
తె లుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అడపాదడపా వర్షా లు పడుతుండగా ఇంకొన్ని రోజుల్లో మరింత ఎక్కువగా వానలు కురుస్తాయి. అయితే ఈ సీజన్ వానలతో పాటు ఎన్నో వ్యాధులను వెంట తీసుకొస్తుంది. అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యానికి గురికాక తప్పదు. ఈ మాన్సూన్లో మన ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాహారం
ఈ సీజన్లో సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. వేటినైనా వండకుండా నేరుగా తింటే వైరస్, బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు సహా ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ఉడకబెట్టిన కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్, తాజా చేపలు, హెర్బల్ టీ సహా ఫైబర్, ప్రొటీన్లు ఉండే ఫుడ్ అధికంగా తీసుకోండి.
సరైన నిద్ర
ఈ సీజన్లో రోజుకు కనీసం 6-8 గంటలు నిద్ర తప్పనిసరి. నిద్రలేకపోతే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది.
విటమిన్ C
వైరల్ ఫీవర్, జలుబు, స్కిన్ అలర్జీలు సహా ఇతర మాన్సూన్ సమస్యల నుంచి కాపాడుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ C గల పుడ్స్ ఈ సీజన్లో తప్పక తీసుకోవాలి. నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీలు, ఆలు, బొప్పాయి, ద్రాక్ష వంటివి ఎక్కువగా తినండి.
జంక్ ఫుడ్/వేపుళ్లు
వర్షం పడుతుంటే చాయ్, బజ్జీలు సహా ఇతర స్నాక్స్ తినేందుకు మనం ఆసక్తి చూపిస్తాం. కానీ ఈ సీజన్లో జంక్ ఫుడ్స్, వేపుళ్లు సహా బయటి ఆహారానికి దూరంగా ఉండటమే మేలు. బయట అమ్మే పదార్థాలపై బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువ. అవి తింటే మనకు ఇబ్బంది తప్పదు.
శుభ్రత
వర్షాకాలంలో శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. శుభ్రత అంటే కేవలం మనం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవడమే కాదు. వండే కూరగాయలు కడగడం, నీటిలో బ్లీచింగ్ సహా ఇతర బ్యాక్టీరియా సంహారకాలు చల్లడం, కాచి వడకాచిన నీటిని తాగడం వంటివి పాటించండి.
స్కిన్ కేర్
ఈ కాలంలో అన్ని రకాల చర్మాల వారికి తేమ అధికంగా వస్తుంది. కాబట్టి మీ చర్మానికి తగ్గట్లు చర్మ సంరక్షణ చర్యలు చేపట్టండి.
వ్యాయామం
రోజూ కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఫలితంగా వైరస్లపై పోరాడేలా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఈ సీజన్లో ప్లాంక్స్, స్క్వాట్స్, జంపింగ్ రోప్ లేదా యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి.
రోగులకు దూరంగా..
వర్షాకాలంలో చాలామంది అనారోగ్యంపాలవుతుంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్తే మీరూ రోగాలబారిన పడవచ్చు. మీకు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
వర్షంలో నడవడం
వర్షంలో నడవడం వల్ల బురద నీరు చర్మానికి తాకి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. వీలైనంతవరకు వర్షం తగ్గి రోడ్లపై నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే బయటకు వెళ్లండి.
దోమల నుంచి రక్షణ
వర్షా కాలంలో చాలా వ్యాధులు దోమల కారణంగానే వస్తాయి. ఇవి ఏ సమయంలోనైనా ఎక్కడైనా కుడుతుంటాయి.
కాబట్టి ఇంట్లో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఇంట్లోకి దోమలు రాకుండా నివారణ చర్యలు చేపట్టండి.