CINEMAGREAT PERSONALITIESTelugu Special Stories

తెలంగాణ కోటి రతనాల వీణ.. దాశరథి కృష్ణమాచార్య..

శ్రీశ్రీ అనగానే విప్లవ గీతాలు గుర్తొస్తాయి. సి. నారాయణరెడ్డి అనగానే యుగళ గీతాలు గుర్తొస్తాయి. ఆత్రేయ అనగానే సామాన్యమైన పదాలతో వ్రాసే పాటలు గుర్తొస్తాయి. కొసరాజు అనగానే హాస్య పాటలు గుర్తొస్తాయి. అదే విధంగా ఈయన పేరు వినగానే వీణ పాటలు గుర్తొస్తాయి. చక్కటి ఆహ్లాదకరమైన ఎన్నో పాటలు వ్రాశారు. ముఖ్యంగా వీణ పాటలు ఎక్కువగా వ్రాశారు. తెలుగులో మొట్టమొదటి కవాలి పాట కూడా తనే వ్రాశారు. తాను చనిపోయి సుమారు 36 సంవత్సరాలు అవుతుంది. తాను చిన్న వయస్సులోనే (62 సంవత్సరాల వయస్సులోనే) మరణించారు. 1960 – 80 మధ్యలో సుమారు 600 పాటలు వ్రాశారు. చాలా చక్కటి పాటలు వ్రాశారు. తెలుగులో మంచి పాటలు చెప్పమంటే తన పాటలు చెప్పకుండా ఉండలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్థాన కవిగా నియమించబడ్డ మొట్టమొదటి సినీ కవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ఆస్థాన కవి కూడా. ఆయనే దాశరథి కృష్ణమాచార్య.

పరిచయం…

దాశరథి గారు సినిమాల్లోకి రాకముందే చాలా కవితా సంకలనాలు వ్రాశారు. అందువలన తనను సినీ కవిగా కంటే కూడా, మాములు కవిగానే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన కవి దాశరథి గారు. తాను తెలంగాణ కవి, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన కవి అని గుర్తుపెట్టుకుంటారు. తాను కవిగా ఉండి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా పాల్గొని సంవత్సరాల పాటు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడి 16 నెలల పాటు జైలులో ఉండి దారుణమైన హింసను అనుభవించి, ఇన్ని సంఘర్షణల తర్వాత తాను సినిమాల్లోకి వచ్చారు. ఇది తన ప్రత్యేకత.

దాశరథి గారి పేరు వినగానే నిజాం రాజుకు వ్యతిరేకంగా 1947 – 48 లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తాను వ్రాసిన పాటలు అందరికీ గుర్తొస్తాయి. “మా నిజాం రాజు జన్మజన్మల బూజు”, “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని కూడా దాశరధి కృష్ణమాచార్య గారే వ్రాశారు. వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో మిగతా కార్యకర్తలతో కలిసి పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లి జైల్లో ఉండి కూడా నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కవి దాశరధి కృష్ణమాచార్య ఒక్కరే. తాను 05 నవంబరు 1987 నాడు   మరణించారు. తన పేరు వినగానే వీణ పాటలు గుర్తొస్తాయి. కమ్మని యుగళగీతాలు గుర్తొస్తాయి. తాను వ్రాసిన పాటలు తక్కువే, కానీ తాను వ్రాసిన పాటలలో వాసి ఉన్నవి ఎక్కువ. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” లాంటి పాటలు వింటే తన పాటల్లోని మాధుర్యం ఏంటో అర్థం అవుతుంది.

రచనల పై ఉపోద్ఘాతము… 

దాశరథి గారు 32 పుస్తకాలు వ్రాశారు. వాటిల్లో ఎక్కువగా కవిత్వానికి సంబంధించినవి. అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, పునర్నవం, అమృతాభిషేకం, దాశరథి శతకం, కవితా పుష్పకం ఇలా దాదాపు పాతిక కవిత సంపుటాలు వ్రాశారు. నవమి అనే నాటికలు వ్రాశారు. అనువాద గ్రంథాలు వ్రాశారు. బాలభారతం, శంకర్స్ బాలల బొమ్మల రామాయణం, మహా శిల్పి జక్కన అనే చారిత్రాత్మక నవల వ్రాశారు. దాశరథి గారు తన స్వీయచరిత్ర వ్రాసుకున్నారు. గాలిబ్ గీతాలు తెలుగులో రెండు రెండు వాక్యాలతో ద్విపదాలు వ్రాశారు. ఇవన్నీ కూడా దాశరధి గారు సినిమాలోకి రాకముందే వ్రాశారు. దాశరధి గారు వక్త. కవులు వ్రాయగలరు, కానీ వక్తలు కాలేరు.  ఈ రెండు ఉన్నవారు ఉద్యమంలో దూకలేరు. కానీ దాశరథి గారు ఉద్యమంలో పాల్గొన్నారు. తాను ఉద్యమ శీలి. వేరే భాషలలో ఉన్న గాలిబ్ గీతాలు తెలుగులోకి అనువాదం చేశారు. తాను చక్కని స్నేహశీలి. అందరితో చక్కటి స్నేహానికి కొనసాగిస్తుండేవారు.

ప్రతీ ఉగాదికి కవి సమ్మేళనం…

ఆ రోజులలో ప్రతీ ఉగాదికి కవితా సమ్మేళనం జరిగేది. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ ఇంకా మరి కొంతమంది సినిమాలలో లేని కవులు కొంతమంది ఆ సమ్మేళనంలో పాల్గొనేవారు. అందులో దాశరథి గారు కవితా చదివే విధానం ఆకట్టుకునేది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తాను వ్రాసిన అగ్నిధార అనే పుస్తకాన్ని తమ మిత్రులు దేవులపల్లి రామానుజరావు గారు ముందుమాట వ్రాస్తూ దాశరథి గారి గురించి ఇలా చెప్పారు. దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణ యందుండరు. దాశరథి ని ప్రేమించని వారు తెలంగాణలో లేరు. దాశరథిని స్వీకరించని వస్తువు తెలంగాణలో లేదు. దాశరథియే తెలంగాణము, తెలంగాణమే దాశరథి అని వ్రాశారు.

మంజీర నదిపై ఖండిక…

దాశరథి గారు తెలంగాణ వీరుల యొక్క కథనాన్ని, తెలంగాణ శిల్పుల యొక్క వైశిష్ట్యాన్ని ఎప్పుడూ చెబుతుండేవారు. దానికి దాశరథి గారు వ్రాసిన కొన్ని కవితలు “నేను రా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంతా యతార్చినాను” అని గర్జించారు. “ఏది కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు, ఎవడు సింగన, అన్నీ నేనే అంతా నేనే” అని తనని తెలంగాణతో మమేకం చేసుకున్నారు. మంజీరా నది అంటే దాశరథి గారికి చాలా ఇష్టం. మంజీరా నది మీద ఒక ఖండిక కూడా వ్రాశారు. అందులో “ఇందూరు మండలం ఎందాకని నీటి తడి తాకి తీయని తనమునొందు, నా తెలంగాణమ్ము గీతా నృత్యమ్ములతో అందాక పూజిస్తూ ఉండు” అని వ్రాశారు.

కాపయ్య నాయకుడిపై సీస పద్యం…

తెలంగాణలో కాపయ్య నాయకుడు ఉండేవాడు. తాను ఓరుగల్లును తుగ్లక్ నుండి విముక్తి చెందించాడు. తనని కీర్తిస్తూ దాశరథి గారు ఒక ఖండిక వ్రాశారు. “ఢిల్లీ సుల్తాను కంఠపీటిపై నీవు కరకు కత్తి ప్రతిష్టింపగలిగినావు.  కాకతీయుల నాటి విక్రమము మరలా సూపి తెలంగాణ దాస్యమ్ము బాపినావు” అని వ్రాశారు. కాపయ్య నాయుడు చనిపోయాక తెలంగాణ అంతా దోపిడీ చేయబడింది. ఓరుగల్లు పట్టణం ఊపిరిపోయిందని వాపోతూ దాశరథి గారు వ్రాసిన ఈ సీస పద్యం చాలా ప్రసిద్ధి పొందింది.  “వేయి స్తంభముల గుడి వ్రాయించుకున్నది నా చేత ఏకశిలా చరిత్ర, వీర రుద్రమదేవి వినిపించుకున్నది నా చేత జన్మజన్మల కథలు, పోతన కవి కలబోయించుకున్నాడు నా చేత నేటి ఆనాటి కవిత. ముసునూరి కాపన్న మ్రోయించుకున్నాడు నా చేత కాంతి వీణా జయమ్ము. నాకు తల్లివి నీవు, నీకు నేను సుతుడ. అలనాటికి నేటికి అనుదినము మోయుచున్నావు నా గళంబున,  కలాన “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని సీస పద్యం వ్రాశారు.

దాశరథి గారు వ్రాసిన మహాంద్రోదయం అనే పుస్తకానికి పీఠిక వ్రాస్తూ “మల్లంపల్లి సోమశేఖర శర్మ” గారు దాశరథి కి తెలంగాణ మీద గల భక్తి, రక్తి అనుపమానమైనది. తెలుగుదేశం అంటే, అందులోను తెలంగాణ అంటే వడలు ఉప్పొంగిపోవు ఉత్కంఠ భావావేశపరుడు దాశరథి. ఆయనకి “ఎంతటి గాఢానురాగమో తెలంగాణని ప్రేమించాడు” అని వ్రాశాడు. దాశరథి గారు వ్రాసిన ఇంకొక పద్యం “కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వశించి పొద్దుపొద్దున అందాలు పూయు నా తెలంగాణ తల్లి కంజాత వల్లి” అని వ్రాశారు.

ముసీనది పై కవిత…

హైదరాబాదులోని మూసినది గురించి కవిత వ్రాస్తూ “పాత కొత్త బస్తీల మధ్య రోతగా తయారైన మురిపి కూపము లాంటి మూసీ నదిని పూర్తిగా క్షాళన చేస్తేనే బాగుండును. లండన్ లోని థేమ్స్ నది వలె, వాషింగ్టన్ లోని పుటామిక్ రివర్ వలె, వియన్నా లోని వీధి కుళ్యాల వలె పరిశుద్ధంగా మూసి ఎప్పుడూ ప్రవహించవలె” అని వ్రాశారు. దాశరథి గారు నిజామాబాద్ జైల్లో ఉండగా వ్రాసిన ఒక పద్యం “ఆయాసపడు జైలులో ఎన్ని ప్రజలు, రాజ్యములున్నవో అని అరసినాను, నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదకినాను” అని వ్రాశారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాశరథి కృష్ణమాచార్య 

ఇతర పేర్లు  :  దాశరథి

జననం    :     22 జులై 1925    

స్వస్థలం   :    చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, తెలంగాణ

వృత్తి      :      కవి, రచయిత, వక్త 

తండ్రి    :   వెంకటాచార్యులు 

తల్లి     :   వెంకటమ్మ 

పురస్కారాలు   :    1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి

మరణం  :   05 నవంబరు 1987

నేపథ్యం…

“దాశరథి” అంటే శ్రీరామచంద్రుడు అంతటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని అర్థం. “శరథి” అంటే సముద్రం వంటి వాడు అని అర్థం. శరథి అంటే అమ్ములపొది అని కూడా అర్థం. దాశరథి గారు తాను వ్రాసిన కవితలన్నీ కూడా తన అమ్ములపొది నుండి వచ్చిన బాణాల లాంటివి. “రథి” అంటే అతిరథి, మహారథి అంటే రథం నడిపేవాడు, ఎందరికో మార్గదర్శకుడయ్యాడు అని అర్థం వచ్చేలా ఉంటుంది. “థి” అంటే బుద్ధి, మేధావి, ధీశాలి అని అర్థం. అందుకని దాశరథి అనే పేరులో ఏ అక్షరాన్ని తీసేసినా మిగిలినవన్నీ కూడా దాశరథి గారికి ప్రతీకగా నిలుస్తాయి. 22 జూలై 1925 నాడు దాశరథి గారు జన్మించారు. వాళ్ళ అమ్మ గారి పేరు వెంకటమ్మ గారు, నాన్నగారి పేరు వెంకటాచార్యులు గారు.

బాల్యం…

దాశరథి గారు వరంగల్ జిల్లా  చిన్న గూడూరులో పుట్టారు. తాను పుట్టింది “బుధవారం”. వారి పూర్వీకులు భద్రాచలంలో ఉండటం వలన, వారు విశిష్టద్వైత అంశానికి చెందినవారై ఉండడం వలన, దాశరథి అనే ఇంటి పేరు ఉండొచ్చని అంటుంటారు. దాశరథి గారి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య. స్కూలులో చిన్నతనం నుండే తాను కవితలు వ్రాయడం వలన దాశరథి అనే పేరునే కొనసాగిస్తూ వచ్చారు. వీరి నాన్నగారు చక్కటి విద్వాంసులు. తమిళంలో ఉన్న మత గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. దాశరథి గారి అమ్మ గారికి కూడా తెలుగు సాహిత్యం మీద మంచి పరిచయం ఉంది. చిన్నప్పటినుండే “మనుచరిత్ర” గురించి వాళ్ళ అమ్మ గారి దగ్గర నేర్చుకున్నారు. ఒకవైపు తల్లి గారికి, మరోవైపు తండ్రి గారికి సాహిత్యంతో పరిచయం ఉండడం వీరి సహచర్యంలో తనకు సాహిత్యం మీద విపరీతమైన మక్కువ ఏర్పడింది.

చిన్నప్పటినుండే తనకు ఎదిరించే అలవాటు ఉండేది. వీరి గ్రామం గూడూరు ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మం లో ఉండేది. కాబట్టి తన విద్యాభ్యాసం ప్రస్తుత ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇంటి వద్ద అమ్మానాన్నల దగ్గర సంస్కృతం నేర్చుకునేవారు. మామూలుగా చదువు మాత్రం ఖమ్మంలో “ఉస్మానియా హైస్కూల్లో” చదువుకునేవారు. డి.రామలింగం, హీరాలాల్ మోరియా లాంటి కవులు దాశరథి గారికి (ఖమ్మం పాఠశాలలో) సహచరులు. నిజాం రాజుల పరిపాలనలో ఉండటం వలన ప్రార్థనలు ఊర్థూలో ఉండేవి. ఇంట్లో నాన్నగారు సంస్కృతంలో రుద్దడం, పాఠశాలలో  మాస్టారు ఉర్దూలో రుద్దుడం దాంతో తనకు వారిపై వ్యతిరేకత భావం ఉండేది.

చిన్నతనం నుండే కవిత్వం...

తనకు ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు కవిత్వం వ్రాయడం మొదలుపెట్టారు. పన్నెండు సంవత్సరాల వయస్సున్నప్పుడు పాఠశాలలో ఒకరోజు 25 పద్యాలు వరుసగా టక టకా చదివారు. తాను చదివిన ప్రవాహం చూసి, తన స్వరానికి, తన గాంభీర్యానికి తన పఠన మాధుర్యానికి, కవితా శక్తికి “నారాయణరావు” గారు (సుబేదారు) దాశరథి గారిని కౌగిలించుకొని నాయనా నాకు తెలుగు రాదు. కానీ నువ్వు చదివిన విధానం చూస్తే నువ్వు భవిష్యత్తులో మంచి కవివి అవుతావు అని ఆశీర్వదించి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చారు.

దాశరథి గారు పేదరికంలో ఉండడం వలన తాను ట్యూషన్ చెబితే వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవారు. 1977 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఎంపిక చేసినప్పుడు “మండలి బుద్ధ ప్రసాద్” గారు దాశరథి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు దాశరథి గారు తనకు పాఠశాల రోజులలో జరిగిన అనుభవం గురించి చెప్పారు. “మద్రాసు ఎఫో కాస్మో ఉస్మానియా హై స్కూల్” లో గోనె సంచులలో కూర్చుని ఆడుతుండే ఆటలో భాగంగా విజేతలందరికీ ఒక టోర్నమెంట్ పెట్టారు. ఆ టోర్నమెంట్ లో మిగతా స్కూల్ పిల్లలతో పోటీపడి దాశరథి గారు గెలిచారు.

అప్పుడు సుబేదారు ఒక రాజా పెన్ను ఇచ్చారు. అందులో సిరా పోసుకుని దాశరథి గారు ఒక కవిత వ్రాశారు. “గోడ సంచి పరుగుల పోటీ, భలే మంచి ఆటల పోటీ. బొక్క బోర్లా పడ్డాడొకడు, ముక్కు పగిలి ఏడ్చాడొకడు. హా అల్లా అన్నాడు ఒకడు, ఓరి దేవుడా అన్నాడొకడు. ఏడ్చేవాడు ఒకడైతే, నవ్వే వాడింకొకడు. అవమానం ఒకడిదైతే, సన్మానం ఇంకొకడికి. గెలిచిన వాడు నవ్వాలో, ఓడిన వాడు ఏడవాలో, నేటి గెలుపు రేపటి ఓటమి, నేటి ఓటమి రేపటి గెలుపు. అదేరా ఈ జీవితం, మరి ఎందుకురా ఏడవడం”. ఇది దాశరథిగారు తన 14 సంవత్సరాల వయస్సులో బహుమతిగా వచ్చిన కలములో సిరా పోసుకొని వ్రాశారు.  ఈ విధంగా తన పాఠశాల జీవితం గడిచింది.

తెలంగాణ సాయుధ పోరాటం…

దాశరథి గారు పాఠశాలలో చదువుతున్నప్పుడు హైదరాబాదు సంస్థానాన్ని “మీర్ ఉస్మాన్ అలీ ఖాన్” అనే రాజు పరిపాలిస్తున్నారు. అప్పట్లో హైదరాబాదు రాష్ట్రంలో జాగిదారులు, పాయగాళ్లు, తాలూకా, పరిషత్, సమితి లాంటి విభాగాలు ఉండేవి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 16 జిల్లాలతో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడి వుండేది. హైదరాబాదు రాష్ట్రం లో తెలుగు, మరాఠీ, ఉర్దూ మాట్లాడేవారు. “మీర్ ఉస్మాన్ అలీ ఖాన్” అనే రాజు గారు హైదరాబాదులోనే ఉండేవారు. జాగిదారులు, పాయగాళ్లు మక్తాలు పరిపాలించేవాళ్ళు. జాగీదారులు హైదరాబాదులో ఉండి వాళ్ళ సేవకుల్ని వివిధ ప్రదేశాలలో ఉంచి పరిపాలించే వాళ్ళు. ప్రజలకు తీవ్రమైన నియమ నిబంధనలు పెట్టేవారు. ప్రజలు ప్రతీ పనికి ముందు “బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా దొరా” అని అనేవారు. అలా ప్రజలను అణిచివేతకు గురి చేసేవారు.

అధికార భాష ఉర్దూ…

భాషా పరంగా ఉర్దూ భాషను ప్రోత్సహించేవారు. తెలుగు భాషను దిక్కుమాలినది అని హేళన చేసేవాళ్లు. తెలుగు భాషను కాపాడుకోవడానికి కొన్ని సంస్థలు స్థాపించబడటం జరిగినది. నాయని వెంకట రంగారావు గారు 1901 లో “శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం” స్థాపించారు. 1904లో హనుమకొండ లో “రాజరాజ నరేంద్ర బాషా నిలయం” అనే సంస్థను మొదలుపెట్టారు. 1943లో హైదరాబాదులో “ఆంధ్రసారస్వత పరిషత్” అనే ఇంకో సంస్థ మొదలైంది. ఇవి కాక వాటికి అనుబంధంగా ఆంధ్ర సారస్వత్ ఉండేవి. “నిజాం రాష్ట్ర ఆంధ్రభాషా నిలయం” ఏర్పాటు చేసి 1930లో “జోగిపేట” లో సభ నిర్వహించారు.  మతపరంగా తెలుగువారిని ఇబ్బంది పెడుతూ “అంజుమన్ పబ్లిగ్లిస్తాన్” అనే సంస్థ ద్వారా హిందువులందరినీ ముస్లింలుగా మార్చేవారు. అప్పుడు “ఆర్య సమాజం” మొదలై శుద్ధి సభా” పేరుతో ముస్లిములు గా మారిన వారందరినీ తిరిగి హిందువులుగా మార్చేవారు.

రజాకార్ల అరాచకాలు…

ఒకపక్క స్వాతంత్ర్య పోరాటం జరుగుతుండేది. నిజాం రాజులు బ్రిటీషు వారికి విధేయులుగా ఉండేవారు. 1940లో మెట్రిక్ పూర్తి అయిపోయిన దాశరథి గారు ఉద్యమంలోకి దూకేశారు. 1945 నాటికి “ఆంధ్ర సభ” రెండుగా చీలి “జాతీయాంధ్ర మహాసభ”, “కమ్యూనిస్టు ఆంధ్ర మహాసభ” గా విడదీయ పడ్డాయి. 1946లో స్టేట్ కాంగ్రెస్ కాస్త “ఆంధ్ర కాంగ్రెస్” అయ్యింది. అది స్వాతంత్ర్యం కోసం పనిచేస్తుందని తెలుసుకొని దానితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు దాశరథి గారు. 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాదును భారతదేశం లో విలీనం చేయడానికి రాజు ఒప్పుకోలేదు. రాష్ట్రాన్ని తానే పరిపాలించుకోవాల్సింది అని చెప్పాడు. తన హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా తానే పరిపాలించాలనేది తన ఉద్దేశ్యం. 

కమ్యూనిస్టులు శాంతియుతంగా ఉద్యమం చేస్తే బాగోలేదని గ్రహించి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గెరిల్లా పోరాటానికి యువకులను సిద్ధం చేశారు “సయ్యద్ ఖాసిం రజ్వి” (లిటిల్ హిట్లర్) 50,000 మంది యువకులను తయారు చేశారు. వారిని రజాకారులు అన్నారు. రజాకార్లంటే స్వచ్ఛంద సేవకులను అర్థం. కానీ రజాకార్లు అత్యాచారాలు, మానభంగాలు, గ్రామాలపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేయడం, హత్యలు ఇవన్నీ విశృంఖలంగా చేస్తుండేవారు. వీళ్ళందరికీ లీడర్ “సయ్యద్ ఖాసిం రిజ్వి”  వీరికి వత్తాసు పలికారు. ఎవరైతే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారిమీదికి రజాకార్లు ఎదురు దాడికి దిగి వారిని అణచివేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దాశరథి గారు ఉద్యమంలోకి దూకారు.

Show More
Back to top button