HEALTH & LIFESTYLE

డైట్ విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి.. 

బరువు తగ్గడం అనేది కేవలం కొవ్వు పదార్థాలు తగ్గించడం లేదా అప్పుడప్పుడు వ్యాయామం చేయడం మాత్రమే కాదు. దీనికి ఆహారం, జీవనశైలి మరియు మానసిక ఆరోగ్యం పట్ల సరైన అవగాహన అవసరం. బరువు తగ్గించే క్రమంలో చాలామంది తెలియకుండానే కొన్ని చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. ప్రధానంగా, త్వరగా బరువు తగ్గాలని ఆశించి, చాలామంది ఉదయం టిఫిన్ లేదా రాత్రి సప్పర్ వంటి ముఖ్యమైన మీల్స్‌ను పూర్తిగా మానేస్తారు.

ఇది జీవక్రియ (మెటబాలిజం) రేటును తగ్గించి, శరీరాన్ని బలహీనపరుస్తుంది. సరైన విధానం ఏమిటంటే, ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా, తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. దీనివల్ల జీవక్రియ సక్రమంగా జరిగి, దీర్ఘకాలంలో బరువు తగ్గుతారు. ఉపవాసాలు ఉండడం, వెంటనే ఫలితం రావాలని కోరుకోవడం వంటివి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. బరువు తగ్గాలనుకునేవారు ఆహార సమయాలలో మార్పులు చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.

బరువు నియంత్రణలో మానసిక ఒత్తిడి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, వ్యాయామంతో పాటు ధ్యానం వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే, శరీరం తీరు తెలియకుండా, నచ్చిన డైట్ (లిక్విడ్, కీటో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) ఫాలో అవడం వల్ల బరువు తగ్గకపోగా, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

అందుకే బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా డైటీషియన్‌ను సంప్రదించి, అన్ని పోషకాలు సమతుల్యం అయ్యేలా సరైన ప్లాన్‌ను పాటించాలి. చివరగా, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో మార్పులు వచ్చి, శరీరానికి ఎక్కువ శక్తి కోసం ఆహారం అవసరమవుతుంది. అందువల్ల, ప్రతిరోజు కనీసం ఆరు గంటలు నిద్రపోవడం బరువు తగ్గించే ప్రయత్నాలకు చాలా కీలకం.

Show More
Back to top button