Telugu NewsTelugu Special Stories

మానవ తప్పిద విపత్తులతో అపార నష్టాలు

ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి. కనీసం శతాబ్దానికి ఒకసారి కరోనా లాంటి మహమ్మారులు చుట్టు ముడుతూనే ఉండవచ్చని వింటున్నాం.  ప్రకృతి వైపరీత్యాలను ముందు ఊహించడం చాలా సందర్భాలలో వీలు కాదు. మానవ తప్పిదాలతో ప్రాణ ఆస్థినష్టాలు తరుచుగా చూస్తున్నాం. గతంలో విశాఖపట్నం సమీప వెంకటాపురం గ్రామంలో యల్‌జి పాలిమర్స్ పరిశ్రమ నుండి విడుదలైన స్టైరిన్ వాయు‌ లీకేజీ కారణంగా 11 మంది మరణించగా, 1000కి పైగా ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలైనారు.

ఈ మానవ నిర్లక్ష్యానికి 3 కిమీ పరిధిలోని ఐదు గ్రామాలు ప్రభావితం కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారంతో పాటు పునరావాసానికి 30 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. ఇలాంటి సహజ/మానవ కారణ విపత్తులు జరిగినపుడు ఆస్థి ప్రాణనష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయడం, ఉపశమన చర్యలు తెలుసుకోవడం, క్షతగాత్రులను రక్షించి వైద్య సదుపాయాలు కల్పించడం, విపత్తు ప్రమాద నిర్వహణలో సుశిక్షితులైన బలగాలు సత్వరమే స్పందించడం మాత్రమే మన అధీనంలో ఉంటుంది. 

అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినం-2024 నినాదం:

  2011లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 302 విపత్తుల్లో 80,000 మరణాలు, 206 మిలియన్ల ప్రజలు ప్రభావితం అయినారు. ఈ విపత్తులు మిగిల్చిన నష్టం 2 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. సహజ (నాచురల్‌), మానవ కారణ (మ్యాన్‌ మేడ్) విపత్తులు జరిగినపుడు వెంటనే స్పందిస్తూ తీసుకోవలసిన చర్యలను, నష్ట నివారణ పద్దతులు, విపత్తు నిర్వహణ గూర్చి కనీస పరిజ్ఞానాన్ని అందించానే లక్ష్యంతో ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ప్రపంచ దేశాల్లో 13 అక్టోబర్‌న “అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినం” పాటించడం జరుగుతోంది.

1989 ఐరాస పిలుపు మేరకు విపత్తుల తీవ్రతను తగ్గించడం (మిటిగేషన్‌), నివారణించడం (ప్రివెన్షన్‌), స్పందించడం (రెస్పాన్స్), ధైర్యాన్ని నూరి పోయడం (రిఅష్యురెన్స్), తిరిగి యథాస్థితికి తీసుకురావడం (రికవరీ), ఎదుర్కొనే సంసిద్ధత కలిగి ఉండడం (ప్రిపరేషన్‌) లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని విపత్తు ప్రమాద నియంత్రణ మార్గాలను శోధించే వేదికగా అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినాన్ని తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినం-2024 నినాదంగా“నిలకడగల భవిష్యత్తుకు రేపటి తరాన్ని సిద్ధిం చేద్దాం‌” అనబడే అంశాన్ని తీసుకొన్నారు. 

విపత్తులు విధ్వంసకరం:

 ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు, వరదలు, తుఫానులు, సునామీలు, సూక్ష్మ మహమ్మారి కల్లోలాలు, జునోటిక్‌ వ్యాధులు, వడగాలులు, మంచు తుఫానులు, ఇసుక తుఫానులు, అగ్నిపర్వత విస్పొటనాలు, అసాధారణ సముద్ర అలలు, నేల కోతలు, కరువులు, మంటలు, రేడియోధార్మిక వాయువుల వ్యాప్తి, హిమపాతాలు, కొండచరియలు విరిగి పడడం లాంటివి వస్తాయి. మానవ కారణ విపత్తుల్లో భోపాల్‌ వాయు దుర్ఘటన లాంటివి, సముద్రజలాల్లో పెట్రోలియం లీకేజ్‌, చెర్నోబిల్‌ అణు విష్పొటనం, భూతాపంతో మంచుకొండలు కరగటం లాంటివి వస్తాయి. వైపరీత్యాల తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు ప్రాణ నష్టం వేలల్లో, గాయపడిన వారు లక్షల్లో, ఆస్థి నష్టం కోట్లల్లో ఉంటుంది. 

విపత్తు నిర్వహణ:

 విపత్తు నిర్వహణలో ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధానమైంది. క్షతగాత్రులకు సత్వర వైద్య సదుపాయాల కల్పన, నిరాస్రయులకు తాత్కాలిక శిబిరాల ఏర్పాటు, జంతువుల పరిరక్షణ, ఆస్థులను కాపాడుతూ నష్టాన్ని తగ్గించడం, అత్యవసర సరుకుల రవాణ వ్యవస్థలను నెలకొల్పడం లాంటి చర్యలను తీసుకోవాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో విపత్తులను ముందుగానే పసిగట్టగలిగితే నష్టాలను తగ్గించే అవకాశం చాలా ఉంటుంది. విపత్తు ప్రమాద నిర్వహణలో ఉద్యోగులకు, పట్టభద్రులకు కనీస శిక్షణ ఇవ్వడం తప్పకుండా చేయాలి. దీని కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థలను నెలకొల్పాలి.

విపత్తు ప్రమాద నిర్వహణలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక యంత్రాంగాలు, రాజకీయ పట్టుదల, స్వచ్ఛంద‌ సంస్థలు, పౌర సమాజం, శాస్త్రసాంకేతిక సంస్థలు ఎల్లవేళల సిద్ధంగా ఉండాలి. విశ్వ మహమ్మారులైన సూక్ష్మజీవుల విజృంభన, వాతావరణ ప్రతికూలతలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ కారణ ప్రమాదాలు జరిగినపుడు సత్వర పౌర స్పందనతో అపార ప్రాణ ఆస్థి నష్టాన్ని తగ్గించవచ్చు. అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, సునామీల, భూకంపాలు లాంటి విపత్తులు జరిగినపుడు మానవ, జంతు ప్రాణనష్టం, ఆస్థి ధ్వంసం, ప్రకృతి వినాశనం పెద్ద ఎత్తున స్వల్ప వ్యవధిలోనే జరిగిపోతుంది.             

జాతీయ విపత్తు నియంత్రణ ప్రణాళిక:

 విపత్తు ప్రమాద నివారణకు తీసుకోవలసిన చర్యల్లో విపత్తును తగ్గించే అవగాహన, ముందస్తు హెచ్చరికలు, విపత్తును ఎదుర్కొనే తయారీ ప్రణాళికలు, రికవరీ మరియు జీవనోపాధికి చేయూత లాంటి చర్యలతో విపత్తు ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇండియాకు ఒక ప్రత్యేకమైన ‘జాతీయ విపత్తు నియంత్రణ ప్రణాళిక’ ఉండాలని, దానిని 2016లో రూపొందించిన ఘనత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికే దక్కింది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన ‘జాతీయ విపత్తు స్పందన దళం (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్ ఫోర్స్)’ సహాయం తీసుకోవడం జరిగుతోంది. విపత్తు ప్రమాద అవగాహన, విపత్తు ప్రమాద నిర్వహణ, పర్యవేక్షణ యంత్రాంగం, విపత్తు నష్టాన్ని తగ్గించడానికి పెట్టుబడులు, విపత్తును ఏదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూ ముందస్తు హెచ్చరికలు చేయడం అనే నాలుగు సూత్రాల మీద భారత విపత్తు నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేశారు.

  ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదని, జరిగినా ముందస్తు హెచ్చరికలతో తక్షణమే జరగబోయే అపార నష్టాన్ని తగ్గించగల విపత్తు నిర్వహణ యంత్రాంగంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావడానికి సంసిద్ధంగా ఉందాం. సహజ విపత్తుల పట్ల జాగ్రత్త ఉంటూనే మానవ తప్పిదాలతో జరుగనున్న విపత్తులను గమనించి తప్పిద్దాం. 

Show More
Back to top button