Telugu News

అడుగంటుతున్న ఆస్తులు.. ముంచుకొస్తున్న ముప్పు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ నీటి వనరులను తిరిగి భర్తీ చేయలేనంత వేగంగా మనం వినియోగిస్తున్నామని ఇటీవల ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ నివేదిక (UNU-INWEH) ప్రపంచ దేశాలను భయాందోనను కల్గిస్తోంది. మన జలవనరులను ఒక బ్యాంక్ ఖాతాగా పరిగణిస్తే.. వార్షిక వర్షపాతం మన ఆదాయం, భూగర్భ జలాలు మన దీర్ఘకాలిక పొదుపు. కానీ నేడు మనం ఆదాయాన్ని మించి ఖర్చు చేయడమే కాకుండా.. పొదుపును కూడా పూర్తిగా తోడేస్తున్నాము. దీనివల్ల ప్రపంచం ‘జలపరమైన దివాలా’ (Water Bankruptcy) తీసే స్థితికి చేరుకుంది. నేడు ప్రపంచ జనాభాలో 75 శాతం మంది ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్నారు. సహజ సిద్ధంగా నీరు పునరుద్ధరణ చెందే వేగం కంటే, మానవ అవసరాల కోసం తోడేస్తున్న వేగం చాలా ఎక్కువగా ఉండటమే ఈ మహా సంక్షోభానికి ప్రధాన కారణం. మనం జల నిధులను నాశనం చేస్తూ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాము.

చేదు నిజాలు

ప్రకృతి ప్రసాదించిన జల నిధులు మన కళ్లముందే అదృశ్యమవుతున్నాయి. గడచిన 50 ఏళ్లలో ఐరోపా ఖండ విస్తీర్ణానికి సమానమైన 41 కోట్ల హెక్టార్ల చిత్తడి నేలలు కనుమరుగయ్యాయి. హిమనీనదాలు కరిగిపోవడం వల్ల నదులకు నీటి ఆధారమే కరువవుతోంది. ప్రపంచంలోని సగం భారీ జలాశయాలలో 1990 నుండి నీటి నిల్వలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. ఇది పాతిక శాతం జనాభాపై నేరుగా ప్రభావం చూపుతోంది. మనం కేవలం ఉపరితల జలాలనే కాదు, భూమి లోపల 70 శాతం భూగర్భ జలనిధులను కూడా అశాస్త్రీయంగా వాడేస్తున్నాము. నదులపై అడ్డగోలుగా డ్యామ్‌లు నిర్మించడం వల్ల అవి సముద్రంలో కలవలేక చనిపోతున్నాయి. ఈ విధ్వంసం వల్ల చెరువులు, కుంటలు అదృశ్యమవడమే కాకుండా పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది.

భయానక పర్యవసానాలు

భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం వల్ల ఏర్పడే పర్యవసానాలు కేవలం నీటి కొరతకే పరిమితం కావు. భూమి లోపల నీటి పొరలు ఖాళీ అవ్వడంతో, పైన ఉన్న నేల కుంగిపోవడం (Land Subsidence) మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున నేలలోకి కుంగిపోతున్నాయని నివేదిక వెల్లడించింది. డెల్టా ప్రాంతాలు సముద్ర మట్టం కంటే కిందికి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడమే కాకుండా సుమారు 200 కోట్ల మంది ప్రజల నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. నేల కుంగడం వల్ల సముద్రపు ఉప్పు నీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకు వచ్చి, తాగునీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదాల వల్ల మనం సృష్టించుకున్న ఒక భౌగోళిక విపత్తు.

ఆర్థిక నష్టం 

నీటి కొరత అనేది కేవలం దాహానికి సంబంధించిన సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశం. 2022-23 మధ్యకాలంలో అనావృష్టి వల్ల ప్రపంచానికి 30,700 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. చిత్తడి నేలలు అదృశ్యమవ్వడం వల్ల పర్యావరణ సేవలు కోల్పోయి ఏటా 5.1 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వంటి నగరాల్లో తాగునీటి కొరత ఇప్పటికే సామాజిక అలజడికి, నిరసనలకు దారితీసింది. వ్యవసాయానికి నీరు అందక 42 కోట్ల ఎకరాల పంట భూములు ఎండిపోతున్నాయి. 25 కోట్ల ఎకరాల భూమి చవుడుదేరి పనికిరాకుండా పోయింది. ఆహారోత్పత్తిలో సగం నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుండటంతో, భవిష్యత్తులో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

ముంచుకొస్తున్న ముప్పు

ప్రపంచ జనాభాలో 18 శాతం ఉన్న భారత్‌లో.. కేవలం 4 శాతం జలవనరులు మాత్రమే ఉండటం ఆందోళనకరం. 2030 నాటికి దేశంలో 40 శాతం మందికి సురక్షిత తాగునీరు దొరకదని నీతి ఆయోగ్ ఇప్పటికే హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మనం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ, అందుకోసం భూగర్భ జలాలను విపరీతంగా వాడేస్తున్నాము. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం.. చెరువులు కబ్జాకు గురవ్వడం మన పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. భారత్ తక్షణమే మేల్కోకపోతే రాబోయే దశాబ్దం అత్యంత క్లిష్టంగా మారనుంది.

మనం నీటిని ఎలా నాశనం చేస్తున్నాము?

మనం జలవనరులను నాశనం చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి: అతిగా వాడటం, కలుషితం చేయడం, ఆక్రమణలు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదుల్లోకి వదలడం వల్ల స్వచ్ఛమైన నీరు విషతుల్యమవుతోంది. పట్టణీకరణ పేరుతో చెరువులను పూడ్చేసి భవనాలు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి లోపలి నీరు కూడా కలుషితమవుతోంది. మరొక ప్రధాన తప్పిదం ‘నీటి నిర్వహణ’ లో లోపం. వృధాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో మనం విఫలమవుతున్నాము. అడవులను నరికివేయడం వల్ల వర్షపాతం తగ్గి, ఎడారీకరణ పెరుగుతోంది. ప్రకృతి ఇచ్చే దానికంటే మనం తీసుకునేదే ఎక్కువగా ఉండటమే ఈ వినాశనానికి మూల సూత్రం.

పరిష్కార మార్గాలు 

జల సంక్షోభం నుండి బయటపడాలంటే రాజకీయ, ఆర్థిక బేధాలను పక్కన పెట్టి దేశాలన్నీ సమైక్యంగా పోరాడాలి. మొదటిగా, వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) ప్రతి ఇంటిలోనూ, పొలంలోనూ తప్పనిసరి చేయాలి. నదుల పునరుజ్జీవనం కోసం ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు సాంకేతికతను పంచుకోవాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే మైక్రో ఇరిగేషన్ పద్ధతులను రైతులు అవలంబించాలి. చిత్తడి నేలలను, అడవులను రక్షించుకోవడం ద్వారా వాతావరణ మార్పులను అరికట్టవచ్చు. ప్రతి బొట్టు నీటిని పొదుపుగా వాడటమే కాకుండా, వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే (Recycle) సంస్కృతిని పెంచుకోవాలి. అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా జల భద్రతను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్ తరాలకు నీటిని అందించగలం.

Show More
Back to top button