
అభినయ సామ్రాజ్యపు పట్టమహిషిగా పేరుపొందిన భానుమతి రామకృష్ణ గురించి తెలియని తెలుగువారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. భానుమతి రామకృష్ణ కేవలం ఒక నటి మాత్రమే కాదు, గాయని, రచయిత, చిత్ర దర్శకురాలు, చిత్ర నిర్మాత, సంగీత స్వరకర్త, సంపాదకురాలు, స్టూడియో యజమాని మరియు నవలా రచయిత్రి. ఒక్కమాటలో చెప్పాలంటే సకలకళా వల్లభురాలు. ఆమె ప్రతిభకు లెక్కలేనన్ని పురస్కారాలు దక్కించుకున్నారు, లెక్కకు మిక్కిలి ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను 2001 వ సంవత్సరంలో భారతీయ మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. భానుమతి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో సుమారు 100 కి పైగా చిత్రాలలో ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సమానంగా అగ్రతారగా వెలుగొందిన భానుమతి తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ గా ప్రసిద్ధిపొందారు. ఆమె తన తొలిసారి దర్శకత్వం వహించిన చండీరాణి (1953) తో తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా దర్శకురాలిగా కూడా పరిగణించబడ్డారు.
రామకృష్ణ, భానుమతిల ప్రేమ కథ, పెళ్ళి కథ ఒక సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు. ఆమె నటించిన అయిదో చిత్రం “కృష్ణప్రేమ” కు సహాయ దర్శకుడిగా ఉన్న పాలువాయి రామకృష్ణను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారు. తన నిజాయితీ, నిర్లిప్తత, ఔదార్యం, ఔన్నత్యం, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇవన్నీ పద్దెనిమిదేళ్ళు నిండని అతనిపై భానుమతి మనసు పారేసుకునేలా చేశాయి. ఆయన ఎటు తిరిగితే, అటే ఆమె చూపులు తిరిగేవి. ఆయన వచ్చాడా? ఎటు వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? భోజనం చేశాడా? ఇత్యాది విషయాల మీద దృష్టి పెట్టి ఆయన ప్రేమను పొందాలని సర్వ ప్రయత్నం చేసేది. ఒకసారి చిత్రీకరణలో భాగంగా భానుమతి వేలికి గులాబి ముల్లు గుచ్చుకుంది. కట్టు కట్టడానికి తడిగుడ్డ దొరుకుతుందేమోనని ఆమె చూస్తుండగా, రామకృష్ణ ముందుకొచ్చి తన చేతిరుమాలు (కర్చీప్) తీసి కట్టు కట్టారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ భానుమతి తల్లితండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వాళ్ళకు తెలియకుండా బంధువులు, స్నేహితుల సాయంతో వారిరువురు పెళ్ళి చేసుకున్నారు. ప్రపంచానికి ఎంత తలబిరుసుగా కనిపించినా, భానుమతి కట్టుకున్న భర్తకు మాత్రం ఎప్పుడూ అనుకూలవతిగానే వున్నారు.
తొలిచూపులోనే రామకృష్ణ పై మనసు పారేసుకున్న భానుమతి…
1943 లో దర్శకులు హనుమప్ప విశ్వనాథ్ బాబు (హెచ్.వి. బాబు) దర్శకత్వంలో తెరకెక్కిన చలనచిత్రం “కృష్ణ ప్రేమ”. శాంతకుమారి, గాలి వెంకటేశ్వర్లు, అద్దంకి శ్రీరామమూర్తి లాంటి వారు నటించిన ఈ చిత్రంలో “చంద్రావళి” అనే పాత్రను పోషించారు భానుమతి. ఆ చిత్రానికి సహాయ దర్శకులు పాలువాయి రామకృష్ణ. “కృష్ణ ప్రేమ” చిత్రంలో నటించే నటీనటులకు వారి పాత్ర తీరుతెన్నుల గురించి ఆయన వివరిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆ చిత్రంలో నటిస్తున్న భానుమతి పాత్ర తీరుతెన్నుల గురించి వివరిస్తూ ఉండేవారు. సహాయకుడిగా ఉన్న రామకృష్ణను దర్శకులు హెచ్.వి.బాబు పదేపదే మెచ్చుకోవడం భానుమతికి ఆశ్చర్యం కలిగించింది. దర్శకత్వ శాఖలో సహాయ దర్శకుడిగా ఉన్న ఆయనను దర్శకుడు తరుచూ మెచ్చుకోవడం చూసి రామకృష్ణ పట్ల భానుమతికి తొలిచూపులోనే ఒక అనిర్వచనీయమైన అనురాగ భావన, ఒక రకమైన ప్రేమభావన కలిగింది.
భానుమతికి సంభాషణలు, నటన నేర్పించడం సహాయ దర్శకుడిగా రామకృష్ణ బాధ్యత. అందువలన ఆ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు రామకృష్ణ మరియు భానుమతి పరస్పరం మాట్లాడుకోవలసి వచ్చేది. ఆమెకు సంభాషణలు కానీ, నటన కానీ ఒక పాఠం చెప్పినట్లు చెప్పి వెళ్ళిపోతుండేవారు రామకృష్ణ. ఇతర నటీమణులతో కలిసి భానుమతి మాట్లాడుతున్నప్పుడు రామకృష్ణ ఆ ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. ఆయనలోని నిర్లిప్తత భానుమతిని ఆకట్టుకుని ఆయన వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఆమె లోని మార్పును తోడుగా వస్తున్న ఆమె చెల్లెలు పసిగట్టింది. రామకృష్ణ అంటే భానుమతి ప్రత్యేకమైన ఆసక్తి చూపించడం, ఆయన ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు? ఎటు వెళ్తున్నారు? భోజనం చేశారా లేదా లాంటి విషయాలు ప్రత్యేకంగా తెలుసుకోవడం భానుమతి చెల్లెలు గమనిస్తూ ఉండేవారు.
కణ్ణామణి చొరవతో ముందుకు సాగిన ప్రేమకథ…
భానుమతి, రామకృష్ణల మధ్య నడుస్తున్న తంతును గమనిస్తున్న భానుమతి చెల్లెలు ఒకరోజు ధైర్యం చేసి ఏమిటి విషయం అని అక్కయ్యను అడిగింది. దానికి రామకృష్ణ అంటే ఇష్టమని పెళ్లంటూ చేసుకుంటే, రామకృష్ణనే చేసుకుంటాను అని భానుమతి తేల్చి చెప్పేసింది. అప్పటికే ఇంట్లో భానుమతికి సంబంధాలు చూస్తున్నారు. కానీ భానుమతి – రామకృష్ణల మధ్య నడుస్తున్న వ్యవహారం అంతా తండ్రి వెంకట సుబ్బయ్యకు చెప్పేసింది భానుమతి చెల్లెలు. అప్పుడు భానుమతిని విచారించిన తండ్రి, రామకృష్ణ వివరాలు అడిగితే తెలియదు అన్నారు భానుమతి. నీకు ఇలాంటి ఒక ప్రేమ భావన ఉందనే విషయం రామకృష్ణకు చెప్పావా అని తండ్రి అడిగిన ప్రశ్నకు కూడా ఆమె వద్ద సమాధానం లేదు. దాంతో వారి విషయాన్ని భానుమతి నాన్న తేలికగా తీసుకున్నారు. అలాగే భానుమతి ప్రేమిస్తున్న విషయం రామకృష్ణకు కూడా తెలియదు.
“కృష్ణ ప్రేమ” (1943) సినిమాను ఎడిటింగ్ చేస్తున్న బల్లపీఠ వద్ద ఫిలిమ్ కత్తిరించేటప్పుడు భానుమతి ఉన్న క్లోజప్ ఫిలిమ్ ముక్కలను ఆయన జేబులో పెట్టుకునేవారు. భానుమతి గురించిన అన్ని విషయాలను సునిశితంగా పరిశీలన చేస్తున్న “కృష్ణ ప్రేమ” నిర్మాత భార్య కణ్ణామణి మొదటిసారిగా భానుమతి ప్రేమ విషయాన్ని రామకృష్ణతో చెప్పారు. అదేవిధంగా వారిద్దరినీ తమ ఇంటికి ఇద్దరినీ (భానుమతి మరియు రామకృష్ణలను) పిలిపించి వారికి మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అప్పుడు భానుమతి మొదటిసారిగా తన మనసులోని మాటను రామకృష్ణతో చెప్పారు. నిజానికి రామకృష్ణ నేల విడిచి సాము చేసే రకం కానే కాదు. “కృష్ణ ప్రేమ” సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న రామకృష్ణ జీతం నెలకు 200 రూపాయలు మాత్రమే. అదే సినిమాలో నటిస్తున్న భానుమతికి మాత్రం నెలకు 2000 రూపాయలు నెల జీతం.
పేదవాడని తెలిసినా పట్టు విడవని భానుమతి…
“కృష్ణ ప్రేమ” సినిమా చిత్రీకరణ సమయంలో సహాయ దర్శకుడిగా ఉన్న రామకృష్ణ చొక్కా మెడ పట్టీ (కాలర్) చిరిగి ఉండడం చూసి భానుమతికి చెప్పింది చెల్లెలు. “నేను పేదవాడిని, నీవు కథానాయికవి. నన్ను పెళ్లి చేసుకుంటే నీవు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది” అని పేదరికంలో ఉన్న రామకృష్ణ, 18 సంవత్సరాల వయస్సున్న భానుమతికి తన పరిస్థితి వివరించి నచ్చచెప్పజూశారు. కానీ కణ్ణామణి మాత్రం భానుమతి మనసులో ఉన్న మాటను పదేపదే రామకృష్ణకు వివరిస్తూ ఉండేవారు. చేసేదిలేక భానుమతి నాన్న గారిని అడిగి చూడండి, ఆయన ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అని రామకృష్ణ తేల్చిచెప్పారు. ఈ తతంగం అంతా జరిగేటప్పటికీ కృష్ణ ప్రేమ చిత్రీకరణ పూర్తయిపోయింది. భానుమతికి “గరుడ గర్వభంగం” అనే సినిమాలో అవకాశం వచ్చింది. రామకృష్ణకు మాత్రం “చెంచులక్ష్మి” అనే సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది.
దగ్గరుండి పెళ్లి చేసిన మనపాక కమలమ్మ…
ఒకవైపు కూతురు వేరే సంబంధాలు ఒప్పుకోకపోవడంతో భానుమతి నాన్నగారు తన ఇంటికి రామకృష్ణను పిలిపించి విషయం అడిగారు. అప్పుడు రామకృష్ణ నిర్మొహమాటంగా మేము ఆస్తిపరులం కాదు, సహాయ దర్శకుడి జీతం తప్ప వేరే ఆదాయం నాకు లేదు. మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే నాతో వచ్చి పేదరికంలో ఉండాల్సి వస్తుంది, మీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. కానీ చూస్తూ చూస్తూ ఇలాంటి పేదవాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేసేదని భానుమతి తండ్రి అభ్యంతరపెట్టినా భానుమతి వినలేదు. రామకృష్ణనే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది.
మనపాక కమలమ్మ అనే వ్యక్తి రామకృష్ణకు తల్లి లాంటిది. ఆమె దగ్గరుండి 08 ఆగస్టు 1943 నాడు భానుమతి, రామకృష్ణల పెళ్లి జరిపించింది. రామకృష్ణకు ఎడిటింగ్ శాఖలో తొలి పాఠాలు నేర్పించిన ఎం.వీ.రాజన్ వారి (రామకృష్ణ, భానుమతిల) పెళ్లి ఛాయాచిత్రాలు తీశారు. ఆ సాయంకాలం మనపాక కమలమ్మ ఇంట్లోనే సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఆ వేడుకలో రావు బాల సరస్వతి పాటల కచేరి ఏర్పాటు చేశారు. మరుసటి రోజు తన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లి భానుమతి రామకృష్ణ దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి ఇష్టం లేకున్నా పెళ్ళి జరిగింది గనుక, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని రామకృష్ణకు చెప్పి, వారు కొత్త దంపతులను దీవించి పంపారు.
భానుమతి, రామకృష్ణల మధ్యతరగతి మందహాసాలు..
భానుమతి రామకృష్ణ దంపతులకు మనపాక లక్ష్మమ్మ కొత్త దంపతులకు 12 వ రోడ్డు, మహాలక్ష్మి వీధిలో ఉండే భవంతి వెనక ఇల్లును నెలకు 1500 రూపాయలు అద్దెకు చూసి పెట్టారు. ఆ విధంగా భానుమతి రామకృష్ణల వైవాహిక జీవితం మొదలైంది. భానుమతి, రామకృష్ణలు కలిసి పనిచేసిన “కృష్ణ ప్రేమ” చిత్రం మార్చి 1943 లో విడుదలైంది. అదేవిధంగా వివాహం తరువాత భానుమతి నటించిన “గరుడ గర్వభంగం” చిత్రం అక్టోబరు 1943 లో విడుదలైంది. పెళ్లి తరువాత రామకృష్ణ సహాయకుడిగా పనిచేసిన “చెంచులక్ష్మి” చిత్రం జనవరి 1944 లో సంక్రాంతి కానుకగా విడుదలైంది.
నిజానికి భానుమతి పెళ్ళైన తరువాత సినిమాలలో నటించకూడదని నిర్ణయించుకున్నారు. రామకృష్ణతో భానుమతి వివాహానికి సిద్ధపడే ముందే ఈ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందం తరువాతనే భానుమతి వివాహానికి అంగీకరించారు. రామకృష్ణ భానుమతిల సంసార జీవితంలో మధ్యతరగతి మందహాసాలు మెండుగా పండేవి. బస్సు ఎక్కి సినిమాలకు వెళ్లడం, సినిమా అయిపోయాక బస్సులు లేకపోతే రిక్షాలో ఇంటికి రావడం, సినిమా చిత్రీకరణ నుంచి రామకృష్ణ ఇంటికి వచ్చేసరికి కిరోసిన్ పొయ్యి మీద భానుమతి వంట చేయడం, ఇద్దరికీ సంతోషాన్ని పంచేది. వారి వైవాహిక జీవితంలో భార్యను చాలా ప్రేమగా చూసుకున్నారు.
“స్వర్గసీమ” తో పరిశ్రమ లోకి పునరాగమనం…
భానుమతి, రామకృష్ణల సంతోషకరమైన సంసార జీవితంలో నాలుగైదు నెలలు గడిచిపోయాయి. భానుమతి జీవితం నుండి సినిమా అనేది పూర్తిగా మాయమైనట్టే అనుకున్నారు. కానీ “తాను ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలిచిందన్నట్టు” తెలుగు చిత్రసీమ భానుమతికి ఋణపడి ఉందో లేక భానుమతి తెలుగు చిత్రసీమకు ఋణపడి ఉందో తెలియదు. కథ అడ్డం తిరిగింది. తొలి తెలుగు శబ్ద చిత్రాన్ని తెరకెక్కించిన హనుమప్ప మునియప్ప రెడ్డికి కుడి భుజంలా ఉండే ముదిగొండ లింగమూర్తి భానుమతి ఇంటికి వచ్చేసి, బి.ఎన్.రెడ్డి తీయబోయే కొత్త సినిమాలో నటించాల్సిందిగా బి.ఎన్.రెడ్డి తరుపున అభ్యర్థించారు. కానీ ఆ అభ్యర్థనను భానుమతి తోసిప్పుచారు. ఆమె ఒప్పుకోకపోగా, సాయంకాల ఇంటికి వచ్చిన భర్త రామకృష్ణతో విషయం చెప్పారు.
మద్రాసులో ఉన్నంతకాలం మనల్ని సినిమా పరిశ్రమ వాళ్ళు వదిలిపెట్టరు, పుంగనూరుకు వెళ్ళి అక్కడ నేను ఒక ఉద్యోగం చూసుకుంటాను, మనం ఎలాగోలా బ్రతికేద్దాం అన్నారు రామకృష్ణ. తాను సహాయకుడిగా పనిచేస్తున్న చెంచులక్ష్మి సినిమా సహాయ భాద్యతలు మరొకరికి అప్పగించాలనుకున్నారు రామకృష్ణ. ఆ తరువాత రెండు రోజులకే దర్శకులు బి.యన్.రెడ్డి స్వయంగా రామకృష్ణ భానుమతిల ఇంటికి వచ్చి ఈ ఒక్క సినిమాలో నటించండి చాలు, ఆరు నెలలలో సినిమా పూర్తి చేస్తానని అభ్యర్థించడంతో, పెద్దవారైన బి.యన్.రెడ్డి అభ్యర్థనను రామకృష్ణ కాదనలేకపోయారు. అలా పెళ్లి తరువాత సినిమాలే చేయనని భీష్మించుకుని కూర్చున్న భానుమతి ఒప్పుకున్న బి.యన్.రెడ్డి చిత్రమే “స్వర్గసీమ”.
తల్లిదండ్రులైన భానుమతి, రామకృష్ణ దంపతులు..
బి.ఎన్.రెడ్డి “స్వర్గసీమ” (1945) లో భానుమతి నటిస్తుందని తెలిసిన ప్రముఖ దర్శక, నిర్మాత వై.వి.రావు తాను తీయబోయే “తాసిల్దార్” (1944) సినిమాలో నటించాల్సిందిగా ఒప్పించారు. తాను తీయబోయే “తాసిల్దార్” సినిమాను బి.ఎన్.రెడ్డి కంటే ముందుగానే విడుదల చేస్తానని ప్రకటించి, అన్నట్టుగానే ముందుగానే చిత్రీకరణ పూర్తిచేసి 1944 ఆఖరులో విడుదల చేశారు. మరో శుభవార్త ఏమిటంటే “స్వర్గసీమ” (1945) చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే భానుమతి, రామకృష్ణలు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం తెలిసింది. 06 జూన్ 1945 నాడు స్వర్గసీమ సినిమా విడుదలయితే, మరునాడు 07 జూన్ 1945 నాడు భానుమతి, రామకృష్ణ దంపతులకు అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరే “పాల్వాయి వెంకట భరణి సుబ్రహ్మణ్య శర్మ “, క్లుప్తంగా “భరణి”.
భానుమతి నటించిన “స్వర్గసీమ” సినిమా ఘనవిజయం సాధించింది. పుట్టిన అబ్బాయి కోసమైనా ఆస్తులు కూడబెట్టాలి అని అనుకున్న ఆలుమగలు, సినిమా రంగానికి దూరంగా వెళ్లిపోవాలనుకున్న ఆలోచనలను విరమించుకోక తప్పలేదు. ఆ ఆలోచనే భానుమతి నటిగా తెలుగు ప్రేక్షకులకు మరుపురాని చిత్రాలను అందించింది, గాయనిగా మరుపురాని గీతాలను వినిపించింది. వాళ్లు బి.ఎన్.రెడ్డి మీద గౌరవంతో, ఆయన మాట వినకపోయి ఉంటే రామకృష్ణ దంపతులు మద్రాసు విడిచి వెళ్ళిపోయేవారు, అప్పుడు భానుమతి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగి ఉండేది కాదు. అదేవిధంగా భరణి పిక్చర్స్ స్థాపన, రామకృష్ణ దర్శకత్వం ఇలాంటివన్నీ కూడా ఆలోచనలోనే లేని భావనలై ఉండేవేమో? అలా జరగలేదు గనుకనే భానుమతి అనే బహుముఖ ప్రజ్ఞావంతులు తెలుగు సినిమా చరిత్రలో భాగమైపోయారు. అక్కడి నుండి భానుమతి నటనా జీవితంలో వేగం అందుకుంది. తాను నిర్దేశించుకున్న ప్రకారం నటిగా, గాయనిగా, రచయితగా, చివరి దశాబ్దాలలో సంగీత దర్శకురాలిగా, సినిమా దర్శకురాలుగా కొనసాగారు.










