CINEMATelugu Cinema

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఒక అధ్యాయం… బి.ఆర్.పంతులు

కళాత్మక వ్యాపారమైన చలనచిత్ర నిర్మాణంలో ఖర్చు చేయబడే మొత్తాన్ని బట్టి ఎక్కువ బడ్జెట్ సినిమాలు మరియు తక్కువ బడ్జెట్ సినిమాలు అని రెండు రకాలు ఉన్నాయి. ప్రముఖ నటీనటులతో, సాంకేతిక నిపుణులతో ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన సెట్టింగులను ఉపయోగిస్తూ కన్నుల పండుగగా రూపొందేది ఎక్కువ బడ్జెట్ సినిమా. తగుమాత్రం నిధులతో, సినిమా రంగం మీద మోజుతో సినిమా నిర్మాతలుగా అవతరించే కొత్తవారు, ఆర్థికంగాఒక మోస్తరుగా ఉండేవారు తమకు గల పరిమితులకు లోబడి తక్కువ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంటారు.

ప్రస్తుత కాలంలో 70 లక్షల నుండి రెండు, మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే సినిమాలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. ఓ మోస్తరు పేరున్న కథానాయకుడు, కథానాయికలతో గానీ, లేక కొత్తవారితో గానీ ఇటువంటి సినిమాలు నిర్మితమవుతాయి. 1950 – 60 ప్రాంతాల్లో ఇలాంటి రెండు రకాల చిత్రాలు (ఎక్కువ బడ్జెట్ చిత్రాలు, తక్కువ బడ్జెట్ చిత్రాలు) నిర్మించి విజయం సాధించింది “పద్మిని పిక్చర్స్” బ్యానర్‌ వారు. అది స్థాపించిన అధినేత బూదగురు రామకృష్ణయ్య పంతులు (బి.ఆర్. పంతులు). ఆయన “పద్మిని పిక్చర్స్” బ్యానరును స్థాపించి తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలు నిర్మించి విజయం సాధించారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జన్మించి బడిపంతులుగా చేరి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠాలను బోధిస్తూనే నటనపట్ల తనకున్న ఆసక్తితో నాటకరంగంలో చేరిన బి.ఆర్. పంతులు అనేక నాటకాలను ప్రదర్శించారు, నాటక సంస్థను కూడా స్థాపించారు. నాటకాలలో నటించి రంగస్థల నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత సినిమా నటన మీద అనురక్తి ఏర్పడటంతో ఆయన నటించగా పేరు వచ్చిన “సంసార నౌక” నాటకాన్ని సినిమా తీస్తే “సంసార నౌక” కన్నడ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. తరువాత కొన్ని చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తూ, నిర్మాతగా, దర్శకుడిగా నాలుగు భాషా చిత్రాల్లోనూ రాణించారు. త్రిభాషా చిత్రాల (కన్నడ, తమిళ, తెలుగు) దర్శక నిర్మాతగానూ పేరుతెచ్చుకున్నారు బి.ఆర్.పంతులు. స్కూల్ మాస్టర్, శ్రీ కృష్ణదేవరాయ, కర్ణన్, వీరపాండియ కట్టబొమ్మన్, కిత్తూరు చెన్నమ్మ , కళ్యాణం పన్నియుం బ్రహ్మచారి, ఆయిరతిల్ ఒరువన్, పిల్లలు చెప్పిన చల్లని రాజ్యం మొదలైన అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను బి.ఆర్.పంతులు రూపొందించారు.

ఒక రంగస్థల సంస్థ క్రింద 1950లో చిత్రనిర్మాత పి.పుల్లయ్య భాగస్వామ్యంతో బి.ఆర్. పంతులు నిర్మించిన తమిళ చిత్రం మాచరేఖాయ్‌. ఆయన రచయిత పి. నీలకంఠన్‌తో కలిసి “పద్మిని పిక్చర్స్” అనే సంస్థను ప్రారంభించి, 1954లో “కళ్యాణం పన్నియుం బ్రహ్మచారి” అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. కన్నడ చిత్రం రత్నగిరి రహస్య (1957) తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన బి.ఆర్. పంతులు “పద్మిని పిక్చర్స్” బ్యానర్‌పై స్కూల్ మాస్టర్ (1958), కిత్తూరు చెన్నమ్మ (1961) మరియు శ్రీ కృష్ణదేవరాయ (1970) అనే కన్నడ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అజరామర చిత్రాలుగా నిలిచిపోయాయి.

నందమూరి తారకరామారావును కె.వి. రెడ్డి శ్రీకృష్ణుడిగా చేసినట్లు, కన్నడలో రాజ్ కుమార్ ను శ్రీకృష్ణ దేవరాయలును చేసింది బి.ఆర్. పంతులు. బ్రిటీషు వారిని ఎదురించిన వీరపాండ్య కట్ట బొమ్మన్, కిత్తూరు చెన్నమ్మ,  చిదంబరం పిల్లై మొదలగు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తెరకెక్కించినది కూడా బి.ఆర్. పంతులు. తమిళంలో శివాజీ గణేశన్, యం.జి.ఆర్ లకు సమంగా విజయాలను అందించినది కూడా బి.ఆర్.పంతులు. విజయనగర రాజు కృష్ణదేవరాయల ప్రధానమంత్రి తిమ్మరుసు పాత్రలో ఆయన నటించిన ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఆ సమయంలో అది ఒక పెద్ద వాణిజ్య విజయం. తన “పద్మిని పిక్చర్స్” బ్యానర్‌పై బి.ఆర్. పంతులు అన్ని దక్షిణ భారత భాషలలో మొత్తం 57 చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  బూదగురు రామకృష్ణయ్య పంతులు

ఇతర పేర్లు  :  బి.ఆర్. పంతులు 

జన్మదినం :  26 జూలై 1910

స్వస్థలం :     రాళ్లబుడగురు, ప్రస్తుత చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి   :      నటుడు, దర్శకుడు, నిర్మాత 

జీవిత భాగస్వామి  :   బి. ఆర్ కమలమ్మ (బిఆర్ అందాలమ్మాళ్) 

పిల్లలు   :    ఇద్దరు (కూతురు, కొడుకు)

మరణ కారణం  :   అనారోగ్యం 

మరణం :    08 అక్టోబర్ 1974, 

బెంగుళూరు, భారతదేశం

నేపథ్యం…

బడగూర్ రామకృష్ణయ్య పంతులు (బి.ఆర్.పంతులు) 26 జూలై 1910 నాడు బ్రిటిష్ ఇండియాలోని పూర్వ మద్రాసు ప్రెసిడెన్సీలోని ఉత్తర ఆర్కాట్‌లోని రాళ్లబుడగూరు గ్రామంలో (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో) జన్మించారు. బి.ఆర్.పంతులు పదహారణాల అచ్చమైన తెలుగువారు. తాను చదువు పూర్తిచేసుకుని బడిపంతులుగా ఉద్యోగం సంపాదించి, కుప్పంలో పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన పిల్లలకు పాఠాలు చెప్పడం కంటే ఎక్కువగా నాటకాల గురించి విద్యార్థులకు బోధిస్తూ ఉండేవారు.

విద్యార్థులకు కూడా పాఠాల కంటే రామకృష్ణయ్య పంతులు చెప్పిన నాటకాల విశేషాలు, నాటక సంభాషణలు బాగా నచ్చాయి. దాంతో మాస్టారంటే పిల్లలకి అమితమైన గౌరవం ఏర్పడింది. ఇది పాఠశాల యజమాన్యానికి నచ్చలేదు. నాటకరంగం గురించి విద్యార్థులకు పాఠాల రూపంలో చెప్పవద్దని వారు పంతులు హెచ్చరించారు. యాజమాన్యం చెప్పినా కూడా వినకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. దాంతో వారు తొలగించేది ఎందుకని నేనే తప్పుకుంటానని పంతులు ఉద్యోగానికి రాజీనామా చేశారు. నిజానికి తన పెద్దవారి పోరు భరించలేక బడిపంతులు ఉద్యోగానికి వెళ్లారు, కానీ పంతులు మనసంతా నాటకాల మీదనే ఉండేది. ఉద్యోగం మానేసిన పంతులు నాటక రంగాన్నే నమ్ముకున్నారు.

నాటకాలలో…

ఆ రోజులలో నాటకాలు వ్యాపారాత్మకంగా నడిచేవి. అలాంటి నాటక సంస్థలు కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి. అలా 1930 ప్రాంతంలో పీర్ సాహెబ్ నడిపుతున్న చంద్రకళా నాటక మండలిలో బి.ఆర్.పంతులు చేరారు. “సంసార నౌక”, “సదారమి”, “గులేబకావళి” లాంటి నాటకాలలో పంతులు నటిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఈ నాటకాలకు విరామం వచ్చినప్పుడు “గుబ్బి వీరన్న” నాటక సంస్థ ప్రదర్శించే “శ్రీ కృష్ణ గారడి” వంటి నాటకాలలో కూడా నటిస్తుండేవారు. హోస్పేట పరిసర ప్రాంతాల్లో నాటకాలు జరిగుతున్నప్పుడు సాయంకాలం వేళ తన సైకిల్ వేసుకొని హంపికి వెళుతుండేవారు. హంపి శిల్పాల దగ్గర కూర్చొని ఎప్పటికైనా ఇక్కడి చరిత్రను సినిమా తీయాలని కలగనేవారు. కొద్దిరోజులు నాటక సంస్థలలో పనిచేసిన బి.ఆర్.పంతులు తానే సొంతంగా కళాసేవ నాటక మండలిని స్థాపించి, తానే సొంతంగా నాటకాలు వ్రాసి ప్రదర్శించారు. ఇలా అయిదు సంవత్సరాలు తన నాటకరంగంలో కొనసాగిన పంతులు సినిమాలలో చేరాలనుకున్నారు.

సినిమారంగం…

అప్పుడప్పుడే టాకీ సినిమాల వేగం పెరగుతున్న సమయంలో ఆయన మద్రాసుకు చేరుకున్నారు. దేవి ఫిలిమ్స్ అనే సంస్థ “సంసార నౌక” అనే నాటకాన్ని సినిమాగా తీయడానికి  సన్నాహాలు ప్రారంభించింది. ఆ “సంసార నౌక” అనే నాటకాన్ని చంద్రకళ నాటకసంస్థ వారు ప్రదర్శించేవారు. ఆ నాటకంలో పంతులు ప్రధాన పాత్రధారిగా వేషం వేసేవారు. “సంసార నౌక” సినిమాకు ముందు వరకు కన్నడంలో మూడు టాకీ సినిమాలు మాత్రమే నిర్మాణమయ్యాయి. ఆ మూడు సినిమాలు కూడా పౌరాణికాలే. నాలుగవ కన్నడ టాకీ చిత్రంగా, కన్నడ తొలి సాంఘిక చిత్రంగా “సంసారం నౌక” రికార్డులకెక్కింది. “సంసారం నౌక” అనే రంగస్థలం నాటకానికి దర్శకత్వం వహించిన “హెచ్.ఎల్.యన్ సిన్హా” ను దేవి ఫిలిమ్స్ వారు “సంసారం నౌక” అనే సినిమాకి దర్శకుడుగా ఎంచుకున్నారు. ఆయన తరువాత రోజులలో కొన్ని కన్నడ తెలుగు సినిమాలకు దర్శకత్వం చేశారు కూడా. 

“సంసారం నౌక” నాటకంలో నటించిన చాలా మందిని నటీనటులను సినిమాలలో కూడా ఎంపిక చేశారు. ఆ సినిమాలో నాయకా నాయికలుగా బి.ఆర్.పంతులు, యం.వి. రాజమ్మ. వీరు ఆ తరువాత రోజులలో అనేక చిత్రాలలో నటించారు. పౌరాణిక నాటకాలే అన్ని భాషలలో తొలి సినిమాలు అవుతున్న ఆ రోజులలో “సంసార నౌక” కన్నడ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది, ఆకర్షించింది. ఈ సినిమాలో దర్శకుడు హెచ్.ఎల్.ఎన్. సిన్హా కూడా ఒక పాత్రలో కనిపిస్తారు. 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ రోజులలో నిర్మించిన ఈ సినిమా సుమారు రెండున్నర లక్షలు సంపాదించింది. సంసారం నౌక చిత్రం అంత గొప్ప విజయం సాధించింది. అంత గొప్ప విజయం సాధించింది కాబట్టి హీరోగా నటించిన బి.ఆర్. పంతులు నటజీవితం మహోధృతంగా కొనసాగి ఉండాలి. కానీ ఆయన ప్రస్థానం కన్నడ సినిమా రంగంలో వేగం అందుకోలేదు. అందువలన కన్నడ సినిమారంగంలో బి.ఆర్.పంతులు సినిమాలు సంవత్సరానికి ఒకటి విడుదలవుతూ వచ్చాయి.

తెలుగు చిత్రం భక్తిమాలలో…

బి.ఆర్. పంతులు ఆ రోజులలో మద్రాసులో నివాసం ఉండేవారు. అప్పటికి తన ఊరివాడు చిత్తూరు నాగయ్య కథానాయకుడు అయిపోయారు. అందువలన ఆయన సిఫారసుతో సినిమాలలో ఏమైనా వేషాలు దొరుకుతాయేమోనని చిత్తూరు నాగయ్య దర్శనం కోసం ఆయన కార్యాలయం ముందు బి.ఆర్.పంతులు గంటల తరబడి నిలబడి ఉండేవారు. అయినా అప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తరువాత సుమారు నాలుగు సంవత్సరాలకు బి.ఆర్.పంతులు దర్శకులు అయ్యాక చిత్తూరు నాగయ్య ఆర్థిక ఇబ్బందులలో ఉంటే ఆయనకు సహాయం చేస్తూ తన సినిమాలలో అవకాశం ఇచ్చేవారు బి.ఆర్. పంతులు. ఆయన తెలుగులో నటించిన సూటి చిత్రం “భక్తి మాల” (1941). ఇది పౌరాణిక ఛాయలు ఉన్న సాంఘిక చిత్రం. ఇందులో ఒక ప్రధాన పాత్ర అద్దంకి శ్రీరామమూర్తి, రెండవ ప్రధాన పాత్ర బి.ఆర్.పంతులు. మాటలు వ్రాసింది గిడుగు రామ్మూర్తి పంతులు అబ్బాయి గిడుగు సీతాపతి పంతులు. ఈయన భక్తి మాల” లో హీరో తండ్రిగా నటించారు.

యం.వి.రాజమ్మ నిర్మాణంలో “రాధా రమణ”…

“రాధా రమణ” (1943) కన్నడ చిత్రంలో బి.ఆర్.పంతులు, ఎం.వి.రాజమ్మ నాయకా, నాయికలు. కథానాయిక యం.వి.రాజమ్మ ఈ సినిమాకు నిర్మాత. ఈమె కన్నడ సినిమా రంగంలో మొట్టమొదటి మహిళా నిర్మాత. అప్పటికి ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. బి.ఆర్.పంతులు కథానాయకుడుగా నటించిన ఈ సినిమా ద్వారా టి.యన్. బాలకృష్ణ (తిరుమకూడలు నరసిపుర బాలకృష్ణ), కన్నడ భీష్మగా పేరున్న జి.వి. అయ్యర్ (గణపతి వెంకటరమణ అయ్యర్) లు వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే అరుదైన చిత్రాలకు దర్శకుడైన వై.వి.రావు తెరకెక్కించిన తమిళ, తెలుగు సినిమా తహశీల్దార్ (1944) లో బి.ఆర్.పంతులు నటించారు. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తే, తమిళ చిత్రం “లవంగి” (1945)లో షాజహాన్ గా నటించారు. ఆయన కన్నడ సినిమా రంగంలో అనేక చిత్రాలలలో నటిస్తూ వస్తున్నా కూడా ఇతర భాషా చిత్రాలలో చెదురుబొదురుగా నటిస్తూ ఉండడం వలన మిగతా నటుల వేగాన్ని అందుకోలేకపోయారు. 1947లో విడుదలైన “నామ్ ఇరువర్” తమిళ  చిత్రంలో బి.ఆర్.పంతులు కీలకపాత్రలో నటించారు. దీనిని ఏ.వి.యం ప్రొడక్షన్స్ అధినేత  ఏ.వి.మెయ్యప్పన్ చెట్టియార్ దర్శకత్వం వహించి, నిర్మించారు.

పద్మిని పిక్చర్స్ స్థాపించి తానే నిర్మాతగా…

ఆ తరువాత ప్రముఖ గాయకుడు నటుడు టి.ఆర్. మహా లింగం స్థాపించిన “సుకుమార్ ప్రొడక్షన్” సంస్థలో భాగస్వామిగా చేరి నిర్మించిన మొదటి చిత్రం మచ్చ రేకై (1950) సినిమాలో బి.ఆర్. పంతులు నటించారు. తెలుగు దర్శకులు పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు. దానిలో కథానాయకుడు టీ.ఆర్.మహాలింగం మాచరాజుగా నటించారు. తండ్రిగా బి.ఆర్.పంతులు అభినయించారు.  ఇందులో చిన్నప్పటి మాచరాజుగా నటించిన బాల నటి “విజయనిర్మల”. ఆ తరువాత 1953లో వచ్చిన తమిళ చిత్రం “మారుమగల్” (తెలుగులో అమ్మలక్కలు).

తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో తెరకెక్కించిన “మారుమగల్” (తెలుగులో అమ్మలక్కలు) చిత్రంలో వయస్సు మళ్ళిన పాతలో బి.ఆర్.పంతులు నటించారు. అప్పటికే బి.ఆర్. పంతులు వయస్సు 43 సంవత్సరాలు. పంతులు సినీరంగ ప్రవేశం చేసిన 1935 నుండి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలలో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలలో, కొన్నిసార్లు ప్రధాన పాత్రలలో నటిస్తూ  కొనసాగిన బి.ఆర్.పంతులు 1953 చివరలో పద్మిని పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఈ పద్మిని పిక్చర్స్ బ్యానర్ పైన బి.ఆర్. పంతులు నిర్మించిన తొలి చిత్రం ”       కల్యాణం పన్నియుం బ్రహ్మచారి”. ఈ సినిమాలలో తాను నటించకుండా కేవలం నిర్మాతగానే ఉండిపోయారు. ఈ సినిమాకు ఎదురైన కోర్టు కేసుల వలన ఆయన ఈ సినిమాలో నటించలేకపోయారు.

వివాదాస్పదంగా “కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి”…

“కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి” సినిమాతో బి.ఆర్. పంతులును కోర్టుకు లాగింది ప్రముఖ పండితులు వేదము వేంకటరాయ శాస్త్రి మనుమడు వేదము వేంకటరాయ శాస్త్రి. తన తాత పేరు తనకు పెట్టారు. తాత వేంకటరాయ శాస్త్రి అనేక కావ్యాలు వ్రాశారు. ముఖ్యంగా ఆయన వ్రాసిన “ప్రతాపరుద్రీయం” అత్యధిక సార్లు ప్రదర్శించబడిన రంగస్థల నాటకంలో ఒకటి. మనవడు వేంకటరాయ శాస్త్రి తన సోదరులతో కలిసి “వేదము వెంకటరాయశాస్త్రి బ్రదర్స్” పేరుతో పుస్తకాల ప్రచురణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు పుస్తకాలను అచ్చు వేశారు. మద్రాసులోనే నివసిస్తున్న మనవడు వెంకటరాయ శాస్త్రి కూడా రచయిత కావడం, ఆయన వ్రాసిన వ్యామోహం అనే నాటకం 1950 సంవత్సరాలలో అనేకచోట్ల ప్రదర్శింపబడుతూ ఉండేది.

తన కథ కాపీ చేశారు అని బి.ఆర్. పంతులుకు వకీలు ద్వారా కేసు వేసేసి నోటీసులు పంపించారు వేదము వెంకటరాయ శాస్త్రి. నిజానికి గొడవలు, తగాదా పెట్టుకునే స్వభావం ఉన్నవారు కాదు. వారు సౌమ్యులు. బి.ఆర్.పంతులు తీస్తున్న “కళ్యాణం పన్నియమ్ బ్రహ్మచారి”  సినిమాకు కథ ఇచ్చిన వ్యక్తి గోవిందన్ కిండర్ గార్టెన్. ఈయన “వ్యామోహం” అనే నాటకం చూశారో లేక చూడకుండానే కథ వ్రాశారో తెలియదు. అయినా కూడా వెంకటరాయ శాస్త్రితో మధ్యవర్తి ద్వారా రాయబారం నడిపి రాజీకి వచ్చి పెద్దమొత్తంలో సొమ్ము ముట్టజెపారు బి.ఆర్.పంతులు. కథ వ్రాసిన వారి పేరు తన పేరు వేయాలని వేదము వెంకటరాయ శాస్త్రి కోరుకున్నారు. అందుకు బి.ఆర్.పంతులు ఒప్పుకోలేదు.

వెంకటరాయ శాస్త్రి కోర్టుకు వెళ్లారు. క్రింది న్యాయస్థానంలో ఓడిపోయి పై న్యాయస్థానంకు వెళ్లారు. అక్కడ తన నాటకంలోని కొన్ని దృశ్యాలను వెంకటరాయ శాస్త్రి జడ్జి గారికి నటించి చూపించారు. అది చూసిన ఆయన ఈ విచారణ హాస్యస్పదంగా ఉందన్నారు. అక్కడా కూడా కేసు నిలబడలేదు. అందువలన 13 ఏప్రిల్ 1954 నాడు విడుదలైన “కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి” సినిమా  ఘనవిజయం సాధించింది. ఒక సినిమా నటుడిగా కంటే  “కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి” సినిమా కోర్టు సమస్య ద్వారానే బి.ఆర్. పంతులు చాలామందికి తెలిశారు. ఈ సినిమా తెచ్చిన లాభాలతో ఆయన మరణించే వరకు సినిమాలు నిర్మించారు. అఖరు రెండేళ్లలో దర్శకుడుగా కూడా మారారు.

వదిన సినిమాలో కన్నాంబకు జోడీగా…

తన మొదటి రెండు పద్మిని పిక్చర్ సినిమాలలో నీలకంఠన్ భాగస్వామిగా ఉన్నారు. తరువాత రోజులలో బి.ఆర్.పంతులు ఒక్కరే “పద్మిని పిక్చర్స్” ను చివరి వరకు పంతులు కొనసాగించారు. “కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి” సినిమా విజయంతో హిందీలో వచ్చిన పహేలీ తారిఖ్ (1954) చిత్రాన్ని కన్నడ, తమిళ రెండు భాషల్లోనూ పునఃనిర్మాణం ప్రారంభించారు. తమిళంలో “ముధల్ తేతి” ,కన్నడలో “మొదల తేది” పేర్లతో తమిళంలో శివాజీ గణేషన్, అంజలీదేవి నాయికా నాయకులు, అలాగే కన్నడంలో బి.ఆర్ పంతులు, యం.వి రాజమ్మ నాయికా నాయికలు. రెండు భాషలలో తారాగణ బృందాలతో, రెండు భాషల్లో సమాంతర చిత్రీకరణ. రెంటిలోనూ నిర్మాత, ఒక భాషలో కథానాయకులు బి.ఆర్. పంతులు.

అంత పెద్ద సాహసం చేసి ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ప్రయోగాలు చేసుకుంటూ వెళుతుండేవారు.  రెండు సినిమాలు మార్చి 1955లో విడుదలయ్యాయి. ఆ సంవత్సరమే ఏ.వి.యం వారు నిర్మించిన తెలుగు సూటి చిత్రం “వదిన” లో ప్రధాన పాత్రలో నటించారు బి.ఆర్. పంతులు. అందులో అక్కినేని నాగేశ్వరావు అంజలి హీరో హీరోయిన్లు. అయితే కథానాయిక అన్నగా బి.ఆర్ పంతులు నటించారు. వదిన పాత్రలో కన్నాంబ నటించారు. ఇది కూడా శతదినోత్సవ చిత్రం అయ్యింది. పంతులు నటుడిగా ఇతర సినిమాలలో నటించింది రెండు మూడు చిత్రాలలో మాత్రమే. తన సొంత నిర్మాణ సంస్థలో తాను ఖాళీ లేకుండా సినిమాలు నిర్మిస్తూ ఉండడం వలన చాలావరకు ఆయన తన “పద్మిని పిక్చర్స్” సినిమాలలో నటుడిగానే పరిమితం అయ్యారు.

దర్శకుడిగా…

బి.ఆర్.పంతులు నిర్మాతగా మారిన రెండు సంవత్సరాలకే ద్విభాష చిత్రం తమిళంలో తంగమలై రాగసియం, కన్నడలో రత్నగిరి రహస్యంగా రెండు సినిమాలు ప్రారంభించినప్పుడు తమిళంలో భాగస్వామిగా నిర్మాతగా పళనియాండి నీలకంఠన్ (పి.నీలకంఠన్) దర్శకులు, కనడంలో బి.ఆర్ పంతులు దర్శకులు. తమిళ చిత్రం సగ భాగం పూర్తయిన తరువాత భాగస్వామి దర్శకులు అయిన పి.నీలకంఠన్ దర్శకత్వ బాధ్యతల నుండి ప్రక్కకు తప్పుకున్నారు. దాంతో ఈ రెండు చిత్రాల దర్శకత్వ బాధ్యతలు పంతులు మీదే పడ్డాయి. అలాగే కన్నడ సినిమాలో బి.ఆర్. పంతులు ఒక కీలకమైన పాత్రలో నటించారు. తమిళంలో చిత్రీకరిస్తున్న “తంగమలై రాగసియం” లో శివాజీ గణేషన్, జమున నటించగా, టి.ఆర్.రాజకుమారి ప్రధాన పాత్ర పోషిస్తే, కనడంలో ఉదయ్ కుమార్, జమున, సౌకార్ జానకి, బి. సరోజాదేవి ప్రధాన పాత్రలో నటించారు. శివాజీ గణేషన్ తొలిసారి టార్జాన్ పాత్రలో కనిపించింది “తంగమలై రాగసియం” అనే తమిళ చిత్రంలోనే. ఈ సినిమా రెండు భాషలలో విజయవంతం అవ్వడమే కాకుండా తమిళ భాషనుండి ఇతర భాషలోకి అనువదించబడింది. కన్నడంలో 26 ఫిబ్రవరి 1957, తమిళంలో 29 జూన్ 1957 నాడు విడుదలైన ఈ చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

మరో రజతోత్సవం “వీరపాండియ కట్టబొమ్మన్”.

పద్మిని పిక్చర్స్ బ్యానరుపై బి.ఆర్.పంతులు నిర్మించిన భారీ తమిళ చిత్రం “వీరపాండియ కట్టబొమ్మన్”. ఇది తమిళ భాషా చారిత్రాత్మక యుద్ధ చిత్రం. పద్మనీ పిక్చర్స్ పతాకం పై శివాజీ గణేషన్ చలనచిత్ర జీవితంలోనే కాకుండా దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే “వీరపాండియ కట్టబొమ్మన్” సినిమా ఒక అధ్యాయం. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక స్వాతంత్ర్య సమరయోధుడి ఆధారంగా నిర్మించబడిన తొలి చిత్రం కూడా “వీరపాండియ కట్టబొమ్మన్”. భారీ సెట్టింగులతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికి నిర్మాతగా బి.ఆర్. పంతులు అనుభవం ఐదేళ్లు మాత్రమే. సొంత స్టూడియో లేదు. అంత పెద్ద వ్యవస్థ కూడా ఆయనకు లేదు. ఈ సినిమా కలర్ ఫిలిం ప్రాసెసింగ్ లండన్ లో చేయించారు  బి.ఆర్.పంతులు. భారతదేశంలో విడుదలకు ముందే లండన్ లో ప్రీమియర్ షో ప్రదర్శించబడిన తొలి దక్షిణాది చిత్రం కూడా “వీరపాండియ కట్టబొమ్మన్”. ఈ సినిమా ప్రకటించిన విడుదల తేదీని అందుకోవడానికి పంతులు లండన్ లోని రీళ్ళను తీసుకురావడానికి చార్ట్టెడ్ విమానం తీసుకున్నారు. ఈ సినిమా 16 మే 1959 నాడు విడుదల అయ్యింది. స్కూల్ మాస్టర్ సినిమాను సిల్వర్ జూబ్లీ చేసిన ప్రేక్షకులు “వీరపాండియ కట్టబొమ్మన్”. చిత్రాన్ని కూడా సిల్వర్ జూబ్లీ చేసేశారు.

“కప్పలోట్టియ తమిజన్” (1961) సినిమా…

ప్రతీ నెల 7వ తారీకున జీతాలు తప్పనిసరిగా ఇచ్చేవారు బి.ఆర్. పంతులు. అలా జీతాలు ఇవ్వాలంటే తాను సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉండాలని అనేవారు. అనుకున్న సమయానికి జీతాలు ఇవ్వడం కోసం పంతులుగారు కొన్నిసార్లు అధిక వడ్డీలకు కూడా డబ్బులు తెచ్చేవారు. ఒక్కసారి మద్రాసులో తనకున్న మూడు ఇళ్లలో ఒక ఇల్లును కూడా అమ్మేశారు. ఇలా భారీ చిత్రాలు నిర్మించిన తరువాత బి.ఆర్. పంతులు 1960 వ సంవత్సరంలో చిన్న పిల్లలతో తెలుగు, తమిళ, కన్నడలో పిల్లలతో బాలల చిత్రం తెరకెక్కించారు. మూడు భాషలలో చిత్రాలు సమాంతరంగా తెలుగు తారాగణంతో తెలుగు చిత్రాన్ని, తమిళ తారాగణంతో తమిళ చిత్రాన్ని, కన్నడ తారాగణంతో కన్నడ చిత్రాన్ని సమాంతరంగా నిర్మిస్తూనే అందులో తాను నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ ఉండేవారు.

తెలుగులో పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, కన్నడంలో మక్కల రాజ్యం (పిల్లల  రాజ్యం), తమిళంలో కుజంధైగల్ కండ కుడియరసు (పిల్లల గణతంత్రం) గా బి.ఆర్. పంతులు తెరకెక్కించారు. తన స్వీయ నిర్మాణంలో అలనాటి హీరో, హీరోయిన్లకు తన సినిమాలతో ప్రతీ ఒక్కరికి ఒక మైలురాయి ఇచ్చారు. అలాంటిదే పి.సరోజ దేవి సినీ జీవితంలో “కిత్తూరు చెన్నమ్మ” (1961). పంతొమ్మిదవ శతాబ్దం తొలి దశాబ్దాలలో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని 1961 లో విడుదల చేస్తే, మరొక కథతో తమిళంలో శివాజీ గణేషన్ ప్రధాన పాత్రధారిగా “కప్పలోట్టియ తమిజన్” (1961) సినిమా నవంబరులో 1961లో విడుదలైంది.  వి.ఓ. చిదంబరం పిళ్లై పాత్రలో శివాజీ గణేషన్ నటించారు. ఎం.పీ. శివజ్ఞానం 1944లో రచించిన చిదంబరం పిళ్లై జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని బి.ఆర్. పంతులు తెరకెక్కించారు.

కర్ణన్…

ఇలా ఒకవైపు చారిత్రాత్మక చిత్రాలు తెరకెక్కిస్తూనే బి.ఆర్. పంతులు మధ్యలో “శబాష్ మీనా”, హిందీలో “దిల్ తేరా దీవానా”, “అమర్ షహీద్” లాంటి చిత్రాలను కూడా దర్శకత్వం చేశారు. పద్మినీ పిక్చర్స్ బ్యానరులో బి.ఆర్. పంతులు తెలుగులో నటించిన చిట్టచివరి చిత్రం “పెంపుడు కూతురు”. ఎన్టీఆర్, జానకి, దేవకి ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 06 ఫిబ్రవరి 1963 నాడు విడుదలైంది. ఈ చిత్రం అదే బ్యానరుపై మరియు అదే దర్శకుడు (బి.ఆర్. పంతులు) కన్నడలో “సాకు మగలు” అనే పేరుతో ఏకకాలంలో నిర్మించారు. ఈ చిత్రం ద్వారానే కన్నడ లేడీ సూపర్ స్టార్ “కల్పన” ను పరిచయం చేశారు. బి.ఆర్.పంతులు (పద్మిని పిక్చర్స్) సినీ జీవితంలో మరొక కలికితురాయి 1964 సంక్రాంతికి విడుదలైన “కర్ణన్”. ఇది తెలుగు డబ్బింగ్ “కర్ణ”. ఇద్దరు భారత సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, శివాజీ గణేషన్. తాను ఇద్దరినీ నటింపజేసి కర్ణుడిగా ప్రధాన పాత్రధారిగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ఇది. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో కర్ణన్ చిత్రం “నభూతో న భవిష్యతి”. కర్ణన్ చిత్రం జైపూర్‌లోని రాజభవనాలలో చిత్రీకరించబడింది. అలాగే యుద్ధ సన్నివేశాలను కురుక్షేత్రలో చిత్రీకరించారు. ఇందులోభారత సైన్యానికిచెందిన కొంతమంది సైనికులు ఉన్నారు. ఈస్ట్ మన్ కలర్ లో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం “కర్ణన్”.

“ఆయిరతిల్ ఒరువన్” రజతోత్సవం…

భారీ చిత్రాల నిర్మాణానికి కొంచెం విశ్రాంతినిచ్చి బెంగాలీలో వచ్చిన చిన్న కథ “మానే నా మానే” ఆధారంగా కన్నడంలో తమిళంలోనూ సమాంతరంగా నిర్మించిన చిత్రం “చిన్నాడ గొంబే”. ఈ సినిమాలో 16 సంవత్సరాల అమ్మాయి నటించింది. ఆమెనే తరువాత రోజులలో జయలలిత. ఆమె నటిమణి సంధ్య (వేదవల్లి) కూతురు. జయలలితకు తన చిత్రంలో కథానాయికగా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు బి.ఆర్. పంతులు. “చిన్నాడ గొంబే” కు సమాంతరంగా మరుదన్మోత్తుగా  నిర్మించారు బి.ఆర్ పంతులు. ఆయన ఒక సినిమా తరువాత ఇంకొక సినిమాకు వైవిధ్యభరితంగా కథలు ఎంపిక చేసేవారు. ఇది సమకాలీన దర్శకులకు ఆశ్చర్యానికి గురిచేసేది. ఒకసారి ఒక సినిమా విజయం సాధిస్తే మళ్లీ అలాంటి సినిమా తీసేవారు కాదు పంతులు. మరొక కొత్త రకం కథతో ప్రయోగాలు చేసేవారు. “చిన్నాడ గొంబే” తరువాత ఆయన తమిళంలో తీసిన సినిమా కథ నేపథ్యం పూర్తిగా భిన్నమైంది. 

శివాజీ గణేషన్ తో సినిమాలు తీస్తూ వచ్చిన పంతులు, ఎం.జీ.ఆర్ కథానాయకుడుగా పద్మిని పిక్చర్స్ పతాకంపై తన దర్శక నిర్మాణంలో “ఆయిరతిల్ ఒరువన్” తెరకెక్కించారు. సినిమా నిర్మాణ సమయానికి యం.జి.ఆర్ అగ్ర కథానాయకులు, జయలలిత నూతన నటి. “ఆయిరతిల్ ఒరువన్” జూలై 1965 లో విడుదలైన 150 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శితం అవుతూ విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. ప్రేక్షకులు అంతవరకు చూడని ప్రపంచాన్ని వెండితెరపై చూశారు. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతంలోని పాటలు ఇప్పటికీ కూడా సూపర్ హిట్ పాటలే. ఈ చిత్రం డిజిటలైజ్డ్ చేసి 50 సంవత్సరాల తరువాత 2014లో విడుదల చేస్తే 175 రోజులకు పైగా నడిచి విజయవంతమైంది. ఈ సినిమా నుండి బి.ఆర్.పంతులు, ఎం.జీ.ఆర్ మధ్య స్నేహం కుదిరింది. యం.జి.ఆర్ ను 1967 లో యం.ఆర్. రాధ తుపాకీతో కాల్చే సమయానికి యం.జి.ఆర్, జయలలిత కలయికలో చిత్రీకరణ జరుగుతున్న “రాగసియా పోలీస్ 115” నిర్మాణ దశలో ఉంది.  అది జరిగిన సరిగ్గా సంవత్సరానికి 11 జనవరి 1968 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసి విజయం సాధించారు బి.ఆర్. పంతులు.

వసూళ్ల సునామీ “స్కూల్ మాస్టర్”…

బి.ఆర్. పంతులు 1936 కన్నడ చలనచిత్రం సంసార నౌకలో నటుడిగా అరంగేట్రం చేసిన తరువాత సరిగ్గా 22 సంవత్సరాల తరువాత “స్కూల్ మాస్టర్” అనే కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అనేక రికార్డులకు నాంది పలికింది. ఈ చిత్రంలో బి.ఆర్.పంతులు, యం.వి.రాజమ్మలు ప్రధాన పాత్రలు పోషిస్తే, ఇదే చిత్రం తెలుగులో బడి పంతులు (1972) గా పునః నిర్మించబడి పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. రజతోత్సవం పూర్తి చేసుకున్న తొలి కన్నడ చిత్రం “స్కూల్ మాస్టర్” (1958). మొదట్లో తెలుగు, తమిళంలోకి అనువదింపబడినప్పటికీ ఆ తరువాత రోజులలో తెలుగు, తమిళ, మలయాళ భాషలలో పునర్నిర్మించబడి విజయవంతమైంది.  

మొట్టమొదటిసారిగా దక్షిణాది భాషలన్నింటిలో పునర్నిర్మాణమై అన్ని భాషల్లోని విజయవంతమైన చిత్రం “స్కూల్ మాస్టర్” కన్నడ చిత్రం 31 జనవరి 1958 లో విడుదలయితే, ఆ తరువాత సంవత్సరం బి.ఆర్. పంతులు దర్శకత్వంలో హిందీలో కూడా పునర్నిర్మితమైంది. ఆయన దర్శకత్వం చేసిన తొలి హిందీ చిత్రం “స్కూల్ మాస్టర్”. ఇదే చిత్రాన్ని తన శిష్యుడు పుట్టన్న కనగల్ దర్శకత్వంలో 1964 లో మలయాళంలో “స్కూల్ మాస్టర్” సినిమాని బి.ఆర్ పంతులు నిర్మించారు. 1972లో ఎన్టీఆర్ అంజలీదేవి కలయికలో వచ్చిన బడిపంతులు కూడా ఎంతో సంచలమైన విజయాన్ని నమోదుచేసింది. తెలుగు తప్ప మిగతా అన్ని భాషల్లో పంతులుగారు దర్శకత్వం వహించి నిర్మించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించిందిన దశాబ్దాల చరిత్ర “స్కూల్ మాస్టర్” సొంతం. పీ ఆర్ పంతులు అంటే భారీ చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బి.ఆర్. పంతులు. తక్కువ పెట్టుబడితో దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో “స్కూల్ మాస్టర్” చిత్రానికి వసూళ్ల సునామీ సృష్టించిన వ్యక్తిగా పంతులు చరిత్రలో నిలిచిపోయారు.

మరణం…

1958లో మొదటిసారిగా కన్నడలో తెరకెక్కిన స్కూల్ మాస్టర్ చిత్రం, సినిమా కథ మీద నమ్మకం ఇసుమంతైనా తగ్గలేదు. అదే కథను పదిహేను సంవత్సరాల తరువాత మళ్లీ 1973లో అదే పేరుతో తమిళంలో జెమినీ గణేషన్, షావుకారు జానకి పునర్నిర్మించారు. ఆయన జీవించి ఉండగా తీసిన చివరి తమిళ చిత్రం కూడా ఇదే అయిపోయింది. ఈ సినిమా తరువాత ఎం.జీ.ఆర్, లతలతో మరొక భారీ చిత్రానికి బి.ఆర్ పంతులు శ్రీకారం చుట్టారు.  ఆ సినిమా పేరు “మధురైయై మీటా సుందర పాండియన్” భారీ సెట్టింగ్ లతో ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. వరుసగా నిర్మిస్తున్న భారీ చిత్రాలు వాటికోసం తీస్తున్న అప్పులకు వడ్డీలు నష్టాలు రాకపోయినా ఎప్పటికప్పుడు భారీ లావాదేవీలు మరోవైపు దర్శకత్వం నిర్మాణం పలు భాషల్లో ఏకకాలంలో సినిమాలు తీయడం ఒక్కరోజు కూడా కాళీ లేకుండా షూటింగ్ చేయడం ఇవన్నీ కలిపి పంతులు గారి మీద తెలియని ఒత్తిడి పెంచుతూ వచ్చింది అని విశ్లేషకులు అభిప్రాయం. బహుశా ఆయన అకాల మరణానికి బయటకు తెలియని ఒత్తిడి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. దురదృష్టావశాత్తు “మధురైయై మీటా సుందర పాండియన్” సినిమా చిత్రీకరణ జరగకముందే 08 అక్టోబరు 1974 నాడు హఠాత్తుగా మరణించారు బిఆర్ పంతులు.

ఆగిపోయిన చిత్రాన్ని పూర్తిచేసిన యం. జి.ఆర్… 

ఒకవైపు తక్కువ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూవున్న బి.ఆర్.పంతులు మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకేక్కిస్తూ వచ్చారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, బి.ఆర్.పంతులు ఇద్దరి జీవితంలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రం “శ్రీకృష్ణదేవరాయ”. ఈ చిత్రంలో బి.ఆర్.పంతులు లోని నటనను విశ్వరూపం చేసి చూపించిన పాత్ర “తిమ్మరుసు”. 60 యేండ్ల వయస్సులో ఆ పాత్రలో తనదైన నటనతో విశ్వరూపం చూపించారు. కృష్ణదేవరాయలుగా రాజ్‌కుమార్‌ నటించారు. ఈ చిత్రానికి గాను బి.ఆర్.పంతులు ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ చిత్రం 175 రోజులు ఆడింది. “శ్రీకృష్ణదేవరాయ” చిత్రం కన్నడ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది. ఒకరి ఒత్తిడికి ఏనాడూ తలొగ్గని పంతులు, ఎన్ని ప్రయోగాలు చేసినా తన సొంతంగానే చేసేవారు.

బి.ఆర్. పంతులు మరణించే నాటికి 18 సంవత్సరాలున్న ఒక కుమారుడు ఆయనకు ఉన్నారు. ఆయనను పిలిచిన యం.జి.ఆర్ తాను నటిస్తూ ఆగిపోయిన తన చిత్రం “మధురైయై మీటా సుందర పాండియన్” పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. అన్నమాట ప్రకారం ఆ చిత్రాన్ని వేరే నిర్మాతలకు బదలాయించి అప్పటివరకు బి.ఆర్. పంతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వాళ్ళ కుమారుడికి ఇప్పించారు ఎం.జీ.ఆర్. ఆయనకున్న రాజకీయ కార్యకలాపాల కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయిపోయి జనవరి 1978 లో చిత్రం విడుదలై పరాజయం పాలైంది. ఒకవేళ బి.ఆర్ పంతులు గనుక ఈ చిత్రాన్ని పూర్తి చేసివుంటే అది ఘన విజయం సాధించి ఉండేదేమో? ఏది ఏమైనా ఘనవిజయాలను, పరాజయాలను సమానంగా స్వీకరించి కన్నడ, తమిళ భాషలలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించి చరిత్ర సృష్టించడం కేవలం బి.ఆర్. పంతులుకే సాధ్యమైంది. ఆయన కొడుకు, కూతురు కూడా చలనచిత్ర పరిశ్రమలో కొనసాగడం ఆనందించదగ్గ విషయం.

Show More
Back to top button