Telugu Politics

BRS ఓటమికి కారణాలు ఇవేనా..?

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు’గా బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, ఉన్నా అవి లీకేజీకి గురవ్వడంతో పరీక్షలు రద్దు కావడం వల్ల రాష్ట్రంలోని దాదాపు 30 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను చవిచూసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం, సకాలంలో జీతాలు అందక డిఏ-ఐఆర్ బకాయిల చెల్లింపుల్లో సంవత్సరాల తరబడి ఆలస్యం, రిటైర్మెంట్ వయస్సు పెంపు, గడువుకు ముందే పీఆర్సీ వేయకపోవడం, పారదర్శకంగా బదిలీలు చేపట్టకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, ప్రభుత్వ టీచర్లు ఏ మాత్రం అంగీకరించని 317 జీఓ, సీఎం కేసీఆర్ వారిని తక్కువ చేసి అవమానించినట్టుగా మాట్లాడటం తదితర ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఓటమికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.

ఇక రైతుబంధులో భాగంగా ఎక్కువ ఎకరాలు ఉన్నోళ్లకు ఎక్కువ పైసలిస్తే, బక్క రైతుకు తక్కువ పైసలు ఇవ్వడం కూడా ఓ కారణం అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును పెద్ద రైతుకు ఇస్తారా లేక పేద రైతుకు ఇస్తారా? అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాకుండా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కొంతమందికి ఇచ్చి, మరికొంత మందికి చేతివాటం చూపడం కూడా బీఆర్‌ఎస్ ఓటమికి కారణం అన్నట్లు తెలుస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం, కొన్ని జిల్లాల్లో మంత్రివర్గాన్ని మార్చకపోవడం, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, మేనిఫెస్టో ప్రజలపై అంతగా ప్రభావం చూపకపోవడం కూడా బీఆర్‌ఎస్ ఓటమికి కారణాలని రాజకీయ నిపుణులు అంటున్నారు.
 
* కాంగ్రెస్ గెలుపుతో టీడీపీకి లాభమా?

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తమకు రాజకీయంగా కొంత ఉపశమనం కలిగిస్తుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలోని అనేక మంది రాజకీయ నేతలకు హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో ఒక వ్యాపారం ఉందని, వైసీపీ ప్రభావంతో బీఆర్ఎస్ తమను ఇబ్బంది పెడుతుందన్న అనుమానం తమ పార్టీ నేతల్లో ఉండేదని సీనియర్ నేతలు నుంచి ఓ వాదన ఉంది. అంతేకాదు ఇప్పుడు అలాంటి ఒత్తిళ్లు తగ్గిపోతాయని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు గతంలో రేవంత్ రెడ్డి టీడీపీకి చెందడం, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడం టీడీపీ శ్రేణులకు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాలను బట్టి ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కాంగ్రెస్‌ పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Show More
Back to top button