Telugu Opinion Specials

ప్రజాస్వామ్యం.. మనం కోరుకున్నది ఏంటి? జరుగుతున్నది ఏంటి?

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకోసారి ఓటు వేయడం, గెలిచిన నాయకులు కుర్చీల్లో కూర్చోవడం మాత్రమే కాదు. సామాన్య ప్రజల గొంతుకకు విలువ ఉండటం, వారి సమస్యలు తీరేలా పారదర్శకంగా పాలన సాగడమే నిజమైన ప్రజాస్వామ్యం. కానీ, ప్రస్తుత రాజకీయాలను, ప్రభుత్వాల తీరును చూస్తుంటే… మనం అనుకున్న ప్రజాస్వామ్యానికి, ఇప్పుడు నడుస్తున్న పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. అసలు మన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం మాత్రమే కాదు

ముఖ్యంగా, ప్రజల కోసం మంచి చట్టాలు చేయాల్సిన శాసనసభలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. ప్రజా సమస్యలపై గంటల తరబడి చర్చలు జరగాల్సిన చోట, నాయకుల తిట్లు, కేకలు, ఒకరిపై ఒకరు చేసుకునే వ్యక్తిగత విమర్శలే ఎక్కువైపోయాయి. చట్ట సభలు ముగిసే చివరి నిమిషాల్లో ఎలాంటి చర్చ లేకుండానే ముక్యమైన బిల్లులను పాస్ చేసేస్తున్నారు. నాయకులు తమ జీతాలు, సౌకర్యాల గురించి పట్టుబట్టినట్లుగా… ప్రజల సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపకపోవడం విచారకరం.

గ్రామ స్వరాజ్యమే ప్రజాస్వామ్యానికి పునాది

మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఊరూరా విస్తరించేందుకు 1957లోనే బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ (మూడంచెల) వ్యవస్థను ప్రతిపాదించింది. ఆ తర్వాత ఎస్.కే. డే, రాజీవ్ గాంధీ వంటి నాయకుల కృషి వల్ల పల్లెలకు స్వయం పాలన లభించింది. “మా ఊరికి మేమే రాజులం, మా రోడ్లు, మా ఆసుపత్రులు, మా ఊరి నీటి వసతులు మేమే చూసుకుంటాం” అని పల్లె ప్రజలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా పాలన నేరుగా ప్రజల ఇంటి ముందరికే వచ్చింది.

రాజకీయ జోక్యంతో స్థానిక సంస్థల స్వేచ్ఛకు దెబ్బ

కానీ కాలం మారేసరికి, ఆ గ్రామ స్వరాజ్య స్ఫూర్తి దెబ్బతిన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక సంస్థల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. దాంతో పంచాయతీలు, మండల స్థాయి పాలన కూడా రాజకీయ పార్టీల కొట్లాటలకు కేంద్రాలుగా మారిపోయాయి. ఊరి అభివృద్ధి కంటే తమ రాజకీయ లబ్ధి, సొంత ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో నాయకులు వ్యవహరించడంతో.. స్థానిక సంస్థలు తమ అసలైన అధికారాన్ని, స్వేచ్ఛను కోల్పోయాయి.

స్థానిక ఎన్నికల వేళ ప్రజలు ఆలోచించాల్సిన సమయం

స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు దాటుతున్నా, మనం ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు వెళ్తున్నాం కానీ… ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనైనా ప్రజలు, నాయకులు ఆలోచించాలి. ఎన్నికలు అంటే కేవలం ప్రచారాలు, ఓట్లు కొనుక్కోవడాలు కావు. కింది స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని, ప్రజల వద్దకే నిజమైన పాలనను తేవడమే మన ముందున్న అసలైన లక్ష్యం.

Show More
Back to top button