Telugu Politics

యాక్షన్‌లోకి దిగిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు యాక్షన్‌లోకి దిగారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ పారిశ్రామికవేత్తలతో గత కొన్ని రోజులుగా సమావేశం అవుతున్నారు. తాజాగా బిపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన సంస్థ ప్రతినిధులతో అన్నారు.

దీంతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ,పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. దేనికి సీఎం చంద్రబాబు కూడా అన్ని రకాల సహాయ సహయకారాలు అందించేందుకు సిద్దంగా వున్నట్లు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఒకే అయితే సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. 

సీఎం చంద్రబాబు ఇటీవలి తన ఢిల్లి పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్‌ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా బుధవారం బీపీసీఎల్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి అవసరమైన భూములను కేటాయిస్తామన్నారు. కాగా, 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను సీఎం కోరారు. దానికి తగ్గట్టుగానే అక్టోబర్‌ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్‌ తో వస్తామని బీపీసీఎల్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

బిపీసీఎల్, విన్ ఫాస్ట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా, మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. కర్ణాటకకు  చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టర్ సంస్థ రివర్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఈవీ తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్  తయారీ లక్ష్యంతో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందట.

దీంతో ఈ సంస్థ కూడా కార్యరూపం దాల్చితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సేకరించింది. దాదాపు 50కి పైగా సంస్థల వివరాలను ఈడీబీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సంస్థలను వెంటనే కార్య రూపంలోకి తీసుకొచ్చేందుకు అవకాశమున్న పెట్టుబడులు ఏమిటన్నది అధికారులు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా సంస్థల యాజమాన్యాలతో సత్వరమే సంప్రదింపులు జరపనున్నారు. ప్రధానంగా అరబ్‌ దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను కూడా గుర్తించి, ఇప్పటి నుంచే వారితో చర్చలు జరుపుతామని అధికారులు తెలిపారు.

Show More
Back to top button