లి బిడ్డల బంధం, దీనమైన పరిస్థితి చూసి తల్లికి జాలేసింది. బిడ్డను వదిలి పోకుండా తల్లిని కట్టిపడేయడానికి తల్లి మెదడులో ఒక రసాయనిక చర్య మొదలైంది. అది ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ లాంటి బంధన రసాయనాలు. బిడ్డను చూసినప్పుడు తల్లిలో మిరిమిట్లు గొలిపే విద్యుత్ ప్రవాహ మార్గాలు తరువాత మెల్లిగా ఆ జంటల మధ్యలో కూడా పనిచేయడం మొదలైంది. అక్కడి నుండే ఇద్దరు వ్యక్తులు లేదా జీవుల మధ్య ఏర్పడే బలమైన భావోద్వేగ, సామాజిక బంధం మొదలైంది. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే? మొదట ప్రేమ అనేది ఆడ మగ మధ్య పుట్టలేదు. తల్లి బిడ్డ మధ్య పుట్టింది.
శృంగారానికి శరీరం, ప్రేమకు మనసు కావాలి…
అయితే ఇప్పుడు మనిషి ప్రేమను పట్టుకున్నాడు. మనిషిలో ఉన్న సహజ చెడు లక్షణము ఏంటంటే మనిషి దేనిని పట్టుకుంటే దానిని సర్వనాశనం చేస్తాడు. మనిషి శృంగారంను పట్టుకున్నాడు, అది సర్వనాశనం అయ్యింది. మనిషి ప్రకృతిని పట్టుకున్నాడు, అది కూడా సర్వనాశనమైంది. ఇప్పుడు మనిషి ప్రేమని పట్టుకున్నాడు, అది కూడా సర్వనాశనమైపోయింది. మానవ నాడీ వ్యవస్థ ఏమి చెబుతుందంటే మనిషి ప్రేమలో పడ్డప్పుడు తన మెదడు ఒక మారకద్రవ్యంకు బానిసైన వాడిలా ప్రవర్తిస్తుంది. డోపమైన్ పెరుగుతుంది, సెరటోనిన్ పడిపోతుంది.
మనసు ఒకే వ్యక్తి మీద పాతుకుపోతుంది. దాంతో అతని మెదడులో తార్కిక సామర్థ్యం తగ్గిపోతుంది. ఇక తర్కం సంగతి దేవుడెరుగు. అందుకే ప్రేమలో పడి పందుల్లా దొర్లుతున్న వారు తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, అలాగని విమర్శ కూడా కాదు, మెదడులోని రసాయన ప్రక్రియలు చేసే పని. చాలా మంది చేసేమానసిక పరిపక్వత లేనివారు ఆ రసాయనాన్ని ప్రేమ అనుకుంటారు. ఇకపోతే మేథావులు ఈ రసాయనాన్ని ప్రేమ కాదు నకిలీ అనుకుంటాం.
జరుగుతున్నది జగన్నాటకం అనుకుంటారు, కానీ జరుగుతున్నది రసాయనిక నాటకం. కానీ నిజం ఏమిటంటే నీ ఆకలి కూడా రసాయనమే, నీ నొప్పి కూడా రసాయనమే, నీ భయం కూడా రసాయనమే. ఒకవేళ అవన్నీ నకిలీ అయితే నీ ప్రేమ కూడా నకిలీనే. అవన్నీ నిజమైతే నీ ప్రేమ కూడా నిజమే. ఈ రెండిటి మధ్య సన్నని రేఖ ఉంటుంది. అది తెలుసుకోలేకపోతే అయితే అమాయక ప్రేమికులు అవుతాం, లేకపోతే అవసరాలు తీర్చుకునే మేథావులు అవుతాం. అయితే నొప్పి అనేది ఒక రసాయనం, కానీ మన శరీరం దానిని అనుభూతి చెందేలా చేస్తుంది. ప్రేమ కూడా అంతే.
శృంగారానికి ప్రేమకి మధ్య తేడా ఇక్కడే మొదలవుతుంది. శృంగారానికి శరీరం సరిపోతుంది, కానీ ప్రేమకు మనసు కావాలి. శృంగారం సంభోగంలో రతి తృప్తితో ముగిసిపోతుంది. కానీ ప్రేమ మాత్రం ఆ అంతిమ ఘట్టం తరువాత పుడుతుంది. శృంగారంలో నీవు నాకు ఏమి ఇవ్వగలవు అనే ప్రశ్న ఉంటుంది. కానీ ప్రేమలో నేను నీతో ఉండగలనా అనే ప్రశ్న ఉంటుంది. జంతువులతో పాటు మనిషి కూడా శృంగారం చేస్తాడు. కానీ ప్రేమలో ఎక్కువగా బాధపడేది కేవలం మనిషి మాత్రమే.
కామం అంటే శరీర వాంఛ కాదు…
ప్రేమ గురించి ప్రముఖులు పరిపరి విధాలుగా చెప్పారు. జర్మన్ తత్వవేత్త మరియు రచయిత ఆర్థర్ షోపెన్‌హౌర్ ఏం చెప్పారంటే? ప్రేమ అనేది జాతుల మోసం. వాటి పునరుత్పత్తి కోసం మెదడు వేసిన ఒక వలపు అన్నారు. ఎరిచ్ ఫ్రమ్ అనే ఒక జర్మన్ మనస్తత్వవేత్త ప్రేమ అనేది ఒక భావన కాదు అది ఒక నైపుణ్యం అన్నారు. జర్మన్ తత్వవేత్త మరియు రచయిత అయిన ఫ్రెడ్రిక్ నీట్షే ప్రేమలో కూడా ఒక ఆధిపత్య పోరు దాగి ఉంది, ఇది ఒక కొట్లాట అన్నారు. వీరు ముగ్గురు కూడా చెప్పింది నిజమే. ప్రేమ అనేది కేవలం ఒకే విషయం కాదు, అది మూడు పొరలు కలిసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ జీవశాస్త్రంతో, మానసిక అవసరాలతో, అవసరం కోసం చేసే ప్రయత్నంతో ముడిపడి ఉంది.
అందుకే చాలామంది అనుకునే ప్రేమ నిజమైన ప్రేమ కాదు, ఒంటరితనంకు ఒక ఔషదం. అభద్రత భావానికి ఒక అతుకు. లైంగిక కోరికకి ఒక కారణం. దాని యాజమాన్యంకి ఒక శృంగారభరితమైన పేరు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ప్రేమని కామం ఎందుకు అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంది. శృంగారం చెడ్డదా? లేక ప్రేమ చెడ్డదా? ఈ విషయం గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పారు? నిజానికి తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడూ కూడా ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పడు. తాను చెప్పిన ఒకే ఒక మాట “ఎక్కడైతే కామం (అతి కోరిక, మోహం) ఉంటుందో, అక్కడ ప్రేమ ఉండదు”, “ప్రేమ ఉన్నచోట కామానికి చోటు లేదు”. అంటే దీని అర్థం కామం చెడ్డది అని కాదు, జిడ్డు కృష్ణమూర్తి దృక్కోణంలో కామం అంటే శరీర వాంఛ కాదు, కామం అంటే ఊహల్లో తిరగడం, ఒక ప్రతిబింబం సృష్టించుకోవడం, ఆనందం పునరావృతం చేయడం, జ్ఞాపకశక్తిని మళ్లీ మళ్లీ గుర్తుచేయడం ఆ అనుభవం మళ్లీ కావాలనుకోవడం.
ప్రేమకు ఆత్మసాక్షి ఉండదు…
మాములుగా చెప్పాలంటే కామం అంటే “ఆలోచన ద్వారా పొందే ఆనందం”, కామం అంటే శృంగారం కాదు, శృంగారం తరువాత కామం చేసే పని, కానీ ప్రేమ అంటే అభ్యర్థన కాదు, అనుబంధం కాదు, అసూయ కాదు, స్వాధీనత కూడా కాదు, చివరికి ఆధారపడటం కూడా కాదు. నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఆ వ్యక్తి లేకపోతే నీవు బాధపడతావా? అని జిడ్డు కృష్ణమూర్తి అడుగుతారు. నీవు బాధ పడితే అది ప్రేమ కాదు, అది అనుబంధం. ఆమె ఇంకొకరితో మాట్లాడితే నీవు ఇబ్బంది పడతావా? ఇబ్బంది పడితే అది ప్రేమ కాదు, స్వాధీనత. ఆమె నీతో శారీరకంగా ఉండలేకపోతే నీవు అసంతృప్తి చెందుతావా? అయితే అది ప్రేమ కాదు కామం. జిడ్డు కృష్ణమూర్తి వద్ద ప్రేమకు ఆత్మసాక్షి ఉండదు. తాను స్పష్టంగా చెబుతాడు. శృంగారం సమయంలో కొద్దిసేపు “నేను” అనే భావన మాయమవుతుంది. అందుకే మనిషి దానిని మళ్లీ మళ్లీ పునరావృతం చేయాలనుకుంటాడు. ఆ పునరావృతం చేయాలనుకోవడంలో కామం పుడుతుంది.
అంటే ఇక్కడ సమస్య కామం కాదు. ఆత్మసాక్షి నిస్వార్థమైన ఆ ప్రయత్నం మళ్ళీ కావాలని నేను కోరుకోవడం. అందుకే జిడ్డు కృష్ణమూర్తి ప్రేమని వంటలా వండమాకు మాములుగా గమనించమన్నారు. ప్రేమ అనేది బాధ్యత కూడా కాదు. అది మెదడులో స్వీయ కార్యాచరణ మాయమైన స్థితి. అసలు నేను అనేది ఎలా మాయమవుతుంది? నేను అనేది లేకపోతే మనసే ఉండదు కదా. అది లేకుండా మరో నేనుని ఎలా ప్రేమిస్తాం? జిడ్డు కృష్ణమూర్తి తత్వశాస్త్రంలో కేంద్ర సందేహం ఇదే. అతను ఆత్మసాక్షి చంపు అనలేదు. ఆత్మసాక్షి గమనించండి అన్నారు. అన్నింటికంటే ముందు నీవు ఒక విషయం తెలుసుకోవాలి. ఆత్మసాక్షి అనేది రెండు వరసలలో ఉంటుంది. ఒక వరుస క్రియాత్మక వ్యక్తిత్వం “పేరు, ఊరు, పని, భాష, చిరునామా, నైపుణ్యాలు, నిత్య జీవిత వ్యక్తిత్వం”. ప్రతీ మనిషికి ఇవి అవసరం. ఇవి లేకపోతే సమాజంలో బ్రతకలేరు. ఇది సమస్య కూడా కాదు.
ఆత్మ నాశనానికి తుది ముగింపు…
రెండో వరుస మానసిక స్వరూపం. దీనితోనే మనకు సమస్య. ఇది ఏమంటుందంటే నన్ను గౌరవించాలి, నన్ను వదిలిపెట్టవద్దు, నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మన గతంలో జరిగిన తప్పులు, వాటి జ్ఞాపకాలు, మనం ఛాయాగ్రహణం చేసిన ప్రతిబింబాలకి ఇది ఒక కొనసాగింపు కథనం. అది నేను, నాకు, నాది అని పిల్లోడిలా గోల పెడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి మాట్లాడింది ఈ ఆత్మసాక్షి గురించే. శృంగారం ఉచ్ఛస్థితి గమనంలో పెద్దగా నవ్వినప్పుడు, మంచి పాటలో మునిగిపోయినప్పుడు కొన్ని సెకన్ల పాటు నేను అనేది ఉండదు. ఆ సమయంలో నేను అనేది మర్చిపోతాం. ఆ కదలికలో మునిగిపోవాలి.
దీనిని బట్టి నేను అనేది కచ్చితంగా మాయమైపోతుంది. కానీ అది సహజంగా అవుతుంది. అందుకే ఆత్మసాక్షిని మాయం చేయలేం అన్నారు జిడ్డు కృష్ణమూర్తి. తెలిస్తే మాయం చేయొచ్చు అన్నారు. ఉదాహరణగాగా చెప్పాలంటే నీ ప్రియురాలు పక్క వాళ్ళతో మాట్లాడిందనుకో నీకు అసూయ పుడుతుంది. కానీ అసూయ ఎందుకు పుట్టింది అది నిన్ను నీవు ప్రశ్నించుకోవు. నీ అసూయని సమర్థించుకుంటావు. దానిని అణచివేస్తావు, ఆమెను నిందిస్తావు. అంటే నీ అంతరాత్మ ఇంకా రాక్షసంగా మారుతుంది.
కానీ జిడ్డు కృష్ణమూర్తి అసూయకి చీటి పెట్టకుండా సమర్థించకుండా, శ్రద్ధతో గమనించమన్నారు. అక్కడ ఆత్మసాక్షి ఉద్దేశ్యము ఉంది అన్నారు. ఇక్కడ పరిశీలకుడు గమనించబడుతున్నాడు. అసూయాను గమనిస్తున్నది అసూయ నుండే పుట్టిన ఆత్మసాక్షి నిరూపణ. ఇది నీకు సాక్షాత్కారము అయినప్పుడు పరిశీలన ముక్కలైపోతుంది. మాములుగా చెప్పాలంటే నీకు నీ జీవిత భాగస్వామి మీద అసూయ వస్తే అసూయాను గమనించగలిగే శక్తి, పరిపక్వత, జ్ఞానం నీలో ఉంటే అప్పుడు అది అసూయ కాదు. అది నా అభద్రత భావం అని నీకు అర్థమవుతుంది.
అలా అర్థం అవ్వడమే సాక్షాత్కారము. సాక్షాత్కారములో అన్ని మాయమవుతాయి. చివరిగా ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నీవు దేవుని నమ్ముతావు కాబట్టి నీవు భక్తుడివి. భయాల వల్ల, నీ కోరికల వల్ల, నీ చుట్టూ ఉన్న ప్రణాళికల వల్ల నీవు దేవుని నమ్ముతున్నావు. ఒకవేళ నీవు మానవ శాస్త్రం చదివితే దేవుడు లేడు అనే ఒక భావన నీకు తెలుస్తుంది. కాబట్టి నీలో ఉన్న భక్తుడు మాయం అవుతాడు. ఇదే విధంగా తెలుసుకుంటే నీ భయం, నీ కోరిక కూడా మాయం అవుతాయి. అహంకార నిర్మూలన, ఆత్మ నాశనానికి ఇదే తుది ముగింపు.
మరిన్ని వ్యాసాలు చదవండి:
ప్రేమ అనేది ఒక మానసిక రోగమా? మూర్ఖులే ప్రేమిస్తారా?
ప్రేమ, కరుణ, శాంతి, క్షమాగుణాల ప్రదర్శన వేడుక క్రిస్మస్ పండుగ










