
15 అక్టోబర్ ‘అబ్దుల్ కలాం జయంతి’ సందర్భంగా‘లీడ్ ఇండియా’ అంటూ యువతను దేశాభివృద్ధి మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని పిలుపును ఇచ్చిన మన ప్రియతమ ఏ. పి. జె. అబ్దుల్ కలాం భరతమాత ముద్దు బిడ్డగా జాతి గౌరవాన్ని అంతర్జాతీయ వేదికల మీద చాటి చెప్పి అనన్య సామాన్యడు, మేరునగ ధీరుడు, అనితరసాధ్య ఘనుడు. భారత 11వ రాష్ట్రపతిగా (2002-07) విశిష్ట సేవలందించి ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసిన అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931న ప్రముఖ దక్షిణ భారత తీర్థ స్థలం రామేశ్వరం పట్టణంలో పేద తమిళ ముస్లిమ్ కుటుంబంలో ఆశియమ్మ – జైనులబ్దీన్ దంపతులకు జన్మించారు. రామేశ్వరంలో పాఠశాల విద్య, తిరుచురాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రం (1954), మద్రాస్ యంఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (1960) పట్టాలు పొందారు.
మెసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా:
అతి సాధారణ విద్యార్థి దశ నుంచి అసాధారణ మేధావిగా కలాం ఎదిగిన క్రమం విలక్షణం, ఆశ్చర్యకరం. నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా, సైన్స్ అడ్మినిస్ట్రేటర్‌గా విలక్షణ సేవలందించే క్రమంలో డిఆర్‌డిఓ (డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలంప్‌మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో పరిపాలనాదక్షుడిగా, మిలటరీ మెసైల్ రూపశిల్పిగా తన సత్తా చాటి ‘మెసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తించబడ్డారు. ప్రధాని ముఖ్య వైజ్ఞానిక శాస్త్ర సలహాదారుగా, డిఆర్‌డిఓ సెక్రటరీగా 1992 నుంచి 1999 వరకు పని చేశారు.
స్వావలంభన దిశగా భారతదేశాన్ని న్యూక్లియర్ ఎనర్జీ కలిగిన దేశంగా నిలపటానికి 1998లో పోక్రాన్-॥ పరీక్షలను పర్యవేక్షించి ప్రజల చేత జేజేలు అందుకున్నారు. భారత వాయు సేనలో ఫైటర్ పైలెట్‌గా పని చేయాలనుకున్న కలాం ఏరోస్పేస్ శాస్త్రజ్ఞుడిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇంజనీర్, సైంటిస్ట్, రచయిత, ఆచార్యులు, యువత ఆరాధ్య దైవం, ఆదర్శ రాజకీయవేత్త, యువతకు మార్గదర్శిగా బహుముఖీన ప్రతిభ కలిగిన అబ్దుల్ కలాం బోధనలు అనితరసాధ్యాలు. నేను చేయగలననే దృఢ సంకల్పమే విజయాలను అందిస్తుందని, ఎవరి తలరాతను వారే లిఖించుకోవాలని, నిజాయితీగల హృదయంతోనే అసలైన ఆకర్షణీయ వ్యక్తిత్వం వ్యక్తం అవుతుందని బోధనలు చేశారు.
కలలు కందాం, సాకారం చేసుకుందాం:
ఉన్నత కలలు కనండి, సాకారానికి కఠోర సాధన చేయండి’ అంటూ నినదించిన కలాం జీవితం తెరిచిన పుస్తకం, యువతకు మార్గదర్శకం. పడవలు నడిపే వృత్తిలో పేరుగాంచిన కలాం కుటుంబం, వ్యాపారంలో నష్టం రావడంతో కష్టాల కడలిలో పట్టుదలతో చదువులను కొనసాగిస్తూ, పేపర్ బాయ్‌గా పని చేస్తూ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేయగలగడం నేటి యువతకు ప్రేరణాత్మకం. ఉద్యోగిగా తన సీనియర్స్ డా: విక్రమ్ సారాభాయ్, ఆచార్య సతీష్ ధవన్, డా: బ్రహ్మ ప్రకాశ్ లాంటి దిగ్గజాల వద్ద నాయకత్వ పటిమను, అంతరిక్ష శాస్త్రసాంకేతిక మెలకువలను నేర్చుకున్నారు. 1969లో ఇస్రోకు బదిలీ అయిన కలాం నేతృత్వంలో భారత తొలి స్వదేశీ పరిజ్ఞానంతో ‘సాటలైట్ లాంచింగ్ వెహకిల్ (యస్‌యల్‌వి-3’)ను రూపొందించుటలో విజయం సాధించారు. 1970-90ల మధ్య పియస్‌యల్‌వి (పోలార్ సాటలైట్ లాంచింగ్ వెహకిల్)తో పాటుగా యస్‌యల్‌వి-3లను అభివృద్ధి చేయుటలో ప్రధాన భూమికను నిర్వహించారు.
‘బాలిస్టిక్ మెసైల్‘ టెక్నాలజీతో ‘ప్రాజెక్ట్ డెవిల్’, ‘ప్రాజెక్ట్ వాలియంట్’లను రూపొందించడంలో మార్గదర్శనం చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మెసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐజియండిపి) ద్వారా కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ₹ 3.88 బిలియన్ పెట్టుబడితో పరిశోధనలు కొనసాగించారు. ‘అగ్ని’, ‘పృథ్వి’మెసైల్‌లను విజయవంతంగా నిర్మించగలిగారు. 1998లో చవకైన ‘కలాం-రాజు కరోనరీ స్టంట్’ను, 2012లో ‘కలాం-రాజు టాబ్లెట్’ హెల్త్‌కేర్ కంప్యూటర్‌ను రూపొందించారు. టెక్నాలజీ సహాయంతో ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, విద్యారంగాలను పరిపుష్టం చేయవచ్చని గట్టిగా నమ్మిన కలాం ముందు చూపు అద్వితీయం. ‘జననం సాధారణమే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని’ ఉద్భోధించారు.
లీడ్ ఇండియా రూపశిల్పి:
25 జూలై 2002న రాష్ట్రపతి పదవిని చేపట్టి భారత తొలి పౌరుడిగా ‘ప్రజా రాష్ట్రపతి’గా పేరు తెచ్చుకున్నారు. భారత అత్యుత్తమ ‘భారత రత్న’ఆవార్డు పొందిన ఏకైక తొలి సైంటిస్ట్, బాచిలర్ కలాం అనంతరం రాష్ట్రపతిగా విశిష్ట సేవలు అందించారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన అనంతరం అబ్దుల్ కలాం ‘లీడ్ ఇండియా – 2020’ ఉద్యమాన్ని ప్రారంభించి ఐదేళ్ళలో 5 లక్షల యువతకు మార్గదర్శకం చేయాలనే లక్ష్యాన్ని ఛేదించుటకు కృషి చేశారు. నేటికీ కలాం స్థాపించిన ‘లీడ్ ఇండియా ఫౌండేయన్’ అనబడే 2వ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తన అభిమానులు ‘లీడ్ ఇండియా నేషనల్ క్లబ్స్’ వేదికగా యువతను సన్మార్గంలో నిలిపే పలు అసమాన్య సేవలను కొనసాగించడం హర్షదాయకం. అనేక అగ్ర విద్యాసంస్థలు ఐఐయం, ఐఐయస్‌సి, ఐఐఐటి, బిహెచ్‌యు, అన్నా విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ఫ్రొఫెసర్‌గా అమూల్య సేవలు, అనుభవసారాలు అందజేశారు. తన జీవితకాలంలో 40కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకోగలిగారు.
పురస్కారాలే పులకించిన వేళ:
అత్యుత్తమ పౌర పురస్కారం భారత రత్నతో పాటు పద్మవిభూషణ్, పద్మ భూషన్, ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత ఆవార్డు, వీర సావర్కర్, శస్త్ర రామానుజన్, వాన్ బ్రాన్ లాంటి పలు ఆవార్డులతో సన్మానాలు అందుకున్నారు. తన అనుభవాలను, ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్ధేశ్యంతో ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘ఇండియా-2020’, ‘ఇగ్నైటెడ్ మైండ్స్’, ‘ఇండామిటబుల్ స్పిరుట్స్’ లాంటి పలు పుస్తకాలు రచించారు. 26 జూలై 2015న ఐఐయం, షిల్లాంగ్‌లో విద్యార్థి యువతతో ముచ్చటిస్తూనే 83వ ఏట తుది శ్వాస విడిచిన ఏ. పి. జె. అబ్దుల్ కలాం జీవితం ఆసాంతం అనుసరణీయం, సదా స్మరణీయం.
బలమైన విజయకాంక్షతోనే అపజయాలను అధిగమించాలని, విద్య రెక్కలతోనే ఎదిగాలంటూ నినదించిన కలాం దార్శనికత పరమ పవిత్రం, ప్రగతికి ఇంధనం. ‘సక్సెస్ అంటే మన సంతకం ఆటోగ్రాఫ్‌గా మారాడమే’ అన్న కలాం ‘కల అంటే నిద్రలో వచ్చేది కాదని, నిద్ర పోనివ్వకుండా విజయం వరించే దాకా మనల్ని కార్యోన్ముఖులను చేసేది’ అని నమ్మిన అపూర్వ మూర్తిమత్వ నిధి మన అజేయ అబ్దుల్ కలాం సామాన్య ప్రజల మదిలో తిష్టవేసిన ప్రేరణామూర్తి, నిత్య చైతన్య స్పూర్తి.