
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కావడం ఈ మ్యాచ్‌కు చారిత్రక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
భారత్ ఈ టోర్నమెంట్లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్, టైటిల్‌కు గట్టి పోటీదారుగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ సూపర్ 4 దశలో బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయం తర్వాత, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫైనల్లో భారత్‌ను ఓడిస్తామని సవాల్ విసిరాడు.
ఆదివారం, సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ తుది పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ రోజు భారత్ తమ సూపర్ 4 లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న భారత జట్టు పాక్‌తో తుది పోరుకు ముందు ఫీల్డింగ్‌లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.






