Telugu Cinema

తెలుగు సినీ ప్రేక్షకులకు మృష్టాన్న భోజనం.. గుండమ్మ కథ..

గుండమ్మ కథ చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణం అనేది కూడా ఒక రకమైన వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిది సమకూర్చేదే సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి, దానినే సదా ఆచరించిన వ్యాపారదక్షులు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి గారూ. తన సినిమా సూత్రాన్ని ‘పాతాళభైరవి’ చిత్రం ద్వారా ‘జనంకోరేది మనం తీయాలి గానీ మనం తీసేది జనం చూడడం కాదు’ అని చెప్పి మరీ సినిమాలు నిర్మించి సమాధానమిచ్చిన మేధావి నాగిరెడ్డి గారు.

కథ, కథనం, మాటలు-పాటలు, సంగీతం, దర్శకత్వం ఇత్యాది వ్యవహారాలన్నీ చక్రపాణి గారు అమలు పరచేవారు. అందుకే వీరిని చిత్రపరిశ్రమలో కృష్ణార్జునులు అంటారు. వీరు నిర్మించిన చిత్రాలు అధికంగా అంచనాలను మించి ఆర్జించినవే కావడం విశేషం. ఈ సూత్రాన్ని నమ్మి చిత్రాలు నిర్మించడం వలననే ఈ తరహా విజయాలు సాధ్యమైనాయి.   అదే విజయా సంస్థ క్రమశిక్షణ. “షావుకారు” చిత్రం మొదలుకొని “శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్” వరకు  పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వాటిలో విజయా సంస్థ వారు నిర్మించిన విజయవంతమైన చివరి బ్లాక్ & వైట్ చిత్రం “గుండమ్మ కథ”.

“మనె తుంబిద హెణ్ణు” అనే కన్నడ చిత్రం నుండి తయారుచేసుకున్న కథతో ఎన్టీఆర్ , ఏ.యన్.ఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలున్న ఈ సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్‌ పాత్రలో “గుండమ్మ కథ” పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్ వంటి ఎన్నో అజరామర చిత్రాలను తెరకెక్కించిన విజయా సంస్థ తొలిసారిగా చేసిన రీమేక్ సినిమా ‘గుండమ్మ కథ’. ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్ లాంటి నటులు ఎలాంటి భేషజాలకు పోకుండా తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా “గుండమ్మ కథ” నిలచింది. 07 జూన్ 1962 నాడు విడుదల అయిన ఈ చిత్రం నేటికి 60 వసంతాలు నిండిపోయాయి.

అతిరథ, మహారథ, మహా మహారథులు నటించిన ఈ చిత్రాన్ని అజరామరంగా తీర్చిదిద్దిన దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు, అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చిన పింగళి గారు, వినసొంపైన బాణీలను సమాకూర్చిన ఘంటశాల గారు, మంచి సంభాషణలను అందించిన డి.వి.నరసరాజు గారు అంతా కలిసి అజరామర చిత్రాన్ని తీసి ప్రేక్షకులకు మృష్టాన్న భోజనాన్ని వడ్డించారు. హాస్యానికి పెద్దపీట వేసినా కూడా నవరసాలూ కలుపుకుంటూ వెళుతుందీ కథ. తెలుగు వాళ్ళ ఇంటిల్లిపాదికీ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టించని విందు భోజనం ఈ సినిమా. అందుకే, తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆనవాళ్లుగా నిలిచిన చిత్ర రాజాల్లో  ‘గుండమ్మ కథ’ తన స్థానాన్ని శాశ్వతం చేసుకుంది.

చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కమలాకర కామేశ్వరరావు 

నిర్మాణం     :      బి.నాగిరెడ్డి , చక్రపాణి

రచన          :     చక్రపాణి (స్క్రీన్ ప్లే), డి.వి.నరసరాజు (మాటలు), పింగళి నాగేంద్రరావు (పాటలు)

తారాగణం   :    నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున , ఎస్.వి.రంగారావు ,

సూర్యకాంతం

సంగీతం      :     ఘంటసాల

నేపథ్య గానం    :     ఘంటసాల, పి. సుశీల, పి. లీల 

గీతరచన      :     పింగళి నాగేంద్ర రావు

ఛాయాగ్రహణం   :   మార్కస్ బార్ట్‌లీ

నిర్మాణ సంస్థ   :   విజయా ప్రొడక్షన్స్

నిడివి       :      166 నిముషాలు

విడుదల తేదీ   :     07 జూన్ 1962

భాష        :      తెలుగు

చిత్ర కథ….

గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మి (సావిత్రి), స్వంత కూతురు సరోజ (జమున), కొడుకు (హరనాథ్) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి తన మీద వేసుకుంటే , సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా కూడా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య వచ్చి (రమణారెడ్డి) పెళ్ళి సంబంధం చెడగొడతూంటాడు.

ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల) విడుదలయ్యాకా తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అతని పథకం. పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్.వి.రంగారావు) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో, పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఆ యింటి పరిస్థితి అర్థం చేసుకొంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదనీ, మరోవైపు సరోజకున్న పెంకెతనం, బద్ధకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు.

ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్.టి.రామారావు), రాజా (అక్కినేని నాగేశ్వరరావు)లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు కొడుకు (హరనాథ్), ప్రేమిస్తున్న అమ్మాయి (ఎల్.విజయలక్ష్మి)కి అన్నయ్యగా రాజా ప్రవేశించి, సరోజను ఆకట్టుకుంటాడు. సరోజ మంకుపట్టు పట్టుకు తోడు అతను ఆస్తిపరుడేనని, రామభద్రయ్య కొడుకని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమె కన్నా పెద్దదైన లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన గుండమ్మకు వస్తుంది.

అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేసి, తనకు లక్ష్మినిచ్చి పెళ్ళిచేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది గుండమ్మ. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది. రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని, దొంగనని, ఆస్తిపాస్తులూ లేనివాడినని కొత్త నాటకం మొదలుపెడతారు. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారన్న వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు.

అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు. కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి, ఉన్నదాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు. మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కచేయకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. గుండమ్మ కోడలి దూరపు బంధువు దుర్గమ్మ (ఛాయాదేవి) ఆ చుట్టరికం అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది.

ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు. ఇంతలో అంజి, లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి, సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు. రాజా గారెలు కావాలని మరో నాటకం ఆడగా, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు.

యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడం, అతను తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు. తమ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.

తారాగణం…  పాత్రలు…

ఎన్.టి.రామారావు..    ఆంజనేయ (“అంజి”) ప్రసాద్..

అక్కినేని నాగేశ్వరరావు…  రాజా..

సావిత్రి…     లక్ష్మి..

జమున…    సరోజ…

ఎస్వీ రంగారావు…   రామభద్రయ్య…

రాజనాల…   భూపతి…

రమణారెడ్డి…  కంచు ఘంటయ్య…

హరనాథ్…    ప్రభాకర్..

అల్లు రామలింగయ్య…  అయ్యర్‌గా ( అతిధి పాత్ర )..

సూర్యకాంతం…   గుండమ్మ…

ఎల్.విజయలక్ష్మి…    పద్మ…

ఛాయాదేవి…   దుర్గమ్మ…

హేమలత….    కంచు ఘంటయ్య భార్య

ఋష్యేంద్రమణి….    పద్మ తల్లి…

కథా సంగ్రహణం…

నిజానికి గుండమ్మ కథ ఓ కన్నడ చిత్రం. ఇది తిరిగి తెలుగులో పునర్నిర్మింపబడింది. సినిమా ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు విఠలాచార్య. జానపద చిత్రాలను జనరంజితంగా చూపించే దర్శకుడు, జానపద బ్రహ్మగా ప్రసిద్ధి గాంచిన విఠలాచార్య గారు స్వతహాగా కన్నడిగుడు. తన మాతృభాష కన్నడలో 1958లో “మనె తుంబిద హెన్ను” అనే చిత్రం తీశారు. కన్నడలో ఆ చిత్రం విజయవంతమైంది. అది నాగిరెడ్డికి గారికి చాలా బాగా నచ్చింది. చిత్ర నిర్మాణంలో విఠలాచార్య గారికి విజయ సంస్థ అధినేత బి.నాగరెడ్డి గారు సహాయ సహకారాలు అందించారు.

ఆ కృతజ్ఞతతోనే విఠలాచార్య గారు పరభాష హక్కుల్ని నాగిరెడ్డి గారికి ఇచ్చేశారు. అందులోని పాత్రే గుండమ్మ. ఆమె భర్త నోరూ వాయి లేనివాడు. గుండమ్మ కు ఓ సవతి కూతురు, సొంత కూతురు ఉంటారు. సవతి కూతుర్ని పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న సవతి కూతురు మేనమామ కోపంతో రగిలిపోతాడు. గుండమ్మకు బుద్ధి చెప్పేందుకు ఆమె సొంత కూతుర్ని ఓ జైలు పక్షికి ఇచ్చి పెళ్లి చేయిస్తాడు. ఇదంతా నాటకీయంగా సాగుతుంది. గుండమ్మ పాత్ర, కుటుంబ వ్యవహారాలు నాగిరెడ్డి గారికి చాలా తమాషాగా అనిపించాయి. సరిగ్గా ఆ సమయానికే విజయా ప్రొడక్షన్స్ వారు ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం తీయాలన్న ఆలోచనలో ఉన్నారు.

అయితే “మనె తుంబిద హెన్ను” రీమేక్ హక్కులు ఉన్నాయి కాబట్టి, ఆ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించాలని అనుకున్నారు. అప్పటివరకు విజయా సంస్థ వారు తమ సొంత కథలను మాత్రమే తెర మీదకు తీసుకొచ్చేవారు. తొలిసారి పర భాషలోని సినిమాను తీసేందుకు సిద్ధపడ్డారు. అయితే కథను డి.వి.నరసరాజు గారి సహాకారంతో తెలుగు ప్రాంతీయతకు తగ్గట్టు మార్పులు, చేర్పులు చేయించారు. నాగిరెడ్డి గారి చిత్రాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా చక్రపాణి గారు ఆమోద ముద్ర వేయాల్సిందే.

కన్నడ చిత్రంలో ఉన్న కొన్ని విషయాలు నచ్చని చక్రపాణి గారూ షేక్ స్పియర్ రచన “టేమింగ్ ఆఫ్ ది ష్రూ” నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధంచేశారు. “గుండమ్మ కథ”కు ఆధారమైన ఈ కథలో ఒక పాత్ర పేరు “గుండమ్మ”. కథను మార్చుకోవడంలో “గుండమ్మ”ను ప్రధాన పాత్రగా చేసుకున్నారు. అసలు ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా, అదే పేరు ఉంచేయమని చక్రపాణి గారు సలహా ఇచ్చారు. చివరకు గుండమ్మ పేరునే ఖాయం చేశారు. ఆ చిత్రంలో అగ్ర హీరోలున్నా , ఒక క్యారెక్టర్ నటి పేరు పెట్టడం విశేషం.

దర్శకుడిగా “పౌరాణిక బ్రహ్మ”..

“మనె తుంబిద హెణ్ణు” కథకు కొన్ని మార్పులు చేసి, కథకు తగ్గ సంభాషణలు సిద్ధం చేసి, దర్శకుడుగా బి.ఎన్.రెడ్డి గారి పేరు అనుకున్నారు. తరువాత మళ్ళీ నాగిరెడ్డి గారు మనసు మార్చుకున్నారు. ఒక అనువాద చిత్రాన్ని బి.ఎన్.రెడ్డి గారి లాంటి దర్శకుడితో తీయిస్తే బావుండదని పుల్లయ్య ని ఎంచుకుంటే ఎలా ఉంటుందా? అని చర్చించారు.

డి.వి.నరసరాజు గారు సిద్ధం చేసిన సంభాషణల పరంపరను పుల్లయ్య గారికి పంపించారు. కొన్ని సందేహాలు వ్యక్తం చేసిన పుల్లయ్య గారు తనకు అంతగా నచ్చలేదని చెప్పేశారు.

దాంతో మరోసారి ఆ సినిమా పక్కకు వెళ్ళింది. దీంతో నాగిరెడ్డి గారు రంగంలోకి దిగి కమలాకర కామేశ్వర రావు గారికి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, కామేశ్వరరావు గారు అప్పటివరకు పౌరాణిక చిత్రాలే తీశారు. ఈ చిత్రం ద్వారా తొలిసారి ఒక సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు.

గుండమ్మ ఫైలు చక్రపాణి గారి ముందుకు వెళ్ళింది. పిచ్చి వాళ్లతో, వికలాంగులతో సన్నివేశాలు నడపడం చక్రపాణి గారికి పెద్దగా ఇష్టం ఉండదు. దాంతో కథ తనకు నచ్చలేదు. నాగిరెడ్డి గారికి మాత్రం ఎలాగైనా ఈ సినిమా తెరాకెక్కించాలని పట్టుదలగా ఉండేది.

కథా చర్చలు జరిగాక కన్నడ కథలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకోవాలని చక్రపాణి గారు తీర్మానించారు. స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావు గారిని ఎంచుకున్నారు.

చక్రపాణి గారు మొత్తంగా గుండమ్మ కుటుంబాన్ని తీసుకుని, ఆమె భర్త పాత్రను మాత్రం తీసేశారు. పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.

కావున ఆ పాత్ర కథకు అనవసరం అనేది చక్రపాణి గారి ఉద్దేశ్యం. ఈ చిత్రం కోసం అప్పటి అగ్గ నటులైన ఎన్టీయార్ , ఏఎన్నార్ , సావిత్రి ,జమున, ఎస్వీఆర్ , రమణారెడ్డి వంటి వారిని ఎంపిక చేశారు.

అయితే అందరూ డేట్స్ ఇచ్చినా, చిత్రం మాత్రం మొదలుపెట్టలేదు. అందుకు కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి? ఒక సినిమా చిత్రీకరణలో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి గారు “గుండమ్మ” పాత్రకు ఆమె అయితేనే సరిపోతుందని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ధ ప్రస్తావిస్తే ఆయన కూడా మరో మాట చెప్పకుండా సరే అనేశారు.

చిత్రీకరణ…

విజయా వారి స్టూడియో లోనే గుండమ్మ ఇంటి సెట్ ను వేయించారు. అంతమంది ఆర్టిస్టులను ఒకేసారి కెమెరా ముందుకు తీసుకువచ్చేందుకు వాళ్ళ కాల్ షీట్లు సర్దుబాటు అయ్యేవి కావు. అందువలన ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే చిత్రీకరణ చేస్తూ వచ్చారు. రోజు ఉదయాన్నే చక్రపాణి గారు ఆఫీస్ కి వెళ్ళిపోయి నటీ నటులకు ఫోన్లు చేస్తూ ఉండేవారు. సావిత్రి గారికి ఫోన్ చేసి ఈరోజు నీ ప్రోగ్రాం ఏమిటి అని అడిగేవారు. షూటింగ్ ఉందంటే ఓకే అని పెట్టేసేవారు. సూర్యకాంతం అందుబాటులో ఉంటే, ఆమెతో పాటు రమణారెడ్డిని పిలిపించి చిత్రీకరణ జరిపేవారు. “కోలో కోలోయమ్మ కోలో నా స్వామి” పాటలో రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున నలుగురూ నటించారు. పాట చిత్రీకరించే సమయంలో హీరోలిద్దరికీ కుదరకపోవడంతో రామారావు – సావిత్రిపై ఒకసారి , నాగేశ్వరరావు – జమునపై ఒకసారి విడివిడిగా చిత్రీకరించారు. ఎడిటింగ్ లో తేడా లేకుండా జాగ్రత్తపడ్డారు.

గుండమ్మగా సూర్యకాంతం గారు అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారనే చెప్పాలి. ఏమిటీ పొద్దున్నే ధనాధనమని మమ్మల్ని నిద్రపోనియ్యవా అంటూ చవతి కూతుర్ని మొట్టుతుంది. ఆమె కోడి కూసింది పిన్ని అని చెబితే, అది నీలాంటిదే పనీ పాట లేక కూసి ఉంటుంది అనేస్తుంది గుండమ్మ. ఇలాంటి  సంభాషణలతోనే గుండమ్మ తీరుని స్పష్టం చేశారు. హోటల్లో ఉద్యోగం ఊడగొట్టుకున్న పని వాడికి పని ఇప్పిస్తానంటూ తీసుకొచ్చిన గంటన్నతో అది గుండమ్మ ఇల్లు అని గ్రహించి సర్వర్ చెప్పే సంభాషణలు, గుండమ్మ రోజు తన భర్త ఫోటోకు నమస్కరిస్తూ, చెప్పుల్ని కళ్లకు అద్దుకునే ఘట్టం గుండమ్మ పాత్రను సంపూర్ణంగా ఆవిష్కరిస్తాయి.

అంజి అనే పనివాడు (ఎన్టీఆర్) ప్రవేశించినప్పటి నుండి కథ పూర్తిగా వినోదభరితంగా మారిపోతుంది. గుండక్క, బుల్లెమ్మ, చిట్టెమ్మ, బుల్లోడా అంటూ అంజి చేసే హంగామాను ఎవ్వరూ మర్చిపోరు. గుండమ్మకు గుణపాఠం చెప్పాలంటే అంతకంటే గయ్యాలి పాత్ర అవసరం. అందుకే దుర్గమ్మ పాత్రను కథలోకి తీసుకొచ్చారు. గుండమ్మ కోడలు తరపున అంటూ ఇంట్లో తిష్ట వేసే దుర్గమ్మగా ఛాయాదేవి నటన కూడా చాలా బాగా నచ్చింది. సూర్యకాంతం, ఛాయాదేవి లు పోటాపోటీగా నటించారు. గంటయ్య అండతో గుండమ్మను కొట్టంలోకి పంపుతుంది దుర్గమ్మ. పెళ్లి చేసుకుని పెద్దింటి కోడలుగా వెళ్ళిపోయిన సవతి కూతురు తిరిగి వచ్చాక గుండమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం, దుర్గమ్మ ముందుకు వెళ్లేందుకు భయపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సంగీతం…

గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల గారు సంగీతాన్ని స్వరపరిచారు. ఇందులో ఎనిమిది పాటలు ఉన్నాయి, వీటి సాహిత్యాన్ని పింగళి గారు వ్రాశారు. సౌండ్ మిక్సింగ్ ప్రక్రియను ఎ. కృష్ణన్ మరియు వి. శివరామ్ లు పర్యవేక్షించారు. అలాగే సౌండ్‌ ట్రాక్‌ను ఎన్‌.సి.సేన్ గుప్తా నిర్వహించారు. ఘంటసాల రామారావు మరియు నాగేశ్వరరావులకు గాత్రం అందించారు. సావిత్రి, జమునలకు గాత్రాన్ని పి.సుశీల , పి.లీల అందించారు. “ఎంత హాయి” పాట మోహనం రాగాన్ని ఉపయోగించి రూపొందించారు. ఇందులోని ప్రతీ పాట ఒక క్లాసిక్‌. ఇందులోని పాటల చిత్రీకరణ చాలా విచిత్రంగా జరిగింది.

“కోలో కోలోయమ్మ కోలో నా స్వామి” పాటలో రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున నలుగురూ నటించారు. పాట షూట్‌ చేసే సమయంలో హీరోలిద్దరికీ ఒకేసారి సమయం కుదరకపోవడంతో రామారావు-సావిత్రిపై ఒకసారి, నాగేశ్వరరావు-జమునపై ఒకసారి విడివిడిగా చిత్రీకరించారు. ఇక ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ’ పాట వెనుక కూడా ఓ చిత్రమైన చర్చ జరిగింది. పాటల రచయిత అయిన పింగళి చక్రపాణి దగ్గరకు వచ్చి ‘తర్వాతి డ్యూయెట్‌ ఏ ప్రాంతంలో తీస్తున్నారు’ అడిగారట. ‘ఎక్కడో తీయటం ఎందుకు? పాటలో దమ్ముంటే విజయాగార్డెన్స్‌లోనే చాలు. ఊటీ, కశ్మీర్‌, కొడైకెనాల్‌ ఎందుకు?’ అన్నారట. ఆయన అన్న మాటలను దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ’ పాట వ్రాశారు పింగళి.

విడుదల…

విజయా ప్రొడక్షన్స్‌ వారు నిర్మించిన గుండమ్మ కథ చిత్రాన్ని 7 జూన్ 1962 నాడు విడుదల చేశారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ అంతటా 19 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడింది. విజయవాడ దుర్గా కళామందిర్‌లో 175 రోజులు ప్రదర్శింపబడి రజతోత్సవాన్ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో రోజుకు మూడు ప్రదర్శనలతో 100 రోజులు నడిచిన మొదటి చిత్రంగా “గుండమ్మ కథ” నిలిచింది. చైనా-భారత యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ చిత్ర రజతోత్సవ వేడుకలు జరుపకుండా ఆ నిధులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.

ఈ చిత్రం విడుదలైన తర్వాత, పలువురు విమర్శకులు “గుండమ్మ కథ” ను, దాని కథ, స్క్రీన్‌ప్లే మరియు ప్రధాన తారాగణం యొక్క నటనకు ప్రశంసించారు. కృష్ణానంద్ గారు 15 జూన్ 1962న ఆంధ్రపత్రికకు సమీక్ష వ్రాస్తూ, సూర్యకాంతం పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, “సినిమా పేరు” ను మెచ్చుకుంటూ, నిర్మాతలు గుండమ్మ పాత్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ఆ పాత్రకు ప్రాణం పోసిన సూర్యకాంతం గారు కూడా  ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆమె నటన అద్భుతం అని వ్రాశారు.

అదే రోజు, జమిన్ రైట్ నుండి ఒక కథనం ఈ విధంగా వెలువడింది. “స్క్రీన్ ప్లే, ప్రతీ సన్నివేశం మరియు కథలోని ప్రతి పాత్ర ఉద్దేశపూర్వకంగా హాస్యం కోసం రూపొందించబడింది.

కోపంలో హాస్యం, గొడవలో హాస్యం, ప్రతిచోటా హాస్యం” అది పేర్కొంది. జూన్ 8న, ఆంధ్రజ్యోతి నుండి ఒక విమర్శకుడు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ, “ఇది గుండమ్మ కథ కాదు, మనం ప్రతీ రోజూ చూసే కథ – మన కథ” అని వ్రాశారు.

విశేషాలు…

★ కన్నడంలో బి.విఠలాచార్య గారు నిర్మించిన “మనె తుంబిద హెణ్ణు” ఈ సినిమా కథకు మూలం. ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి “గుండమ్మ కథ” ను చక్రపాణి గారు రూపొందించారు.

★ గుండమ్మ కథ విడుదలకు 10 రోజుల ముందు, ఎల్.వి.ప్రసాద్ గారి కుమార్తె వివాహ సందర్భంగా విజయా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నాట్య ప్రదర్శన సమయానికి “వైజయంతిమాల” రాలేక పోవటంతో, గుండమ్మకథ సినిమాను అతిథులుకు చూపించారు. ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి గారితో సహా పలువురు ఈ సినిమా ఆదడని అభిప్రాయపడ్డారు. కానీ నిర్మాతలు మాత్రం సినిమాపై గట్టి నమ్మకం తో ఉన్నారు. సినిమా విడుదల అయిన తర్వాత ప్రముఖుల అంచనాలను తలకిందులు చేస్తూ గుండమ్మ కథ విజయవిహారం చేసింది..

★ “గుండమ్మ కథ” నందమూరి తారక రామారావు గారు నటించిన 100వ చిత్రం. అక్కినేని నాగేశ్వరావు గారికి 99 వ చిత్రం..

★ నందమూరి తారక రామారావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో నట రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ స్టైలిష్ గా కనిపిస్తారు.

★ ఈ చిత్ర నిర్మాణం సంవత్సరం పాటు కొనసాగింది. ఈ సినిమాకు ముందుగా బి.ఎన్.రెడ్డి, ఆ తరువాత పోలుదాసు పుల్లయ్య లను దర్శకులుగా అనుకున్నారు. కానీ అఖరికి కమలాకర కామేశ్వరరావును దర్శకుడుగా ఎంపిక చేశారు..

★ గుండమ్మ కథ చిత్రం సెన్సార్ తేదీ 30 మే 1962 పూర్తవ్వగా, ఈ చిత్రం  07 జూన్ 1962 నాడు విడుదల అయ్యింది..

★ ఎన్టీఆర్, అక్కినేని గార్లు కలిసి 14 మల్టీస్టారర్ చిత్రాలలో నటించారు. “గుండమ్మ కథ” చిత్రం వీరిద్దరు కలిసి నటించిన 10 వ చిత్రం..

★ గుండమ్మ కథ తమిళ వెర్షన్ “మనిదన్ మారవిల్లే” లో ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రను జెమినీ గణేషన్ గారు పోషించారు. ఈ సినిమా అక్కినేనికి100 వ సినిమా.ఈ సినిమాకు చక్రపాణి గారు దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించ లేదు..

★ గుండమ్మ కథ చిత్రం మొదట దఫా 25 కేంద్రాలలో విడుదల అయ్యింది. మొదటి రన్ లో 19 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. రెండవ సారి విడుదల చేసినప్పుడు, నరసరావు పేట, చిలకలూరి పేట లలో 100 రోజులు ఆడింది. మొత్తంగా గుండమ్మ కథ 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది..

★ గుండమ్మ కథ చిత్రం విజయవాడ లోని దుర్గ కళామందిరం లో 175 రోజులు ఆడింది. 175 రోజుల వేడుక జరపకుండా ఆ మొత్తాన్ని చైనా తో యుధ్ధం చేస్తున్న భారత సైన్యం యుద్ధ నిధికి నిర్మాత నాగిరెడ్డి గారు విరాళమిచ్చారు..

Show More
Back to top button