దక్షిణభారత సినీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ ద్విపాత్రాభినయం. అంటే ఒక సినిమా ప్రదర్శన లేదా ఒక నాటక ప్రదర్శనలో ఒకే నటుడు లేదా ఒకే నటి రెండు పాత్రలను ధరించడాన్ని ద్విపాత్రాభినయం అంటారు. మన జానపద కళారీతులలో ఒకే కథకుడు లేదా ఒకే పాటగాడు వేర్వేరు పాత్రల సంభాషణలను వేర్వేరు హావభావాలతో చెప్పడం కూడా సర్వ సామాన్యమే. ద్విపాత్రాభినయ సంప్రదాయం అనేది నాటకాలు వేసే కాలంలో వేర్వేరు పాత్రలు పోషించడానికి సరిపడా ప్రతిభ గల నటులు లేనప్పుడు అవసరార్ధం ప్రారంభమైంది. అయితే నాటకాలలో ద్విపాత్రాభినయ ప్రక్రియ వాడినప్పుడు ఇద్దరు పాత్రధారులూ ఒకేసారి రంగస్థలం మీదకి వచ్చే అవకాశం లేదు. ఒక పాత్ర ముగిసిన తరువాత అదే నటుడు మరొక పాత్ర ధరించేవాడు. కానీ సినిమాలలో ఈ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొందని చెప్పవచ్చు. సినిమాలో కొన్ని చోట్ల హీరోయిజాన్ని సమతుల్యం చేయడానికీ, ఇంకొన్నిచోట్ల సినిమా కథలో అనుకోని మలుపులు తిప్పడానికీ, మరికొన్నిచోట్ల కథానాయకుని ప్రతిభను బహుముఖంగా ప్రదర్శించడానికీ ద్విపాత్రాభినయ ప్రక్రియ వాడబడింది. కవలపిల్లల పాత్రలు ద్విపాత్రాభినయానికి పట్టుగొమ్మలైనాయి.
భారతీయ సినిమారంగంలో ద్విపాత్రాభినయ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొంది. ఎందువలనంటే ఒకే ఫ్రేములో రెండు పాత్రలనూ చూపే అద్భుతాన్ని ఛాయాగ్రాహకులు సాధించారు కాబట్టి. అయితే తెలుగు సినిమాలలో ఇది దర్శకులకూ, నటులకూ, ప్రత్యేకించి ఛాయాగ్రాహకులకూ ఒక సవాలైపోయింది. భారతీయ సినిమాలలో తొలి ద్విపాత్రాభినయము 1923 వ సంవత్సరంలో విడుదలైన మూకీ చిత్రము పత్నీ ప్రతాప్ లో తొలి తరము భారతీయ సినిమా నటి “పేషన్స్ కూపర్” అభినయించారు. అయితే తెలుగు సినిమా రంగంలో ద్విపాత్రాభినయము “సతీ సులోచన” (1935) తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో “మునిపల్లె సుబ్బయ్య” గా ప్రఖ్యాతి పొందిన వల్లూరి వెంకట సుబ్బారావు అనే నటులు “రావణుడు”, “ఇంద్రజిత్” పాత్రలను పోషించి ద్విపాత్రాభినయముతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ద్విపాత్రాభినయాన్ని మరికాస్త విస్తరిస్తే మూడు, నాలుగు ఇలా ఎన్ని పాత్రలైనా ధరించవచ్చును. శివాజీ గణేశన్ తమిళంలో ఒకేసారి 9 పాత్రలు ధరించారు. తెలుగులో దానవీరశూరకర్ణ సినిమాలో నందమూరి తారకరామారావు బహుపాత్రాభినయంలో అభినయించడం విశేషం.
ఇదిలా ఉంటే తెలుగు చిత్రసీమలో కథానాయికలలో ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటి మద్దెల నగరాజకుమారి. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. మద్దెల నగరాజకుమారి తల్లిదండ్రుల చాటుపిల్ల. తల్లిదండ్రులు చెప్పునట్టు వినే రాజకుమారి, వారి అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు. సినిమాలలో నటిస్తే అందం కరిగిపోతుందనే అపోహ ఉండడం వలన సినిమాలలో ఎక్కువగా నటించే అవకాశం తల్లిదండ్రులు ఆమెకు కల్పించకపోవడంతో ఆమె తక్కువ సినిమాలలో నటించారు. అందంగా, ఆకర్షనీయంగా, ఎంతో నాజూకుగా కనిపించే నగరాజకుమారికి సినిమాలలో నటిస్తే ఎక్కువ కాలం బ్రతకరని అపోహలు కలిగించారు. అందుకే అవకాశాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చినా నటించడానికి ఆమె తల్లి అస్సలు అంగీకరించలేదు. ఆకాశరాజు (1951), మల్లీశ్వరి (1951), పెంపుడు కొడుకు (1953 ), కాళహస్తి మహాత్యం (1954) తదితర చలనచిత్రాలలో నటించిన నగరాజకుమారి తరువాత రోజులలో వేషాలు కరువవ్వడంతో చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.
నేపథ్యం…
ఆంధ్ర పారిస్ గా పేరున్న తెనాలి పట్టణం ఎంతోమంది ప్రముఖులను (కవులను, సినిమా నటీనటులను, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలను, స్వాతంత్ర్య సమరయోధులను, కర్ణాటక సంగీత నాథవిద్వాంసులను, రంగస్థల నటులను) తెలుగు వారికి అందించింది. ఎందరో కళాకారులను చలనచిత్రరంగానికి అందించిన తెనాలిలో 1921 వ సంవత్సరంలో వెంకటేశ్వరరావు, రామమణి దంపతులకు మద్దెల నగరాజకుమారి జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాలు అంటే ఇష్టం ఉన్న రాజకుమారికి నటన అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. నాటకాలలో, సినిమాలలో ఆడవారికి ప్రవేశం అంటే జనాలు ముక్కుమీద వేలు పెట్టుకునే ఆ రోజులలో తల్లిదండ్రుల చాటుపిల్ల అయిన రాజకుమారి, వారి అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు.
అంటే ఆ రోజులలో సినిమాలలో నటిస్తే ఎక్కువ కాలం బ్రతకరని, అదీగాక అందం కరిగిపోతుందని, అపోహలు ఉండడం వలన కూడా నగరాజకుమారికి అవకాశాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చినా ఆమె తల్లి మాత్రం అందుకు అంగీకరించలేదు. చందమామ లాంటి లావణ్యం, హంపీ శిల్పం, నాజూకుగా, ఎంతో ఆకర్షనీయంగా ఉండే సౌందర్య రూపం, కమ్మని స్వరంతో హాయిగా పాడుతూ ఉండే నగరాజకుమారికి సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయినా తల్లి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇంట్లో తిరుగుతూ కమ్మని స్వరంతో నగరాజకుమారి హాయిగా అలా పాడుతుంటే విని ఎంతో ఆనందించేది ఆమె తల్లి, “శ్రీకృష్ణతులాభారం”, “సీతాకళ్యాణం” తదితర చిత్రాలలో ఆమెను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను ఆమె తల్లి మాత్రం అంగీకరించలేదు. తన కూతురు తన కళ్ళ ముందు అలా కనిపిస్తే చాలు అనుకునేది.
చిత్ర రంగ ప్రవేశం…
రాసిపెట్టి ఉంటే ఏదైనా దక్కుతుంది అనడానికి మద్దెల నగరాజకుమారి సరిగ్గా సరిపోతుంది. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే, పూర్ణా టాకీస్ అధినేత గ్రంధి కామరాజు మంగరాజు (జి.కె. మంగరాజు) ఆరోజుల్లో క్వాలిటి పిక్చర్స్ పతాకం స్థాపించి ఆ రోజుల్లో సినిమాలు నిర్మించేవారు. ఎం.వి. రమణమూర్తి దర్శకత్వంలో జి.కె. మంగరాజు నిర్మించతలపెట్టిన దశావతారాలు (1937) సినిమాలో తారాగణం కోసం వెతుకుతూ విజయవాడ వచ్చారు. నటి కన్నాంబ నాటక సమాజంలో వయోలిన్ వాద్యకారుడుగా పనిచేస్తుండే పువ్వుల అంజయ్య స్వయానా నగరాజకుమారికి బంధువు. దశావతారాలు (1937) సినిమాలో తాను నటిగా సరిపోతుందని భావించి, ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం తెనాలి నుండి విజయవాడకు పంపించారు.
ఆమెను చూసిన చిత్ర నిర్మాతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎంపిక చేయడమే కాకుండా, ఆ సినిమాలో ఆమెకు మూడు పాత్రలలో (సీత, లక్ష్మీ, యశోధర) నటించే అవకాశం ఇచ్చారు. కలకత్తాలో నిర్మితమైన ఈ చిత్రంలో పారుపల్లి సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, తీగెల వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు, రాధాకృష్ణమూర్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి వి.జె. గోపాల్ సింగ్ సంగీతం అందించారు. 11 ఏప్రిల్ 1937 నాడు విడుదలైన “దశావతారాలు” అద్భుతమైన విజయం సాధించింది. దాంతో మరిన్ని అవకాశాలు ఆమెను వరించాయి.
ఆ తరువాత ఆమెకు నిరంజన్ పాల్ దర్శకత్వంలో “అరోరా ఫిలిమ్స్” నిర్మించిన “అమ్మ” (1939) చిత్రంలో నాయిక అవకాశం లభించింది. నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన బిపిన్ చంద్ర పాల్ కుమారుడు. ఆయన తెరకెక్కించిన అమ్మ చిత్రంలో ఆమె పాడిన “వికసిత సుమములకున్” అనే పాట, కథానాయకుడు సుబ్బారావుతో కలిసి పాడిన “నిరీక్షించవా నాకై” అనే యుగళగీతం ఆనాటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 16 మార్చి 1939 నాడు విడుదలైన ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. అదేవిధంగా జి.వెంకటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఉష (1939)చిత్రంలో చిత్రలేఖగా ఆమె నటించారు. ఉష, అనిరుద్ధులను తన మంత్రశక్తితో ఒకటిగా చేసే కీలకమైన పాత్ర ఆమెది. అయితే ఈ చిత్రం కూడా ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో రాజకుమారికి సరైన అవకాశాలు తగ్గాయి.
వాహిని సంస్థలో మూడు చిత్రాలు…
ఒకవైపు అవకాశాలు తగ్గుతున్నా కూడా మరోవైపు “సుమంగళి” చిత్రంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వాహినీ పతాకంపై, బి.ఎన్.రెడ్డి నిర్మాణం, దర్శకత్వంలో 1940 లో నిర్మించబడిన చలనచిత్రం “సుమంగళి”. ఇందులో చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గిరి, దొరైస్వామి, మాలతి, తాడంకి శేషమాంబ, గౌరీపతిశాస్త్రి లతో బాటుగా నగరాజకుమారి కూడా నటించిన ఈ చిత్రం నుండి ఆమె కుమారిగా గుర్తింపు పొందింది, ఆమె నటజీవితం కూడా మలుపులు తిరిగింది. ఆ తరువాత అదే వాహిని సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. వాహినీ పిక్చర్స్ పతాకంపై బి.యన్.రెడ్డి తీసిన మూడవ చిత్రం దేవత (1941). ఈ చిత్రంలో నాయికగా కుమారి నటించింది. ఈ చిత్రంలో ఆమెది అమాయకురాలైన పనిమనిషి వేషం. అప్పటికే నటులుగా, గాయకులుగా పేరు తెచ్చుకున్న నాగయ్య, టంగుటూరి సూర్యకుమారిలకు దీటుగా నిలబడి నటించి పేరు తెచ్చుకున్నారు. సాహసోపేతమైన కథాంశంతో నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితాన్నిచ్చింది.
ముగిసిన సినిమా ప్రస్థానం…
మాములుగానే గాయని అయిన తాను “అమ్మ”, “సుమంగళి”, “దేవత” చిత్రాల వరకూ తన పాటలు తనే పాడుకున్నా, ఆ తరువాత మాత్రం నేపథ్యగాయకుల మీదనే ఆధారపడ్డారు. అయితే ఆమె ఒప్పందం ప్రకారం వాహినీ వారి నాలుగవ చిత్రం, దర్శకుడు కె.వి.రెడ్డి తెరకెక్కించిన తొలి చిత్రం భక్త పోతన (1942)లో నగరాజకుమారి నటించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆమె “తులసీదాసు” చిత్ర చిత్రీకరణ నిమిత్తం, వాహినీ వారి అనుమతితో ఆమె బొంబాయి వెళ్ళడంతో భక్తపోతన చిత్రంలో నటించే అవకాశం ఆమె చేజారింది. దర్శకుడు రమణారావు దర్శకత్వంలో తెరకెక్కిన “తులసీదాసు” చిత్రం కోసం బొంబాయిలోనే నగరాజకుమారి ఆరు నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. ఆరు నెలలు అక్కడే ఉన్నా చిత్రీకరణ సజావుగా సాగక ఆగిపోవడం నగరాజకుమారిని మానసికంగా కుంగదీసింది.
నిజానికి ఇలా జరగకుండా ఉండి ఉంటే ఆమె సినిమా ప్రస్థానం ఇంకోలా ఉండేది. ఒకవైపు ఆమె తల్లికి ఇష్టం రాజకుమారి నటించడం ఇష్టం లేకపోవడంతో చేసేది లేక నటనలో కొంత విరామం తీసుకోవలసిన వచ్చింది. దాంతో ఆమె నటిగా సినిమాలకు అయిదేళ్ళ విరామం తీసుకున్నారు. ఎట్టకేలకు ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో 1946 లో “ముగ్గురు మరాఠీలు” చిత్రంతో తిరిగి చలనచిత్రరంగంలో అడుగుపెట్టారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించినా ఆమె సినీ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. ఆ తరువాత ఆమె చిలకలపూడి సీతారామాంజనేయులు (సి.ఎస్.ఆర్) దర్శకత్వంలో ప్రారంభమై అర్ధాంతరంగా ఆగిపోయిన చిత్రం “శివగంగ” లో నటించారు. ఇది విడుదల అవ్వకపోవడంతో నగరాజకుమారి సినిమా ప్రస్థానానికి మళ్ళీ తెర పడిపోయింది.
“మాయపిల్ల” (1951) తో మళ్ళీ వెండితెరపై…
వెండితెరపైకి రావడం, వెళ్లిపోవడం మళ్ళీ నటించడం, విరామం తీసుకోవడం ఇలా కొనసాగుతున్న తన ప్రస్థానంలో 1947 తరువాత నాలుగేళ్ళుగా తెర వెనకున్న నగరాజకుమారికి, దర్శకులు ఆర్.ఎస్.ప్రకాష్ తన “మాయపిల్ల” (1951) చిత్రంలో మంచి అవకాశం ఇచ్చారు. కల్యాణం రఘురామయ్య, కస్తూరి శివరావు, లక్మీరాజ్యం ముఖ్య పాత్రలు పోషించాగా, నగరాజకుమారి దొంగల రాణి “మాయపిల్ల” (అసలు పేరు ఆశ) గా, రూపగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం కత్తి యుద్ధాలు, కొండచిలువతో యుద్ధం ఇలా పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. ఆ సినిమా కోసం ఇలాంటివి చాలానే చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. “మాయపిల్ల” చిత్రం దర్శకుడు రఘుపతి సూర్య ప్రకాశ్ కు చివరి చిత్రం. 26 అక్టోబరు 1951 నాడు విడుదలైన ఈ చిత్రం కోసం నగరాజకుమారి ఎంతో కష్టపడినా, విజయం మాత్రం దక్కలేదు. విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన ఈ జానపద చిత్రం ఆకాశరాజు (1951) చిత్రాన్ని త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకంపై జంధ్యాల గౌరీనాథశాస్రి నిర్మించగా అందులో నగరాజకుమారి నాయికగా నటించారు. ఈ సినిమా కూడా ఆర్థికంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
నిష్క్రమణ…
ఆమె ఒప్పందం ప్రకారం వాహినీ పిక్చర్స్ వారు తెరకెక్కించిన “భక్త పోతన” చిత్రంలో నటించలేదు కాబట్టి, పది సంవత్సరాల తరువాత వాహినీ సంస్థ వారు నిర్మించిన మల్లీశ్వరి (1951) చిత్రంలో కుమారి మహారాణిగా పాత్ర పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె పాత్ర కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషలలో వచ్చిన “పెంపుడు కొడుకు” (1953), తెలుగులో వచ్చిన “కాళహస్తి మహాత్యం” (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. పి.సుశీల తన మొదటి పాటలలో ఒకటైన శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి (కాళహస్తి మహాత్యం చిత్రం) పాటను కుమారికి పాడటం విశేషం. ఈ సినిమా తరువాత ఆమెకు చలనచిత్రాలలో అవకాశాలు రాకపోవడంతో నగరాజకుమారి చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు. వివాహం తరువాత ఆమెకు గంగాధర్ జన్మించారు. తెనాలిలో అతని చదువు పూర్తి కావడంతో 1958లో విజయవాడకు తరలి వెళ్ళి అక్కడే 50 సంవత్సరాల పాటు గడిపారు. వయసు పైబడి అనారోగ్యం కారణంగా వృద్ధాప్యంలో తన 87వ ఏట 03 మార్చి 2008 నాడు నగరాజకుమారి ఈ లోకం నుండి నిష్క్రమించారు.









