CINEMATelugu Cinema

చలనచిత్ర సీమలో అమ్మదనానికి కమ్మదనం తెచ్చిన శాంతమూర్తి… పండరీబాయి..

సహజమైన తన నటనతో అమ్మ పాత్రలకు జీవం పోసిన అద్భుత నటి పండరీబాయి. నిజ జీవితంలో ఆమె సామ్యురాలు, ఉదార స్వభావి, శాంతమూర్తి. తెరపై పోషించిన పాత్రలలో అచ్చుపోలినట్టు ఆమె వ్యక్తిత్వమే ప్రతిబింబించడంతో ఆవిడ ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగారు. కన్నాంబ, ఋష్యేంద్రమణి, హేమలత తరువాత నందమూరి తారకరామారావు కు తల్లి పాత్రలలో నటించారు పండరీబాయి. అమ్మ తనానికి కమ్మదనం తెచ్చిన శాంతమూర్తి పండరీబాయి. 1950 నుండి 1990 వరకు విడుదలైన అనేక కన్నడ, తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ సినిమాలలో శాంత స్వభావులైన తల్లి, సహనశీలురాలు అయిన తల్లి అనగానే వెంటనే గుర్తొచ్చే రూపం పండరీబాయి.

పిల్లల్ని కష్టపడి పెంచే తల్లిగా, భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా కఠిన పరిస్థితులను తట్టుకుని పిల్లలను తన రెక్కలలో పొదుముకునే తల్లిగా, అన్నదమ్ములు పోట్లాడుకుంటే చూస్తూ కుమిలిపోయే తల్లిగా, ఇంట్లో సహనంతో శాంతంగా సమస్యలను పరిష్కరించే తల్లిగా ఇలా ఎన్నో రకాలైన తల్లి పాత్రలతో దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ ప్రేక్షకుల్ని అలరించారు. తారా తారలకు తల్లిగా వెలిగిపోయిన తార పండరీబాయి.

పండరీబాయి వెండితెర జీవితంలో ఎక్కువ భాగం విలక్షణమైన తల్లి పాత్రలో నటించారు. బాల్యంలో హరికథ లతో, నాటకరంగంలో నాటకాలతో గడిచినా తన 12 ఏళ్ల వయస్సులోనే వెండితెర జీవితం ప్రారంభించారు. ఆ తరువాత సుమారు పదేళ్లపాటు చాలా చిన్న చిన్న పాత్రలు, ఎవ్వరూ గుర్తించని పాత్రలతోనే సర్టిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కథానాయికగా ఒకవైపు నటిస్తూనే కేవలం గ్లామర్ పాత్రలవైపు మాత్రమే మొగ్గుచూపకుండా తల్లి పాత్రలు, అత్త పాత్రలతో కూడా అలరించారు.

50 సంవత్సరాల వెండితర జీవితంలో పండరీబాయి కన్నడ, తమిళ, తెలుగు, మరాఠి, హిందీ భాషలలో దాదాపు 1,000 పైగా చిత్రాలలో నటించిన పండరీబాయి, దాదాపుగా 80 శాతం తల్లి పాత్రలనే ధరించారనడం అతిశయోక్తి కాదు. సుశీల, సుమతి, పార్వతి, లక్ష్మి, శాంత ఇలాంటి తల్లి పాత్రలలో ఎక్కువగా నటించారు. మూడు తరాలకు తల్లిగా నటించిన ప్రత్యేకత కూడా పండరీబాయికే సొంతం. కన్నడ చిత్ర రంగంలో మొట్టమొదటి విజయవంతమైన నటి పండరీబాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అనే బిరుదుతో సత్కరించిన మొట్టమొదటి కన్నడ నటీమణి కూడా పండరీబాయి. కన్నడ ప్రభుత్వం వారు పండరీబాయి గురించి వ్రాసిన పాఠ్యాంశాన్ని కన్నడ 9వ తరగతి వాచకాల్లో చేర్చారు.

మాతృమూర్తుల సేవలను గుర్తుచేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మదర్స్ డే సందర్భంగా ఈమధ్య కాలంలో “బెంగళూరు టైమ్స్” వారు నిర్వహించిన సర్వేలో ఉత్తమ వెండితెర మాతృమూర్తి ఎవరు? అని అడిగిన ప్రశ్నకు అత్యధిక శాతం పాఠకులు ఎంపిక చేసిన పేరు పండరీబాయి. అప్పటికీ ఆమె సినిమాలలో మానేసి పది సంవత్సరాలు అయ్యింది, అలాగే చనిపోయి కూడా సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యింది. అంతగా కన్నడ ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు పండరీబాయి. రాజ్ కుమార్, శివాజీ గణేషన్ ల ప్రక్కన కథానాయికగా నటించిన పండరీబాయి, తరువాత సంవత్సరాలలో వాళ్లకు తల్లిగా అనేక చిత్రాలలో నటించారు. రాజ్ కుమార్ కు 1990 వ సంవత్సరం వరకు తల్లిగా నటిస్తూనే ఉన్నారు. వారికే కాకుండా దక్షిణాది సూపర్ స్టార్లు అయిన ఎం.జీ.రామచంద్రన్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్, రజనీకాంత్, కృష్ణ మొదలగు వారందరికీ కూడా తల్లిగా నటించారు పండరీబాయి.

జీవిత విశేషాలు…

జన్మనామం  :   గీత పండరీబాయి

ఇతర పేర్లు  :  పండరీబాయి 

జన్మదినం :  18 సెప్టెంబర్ 1928

స్వస్థలం :    భత్కల్ , కర్ణాటక , భారతదేశం.

తల్లి    :     కావేరి 

తండ్రి   :  రంగారావు 

వృత్తి   :   కథానాయిక, సహాయ పాత్రధారి, నిర్మాత

జీవిత భాగస్వామి  :  పి.హెచ్. రామారావు 

బంధువులు  :  మైనావతి  (సోదరి)

బిరుదులు   :     కలైమామణి (1965)

మరణ కారణం  :   అనారోగ్యం 

మరణం :    29 జనవరి 2003, 

మద్రాసు , భారతదేశం

నేపథ్యం…

పండరీబాయి సెప్టెంబరు 1928 కర్ణాటక లోని మంగళూరులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆవిడ నాన్న రంగారావు, అమ్మ కావేరి బాయి. స్వతహాగా చిత్రకారులయిన రంగారావు అక్కడే ఉన్న పాఠశాలలో బొమ్మలేస్తుండేవారు. రంగారావుకి చిత్రకళతో పాటు అనేక రంగాలలో ప్రవేశం ఉండేది. ఛాయాగ్రహణం (ఫోటోగ్రఫీ) అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆ రోజులలో ఫోటోలు పెద్దవిగా చేయడం అనేది ఒక కళ. ఆ కళలో ఆయన ప్రావీణ్యం సంపాదించుకున్నారు. రంగారావు స్వతహాగా నాటకాలు వేస్తుండేవారు. ఆయన స్వతంత్రంగా “అంబ ప్రాసాధికా నాట్యమండలి” అనే ఒక నాటక సంస్థను స్థాపించి దాని ద్వారా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. వాటితో బాటుగా హరికథలు చెప్పడం కూడా ఆయన వృత్తిలో భాగమైపోయింది.

హరికథల ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ జరుపుతుండేవారు. నిజానికి వీటి మీద పెద్దగా ఆదాయం కూడా లేదు. చూడబోతే బోలెడంత మంది సంతానం. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఆడవారిలో పెద్దమ్మాయి పండరీబాయి. ఆవిడ అమ్మ కావేరి బాయి ఉపాధ్యాయిని. కావేరి బాయి తన కూతురు పండరీబాయి చిన్నపిల్లగా ఉండగానే ఉద్యోగరీత్యా కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతం చుట్టుప్రక్కల గల “భక్కల్” అనే గ్రామం చేరుకున్నారు. ఆవిడ పిల్లలకు చదువు చెబుతూ, భర్త హరికథలు చెబుతూ వారిద్దరి చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబ పోషణను అలా నెట్టుకొస్తున్నారు. రంగారావు ప్రదర్శించే నాటకాలలో తన కొడుకులతో వేషాలు వేయించేవారు. కానీ వారి కూతుర్లను మాత్రం నాటకాల వైపు రానిచ్చేవారు కాదు.

హరికథలు అంటే ఆసక్తి…

పండరీబాయికి చిన్నప్పటినుంచి హరికథలు అంటే ఆసక్తి. ఆ ఆసక్తిని గమనించి తాను చెప్పే హరికథలకు తీసుకెళుతుండేవారు. నెమ్మది నెమ్మదిగా పండరీబాయికి హరికథలు చెప్పడం నేర్పించేవారు నాన్న. ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పండరీబాయి హరికథలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. కేవలం కన్నడ భాషలోనే కాదు, మరాఠీ భాషలో కూడా హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఆ రోజులలో సుకన్య, పురందరదాసు లాంటి హరికథలను ఆమె చేత ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె హరికథా నైపుణ్యానికి మెచ్చిన మైసూరు ప్రేక్షకులు ఆమెకు చిన్నతనంలోనే “కీర్తన కోకిల” అని బిరుదును కూడా ఇచ్చారు.

తీరిక లేకుండా హరికథలు చెప్పడంలో మునిగిపోయిన పండరీబాయి చదువు పాఠశాలలో చేరిన తొలి నాళ్ళలో ఆరు, ఏడు తరగతులకే పరిమితమైపోయింది. అంతకుమించి ఆమె చదువుకోలేదు. అందువలన తన హై స్కూల్ చదువును మధ్యలోనే ఆపేశారు. ఆమె చదువును మధ్యలోనే ఆపేసినా ఆమె ఆర్జించిన జ్ఞానం, సంస్కారం, తెలివితేటలు ఇవన్నీ కూడా రంగస్థలం మీద, సినీ జీవిత ప్రయాణంలోనూ సంపాదించుకున్నవే. పండరీబాయి అన్నయ్యల పేర్లు జగన్నాథ్, సదాశివ, విమలానంద దాస్. వీరు నాన్నతో పాటు నాటకాలలో వేషాలు వేస్తుండేవారు. జగన్నాథ్, సదాశివ ఇద్దరూ హార్మోనియం వాయించడం, వాటిని మరమ్మతులు చేయడం చేసేవారు. మూడో అన్నయ్య విమలానంద దాస్ కి మాత్రం నాటకాలు వేయడం, నాటకాలు వేయించడంలో ఆసక్తి పెరిగింది. 

తొలిసారి రంగస్థలం పై…

పండరీబాయిని నాటకరంగంలోకి నటింపజేసి, ఆ తరువాత ఆమె వెండితెర జీవితానికి, సినీరంగంలో మలుపులకు బీజం వేసింది తన మూడవ అన్నయ్య విమలానంద దాస్ అని చెప్పవచ్చు. ఆదర్శ నాటక కంపెనీ అనే పేరుతో మైసూర్ లోనే విమలాదాస్ సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించారు. అందువలన వాళ్ళ కుటుంబం అంతా మైసూరుకు వెళ్ళిపోయింది. విమలానంద దాస్ ఒకసారి నాటక ప్రదర్శన జరిపిస్తుండగా అందులో ప్రధానపాత్ర వేసే నటికి ఇంట్లో ఇబ్బంది ఉండి ఆవిడ రాలేకపోయింది. దాంతో ఆ పాత్రను పోషించడానికి నటీమణులు ఎవ్వరూ కూడా సమయానికి దొరకలేదు. వారు ప్రదర్శించేది కాంట్రాక్టు నాటకం. అందువలన ఆ నాటకం ఆపడానికి వీలులేదు. అదే సమయానికి విమలానంద తన చెల్లెలితో ఆ పాత్ర వేయించడానికి ప్రయత్నం చేశారు.

కూతుర్లతో నాటకాలు వేయించడం తండ్రికి ఇష్టం ఉండదు. అందువలన పండరీబాయి వెనుకంజవేసింది. కానీ అన్నయ్య విమలానంద దాసు ధైర్యం చెప్పి తండ్రికి తెలియకుండా ఆ నాటకంలో నటింపజేశాడు. అలా తన పన్నెండేళ్ల వయస్సులోనే తొలిసారిగా ఆమె రంగస్థలం వేదికనెక్కి నాటక ప్రదర్శన ఇచ్చారు. ఆ విషయం తండ్రికి తెలిసింది. ఆయన పండరీబాయిపై కేకలేశారు. కానీ ఆమె నాటకంలో కనబరిచిన నటనకు ప్రేక్షకుల నుండి వచ్చిన విపరీతమైన ఆదరణ చూసి ఆయన ఆనందపడ్డారు. ఆమె నాటకాలు వేసింది తన కొడుకు సంస్థలోనే కాబట్టి ఆయన అడ్డు చెప్పడం మానేశారు. ఆ విధంగా అనుకోకుండా నటిగా మారిన హరికథ కళాకారిణి పండరీబాయి నటించిన నాటకాలలో “గౌతమ బుద్ధ”, “విక్రమ శశికళ”, ముదు తన మధవి” లాంటి నాటకాలు ఆమెకు ఎనలేని పేరును తెచ్చి పెట్టాయి.

చిత్ర రంగ ప్రవేశం…

నాటకాలు వేయడం మొదలుపెట్టిన పండరీబాయి ఒకనాడు ఆమె ప్రదర్శిస్తున్న గౌతమ బుద్ధ నాటకములోని యశోధర పాత్రను చూసిన కన్నడ ప్రముఖ రంగస్థలం  హాస్యనటులు, దర్శకులు హిరణ్ణయ్య ఆ నాటకం చూడడం తన సినిమా “వాణి” లో కూతురు పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించారు. నిజానికి కె.హిరణ్ణయ్య, ఎం.ఎన్.గోపాల్ లు కలిసి “వాణి” (1943) అనే కన్నడ సినిమాకి సంయుక్త దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాకి నిర్మాత కన్నడ సంగీత రత్న, వయోలిన్ మాస్ట్రో తిరుమలకూడలు చౌడయ్య (టి.చౌడయ్య). ఈయన “వాణి” అనే సినిమాలో సినిమాలో ప్రధాన నటులు. ఈ సినిమాలో చౌడయ్య పోషించే పాత్రకి కూతురు వేషం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు.

సరిగ్గా అదే సమయానికి రంగస్థలం మీద పండరీబాయిని చూసిన సహాదర్శకులు హిరణ్ణయ్య  ఆ నాటక నిర్వాహకులు విమలానంద అనుమతి కోరారు. నాటకాలు అంటేనే ఒప్పుకొని నాన్న రంగారావు సినిమా అంటే ఒప్పుకుంటాడా? అందువలన నాన్నని అడగి చెబుతాను అన్నారు విమలానంద. “వాణి” సినిమా నిర్మాత టి.చౌడయ్య బాగా ప్రసిద్ధులవ్వడంతో, రంగారావు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. 1940లో మొదలైన “వాణి” అనే కన్నడ సినిమా నిర్మాణం పూర్తవ్వడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది. 1943లో విడుదలయిన ఆ చిత్రంలో ప్రధాన స్త్రీ పాత్రలో బళ్లారి లలిత నటించారు. అందులో పండరీబాయి సహాయ పాత్రలో చాలా చిన్న పాత్ర పోషించారు. ఆ సినిమా పెద్దగా విజయవంతం అవ్వలేదు. ఆ సినిమా తెచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాత టి.చౌడయ్యకు చాలా యేండ్లు పట్టింది.

పది సంవత్సరాలు చిన్న చిన్న పాత్రలతో…

టాకీలు మొదలైన తొలినాళ్ళలో దక్షిణ భారతీయ సినిమా నిర్మాణం అంతా కూడా ఎక్కువగా కొల్హాపూర్, మద్రాసు, కోయంబత్తూర్ లలో జరుగుతుండేది. “వాణి” సినిమా నిర్మాణం కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియోస్‌లో జరిగింది. ఆ చిత్రీకరణ జరిగినన్ని రోజులు పండరీబాయి తన హరికథ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి కన్నడ సినిమాల నిర్మాణం 1940 – 47 ల మధ్య  మందకొడిగా సాగింది. రికార్డుల దృష్ట్యా పండరీబాయి నటించిన కన్నడ చిత్రం “వాణి”. కానీ ఆ చిత్రం ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తరువాత పది సంవత్సరాల వరకు ఆమె నటించిన చిత్రాలలో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకున్నారు. 

“వాణి” చిత్రం చిత్రీకరణలో ఉండగానే పండరీబాయిని చూసిన “సుందర్ రావ్ నాదకర్ణి” అనే దర్శకుడు తాను దర్శకత్వం వహిస్తున్న “హరిదాసు” అనే తమిళ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించడానికి అవకాశం ఇచ్చారు. 1944 దీపావళి నాడు విడుదలైన ఆ సినిమా తమిళ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 784 రోజుల పాటు ఒకే థియేటర్‌లో ప్రదర్శించి అత్యధిక కాలం నడిచిన తమిళ చిత్రంగా “హరిదాసు” సినిమా రికార్డు సృష్టించింది. ఆ చిత్రం ఎం.కే.త్యాగరాజ భాగవతార్ ని ఆకాశానికి ఎత్తేసింది.

ఆ తరువాత ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం “భక్త గోర కుంభార”. ఇది కన్నడ పౌరాణిక చిత్రం. పండరీబాయికి ఇది ఈమె మూడవ చిత్రం. దీనికి దర్శకుడు, నిర్మాత హొన్నప్ప భాగవతార్. ఇందులో పండరీబాయికి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. ఇందులో విమలానంద దాస్ (పండరీబాయి అన్న) ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించాడు. ఈ సినిమా 1949లో  విడుదలయ్యింది. ఏ.వి.యం ప్రొడక్షన్స్ అధినేత అవిచి మెయ్యప్ప చెట్టియార్ దర్శకత్వంలో టి.ఆర్. మహాలింగం (తెంకరై రామకృష్ణ మహాలింగం) నటించిన వెధల ఉలగం సినిమాలో కాళీ దేవిగా పండరీ బాయి నటించారు. ఇది 1948లో విడుదలైంది.

“వజ్కైకి” (1949) తమిళ చిత్రాన్ని ఏ.వీ.ఎం స్టూడియో అధినేత అవిచి మెయ్యప్ప చెట్టియార్ హిందీలో “బహార్” గా పునర్నిర్మానం చేశారు.   అందులో “మాల్తీ” గా పండరీబాయికి నటనకు ఆస్కారం ఉన్న ఒక స్త్రీ పాత్ర ఇచ్చారు. 1951 లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

ద్విభాషా చిత్రం లో…

ఏ.వి.యం కాంట్రాక్టులో ఉన్న సమయంలో మూడు సంవత్సరాల్లో పండరీబాయి తమిళ భాషను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఏ.వి.యం వారికి వ్రాసిన కాంట్రాక్టు పూర్తయిపోవడంతో ఆమె ఏకకాలంలో ద్విభాషా చిత్రాలలో నటించారు. అందులో ఒకటి “రాజా విక్రమ” (1950). తమిళ , కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరించారు. కెంపరాజ్ ఉర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కథ, నిర్మాత, దర్శకుడు కెంపరాజ్ ఉర్సు. ఈయన ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ కి సోదరుడు. మద్రాసులోని మైలాపురంలో ఒక పెద్ద బంగ్లాలో ఉండేవారు కెంపరాజు ఊర్స్.

ఈయన సినిమాల్లోకి ప్రవేశించి తీసిన తొలి చిత్రం “రాజా విక్రమ”. ఈ చిత్రంలో రాజుకు ముగ్గురు భార్యలు ఉంటారు. రాజుగా కెంపరాజ్ ఉర్సు నటిస్తే, ముగ్గురు భార్యలుగా జయమ్మ, రాజమ్మ, లలిత నటించారు. లలిత నిజ జీవితంలో కెంపరాజు ఊర్స్ భార్య. వెయ్యి అడుగుల ఫిల్మ్ చిత్రీకరించారు. ఈ సినిమాలో లలిత గొంతు బాగోలేదు. దాంతో తన భార్య లలితతో చిత్రీకరణ చేసిన ఆ ఫిల్మ్ ని ప్రక్కన పెట్టిన కెంపరాజు ఊర్స్ ఆమె స్థానంలో పండరీబాయిని తీసుకున్నారు. ఈ సినిమా తమిళంలో పరాజయం పాలైంది, కానీ కన్నడంలో అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో పండరీబాయిని ప్రేక్షకులు గుర్తించే పాత్ర దొరికింది.

సినీ జీవితాన్ని మలుపుతిప్పిన “పరాశక్తి” (1952)…

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్ వారు పండరీబాయిని మూడు సినిమాలకు కాంట్రాక్టు వ్రాయించుకున్నారు. కానీ వారు ఒకేఒక్క సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు మర్మయోగి (1951). యం.జి.రామచంద్రన్, అంజలీ దేవి  ప్రధాన పాత్రలో నటించిన “మర్మయోగి” లో వసంతగా పండరీబాయి నటించారు. ఈ విధంగా పది సంవత్సరాలు చిన్న చిన్న పాత్రలతో నత్తనడకన సాగిన ఆమె సినీ ప్రస్థానం 1952 నుండి ఉపందుకుంది. “పరాశక్తి” (1952) తమిళ సినిమా ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ చిత్రం శివాజీ గణేషన్ కు మొదటి చిత్రం. ఈ సినిమాలో విమల పాత్రను అద్భుతంగా పోషించిన పండరీబాయి ఆ తరువాత నలభై సంవత్సరాల తన చలనచిత్ర జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది.

“రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక తమిళ కుటుంబ సభ్యులకు జరిగిన అనర్థాలను వివరిస్తూ సాగే కథనంతో “పావలార్ బాలసుందరం” వ్రాసిన యొక్క పరాశక్తి నాటకాన్ని 1952 ప్రాంతంలో తమిళ దేశమంతా విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ పరాశక్తి నాటకం ఆధారంగా నేషనల్ పిక్చర్స్ యొక్క ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ పి.ఏ.పెరుమాళ్ ఈ సినిమాను నిర్మించగా, కృష్ణన్ – పంజు లు దర్శకత్వం వహించారు. “పరాశక్తి” సినిమా నిర్మాణ సన్నాహాల్లో ఉండగానే ఆదినారాయణరావు, అంజలీదేవి కలిసి అంజలి పిక్చర్స్ బ్యానర్ లో మొట్టమొదటి సినిమాగా ఎల్వీప్రసాద్ దర్శకత్వంలో “పరదేశి” సినిమా నిర్మించతలపెట్టారు. ఆ సినిమాలో పెట్టుబడి పెట్టిన పి.ఏ.పెరుమాళ్ నటులు శివాజీ గణేష్ గురించి చెప్పారు.

తెలుగు “పరదేశి” కి తమిళ వర్షన్ “పూంగోతై” ని సమాంతరంగా నిర్మాణం చేయాలని నిర్మాతల ఆలోచన. “పూంగోతై” లో ఒక పాత్రకు శివాజీ గణేషన్ ను తీసుకున్నారు. 1952 దీపావళికి విడుదలైన పరాశక్తి తమిళ చలనచిత్ర పరిశ్రమలో కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. పరాశక్తి సినిమాతో శివాజీ గణేషణ్ తమిళ తెరకు దొరికిన మరొక అద్భుతమైన నటులు అని విమర్శకులు ప్రశంసించారు. ఆయన ప్రక్కన నటించిన పండరీబాయికి కూడా పత్రికల్లో ప్రేక్షకులలో చాలా చక్కటి గుర్తింపు లభించింది. తెలుగు “పరదేశి” సినిమాలో సుశీలగా పండరీ బాయి నటించారు. ఈ సినిమా శివాజీ గణేషన్ మూడో చిత్రంగా జనవరి 1953లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. పరదేశి సినిమా పరాశక్తి లాగా ఘనవిజయం సాధించలేకపోయినప్పటికీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. పండరీబాయికి మరింత గుర్తింపును తెచ్చింది.

“గుణసాగరి” (1953)…

పండరీబాయి 1952 వ సంవత్సరం వరకు రెండు, మూడేళ్లు ఒక్కొక్క సినిమాలో నటిస్తూ వచ్చారు. 1953 నుంచి వేగం పెంచారు. తన చిత్రల సంఖ్య 1953 నుండి పెరుగుతూ వచ్చింది. “పరదేశి” సినిమా విడుదలైన మరునాడే ఆమె ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం “గుణసాగరి” (1953)  విడుదలైంది. ఇదే సినిమా తమిళంలో “సత్యశోధన” అనే పేరుతో విడుదలైంది. “గుణసాగరి” సినిమాలో గుణసాగరి పాత్రలో ఆమె నటించారు. ఈ సినిమా నుండి కన్నడ ప్రేక్షకులు ఆమెను కన్నడ నటిగా ఆదరించారు. కర్ణాటకలోని 9వ తరగతి విద్యార్థులకు గుణసాగరి పండరీబాయి అని పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చింది కన్నడ ప్రభుత్వం.

ఆచార్య ఆత్రేయ రచించిన యన్.జి.వో (నాన్ గెజిటెడ్ ఆఫీసర్) నాటకం ఆధారంగా రూపొందించబడిన చిత్రం గుమస్తా (1953). దీనికి ఆర్.యం. కృష్ణసామి దర్శకత్వం వహించారు. ఆ గుమస్తా రంగనాథన్ పాత్రలో నటించినవారు చిత్తూరు వి.నాగయ్య. ఆయన సోదరి పాత్రలో పండరీబాయి నటించారు. అపార్ధాలు, అపనిందలు మోసే పాత్ర ఆమెది. ఈ సినిమా తెలుగులోనూ, తమిళంలోనూ పరాజయం పాలైంది. గుమస్తా విడుదలైన రెండు నెలలకు “తిరుంబి పార్” (1953) అనే తమిళ చిత్రం విడుదలైంది. ఇందులో శివాజీ గణేషన్ కు చెల్లెలు పూమలైగా పండరీబాయి నటించారు. అదే సంవత్సరము విడుదలైన “కంగల్” (1953) చిత్రంలో శివాజీ గణేషన్ కు జంటగా పండరీబాయి నటించారు.  

రాజ్ కుమార్ తో జంటగా “బెదర కన్నప్ప” (1954)..

పండరీబాయిని కన్నడ ప్రేక్షకులు మరింత దగ్గర చేసిన చిత్రం “బెదర కన్నప్ప” (1954). కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మొట్టమొదటి కన్నడ చిత్రం ఇది. కన్నప్ప భార్య నీలగా పండరీబాయి నటించారు. అదే సినిమాను తెలుగులో కాళహస్తి మహత్యం (1954) పునర్నిర్మాణం అయినప్పుడు అందులో నీల పాత్రలో మాలతి నటించారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమై 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. 1954 వ సంవత్సరంలో పండరీబాయి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు శివాజీ గణేషన్ తోనే నటించారు. వాటిలో ఒకటి “అంద నాల్”. 

తమిళంలో మొట్టమొదటిసారిగా పాటలు, పోరాట సన్నివేశాలు లేకుండా తీసిన ఉత్కంఠభరిత చిత్రం “అంద నాల్”. శివాజీ గణేషన్ ప్రక్కన ప్రధాన నటిగా ఉష పాత్రలో పండరీబాయి నటించి విమర్శకుల ప్రశంసలు మరియు ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. శివాజీ గణేషన్ తో నటించిన మరో సినిమా మనోహర (1954). ఈ సినిమాలో శివాజీ గణేషన్ కు జోడీగా టి.ఆర్. రాజకుమారి, పి.కన్నాంబ మరియు గిరిజ లు ముఖ్య పాత్రలు పోషిస్తే పండరీబాయి మాత్రం ఒక చిన్న పాత్రతో సరిపెట్టుకున్నారు. శివాజీ గణేషన్ కు జోడీగా కథానాయికగా ప్రధాన పాత్రలు పోషించిన పండరీబాయి “మనోహర” చిత్రంలో చిన్న పాత్ర పోషించడానికి కూడా ఆమె వెనుకంజ వేయలేదు.

తల్లి పాత్రలలో…

నల్లకాలం (1954) సినిమాలో మద్రాస్ కందస్వామి రాధాకృష్ణన్  తమిళ సినిమాలో (ఎం.కె రాధా) ప్రక్కన కథానాయికగా నటించారు. 1954 వ సంవత్సరానికి పండరీబాయి నటించిన చిత్రాల సంఖ్య సుమారు పదిహేడు దాటింది. వీటిలో ఎక్కువగా 1953 – 54 సంవత్సరాలలో వచ్చినవే. ఆమె శివాజీ గణేషన్ తో ఎక్కువ సినిమాలలో నటించారు. ఆయన ప్రక్కన కథానాయిక పాత్రలే కాకుండా, ఏ పాత్ర ఇచ్చినా నటిస్తూనే వచ్చారు పండరీబాయి. కన్నడం, తమిళం, తెలుగు లాంటి భాషలలో నటించడం వలన ఆమె మూడు భాషల ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.

“పరాశక్తి” సినిమా దర్శకులు కృష్ణన్ – పంజు, “బెదర కన్నప్ప” దర్శకులు హెచ్.ఎల్.ఎన్ సిన్హా మొదలగు దర్శకులు తమ తరువాతి చిత్రాలలో వరుసగా పండరీబాయికి అవకాశాలు ఇచ్చారు. ఏ.వి.ఎం వారు తీసిన ప్రతీ ద్విభాషా చిత్రంలో పండరీబాయికి కచ్చితంగా పాత్ర ఉంటుంది. పండరీబాయి చెల్లెలు మైనావతి కూడా 1953 లో సినీరంగ ప్రవేశం చేశారు. 1953లో విడుదలైన కంగల్ చిత్రంలో పండరీబాయిది ప్రధాన పాత్ర అయితే, ఆమె చెల్లెలు మైనావతి ఒక చిన్న పాత్ర పోషించారు. 1953 నుండి 1964 వరకు కథానాయిక పాత్రలు పోషించిన పండరీబాయి 1964 తరువాత తల్లి పాత్రలకే పరిమితమయ్యారు. గ్లామర్ పాత్రలున్న కథానాయిక పాత్రల వైపు మొగ్గు చూపకుండా, శాంత స్వభావం ఉన్న సాత్విక పాత్రలవైపు, కరుణ రస పాత్రలవైపు ఆమె ఒదిగిపోవడం వలన తనకు ఎక్కువ సహాయ పాత్రలు, గుణచిత్ర నటి పాత్రలే పోషించాల్సి వచ్చింది.

నిర్మాతగా 15 చిత్రాలు…

1955 – 56 లలో కన్నడ భక్తిరస ప్రధాన చిత్రాలు  భక్త మల్లికార్జున (1956), సంత్ సాఖు (1956), భక్త విజయం (1956), హరిభక్త (1956), రేణుకా మహాత్మే (1956) సినిమాలలో కథానాయికగా నటించారు పండరీబాయి. పండరీబాయి సినీ ప్రస్థానానికి పెద్ద మలుపు 1957లో ఆమె నిర్మాతగా మారడం. అప్పటికి ఆమె వయస్సు 29 సంవత్సరాలు, ఆమె నటించిన సినిమాల సంఖ్య 32 మాత్రమే.  అయినా కూడా ఆమె తెగించి, ధైర్యం చేసి “శ్రీ పాండురంగ ప్రొడక్షన్స్” బ్యానర్ లో కన్నడంలో  “రాయరా సొసే” అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు తొలి సాంఘిక చిత్రం.

రాజ్ కుమార్, పండరీబాయి నాయక, నాయికలుగా నటించారు. రాజ్ కుమార్ తొలి చిత్రం “బెదర కన్నప్ప” నుండి “రాయరా సొసే” ముందు వరకు ఆయన నటించినవన్నీ కూడా పౌరాణిక చిత్రాలే. కన్నడ కంఠీరవ రాజకుమార్ కి మొట్టమొదటిసారి సాంఘిక చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రత్యేకత నిర్మాత పండరీబాయికి దక్కింది. “రాయరా సొసే” చిత్రం ద్వారా గాయని ఎస్.జానకి కన్నడ చిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, మరోవైపు తన వెండితెర జీవితంలో నిర్మాతగా 15 సినిమాలు నిర్మించారు.

పి.హెచ్. రామారావు తో వివాహం…

అక్కినేని నాగేశ్వరావు, సుజాతల కలయికలలో జనవరి 1984 లో విడుదలైన “కోటీశ్వరుడు” చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన పి.హెచ్. రామారావు అనే వ్యక్తి పండరీబాయి భర్త. అక్కినేని నాగేశ్వరరావు అన్నయ్య అని పిలిచిన ఏకైక వ్యక్తి పండరీబాయి. ఆమె నిర్మాతగా పెద్దగా పేరు సంపాదించుకోకపోయినప్పటికీ నష్టాలు రాకపోవడం వలన తాను ఎక్కువ కాలం సినీ నిర్మాణంలో కొనసాగారు. అప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో మాత్రమే తెలుగు వారికి పరిచయం ఉన్న పండరీబాయి 1970 తరువాత నేరుగా తెలుగు సినిమాలలో తల్లిపాత్రలు, అత్త పాత్రలలో నటించారు.

వాటిలో కొన్ని “పండంటి కాపురం”, “నిజం నిరూపిస్తా, “మరపురాని తల్లి”, “కోడలు పిల్ల” మొదలైనవి. 1980 లలో ఆమె నటించిన తెలుగు సినిమాలు “సూపర్ మ్యాన్”, “సర్దార్ పాపారాయుడు”, “హేమాహేమీలు”, “ధర్మచక్రం”, “రగిలే గుండెలు” మొదలైనవి. ఆ మూడు దశాబ్దాలలో పండరీబాయి తమిళ, కన్నడ, తెలుగు భాషల చిత్రాలలో తరచూ కనిపిస్తూ ఉండేవారు. పండరీబాయి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. భర్త పేరు పి.హెచ్.రామారావు. ఈయన సినిమా నిర్మాత. పి.హెచ్.రామారావు, పండరీబాయి దంపతులకు ఇద్దరు సంతానం. ఆ ఇద్దరూ కూడా అబ్బాయిలే.

ఇంటి ఆవరణలో పాండురంగ దేవాలయం…

1958 వ సంవత్సరంలో పెద్ద స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఇష్ట దైవం అయిన పాండురంగడు దేవాలయాన్ని తమ ఇంటికి ఆవరణలోనే నిర్మించుకున్నారు. పండరీబాయి జీవించి ఉన్నంతకాలం ఆ దేవాలయ సంరక్షణను కుటుంబ సభ్యులు చూసుకునేవారు. బయటవారు చాలా మంది ఆ దేవాలయాన్ని సందర్శించి వెళుతుండేవారు. నటిగా మూడు భాషల్లోనూ పండరీబాయి తీరికలేకుండా నటిస్తూనే ఉన్నారు. 1990 నాటికి పండరీబాయి చెల్లెలు మైనావతి 100 కన్నడ సినిమాల్లో నటించారు. ఈలోగా మైనావతి కుమారుడు టీ.వీ.సీరియల్స్ లో రంగప్రవేశం చేశాడు. దాంతో పండరీబాయి మరియు ఆమె చెల్లెలు మైనావతి టి.వి సీరియల్ లలో నటిస్తుండేవారు. డిసెంబరు 1994 లో మద్రాసు బయట ఒక పెళ్లి వేడుకకు హాజరై తిరిగొస్తుండగా వెల్లూరు దగ్గరలో పండరీబాయి ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పండరీబాయి ఎడమ చేతిని తీసేయాల్సి వచ్చింది. అయినా కూడా ఆమె నటిస్తూనే వచ్చారు.

  మరణం…

2000 సంవత్సరం వచ్చేసరికి ఆమె 70 సంవత్సరాల వయస్సులో నటన ఆపేసి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆవిడ 1000 కి పైగా చిత్రాలలో నటించారు. డిసెంబరు 2022 లో అనారోగ్య సమస్యలతో మద్రాసులో అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పండరీబాయి చికిత్స కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చికిత్స పూర్తయిన నెల రోజులు తరువాత 29 జనవరి 2003 నాడు పండరీబాయి కన్నుమూశారు.

ఆ నాలుగైదు దశాబ్దాల ప్రేక్షకులు పండరీబాయిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కర్ణాటక ప్రభుత్వం పండరీబాయి గురించి స్మరించుచుకుంటూనే ఉంటుంది.   దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, అవకాశాలు వచ్చీ, చేజరిపోయి, తనకు వచ్చిన అవకాశాలు గుర్తింపు ఇవ్వకపోయినా కూడా పట్టుదలగా కొనసాగి, కథానాయిక అయ్యాక కూడా మళ్లీ సహాయ పాత్రలవైపు మళ్ళి, 50 సంవత్సరాల పాటు వెండితెర నటననే నమ్ముకుని ఉన్న పండరీబాయి జీవితము, విలక్షణమైనది, వ్యక్తిత్వంలోనూ ప్రశాంతమైనది,  స్ఫూర్తిదాయకమైనది కూడా.

Show More
Back to top button