CINEMATelugu Cinema

తెలుగు నాటకరంగానికి అసమాన ఖ్యాతి తెచ్చిన నటులు. యడవల్లి సూర్యనారాయణ.

తెలుగు సినిమా రంగానికి పునాదులు వేసినది తెలుగు నాటకరంగం. తెలుగు తొలి శబ్ద చిత్రము 06 ఫిబ్రవరి 1932 నాడు విడుదలైన “భక్తప్రహ్లాద” ను హెచ్.ఎం.రెడ్డి తెరకెక్కించినప్పుడు నటీనటులు దొరకడం కష్టమైపోయింది. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని ప్రదర్శిస్తున్న సురభి నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, అదే కథతో సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకుని సినిమాను తెరకెక్కించారు. సినిమాలు వచ్చిన కొత్తలో వాటిని ప్రేక్షకులు చూడకుండా నాటకాలకే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు.

ప్రతాపరుద్రీయం, లవకుశ, బొబ్బిలి యుద్ధము, గయోపాఖ్యానం, పాండవ ఉద్యోగ విజయము, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ రాయబారం, సత్యహరిశ్చంద్రీయము మొదలగు నాటకాలు ప్రదర్శించే ఆ కాలంలో అద్దంకి శ్రీరామమూర్తి, ఉప్పులూరి సంజీవరావు, ఆరాధ్యుల వెంకట సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, కపిలవాయి రామనాథశాస్త్రి లాంటి ప్రముఖ నటులు నాటక ప్రదర్శన చేస్తుండేవారు. అలాంటి రంగస్థల నటులలో ప్రముఖులు యడవల్లి సూర్యనారాయణ. 

యడవల్లి సూర్యనారాయణ ప్రముఖ తెలుగు రంగస్థల నటులు, తొలితరం తెలుగు సినిమా నటులు, మైలవరం బాలభారతీ నాటక సమాజంలో నాయక పాత్రధారి. 1912 వ సంవత్సరంలో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకులు. 1913 వ సంవత్సరంలో విజయవాడలో “గయోపాఖ్యానం” పంచమాంకం నాటక ప్రదర్శన పోటీలలో అర్జునుడు పాత్రకు ద్వితీయ బహుమతి గెల్చుకుని మైలవరం రాజా దృష్టిని ఆకర్శించి, ఆ రాజా వారి ఆహ్వానం మేరకు బాల భారతీ నాటక సంఘం (మైలవరం కంపెనీ) లో చేరి, అది మైలవరం నుండి విజయవాడకు మారిన తరువాత అందులో ఆయన కథానాయకుడిగా చేరారు. అక్కడ ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసి పనిచేశారు. నాటకాలలో యముడు, సత్యవంతుడు, శ్రీ కృష్ణుడు (తులాభారం), అర్జునుడు (గయోపాఖ్యానం), సారంగధరుడు, దుర్యోధనుడు, వత్సరాజు, దుష్యంతుడు, పృథ్వీరాజు, విజయరామరాజు, నలుడు, శ్రీరాముడు, రామదాసు మొదలగు పాత్రలు పోషించారు.

యడవల్లి సూర్యనారాయణ మంచి నాటక లక్షణ పండితులు. దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీలలో గొప్ప నిష్ణాతులు. నాటకాలలో అనేక మంది యువ నటులను తీరచిదిద్దిన నాట్యాచార్యుడు. ఈయన సత్యవంతుడు, దుష్యంతుడు, దుర్యోధనుడు పాత్రలు ధరిస్తున్నాడంటే నాటుగు రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడుపోయేవి. నటుడి సామర్ధ్యానికి గీటురాయిగా పరిణమించిన మయసభలో దుర్యోధనుని దృశ్యం ఈయన ఏరికోరి వ్రాయించుకున్నదే. సత్యవంతుడిగా “పోయేనయ్యో ననుబాసి…” మొదలయిన పాటలు ఆనాటి శ్రోతల చెవులలో నేటికీ గింగురుమంటూంటాయి.

శబ్దచిత్రాలు ప్రారంభమైన తొలినాళ్లలో సినిమారంగంలో చేరి “శ్రీరామ పాదుకా పట్టాభిషేకం”, (1932), శకుంతల (1932), సీతాకళ్యాణం, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) చిత్రాలలో నటించారు. వెండితెర తొలి రాముడు, తొలి ధుర్యోధనుడు, తొలి దుష్యంతుడు ఈయనే. ధనవంతుల కుటుంబంలో పుట్టి, ధనవంతులుగానే జీవించి, గౌరవప్రదమైన పాత్రను పోషించి, గౌరవప్రదంగానే ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఆయన జీవించిన 52 సంవత్సరాలలో 35 సంవత్సరాల పైగా నాటక రంగంపైనే జీవితం గడిపారు. నటనే జీవితంగా భావించడమే కాక వృత్తిగా స్వీకరించి, నటులకు అసమాన గౌరవం తెచ్చిపెట్టిన కళారాధకులు యడవల్లి సూర్యనారాయణ.

నేపథ్యం…

యడవల్లి సూర్యనారాయణ 1888 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో సంపన్నుల కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి మెట్రిక్యులేషన్ వరకు గుంటూరులోనే చదువుకోవడం వలన ఆయనకు ఆంగ్లములో అభినివేశం ఏర్పడింది. పండితవంశంలో జన్మించడం వలన ఆయన సంస్కృతాంధ్ర విషయాలలో పట్టుసాధించారు. విద్యార్థి దశలోనే మృదుమధురంగా పాడుతూ, విద్యార్థి సోదరులను ఆకర్షించగలిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి హైస్కూల్ అయ్యే వరకు కూడా గుంటూరులోనే చదువుకున్నారు ఆయన చదువుకుంటున్న ఆ విద్యార్థి దశలో ఉండగానే పద్యాలు బ్రహ్మాండంగా పాడడం వలన తోటి విద్యార్థులు ఆయనను ఒక కథానాయకుడిని చూసినట్లు చూసేవారు.

గుంటూరులో 1910 సంవత్సరంలో ప్రాంతంలో హరిప్రసాదరావు మరియు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కలిసి సంయుక్తంగా “హిందూ నాటక సమాజం” స్థాపించారు. దానిని ఫస్ట్ కంపెనీ అనేవారు. అంటే ప్రధాన పట్టణాలు అయిన బందరు, తెనాలి, గుంటూరు, రాజమండ్రి లలో అప్పుడప్పుడే మొట్టమొదటిగా ప్రారంభించిన నాటక సమాజాలను ఫస్ట్ కంపెనీ అని పిలుస్తుండేవారు. అలాంటి ఫస్ట్ కంపెనీగా పేరున్న “హిందూ నాటక సమాజం” ను హరిప్రసాదరావు మరియు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నిర్వహిస్తూ ప్రదర్శించే అద్భుతమైన నాటకాలకు యడవల్లి సూర్యనారాయణ హాజరవుతూ ఉండేవారు.

స్వయంకృషితో నటన నేర్చుకుని…

విద్యార్థి దశలోనే ఉన్న యడవల్లి సూర్యనారాయణకు నాటకాలు అంటే ఉన్న అభిమానం వలన, నాటకాలలో హరిప్రసాద రావు యొక్క నటన, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి పద్యాలు పాడే విధానాన్ని అతి దగ్గరగా ఉండి సునిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. ఎక్కడైనా నాటకం ప్రదర్శన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లి నటులు చెప్పే పద్యాలకు వీక్షకులు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? ఎందుకు వన్స్ మోర్ లు చెబుతున్నారు అని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారు. ఆ తరువాత వారు పాడిన పద్యాల గ్రామ్ ఫోన్ రికార్డులను తెప్పించుకొని, వాళ్ళు పాడిన రాగాలను విపరీతంగా సాధన చేసి, ఆయన నటుడయ్యాక వాటిని నాటకాలలో వాడుకునేవారు. నిజానికి యడవల్లి సూర్యనారాయణ నటన గురించి, పద్యాలు పాడడం గురించి ఎవ్వరి దగ్గరా నేర్చుకోలేదు. ఎవ్వరి దగ్గరకైనా వెళ్లి నెలల తరబడి, సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకున్నది లేదు. సంస్కృతం చదువుకొని, సంస్కృత కావ్యాలను అవపోసన పట్టడం వలన పద్యాలు పాడడం ఆయన స్వయంకృషి అనే చెప్పాలి. స్వయంకృషితో ఆయన నటనను చూసి నేర్చుకున్నారు.

“అమెచ్యూర్ నాటక సంస్థను స్థాపించి”…

ఉన్నత పాఠశాల చదువు అయిపోయే సమయానికి గుంటూరులో ఫస్ట్ కంపెనీ, రెండో కంపెనీ అని రెండు నాటక కంపెనీలు ఉండేవి. ఈ రెండు నాటక కంపెనీలలో కూడా పోటాపోటీగా నాటకాలు ప్రదర్శింపబడేవి. ఫస్ట్ కంపెనీకి చెందిన హర ప్రసాద రావుని ఆదర్శంగా తీసుకొని ఆయన వలే నటించాలని అనుకుని “అమ్మెచ్యూర్ క్లబ్” ని స్థాపించి, కొంతమంది ఔత్సాహిక కళాకారులను పోగేసి నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు యడవల్లి సూర్యనారాయణ. ఆంధ్ర రత్నగా పేరున్న “దుగ్గిరాల గోపాలకృష్ణయ్య”, వంగర ఆంజనేయులు, బెల్లంకొండ నరసింహ లాంటి వాళ్ళందరూ అమెచ్యూర్ నాటక సంస్థ తరుపున నాటకాలు వేసేవారు. వారు “బొబ్బిలి యుద్ధం”, “ప్రసన్న యాదవం”, “గయోపాఖ్యానం” లాంటి నాటకాలలో నటిస్తూ ఉండేవారు. “ప్రసన్న యాదవం” నాటకంలో అర్జునుడిగా పాత్ర పోషిస్తూ ఉండే యడవల్లి సూర్యనారాయణ, “గయోపాఖ్యానం” నాటకంలో కృష్ణుడిగా, “బొబ్బిలి యుద్ధం” లో విజయరామరాజుగా పాత్రలు పోషించేవారు. ఆ రోజులలో అమెచ్యూర్ నాటక సంస్థ తరుపున నాటక పోటీలు నిర్వహిస్తే “గయోపాఖ్యానం” నాటకంలో అర్జునుడి పాత్రకు అద్భుతంగా పోషించినందుకు యడవల్లి సూర్యనారాయణ బహుమతి అందుకున్నారు.

“బాల భారతీ” నాటక సమాజంలో చేరి…

యడవెల్లి సూర్యనారాయణ కథానాయకుడిగా, కడియం రత్తయ్య కథానాయయికగా వేసిన నాటకాలు తమిళ, కన్నడ ప్రాంతాలలో దిగ్విజయంగా ప్రదర్శించబడ్డాయి. ఎక్కడికి వెళ్లినా స్వర్ణ పతకాలు, సువర్ణ పతకాలు బహుమతిగా వస్తూండేవి. ఈ జంటకు ఆ రోజులలో అంత అఖండ కీర్తి లభించేది. నాటకాలలో యడవల్లి సూర్యనారాయణ కథానాయకుడిగా, కడియాల రత్తయ్య కథానాయకిగా నాటకాలలో పాత్రలు పోషించేవారు. వారిద్దరూ నాటకంలో నటిస్తున్నారు అని తెలిస్తే చాలు, నాటకం ప్రారంభం అవ్వడానికి వారం రోజుల ముందే టికెట్లు అమ్ముడైపోయేవి.

ఇలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న సమయంలోనే సూరపనేని వెంకట పాపయ్య కోరిక మేరకు “బాల భారతి నాటక సమాజం” లో చేరిపోయారు. ఇందులో యడవల్లి సూర్యనారాయణ, అద్దంకి శ్రీరామమూర్తి (స్త్రీ పాత్రధారణ కోసం), ఉప్పలూరి సంజీవరావు, వరజనాయుడుగా పేరుప్రఖ్యాతులు గాంచిన గూడపాటి నరసింహనాయుడు మొదలగు వారు అందరూ కూడా ఈ నాటక సమాజంలో చేరి నాటకాలలో నటిస్తూ ఉండేవారు. మైలవరం కంపెనీగా ప్రసిద్ధిచెందిన “బాల భారతి” నాటక సమాజాన్ని విజయవాడ దగ్గరలో ఉన్న మైలవరం గ్రామానికి చెందిన జమిందారు సూరపనేని వెంకట పాపయ్య స్థాపించారు.

రంగస్థలం నటీనటులను ప్రోత్సహించే సూరపనేని వెంకట పాపయ్య, నాటకరంగంలో పేరున్న నటీనటులందరినీ కూడా తన “బాల భారతీ” నాటక సమాజంలోకి చేర్చుకుని, నాటక ప్రదర్శన జరిగినా, జరగకపోయినా నటీనటులకు నెలనెలా పారితోషికం ఇస్తూ ఉండేవారు. అందువలన పేరున్న నటీనటులు అందరు ఆయన స్థాపించి, నిర్వహిస్తున్న “బాలభారత నాటక సంఘం” లో చేరడానికి ఉత్సాహపడుతూ ఉండేవారు. ఈ నాటక సమాజం తరపున “శాకుంతలం”, “సారంగధర”, “హరిశ్చంద్ర”, “ద్రౌపది వస్త్రాపహరణం” లాంటి సుమారు 30 నాటకాలను ప్రదర్శిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలను తిరిగి పేరు తెచ్చుకున్నారు యడవల్లి సూర్యనారాయణ.

సంస్కృత శ్లోకాలను చీల్చి అర్థవంతరంగా చదివి…

రంగస్థలంపై యడవల్లి సూర్యనారాయణ నటించిన పాత్రల గురించి చెప్పాలంటే, ఆయన “శ్రీరామ పాదుకాపట్టాభిషేకం” లో రాముడు గానూ, “చిత్రనళినీయం” లో నలుడు మరియు బహుడు గానూ, “సతీసావిత్రి” లో సత్యవంతుడుగా, “పాండవోద్యోగ విజయం” లో దుర్యోధనుడిగా పాత్రలు పోషిస్తూ ఉండేవారు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన “శకుంతల” నాటకంలో దుష్యంతుని పాత్ర పోషించేవారు యడవల్లి సూర్యనారాయణ. నిజానికి “శకుంతల” నాటకం అనేది తెలుగు నాటకమే అయినప్పటికీ మూల సంస్కృత నాటకంలోని శ్లోకాలను చీల్చి వాటిని అర్థవంతరంగా చదివినప్పుడు ప్రేక్షకులు పరవశించిపోయేవారు. 

ఇలా అర్థవంతరంగా చదవడం వలన “శకుంతల” నాటకం యడవల్లి సూర్యనారాయణకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆయన పద్య పఠనం గురించి చెప్పాలంటే ఆయన స్పష్టమైన ఉచ్ఛారణతో, భావయుక్తంగా పద్యం చెప్పడం, ఎంత కష్ట సమాసాలనైనా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా పదవిభజన చేసి పాడడం ఆయన ప్రత్యేకత. యడవల్లి సూర్యనారాయణ నాటకరంగం మీద నటిస్తూవుంటే తెలుగు మాస్టారు తెలుగు పాఠం చెబుతున్నట్టుగా ఉండేదట. ఈయన వద్దనే కపిలవాయి రామనాథ శాస్త్రి పద్యాలు పాడడం నేర్చుకున్నారు. గుంటూరులో ఫస్ట్ కంపెనీకి చెందిన హరి ప్రసాద రావు మరణానంతరం, ఆయన నటించాల్సిన పాత్రలన్నీ కూడా యడవల్లి సూర్యనారాయణ నటించేవారు.

సినిమా రంగం..

యడవల్లి సూర్యనారాయణ నాటకరంగంలో ఏకఛత్రాధిపత్యంగా ప్రధాన పాత్రలు పోషిస్తూ విశిష్టమైన పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న రోజులలో ఆయనకు సినిమా రంగం ఎఱ్ఱ తివాచీ పరిచింది. మాటలు నేర్చిన తెలుగు సినిమా మొట్టమొదటి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” చిత్ర నిర్మాణం చూసి, బాకురపండ వెంకట్రావుకు కూడా సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. నిజానికి బాకురపండ వెంకట్రావు మంచి గాయకుడు, మంచి నటుడు, మంచి హార్మోనిస్ట్ కూడా. ఆయన తన నాటకాలకు తానే సంగీత బాణీలు కట్టుకుంటూ ఉండేవారు. ఆయన నాటక సమాజాన్ని నడిపారు, నాటకాలలో కొన్ని పాత్రలు పోషించారు, తన పర్యవేక్షణలో కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలాంటి బాకురపండ వెంకట్రావుకు సినిమా తీయాలనే ఆలోచన వచ్చి తనకు తెలిసిన నటీనటులందరినీ తీసుకొని బొంబాయి వెళ్లి “సాగర్ మూవీటోన్” తో కలిపి రెండవ తెలుగు టాకీ చిత్రంగా “శ్రీరామ పాదుక పట్టాభిషేకం” (1932) అనే సినిమాను నిర్మాణం చేశారు. సర్వోత్తం బాదామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ శ్రీరామునిగా నటించారు. అందులో సీతగా సురభి కమలాబాయి నటించగా, బాకురపండ వెంకట్రావు భరతుడిగా నటించారు. ఈ చిత్రం తోనే ప్రముఖ రంగస్థలం నటి దాసరి రామతిలకం వెండితెరకు పరిచయమయ్యారు.

తెలుగు సినిమా మొదటి శ్రీరాముడిగా…

రామాయణం ఆధారంగా నిర్మించిన మొదటి తెలుగు చిత్రంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషించిన మొదటి నటుడిగా యడవల్లి సూర్యనారాయణ మరియు తెలుగు సినిమాలో సీతగా నటించిన మొదటి నటిగా సురభి కమలాబాయి ప్రసిద్ధిచెందారు. శ్రీరామ పాదుక పట్టాభిషేకం 24 డిసెంబరు 1932 నాడు మద్రాసులోని కినిమా థియేటర్‌లో ప్రదర్శించబడింది. ఆ తరువాత 1933లో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ (అప్పటి బెజవాడ) లోని దుర్గా కళా మందిర్‌లో విడుదలైంది. ఈ సినిమా వాణిజ్యపరంగా పెద్దగా లాభాలు తీసుకురాలేదు.

బాకురపండ వెంకట్రావు తన ద్వితీయ సినిమాగా శకుంతల (1932) చిత్ర నిర్మాణం ప్రారంభించారు. సాగర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో సురభి కమలాబాయి, యడవల్లి సూర్యనారాయణ ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించారు. ఈ “శకుంతల” చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ దుష్యంతుడి పాత్ర పోషించగా, శకుంతల గా సురభి కమలాబాయి నటించారు. వెండితెరపై మొదటి దుష్యంతుడు కూడా యడవల్లి సూర్యనారాయణే. ప్రసిద్ధమైన కాళిదాసు రచన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరామ పట్టాభిషేకం సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించగా, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా అకట్టుకోలేదు.

నాటకాలలో గొప్ప “ప్రదర్శక నిప్పుణులు” గా పేరు.. 

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు నాటకాలలో కూడా తన సత్తా చాటుతున్న యడవల్లి సూర్యనారాయణ తన రెండవ సినిమా శకుంతల (1932) తరువాత ఏలూరు జమీందారు మోతే నారాయణరావు నిర్వహిస్తున్న సీతారామాంజనేయ నాటక సమాజంలో కూడా కొన్ని పాత్రలు ధరించారు. ఆ తరువాత యాదవెల్లి సూర్యనారాయణ సొంతంగా “దుర్గా అమెచ్యూర్” అనే నాటక సమాజాన్ని స్థాపించి, దేశం నలుమూలల ప్రదర్శనలు ఇచ్చి ప్రజల యొక్క అభిమానాలను, వారి మన్ననలను పొందుతూ వచ్చారు. యడవల్లి సూర్యనారాయణ నాటకంలో నటిస్తున్నారనే విషయం తెలిస్తే చాలు కోయంబత్తూరు, మద్రాసు, బరంపురం, హైదరాబాదు మరియు పలుప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లలో వచ్చిన ఆయన అభిమానులు, ఆయన ప్రదర్శించే నాటకాలను తిలకిస్తూ ఉండేవారు. నిజానికి యడవల్లి సూర్యనారాయణ కంటే గొప్ప సాత్వికాభినయం చేసేవారు, ఆయన కన్నా గొప్ప విద్వాంసులు, ఆయనకంటే గొప్ప నటులు ఎందరో ఉన్నారు. కానీ ఈ లక్షణాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని అద్భుతంగా నాటకాన్ని ప్రదర్శించే కళను అపోసన పట్టిన నటులు యడవల్లి సూర్యనారాయణ. అందుకే ఆయనను ప్రదర్శక నిప్పుణులు అంటారు మొదలి నాగభూషణ శర్మ.

వెండితెర తొలి దుర్యోధనుడుగా “ద్రౌపది వస్త్రాపహరణం”..

ఈ విధంగా యడవల్లి సూర్యనారాయణ నాటకాలలో కొనసాగుతూ ఉండగానే హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన “ద్రౌపది వస్త్రాపహరణం” (1936) సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో శ్రీకృష్ణుడిగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, ధర్మరాజుగా చొప్పల్లి సూర్యనారాయణ, భీముడుగా దొమ్మేటి సూర్య నారాయణ రావు, శిశుపాలుడుగా వేమూరి గగ్గయ్య నటిస్తే దుర్యోధనుడుగా యడవల్లి సూర్యనారాయణ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి, 1936లో విడుదలైంది. ఆ తరువాత నెలలో “ద్రౌపది వస్త్రాపహరణం” సినిమాను ఢిల్లీలో గవర్నర్ జనరల్ “సర్ఫ్ ఫ్రాంక్ వైస్”, మరియు 60 మంది ఇతర సభ్యుల సమక్షంలో ప్రదర్శించారు. యడవల్లి సూర్యనారాయణకు దక్కిన గౌరవాలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఢిల్లీలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి తెలుగు చలనచిత్రం “ద్రౌపదివస్త్రాపహరణం”. దాంట్లో దుర్యోధనుడుగా నటించిన యడవెల్లి సూర్యనారాయణ వెండితెర తొలి దుర్యోధనుడుగా పేరు గడించారు.

స్వర్గారోహణం…

యడవల్లి సూర్యనారాయణ చిత్రరంగ ప్రవేశం చేసేనాటికి ఆయన వయస్సు సుమారు 40 సంవత్సరాలు. ఆనాటి నుండి వరుసగా నాలుగు సంవత్సరాలు సినిమాలలో కొనసాగి పాదుకా పట్టాభిషేకం (1932), శకుంతల (1932), సీతాకళ్యాణం, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) సినిమాలలో నటించారు. ఆ తరువాత కూడా సినిమాలలో నటించడానికి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ రోజులలో ఆయన నాటకాలకే అంకితమైపోయారు. అప్పట్లో నటినటులను చాలామంది సినిమాలు కంటే కూడా నాటక ప్రదర్శన వైపే మొగ్గు చూపుతూ ఉండేవారు. యడవల్లి సూర్యనారాయణకు నాటకాలలో కంటే సినిమాలలో అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉన్నప్పటికీ ఆయన నాటకాల మీద దృష్టి కేంద్రీకరించడం వలన “ద్రౌపది వస్త్రాపహరణం” (1936) తరువాత ఆయన నటించిన సినిమాలేవి విడుదల కాలేదు. నాటకాలలో కొనసాగుతూనే 1939 వ సంవత్సరంలో స్వర్గారోహణం పొందారు. అప్పటి ఆయుర్ధాయం ప్రకారం పిన్న వయస్సులో 52 సంవత్సరాలకే యడవల్లి సూర్యనారాయణ మరణించడంతో దశాబ్దాల పాటు ఆయన సినిమాలను చూసే అదృష్టాన్ని ప్రేక్షకులు నోచుకోలేదు.

Show More
Back to top button