Telugu News

ప్రేమ అనేది ఒక మానసిక రోగమా? మూర్ఖులే ప్రేమిస్తారా?

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నారు ఆచార్య ఆత్రేయ అభినందన (1988) చిత్రంలో. ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ “ఆకర్షణ”, “అవగాహన”, “తాదాత్మ్యత”, “స్పర్శ”, “కామం”, “ఓదార్పు” అన్నారు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ప్రేమంటే అగ్ని అని తెలుసు, అయినా మళ్ళీ ముద్దెట్టుకున్నాను, ప్రేమంటే విషమనీ తెలుసు, అయినా మరో గుక్కెడు అడిగాను అన్నారు రచయిత “అమృతాప్రీతం”. అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమంటే ఒక బలమైన సానుకూల మానసిక, భావోద్వేగపు స్థితి.

ప్రేమ అనేది మనుషుల మధ్య ఉన్న లోతైన ఆప్యాయత. ఇది వేర్వేరు స్థాయిల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. కుటుంబ ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఏ ఆకర్షణా లేని స్వచ్ఛమైన ప్రేమ (ప్లేటోనిక్ లవ్), స్వీయ ప్రేమ, భక్తి ప్రేమ (భగవంతుడిపై ప్రేమ) ఇలా ప్రేమ పలు రకాలుగా ఉంటుంది. ఒక్కో ప్రేమ ఒకలా ఉంటుంది. ఉదాహరణకు, తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమకు, ఆహారంపై ఉన్న ప్రేమకు తేడా ఉంటుంది. ప్రేమ ఉన్నచోట బలమైన ఆకర్షణ, భావోద్వేగంతో కూడుకున్న అనుబంధం ఉంటుంది.

ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి, ప్రేమ కోసం సామ్రాజ్యాలు కూలిపోయాయి. ప్రేమ కోసం యుద్ధాలు జరిగినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, కవుల కలాల నుండి రక్తం చిందినా, దాని వెనుక ఉన్న ముఖ్య కారణం (“చోదక శక్తి”, “ప్రేరక శక్తి”) ప్రేమ అని మనం నమ్ముతుంటాం. కానీ సోక్రటీసు శిష్యులలో అగ్రగణ్యుడు ప్లేటో మాత్రం “ప్రేమ” గురించి ఒక సత్యాన్ని కుండ బద్దలు కొడుతూ “ప్రేమ అనేది ఒక మానసిక రోగం” అన్నారు.

నిజానికి ఇది వినడానికి శృంగారభావన లేని ఒక క్రూరమైన వాక్యంగా మనకు అనిపించినా, తత్వశాస్త్రవేత్త, మేధావి అనదగ్గ ప్లేటో లాంటి ఒక గొప్ప వ్యక్తి ప్రేమని ఒక మానసిక వ్యాధి అని ఎందుకు అన్నాడు? పవిత్రమైనదిగా మనం పూజించే ఒక భావోద్వేగం నిజానికి ఒక మానసిక రుగ్మత అయితే ఇప్పటివరకు బ్రతుకుతున్న ఈ జీవితం అంతా కూడా ఒక అబద్దమా? అసలు మనకు సమాజం నేర్పినటువంటి ప్రేమ అంటే ఏమిటి? ఈ అనురాగం, ఒకరికోసం ఒకరు బ్రతకడం, ఒకరి కళ్ళలో మరొకరు ప్రపంచాన్ని చూసుకోవడం ఇవన్నీ కూడా మన సినిమాల్లో చూసిన అనురాగభరితమైన నిర్వచనాలు, నవలలలో చూసి నేర్చుకునే ప్రేమపూరితమైన నిర్వచనాలు మాత్రమే. కానీ, నిజానికి ప్రేమంటే ఒక వ్యక్తిపై మనకున్న విపరీతమైన ఆధిపత్యం.

మనలో ఉన్న అభద్రతా భావాన్ని, మనలో ఉన్న అగాధమైన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొకరితో చేసుకునే ఒప్పందం మాత్రమే ఈ ప్రేమ. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే నిజానికి అవతలి వ్యక్తిని ప్రేమించడం లేదు, మనతో ఆ వ్యక్తి ఉండడం వలన మనకు కలిగే భద్రతని మాత్రమే ప్రేమిస్తున్నాము అంతే.

ప్రేమలో దశలు…

ప్రేమ అనే ఈ మానసిక వ్యాధి మనల్ని ఎలా వణికిస్తుందంటే? దీనికి కొన్ని దశలు ఉన్నాయి. మొదటి దశలో దీని “సంక్రమణ” అని పిలవచ్చు. సోకుడు సూక్ష్మజీవులు కణజాలములోకి ప్రవేశించి, అక్కడ సంఖ్యల్లో వృద్ధిచెంది, అక్కడ శోధము ఏవిధంగా అయితే కలిగిస్తామో, అదేవిధంగా ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే మన మెదడులో డోపమైన్, అడ్రినలిన్ అనే రసాయన సందేశవాహకాలు (హార్మోన్స్) అకస్మాత్తుగా పెరిగిపోతాయి. దీనినే మనం చాలా గర్వంగా స్పార్క్ అని, తొలి చూపులో ప్రేమ అని మెచ్చుకుంటాం. కానీ వైద్యపరంగా చూస్తే ఇది ఒక ఆబ్సెసివ్ స్టేట్ (ఏదైనా విషయంపై పదేపదే మతిపోగొట్టుకునేంత ఆసక్తి లేదా భయం పెంచుకోవడం). ఇక రెండవ దశలో “భ్రమ” అంటాం. వాడు లేకపోతే నేను లేను, ఆమె మాట్లాడకపోతే ఈరోజు గడవదు అనేది ఒక “స్థిరమైన భ్రమ” లేదా “సాధారణ అపోహ” (క్లాసికల్ డెల్యూషన్). ఇక్కడ తర్కం (లాజిక్) పూర్తిగా చచ్చిపోతుంది. ఒక మనిషి, మరో మనిషికి ప్రాణధారం ఎలా అవుతారు? అది కేవలం మన మెదడు సృష్టించుకున్న ఒక మాయాజాలం మాత్రమే. మూడో దశనే “వ్యసనం” అంటారు. ఒక డ్రగ్ ఎడిక్ట్ తనకు నల్లమందు (డ్రగ్) దొరక్కపోతే పిచ్చివాడు ఎలా అవుతాడో, ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా అవతలి వ్యక్తి పొందు (అడిక్షన్) దొరక్కపోతే అలాగే విలవిలలాడిపోతాడు.

క్షీనత దశ…

ప్రేమలో నాలుగవ దశ “క్షీణత”. అవతల వ్యక్తితో అడిక్షన్ తగ్గినా, లేక ఆ వ్యక్తి దూరమైనా మనం పవిత్రం అని పిలుచుకున్న విపరీతమైన ప్రేమ వెంటనే ద్వేషంగా, పగగా మారిపోతుంది. అంటే ప్రేమ అనేది అవతలి వ్యక్తి మనకు ఇచ్చే విలువ మీద ఆధారపడి ఉందన్నమాట. నిజానికి ఇదంతా ఒక పెద్ద వ్యంగ్యం అని చెప్పవచ్చు. ఒక పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి తనకు కనబడిన చెట్టుతోనే, లేక గోడతోనో మాట్లాడుతుంటే మనం అతన్ని చూసి జాలి పడతాం, పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని అనుకుంటాం. కానీ అదే ఒక వ్యక్తి తన ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ, అవతలి వ్యక్తి పంపే ఒక ఎమోజిని చూస్తూ గంటలు గంటలు మురిసిపోతూ ఉంటే దానిని మనం క్యూట్ అంటాం. అర్థరాత్రి రెండు గంటల వరకు నిద్ర మానుకొని తిన్నావా, పడుకున్నావా అని మాట్లాడడం ప్రేమ ఎలా అవుతుంది? కచ్చితంగా అది నిద్రలేమి వ్యాధి లక్షణమే కదా.

ప్రేమ అనే పేరు మీద అంగడిలో వేల కోట్ల వ్యాపారం నడుస్తుంది. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి డైమండ్ రింగ్స్ వరకు సినిమాల నుండి డేటింగ్ యాప్స్ వరకు అంతా కూడా ఈ ప్రేమ అనే మానసిక వ్యాధి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాయి. సమాజం చెప్పే ప్రేమ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సామాజిక అనుగుణ్యత (సోషల్ కన్ఫర్మిటీ). అంటే అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, అందుకని ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి నేను కూడా ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి అనే భయమే ఇందుకు నిదర్శనం. మన వంచన (కపటత్వం) ఏ స్థాయిలో ఉంటుందంటే, మనం ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్లు మనకు నచ్చినట్లు ఉండాలని కోరుకుంటాం. వాళ్లు మనల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళితే భరించలేం. అంటే మనకు కావలసింది అవతలి వ్యక్తి సంతోషం కాదు, మన అహానికి కలిగే తృప్తి.

జబ్బు లేదని వైద్యుడి దగ్గర రోగి వాదించినట్టు..

స్వతహాగా మనిషి అత్యంత స్వార్థపరుడు. నిజానికి మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్లలో ఉన్న మనల్ని మనం ప్రేమిస్తున్నాం. అంటే మన అవసరాన్ని తీర్చే ఒక అద్దం కోసం మనం తాపత్రయపడడమే ప్రేమ. తత్వశాస్త్రపరంగా (ఫిలాసఫికల్లి) చూస్తే మానవ ఉనికి అనేది ఎంతో శూన్యమైనది. ఆ శూన్యాన్ని నింపుకోవడానికి రకరకాల వ్యసనాలకు మనం వెతుక్కుంటూ ఉంటాము. అధికారం ఒకరికి వ్యసనమయితే, మరొకరికి డబ్బు వ్యసనమయితే, అత్యధిక శాతం ప్రజలకు ఈ ప్రేమ అనేది ఒక వ్యసనం. ఈ మాటలు వినడానికి కొన్నిసార్లు నవ్వు తెప్పించొచ్చు. మా ప్రేమ చాలా గొప్పది, మా భాగస్వామికి మాకు మధ్య ఉన్నది గొప్ప అనుబంధం, విడదీయరాని ఋణబంధం అని మిమ్మల్ని మీరు సర్దిచెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ వ్యాఖ్యలు ఎలా వుంటాయంటే “ఒక రోగి తనకు జబ్బు లేదు అని ఒక వైద్యుడి దగ్గర వాదించినట్టు” ఉంటుంది.

మీ భావోద్వేగాల మీద మీకు నియంత్రణ లేనప్పుడు అవతల వ్యక్తి ప్రవర్తన మీద మీ సంతోషం ఆధారపడి ఉన్నప్పుడు ప్రేమ అని పిలవడం ఒక సాకు మాత్రమే. అది ఒక బానిసత్వం కూడా. ఈ విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ మెదడులో జరుగుతున్న రసాయనిక లోచాన్ని మీరు ఆధ్యాత్మికత అనుకుంటూ మీరు భ్రమ పడుతున్నారు. సమాజం భ్రమను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే నిజం తెలిస్తే మనుషులు విచ్చలవిడిగా మారిపోతారు అని, ఈ వ్యవస్థలు కూలిపోతాయని భయం. నిజానికి మనం పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ఒంటరి వాళ్ళమే. ఈ నిజాన్ని అంగీకరించలేక మనం తోడు కోసం పరితపిస్తూ, ఆ తోడు దొరకగానే దాని ప్రేమ అనే చీటి వేసి పండగ చేసుకుంటాం. కానీ ఆ రంగు కొద్దికొద్దిగా వెలిసిపోతుంటే, అప్పుడు మొదలవుతుంది అసలు నరకం. గొడవలు, అనుమానాలు, ఆధిపత్య పోరాటాలు. అయినా సరే మనం దానిని వదిలిపెట్టం. ఎందుకంటే మనకు నిశ్శబ్దం అంటే భయం, ఒంటరితనం అంటే వణుకు. ఆ భయం నుండి పుట్టిందే ఈ అనుబంధం, ప్రేమ అనే నాటకీయత. 

ప్రేమ అనే సామూహిక పిచ్చిలో మీరు ఒక భాగమే…

తత్వవేత్త ప్లేటో అన్నట్టు ప్రేమ అనేది ఒక తీవ్రమైన మానసిక రోగం మాత్రమే కాదు, అది ఒక సామూహిక పిచ్చి కూడా. అయితే ఒకరు చేస్తే పిచ్చి అంటారు, కానీ అందరూ కలిసి చేస్తే అదే ఒక సంప్రదాయం అవుతుంది. చివరికి తేలింది ఏమిటంటే మనిషి చేసే ప్రతీ పని వెనక ఉన్నది తన ఉనికిని కాపాడుకోవాలని ఒక తపన మాత్రమే. ఈ అనంతమైన విశ్వంలో మనం చాలా అల్పమైన వాళ్ళమనే సత్యాన్ని మర్చిపోవడానికి మనకు ఒక మత్తు కావాల్సి ఉంటుంది. ఆ మత్తు పేరు “ప్రేమ”. అది ఒక రోగం కాకపోతే ఈ ప్రపంచంలో ఇన్ని విరిగిన హృదయాలు ఎందుకుంటాయి? ప్రేమ పేరుతో ఇన్ని ఆత్మహత్యలు, హత్యలు ఎందుకు జరుగుతాయి? పవిత్రమైన చోట హింస ఉండదు, కానీ ప్రేమలో హింస అంతర్లీనంగా ఉంటుంది.

మనిషి దేనికోసం వెతుకుతున్నాడో అది శాంతి కాదు. అది కేవలం తన ఒంటరితనాన్ని చంపడానికి తన అభద్రత భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెతుక్కునే ఒక భయంకరమైన మానసిక వ్యాధి ప్రేమ. మీరు ప్రేమిస్తున్నానని అనుకున్న ప్రతీసారి మీకు మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి. ప్రేమిస్తున్నవాడు ప్రేమికుడు కాదు. ఒక రోగి తనకు తాను మందు వేసుకోలేక, ఇంకొకరిని తన మందుగా వాడుకోవాలి అనుకొని చూస్తున్న ఒక అసక్తుడు. ఇదంతా గమనిస్తే గనుక తత్వవేత్త ప్లేటో చెప్పింది అక్షర సత్యం అని అనిపిస్తుంది. ప్రేమ అని మనం పిలుచుకుంటున్న ఈ మాయాజాలం ఒక గంభీరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి నుండి బయటపడడం అంత సులభం కాదు. రోగికి తనను తాను రోగి అని పిలిచినప్పుడే తనకు నిజమైన చికిత్స మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రపంచమంతా ఆ రోగంలోనే మునిగి తేలుతుంది. కాబట్టి ఈ సామూహిక పిచ్చిలో మీరు ఒక భాగమే.

భయానికి మనం పెట్టిన పేరే ప్రేమ…

నిజానికి ప్రేమ అనేది ఒక సహజమైన అనుభూతి అని మనం అనుకుంటాం. కానీ అది ఒక సామూహిక కార్యక్రమం. చిన్నప్పటినుండి మనం విన్న కథలు, చూసే పరిసరాలు అన్నీ ఒక నిర్దిష్టమైన రీతిలో ఆలోచించేలా చేస్తాయి. ఈవిధంగా జరిగే అనుక్రమణలో భాగమే ఈ ప్రేమ. నిజానికి ఒక మనిషికి కావాల్సింది ఒక గుర్తింపు. ఆ గుర్తింపు అనేది ఇంకొకరి కళ్ళలో వెతుకుతున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. కానీ ఆ గుర్తింపు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి కూడా తన గుర్తింపు కోసం నీ దగ్గరకు వచ్చాడు. అంటే ఇద్దరు యాచకులు ఒకరినొకరు ధనవంతులు ఆడుకోవడం అనుకోవడం ఎంత నవ్వు తెప్పిస్తుందో, ఇద్దరి అభద్రతా భావంతో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తున్నామని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఈ నిజాన్ని అంగీకరించడానికి మనకు చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకనే మనం కవితలు వ్రాసుకుంటాం, పాటలు పాడుకుంటాం.

కానీ మనందరికీ తెలుసిన విషయం ఏమిటంటే ఇదంతా ఒక పెద్ద అబద్ధం అని. ఆ అబద్దాన్ని మనం ఎంత అందంగా అలంకరిస్తే అది అంత గొప్ప ప్రేమగా చలామణి అవుతుంది. అందుకనే తత్వవేత్త ప్లేటో మాటలను మనం తక్కువగా అంచనా వేయలేము. మనుషుల మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేసి చెప్పిన మాట అది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి, ఆ వ్యాధికి లోనైన ప్రతీ ఒక్కరు ఒక మాయజాలంలో బతుకుతుంటారు. ఆ లోకం నుండి బయటకు రావడం అంటే వాస్తవాన్ని ఎదుర్కోవడం. వాస్తవం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమిస్తాం, ప్రేమ అనే పిచ్చిని ఆరాధిస్తాం. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. చివరగా మీరు ఎప్పటి నుంచి ప్రేమ కోసం వెతుకుతున్నారో గుర్తు తెచ్చుకోండి. ప్రేమ అనేది మీరు పుట్టినప్పటి నుంచి కాదు, మీ గురించి మీరు భయపడడం మొదలుపెట్టినప్పటి నుంచి మొదలైంది. ఆ భయానికి మనం పెట్టిన పేరే ప్రేమ. ఆ ప్రేమనే తీవ్రమైన మానసిక వ్యాధి.

మరిన్ని వ్యాసాలు చదవండి:

ప్రేమ గొప్పదా? కామం గొప్పదా? ప్రేమ ముందా? శృంగారం ముందా?

శారీరక, మానసిక శ్రేయస్సులు సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చక్రాలు

శరీరకంగా ఒకే.. మరి మానసికంగా దృఢంగా ఉన్నారా..?

Show More
Back to top button