NRI News

అమెరికాలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ తెలుగు రచయిత, పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత, ఆచార్య డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. తెలుగు, హిందీ భాషల్లో పీహెచ్‌డీలు చేసి, రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆయనకు టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఫ్రిస్కో, గార్లాండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లు ప్రత్యేక గుర్తింపు పత్రాలు అందజేశారు.

సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి, ముఖ్యంగా రచయితగా, సాంస్కృతిక రాయబారిగా, ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఆయన చేసిన సేవలకు ఈ గౌరవం దక్కింది. గార్లాండ్ మేయర్ డిలన్ హెడ్రిక్ ప్రత్యేక సమావేశంలో ఆయనకు ఈ పత్రాన్ని అందజేసి అభినందించారు.

ఆగస్టు 19న ఫ్రిస్కోలో స్థానిక తెలుగువారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయా నగరాల ప్రతినిధులు ఈ గుర్తింపు పత్రాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ గౌరవం పట్ల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ టెక్సాస్ రాష్ట్ర గవర్నర్‌కు, అక్కడి ప్రజలకు, నగరాల మేయర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ అరుదైన గౌరవం తెలుగువారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు.

Show More
Back to top button